ఎలక్టోరల్ బాండ్స్: 'బీజేపీ ఎన్నికల్లో ఎక్కువ లాభపడడానికే ఈ పథకం' -మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం

ఎలక్టోరల్ బాండ్

ఫొటో సోర్స్, SHAHNAWAZ AHMAD/BBC

ఫొటో క్యాప్షన్, ఎలక్టోరల్ బాండ్ పథకం ప్రవేశపెట్టి, బీజేపీ లబ్ధి పొందిందని అన్నారు పి. చిదంబరం
    • రచయిత, జుగల్ పురోహిత్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టింది ఎన్నికల కమిషన్.

ఆ బాండ్ల వివరాలను ఎస్‌బీఐ మార్చి 12న ఎన్నికల కమిషన్‌కు పంపినప్పటికీ, ఎలక్టోరల్ బాండ్ల సీరియల్ నంబర్లను అందులో పేర్కొనలేదు.

మార్చి 17లోగా ఆ వివరాలను సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ను ఆదేశించింది సుప్రీం కోర్టు.

ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతమైన తరుణంలో రాజకీయంగా చర్చలకు తెరలేచింది.

రాజకీయ పార్టీలకు అందిన విరాళాల విషయంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

ఎలక్టోరల్ బాండ్లు బీజేపీకి ప్రయోజనాన్ని చేకూర్చాయాని అంటున్నారు మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పి.చిదంబరం.

మరోవైపు, రాజకీయాల్లో నల్లధనం పాత్రను పూర్తిగా నివారించేందుకే ఎలక్టోరల్ బాండ్‌ పథకాన్ని ప్రవేశపెట్టామని అన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.

సుప్రీం కోర్టు నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని, అయితే, న్యాయస్థానం ఆ పథకాన్ని రద్దు చేయడానికి బదులు మెరుగుపర్చే దిశగా సూచనలు చేస్తే బాగుండేదని అన్నారు.

పి. చిదంబరంతో బీబీసీ ఇంటర్వ్యూ

ఫొటో సోర్స్, SHAHNAWAZ AHMAD/BBC

ఫొటో క్యాప్షన్, ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా బీజేపీ పూర్తి ప్రయోజనం పొందిందని అన్నారు పి.చిదంబరం

ఎలక్టోరల్ బాండ్లతో బీజేపీకి మేలు జరిగిందా?

ఎలక్టోరల్ బాండ్ల వల్ల లోక్‌సభలో ఇతర పార్టీల కంటే బీజేపీకే మంచి స్థానం దక్కనుందని, ఎందుకంటే ప్రచారానికి అవసరమయ్యే డబ్బు ఆ పార్టీకి అందిందని అన్నారు పి. చిదంబరం.

బీబీసీతో ఆయన మాట్లాడుతూ, బహిర్గతమైన ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని చూసి, తానేమీ ఆశ్చర్యపోలేదన్నారు.

“బాండ్లు కొనుగోలు చేసిన వారందరూ ప్రభుత్వంతో దగ్గర సంబంధాలు కలిగి ఉన్నారు. మైనింగ్, ఫార్మా, కన్‌స్ట్రక్షన్, హైడ్రోఎలక్ట్రిక్ సంస్థలన్నింటికీ కేంద్ర ప్రభుత్వంతో దగ్గరి సంబంధాలున్నాయి. అలాంటి పరిస్థితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల విషయంలోనూ ఉంది” అన్నారు.

ఎలక్టోరల్ బాండ్

ఆయన మాట్లాడుతూ, “ప్రశ్నేంటంటే, ప్రభుత్వం ఇలాంటి మోసపూరిత పథకాన్ని ఎందుకు తీసుకువచ్చింది? రాజకీయ పార్టీలు, విరాళాలు ఇచ్చే దాతలు ఆ వివరాలను బ్యాలెన్స్ షీట్‌లో కచ్చితంగా వెల్లడించేలా పథకం ఉండాలి. అలాంటి పథకాన్ని ప్రభుత్వం తీసుకురావాలి.

గతంలో కార్పొరేట్ సంస్థలు రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు పాదర్శకంగా ఉండేవి. వారి లాభాల్లో నిర్ణీత శాతం మాత్రమే విరాళంగా ఇవ్వాలి. నష్టాల్లో ఉన్న సంస్థకు విరాళాలు ఇచ్చే వీలు లేదు. అలాంటి పాదర్శకమైన విధానానికి మనం వెళ్లాలి” అన్నారు.

