SCAD: రోజుల వ్యవధిలో అక్కాచెల్లెళ్లకు ఒకే తరహాలో గుండెపోటు, హఠాత్తుగా వచ్చే సమస్య ఎంత ప్రమాదకరం?

ఫొటో సోర్స్, FAMILY PHOTO
- రచయిత, ఒవైన్ ఇవాన్స్
- హోదా, బీబీసీ న్యూస్
వేల్స్‌కి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు కేవలం రోజుల వ్యవధిలోనే గుండెపోటుకు గురయ్యారు. గుండెపోటు ప్రాణాంతకంగా ఎలా మారుతుందో అవగాహన పెంచేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు.
రెబెక్కా లూయిస్‌కి 48 ఏళ్లు. ఆమె స్పాంటేనియస్ కరోనరీ ఆర్టెరీ డిసెక్షన్(స్కాడ్)కి గురయ్యారు. అంటే, గుండెకి రక్తం సరఫరా చేసే ధమనుల్లో అడ్డంకులు ఏర్పడి అకస్మాత్తుగా గుండెపోటుకి గురవడం.
హృదయానికి రక్తాన్ని తీసుకెళ్లే ధమనుల గోడకు చీలికలు వచ్చి రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడడం వల్ల ఇది జరుగుతుంది.
కచ్చితంగా అలాగే కాకపోయినప్పటికీ, ఆమె సోదరి అంగారెడ్ కూడా మూడు రోజుల తర్వాత గుండెపోటుకు గురయ్యారు.
స్కాడ్ అనేది అరుదైన వ్యాధి. దానిని అంచనా వేయడం కానీ, నిరోధించడం ప్రస్తుతానికి సాధ్యమయ్యే పరిస్థితి లేదు.
నలభైలలో, యాభైలలో లేదా ఇటీవల బిడ్డను ప్రసవించిన మహిళలు ఈ స్కాడ్ బారిన పడుతున్న వారిలో ఎక్కువగా ఉంటున్నారు.
కార్డిఫ్‌కి చెందిన రెబెక్కా ఓ టీచర్. గత నవంబర్‌లో క్లాస్ రూంలో విధుల్లో ఉన్న సమయంలో ఆమె ఛాతిలో తీవ్రమైన నొప్పి మొదలైంది.
వెంటనే స్పందించిన స్కూల్ హెడ్ రెబెక్కాను కార్డిఫ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ వేల్స్‌కు తరలించారు. ఆమెకు గుండెపోటు వచ్చిందని అక్కడి వైద్యులు తెలిపారు.
కొన్ని రోజుల తర్వాత యాంజియోగ్రామ్ పరీక్షలో స్కాడ్ వల్ల ఆమెకు గుండెపోటు వచ్చినట్లు తేలింది.

SCAD అంటే ఏమిటి?
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల లోపలి పొరలో చీలిక వచ్చి, అది రక్త ప్రసరణను అడ్డుకోవడం వల్ల స్కాడ్ వస్తుంది. కొన్నిసార్లు ఇది గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్టుకు దారితీయొచ్చు.
ఆ సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు: ఛాతీ నొప్పి, చేతులు, మెడ, దవడలు, వీపు లేదా పొట్టభాగం బిగుసుకుపోవడం, లేదా నొప్పిరావడం, మైకం లేదా తల తిరిగినట్లు అనిపించడం, నీరసంగా అనిపించడం, ఆయాసం, వికారంగా ఉండడం, చెమటలు పోయడం, బిగుసుకుపోవడం వంటివి.
తాను అదృష్ణవంతురాలినని రెబెక్కా చెప్పారు. ఎందుకంటే, స్కాడ్‌పై విస్తృత పరిశోధనలు నిర్వహిస్తున్న లీసెస్టర్‌లోని గ్లెన్‌ఫీల్డ్ ఆస్పత్రిలో గతంలో పనిచేసిన వైద్యుడు తనకు చికిత్స అందించారని ఆమె తెలిపారు.
"నిజానికి నాకు యాంజియోగ్రామ్ చేసిన కన్సల్టెంట్.. యాంజియోగ్రామ్‌లో స్కాడ్‌ను ఎలా గుర్తించాలనే దానిపై ఆయన శిక్షణ పొందారు. అందువల్ల నా విషయంలో ఆయన వెంటనే పసిగట్టారు" అని ఆమె చెప్పారు.
ఆస్పత్రిలో రెబెక్కాను సందర్శించిన మరుసటి రోజు ఉదయం ఆమె సోదరి అంగారెడ్‌కు కూడా గుండెపోటు వచ్చింది. ఆమె కూడా స్కాడ్‌తో బాధపడుతున్నట్లు యాంజియోగ్రామ్‌లో తేలింది.
అంగారెడ్‌ని మరో ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే, అంగారెడ్‌కు కూడా స్కాడ్ పరీక్షలు చేయించాలని రెబెక్కా సూచించారు.
''నేను అదృష్టవంతురాలిని. మా అక్క తనకు ఏం జరిగిందో చెప్పి, నువ్వు ఈ పరీక్ష చేయించుకోవాలని, నాకు ఏం జరిగిందో వాటిని వైద్యుల వద్ద ప్రస్తావించాలని చెప్పింది. చివరికి, ఇద్దరు వైద్యులు చర్చించుకుని నన్ను కార్డిఫ్‌కి మార్చారు. ఒకవేళ అక్క లేకుంటే, నాకు గుండెపోటు ఎందుకు వచ్చిందో తెలియకుండానే ఇంటికి వెళ్లిపోయేదాన్ని.''

