‘ఆకలితో అలమటిస్తున్న చిన్నారులను కాపాడేవారే లేరా? నా బిడ్డలాగే వాళ్లూ చనిపోవాల్సిందేనా? కొడుకును కోల్పోయిన తండ్రి ఆవేదన

గాజాలో చికిత్స పొందుతున్న చిన్నారి
    • రచయిత, డేవిడ్ గ్రిటెన్
    • హోదా, బీబీసీ న్యూస్

''ఆకలితో అలమటిస్తున్న చిన్నారులను కాపాడేవారే లేరా?, లేకపోతే వాళ్లూ చనిపోతారు. ఇప్పటికే నా కొడుకు అలీ చనిపోయాడు''

ఉత్తర గాజాలో ఉన్న ఏకైక పిల్లల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, సరైన తిండిలేక, డీహైడ్రేషన్‌తో అలీ అనే చిన్నారి చనిపోయాడు.

అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిగతా చిన్నారులకైనా సాయం అందించాలని అలీ తండ్రి విజ్ఞప్తి చేస్తున్నారు.

మానవతా సాయం పెంచకపోతే కరవు తప్పదని ఐక్యరాజ్యసమితి కూడా హెచ్చరించింది.

''యుద్ధ సమయంలో అలీ జన్మించాడు. అతని తల్లికి తినడానికి తిండి లేకపోవడం వల్ల అలీ కిడ్నీలు పాడయ్యాయి'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి బీబీసీ అరబిక్‌కు చెందిన గాజా లైఫ్‌లైన్ రేడియో సర్వీస్ రికార్డ్ చేసిన ఇంటర్వ్యూలో చెప్పారు.

''అలీ పరిస్థితి రోజురోజుకీ దిగజారింది. చికిత్స చేయించేందుకు ప్రయత్నించాం. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అలీ కన్నుమూశాడు. అతని మరణాన్ని ఈ ప్రపంచం కళ్లప్పగించి చూస్తూనే ఉంది'' అన్నారు.

విషాదకరమైన విషయమేంటంటే, గత వారం చివర్లో బీట్ లాహియా పట్టణంలోని కమల్ అద్వాన్ ఆస్పత్రిని సందర్శించిన తర్వాత ఆస్పత్రిలో తినడానికి సరైన తిండి దొరక్క కనీసం పది మంది పిల్లలు మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం తెలిపింది. వారిలో అలీ కూడా ఒకరు.

గాజా ప్రాంతంలో గత వారంలో సరైన ఆహారం లేక, డీహైడ్రేషన్ కారణంగా 18 మంది పిల్లలు చనిపోయారని, అందులో 15 మంది పిల్లలు కమల్ అద్వాన్ ఆస్పత్రిలోనే మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది.

పోషకాహార లోపంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఆరుగురు చిన్నారుల గురించి కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం వెంటనే ముగియకపోయినా.. మానవతా సాయం పంపిణీలో ఎదురవుతున్న అడ్డంకులను తక్షణమే పరిష్కరించకపోయినా ఆకలితో చనిపోతున్న పిల్లల సంఖ్య వేగంగా పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి బాలల విభాగం యూనిసెఫ్ హెచ్చరించింది.

యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఈ ప్రాంతంలో 30,700 మందికి పైగా మృతి చెందారని, దాదాపు 72,000 మంది గాయాలపాలయ్యారని, వారిలో 70 శాతం మంది చిన్నారులు, మహిళలే ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

నిరుడు అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడుల్లో దాదాపు 1200 మంది చనిపోగా, 253 మందిని బందీలుగా తీసుకెళ్లింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ సైన్యం గాజాపై వైమానిక, భూతల దాడులకు దిగింది.

ఉత్తర గాజాలో ప్రస్తుతం 3,00,000 మంది మాత్రమే ఉండిపోయినట్లు అంచనా. ఇక్కడ ఆకలి సమస్య తీవ్ర స్థాయికి చేరిందని డబ్ల్యూఎఫ్‌పీ(వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్) చెబుతోంది. ఎందుకంటే, ఈ ప్రాంతంలో కేవలం కొద్దిపాటి సాయం మాత్రమే అందింది.

జనవరిలో ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు నిర్వహించిన పోషకాహార పరీక్షల్లో రెండేళ్లలోపు చిన్నారులు ప్రతి ఆరుగురిలో ఒకరు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించారు.

వారిలో ముగ్గురు తీవ్ర శక్తిహీనతతో బాధపడుతున్నారు. వారికి అత్యవసర చికిత్స అవసరం.

గాజాలో చికిత్స పొందుతున్న చిన్నారి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న శిశువులకు పరిమిత వనరులతోనే చికిత్స చేసేందుకు కమల్ అద్వాన్ ఆసుపత్రి ప్రయత్నిస్తోంది

పౌష్టికాహారం లేకపోవడం, స్వచ్ఛమైన నీరు దొరక్కపోవడం, వైద్యసేవలు అందకపోవడం వంటి వాటితో పాటు ఈ ఘర్షణల వల్ల అలసట, గాయాలు వంటివి తల్లులలో తమ బిడ్డలకు పాలిచ్చే సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.

తల్లిపాలు లేదా అందుకు ప్రత్యామ్నాయాలు ఉత్తర గాజా ప్రాంతంలో దాదాపు దొరకని పరిస్థితి.