పి.చిదంబరం

ఫొటో సోర్స్, SHAHNAWAZ AHMAD/BBC

ఫొటో క్యాప్షన్, మొత్తం విరాళాల్లో బీజేపీకే అత్యధికంగా 57% ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు పి.చిదంబరం

ఎలక్టోరల్ బాండ్స్ అంశం బహిర్గతమైన తీరు చూస్తే, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మేలు కలుగుతుందా? అనే ప్రశ్నకు చిదంబరం సమాధానమిస్తూ, “అవును. బీజేపీకి మేలు కలిగింది” అన్నారు.

“ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన మొత్తం విరాళాల్లో ఒక్క బీజేపీకే 57% ఎందుకు వచ్చింది? అన్ని పార్టీలకు వచ్చిన విరాళాలను కలిపినా, ఆ శాతానికి తక్కువే. ఇది కుమ్మక్కు అయినట్లుగా కనిపించట్లేదా అనేది నా రెండో ప్రశ్న” అన్నారు.

“ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన విరాళం, ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను కలిపి చూస్తే, ఎవరికైనా సరే, ఏం జరిగి ఉంటుందో అర్థమవుతుంది” అన్నారు.

ఎలక్టోరల్ బాండ్

“గడిచిన ఐదారేళ్లలో వనరుల్ని భారీగా సమకూర్చుకున్నారు. అందుకు వీలుగా ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రూపొందించారు. దాని ద్వారా పూర్తి ప్రయోజనాన్ని పొందారు. అందువల్లే ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉన్నారు” అని చెప్పారు.

ఆయన మాట్లాడుతూ, “ఎన్నికలకు సంబంధించి ఆర్థిక నిర్వహణ పరంగా చూస్తే, ఇతర పార్టీల కంటే మెరుగైన స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ఇతరులెవరూ వారిని సవాల్ చేసే స్థితిలో లేరు. వారి అభ్యర్థులకు నిధులు సమకూర్చే విషయంలోనూ ఇతరులతో పోలిస్తే, మెరుగైన స్థితిలో ఉన్నారు” అని చెప్పారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఫొటో సోర్స్, Getty Images

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత్రపై ఏమన్నారు?

మొత్తంగా ఈ విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత్ర గురించి చిందబరం, “దీనినే సంస్థలను గుప్పిట్లో ఉంచుకోవడమని అంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనిచేయాల్సిన అవసరమేముంది?” అని ప్రశ్నించారు.

“నేను మొదటి నుంచి దీని గురించి చెప్తూనే ఉన్నాను. సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించకముందు కూడా ఈ విషయం చెప్పాను. ఒకవేళ ఆదేశాలు ఇస్తే,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 24 గంటల్లోగానే వివరాలను బహిర్గతం చేయగలదు” అన్నారు.

ఆయన మాట్లాడుతూ, “ప్రతి బాండ్‌కు యూనిక్ నంబర్ (ప్రత్యేక గుర్తింపు సంఖ్య) ఉంటుంది. కాబట్టి ఆ సంఖ్య ఆధారంగా బాండ్‌ను ఎవరు కొనుగోలు చేశారో తెలుస్తుంది. అంతేకాంకుడా ఆ బాండ్‌ను ఏ రాజకీయ పార్టీ ఎన్‌క్యాష్ చేసుకుందో తెలుస్తుంది. కానీ ఏం జరిగిందో మనం చూశాం. ఈ వివరాలు సమర్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగు నెలల సమయం కోరింది. ఎస్‌బీఐ వైఖరి నాకు విస్మయాన్ని కల్గించింది” అన్నారు.

లోక్‌సభ ఎన్నికలు 2024

ఎస్‌బీఐ మాత్రం ఏం చేయగలదు? కేవలం వారికి వచ్చే ఆదేశాలను పాటిస్తున్నారని వచ్చే విమర్శలపై చిదంబరం స్పందిస్తూ, “ఎవరి ఆదేశాలను వారు పాటిస్తున్నారు? సుప్రీం కోర్టుకు మించిన అధికారం ఎవరికి ఉంది?” అని ప్రశ్నించారు.

“నేను స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇచ్చే సలహా ఒక్కటే, ప్రతి బాండ్‌కు కేటాయించిన అల్ఫాన్యూమరిక్ సంఖ్యను కూడా బహిర్గతం చేయండి. ఈ విషయంలో వెనక్కు తగ్గితే, అపహాస్యం అవడంతోపాటు విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది” అన్నారు.