ఫొటో సోర్స్, ANGHARAD LEWIS
గ్లెన్‌ఫీల్డ్ ఆస్పత్రిలో ప్రస్తుతం 2000 మంది రోగులు ఈ పరిశోధనకు సాయం చేస్తున్నారు.
ఇలాంటి చాలా కేసులు నిర్ధరణ కావని ఈ రీసెర్చ్‌కు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ డేవిడ్ అడ్లామ్ చెప్పారు.
''వైద్య సేవలు అందించే సమయంలో రోగుల్లో స్కాడ్ లక్షణాలను గుర్తించేలా మా సహోద్యోగులను మేం ప్రోత్సహిస్తాం. ఎందుకంటే, వారు స్కాడ్ గురించి పట్టించుకోకపోతే, ఆ కేసులను గుర్తించే అవకాశం చేజారిపోవచ్చు'' అని ఆయన చెప్పారు.
''సాధారణంగా ధమనుల్లో రక్త ప్రసరణ మార్గం కుంచించుకుపోవడం వల్ల గుండెపోటు వస్తుంది, అలాంటప్పుడు ఆ కుంచించుకుపోయిన మార్గాన్ని వెడల్పు చేసి, స్టెంట్ వేస్తాం.
కానీ, స్కాడ్ రోగులకు అందించే చికిత్స అందుకు విరుద్ధంగా ఉంటుంది'' అన్నారాయన.
''మేం ధమని తనంతట తాను నయమయ్యేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే, అది మరో వ్యాధి. ధమనుల గోడలు దెబ్బతినడానికి అంతర్లీనంగా మరో కారణం ఉంటుంది.''
తమకు ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే రెబెక్కా, అంగారెడ్ అర్థం చేసుకుంటున్నారు.
''ఇది మా కుటుంబం మొత్తాన్ని ప్రభావితం చేసింది'' అని అంగారెడ్ అన్నారు.

ఫొటో సోర్స్, ANGHARAD AND REBECCA LEWIS
అయితే, ఇది తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని రెబెక్కా చెప్పారు. గుండెపోటు వచ్చినప్పుడు చాలా బాధ కలిగిందని ఆమె అన్నారు.
"నాకు గుండెపోటు వస్తుందని 48వ ఏడు చివర్లో తెలిసింది." అన్నారామె.
''ఇది చాలా అరుదు అని చెబుతున్నారు. కానీ నా విషయమే తీసుకుంటే, అది స్కాడ్ అని తెలియకపోవచ్చు. మా అక్కకి స్కాడ్ అని నిర్ధరణ కావడం వల్ల, నాకు కూడా అదే అని తేలింది. లేకపోతే పరిస్థితి వేరేలా ఉండవచ్చు'' అన్నారామె.
ఇవి కూడా చదవండి:
- రష్యా ఆర్మీలో హెల్పర్ పని అని తీసుకెళ్లి సైన్యంలో చేర్చారు.. హైదరాబాద్ యువకుడి మరణంపై కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?
- కోల్‌కతా: దేశంలోనే తొలి అండర్‌వాటర్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని.. నిర్మాణానికి వందేళ్ల కిందటే ప్లాన్
- అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్: పాప్ స్టార్ రియానా, బిలియనేర్ బిల్‌గేట్స్, మార్క్ జుకర్ బర్గ్, ఇవాంకా ట్రంప్... ఇంకా భారతీయ హేమాహేమీల మెగా సందడి
- హిందూమతం- నా అభిమతం-5: ఆరెస్సెస్‌లో చేరడం నుంచి ముస్లింను పెళ్లి చేసుకోవడం వరకు రసికా అగాషే కథ
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