లోక్‌సభ ఎన్నికలు 2024
ఫొటో క్యాప్షన్, ఎలక్టోరల్ బాండ్ పథకం రాజ్యాంగ విరుద్ధమని, వాటిని రద్దు చేస్తున్నామని సుప్రీం కోర్టు ఫిబ్రవరి 15న తీర్పునిచ్చింది.

ఎలక్టోరల్ బాండ్ కేసు నుంచి ఏం నేర్చుకోవచ్చు?

ఎలక్టోరల్ బాండ్ కేసు నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చని బీబీసీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ’ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాలు ఖరీదైన వ్యవహారంగా మారాయి. అవి రానురానూ పెరుగుతూనే ఉంటాయనే విషయాన్ని అందరూ అంగీకరించాలి. ఎన్నికల ప్రచారం రంగులు మార్చుకుంటూ, చివరికి పార్టీ కార్యకర్తలు, ఓటర్లకు డబ్బు పంపిణీ చేసే స్థితికి వచ్చేసింది” అన్నారు.

“ఎన్నికలనేవి ప్రజాస్వామ్యానికి ప్రతీక. మొదటగా మనం నిజాయతీగా ఉండాలి. రెండోది ప్రతి అభ్యర్థికి నిర్దేశించిన ఖర్చు పరిమితిని పెంచాలి. మూడోది ఆయా రాష్ట్రాలు ఎన్నికల కోసం నిధులు విడుదల చేసే విధంగా ఆలోచన చేయాలి” అన్నారు.

ప్రజలు ముందుకు వచ్చి పార్టీలకు విరాళాలు ఇచ్చేలా ప్రోత్సహించాలి. చెక్కులు, డ్రాఫ్ట్‌ల ద్వారా పార్టీలకు విరాళం ఇచ్చే వీలు కల్పించాలి. అంతేకాకుండా ఆ వివరాలను ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌లో కచ్చితంగా పేర్కొనాలి. రాజకీయ పార్టీలు కూడా వెల్లడించాలి” అన్నారు.

కాంగ్రెస్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాతల వివరాలను బహిర్గతం చేస్తుందా? అనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ, “ఒకవేళ సుప్రీం కోర్టు లేదా ఎన్నికల కమిషన్ కోరితే, మేం అలానే చేస్తాం” అన్నారు.

ఎన్నికల బాండ్లు అంటే?

దేశంలోని రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఓ విధంగా ఈ బాండ్లను ప్రామిసరీ నోట్లుగా కూడా భావించొచ్చు. దేశంలోని పౌరులు లేదా సంస్థలు వీటిని అధీకృత బ్యాంకు నుంచి కొనుగోలు చేసి, వారికి నచ్చిన రాజకీయ పార్టీకి విరాళంగా అందజేస్తారు.

ఈ ఎన్నికల బాండ్ పథకాన్ని భారత ప్రభుత్వం 2017లో ప్రవేశపెట్టింది. 29 జూన్ 2018 నుంచి అమలులోకి వచ్చింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఎన్నికల బాండ్లను జారీ చేస్తుంది. వీటిని జారీ చేయడం ద్వారా వచ్చిన నగదును సంబంధిత రాజకీయ పార్టీలకు అందజేస్తుంది.

కేవైసీ వివరాలు నమోదు చేసుకుని, బ్యాంకు అకౌంట్ కలిగి ఉన్నవారు ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. దాతల వివరాలు ఈ బాండ్లపై ఉండవు.

రూ.1000 నుంచి మొదలుకొని రూ.10 వేలు, రూ.1 లక్ష, రూ. 10 లక్షలు, రూ.1 కోటి వరకు స్టేట్ బ్యాంకుకు సంబంధించిన నిర్ణీత బ్రాంచుల నుంచి కొనుగోలు చేయొచ్చు. ఈ బాండ్ల కాలపరిమితి 15 రోజులు మాత్రమే.

రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ (ఆర్పీఏ) ప్రకారం నమోదైన రాజకీయ పార్టీలకు మాత్రమే ఈ బాండ్ల నుంచి నిధులు పొందే అర్హత ఉంటుంది.

సాధారణ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 1% ఓటు బ్యాంకు పొందిన రాజకీయ పార్టీలకు మాత్రమే ఇలా ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు అందించేందుకు అవకాశం ఉంటుంది.

ఈ బాండ్లను ఏడాదిలో జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ నెలల్లో అందుబాటులో ఉంచుతారు. దీనితోపాటు లోక్‌సభ ఎన్నికల సమయంలో మరో 30 రోజులు అదనపు గడువును ఇస్తారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)