అందువల్ల పిల్లలు త్వరగా డీహైడ్రేషన్, పోషకాహార లోపానికి గురవుతున్నారు. అది కిడ్నీల వైఫల్యానికి దారితీసి ప్రాణాంతక పరిస్థితులకు కారణమవుతోంది.

ఒక పసికందు, ఆమె సోదరి రోజుల వ్యవధిలోనే ఆస్పత్రిలో మరణించారని కమల్ అద్వాన్ ఆస్పత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో పనిచేస్తున్న డాక్టర్ సామియా అబ్డెల్ జలీల్ గాజా లైఫ్‌లైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

''ఆ చిన్నారి ఒకరికే కాదు, మొత్తం చిన్నపిల్లల విభాగానికి పాలు అందించేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కొంచెం పాలు దొరక్క ఆ పాప చనిపోయింది'' అని ఆమె గుర్తు చేసుకున్నారు.

ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు తమకు అందుబాటులో ఉన్న పరిమిత వనరులతోనే చికిత్స అందించేందుకు డాక్టర్ అబ్డెల్ జలీల్, ఆమె సహచరులు ప్రయత్నిస్తున్నారు. ఆ చిన్నారుల్లో నాలుగు నెలల బాలుడు సలాహ్ సమారా కూడా ఒకరు.

తను నెలలు నిండకుండానే పుట్టాడని, బాగా డీహైడ్రేషన్‌కు గురవడంతో పాటు తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని సలాహ్ తల్లి చెప్పారు. మూత్రం సాఫీగా సాగడం లేదని, అది చాలా నొప్పి పుట్టడంతో పాటు పొత్తికడుపు ఉబ్బిపోతుందని ఆమె తెలిపారు.

''వాడి పరిస్థితి చూసి నా గుండె తరుక్కుపోతోంది. మూత్రం బయటికి రాక ప్రతిరోజూ మీ బిడ్డ ఏడుస్తుంటే, మీరు చూస్తూ ఉండాల్సి రావడం చాలా కష్టమైన విషయం. వైద్యులు కూడా ఎలాంటి సాయం చేయలేకపోతున్నారు''

''నా బిడ్డకు చికిత్స పొందే హక్కు ఉంది. ఈ లోకంలోకి ఇప్పుడే వచ్చినందున, సర్వహక్కులూ ఉంటాయి'' అని ఆమె అన్నారు.

"రోజురోజుకీ నా బిడ్డ పరిస్థితి దిగజారుతోంది. తక్షణమే వాడికి విదేశాల్లో అత్యవసర చికిత్స అవసరం. నా మొర ఆలకించి ఎవరైనా నా బిడ్డ వైద్యానికి సాయం చేస్తారని ఆశిస్తున్నా.''

గాజా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర గాజాకు చాలా తక్కువ సాయం అందుతోంది

ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతున్న లెక్కలు సమస్య తీవ్రతను తక్కువగా చూపిస్తున్నాయని కమల్ అద్వాన్ ఆస్పత్రి డైరెక్టర్ అహ్మద్ అల్ - కహ్లోత్ అన్నారు.

''పోషకాహార లోపంతో మరణించిన వారి సంఖ్యను లెక్కించడం రెండు వారాల కిందటే ప్రారంభమైంది. అందువల్ల వాస్తవ సంఖ్య దానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది'' అన్నారాయన.

''కమల్ అద్వాన్‌తో పాటు జబాలియాలోని మరో ఆస్పత్రి అల్-అవ్‌దాకి ఇంధనం, అవసరమైన వైద్య సామగ్రిని సంస్థ అందించగలిగింది'' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనమ్ సోమవారం ఎక్స్‌లో (ట్వీట్ ) పోస్ట్ చేశారు. కానీ, అవి ప్రాణాలను కాపాడే అత్యవసరాల్లో కేవలం కొంత భాగమేనని ఆయన పేర్కొన్నారు.

''మానవతా సాయం సురక్షితంగా, నిరంతరాయంగా అందించేందుకు సహకరించాలని ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం. సామాన్యులు, మరీముఖ్యంగా చిన్నారులు, వైద్య సిబ్బందికి అవసరమైన సాయాన్ని పెంచాల్సి ఉంది. అయితే, అక్కడి రోగులందరికీ కావాల్సిన ముఖ్యమైన ఔషధం శాంతి'' అని ఆయన రాశారు.

మానవతా సాయం పంపిణీని సులభతరం చేసేందుకు పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలు కూడా ఇజ్రాయెల్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి. ''గాజాకి మరింత సాయం అందించాలి. అందులో ఎలాంటి సాకులూ వద్దు, లేవు'' అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

అయితే, గత రెండు వారాల సమయంలో ఉత్తర గాజాకు ఆహారం తీసుకెళ్లేందుకు చేసిన మొదటి ప్రయత్నాన్ని ఇజ్రాయెల్ సైనికులు అడ్డుకున్నారని మంగళవారం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ తెలిపింది. ఒక తనిఖీ కేంద్రం వద్ద 14 లారీల కాన్వాయ్‌ను ''వెనక్కి తిప్పి పంపారు'', తీవ్ర ''నిరాశ నిస్పృహలో ఉన్న ప్రజల గుంపులు'' వాటిపై పడి దోచుకున్నాయని యూఎన్ ఏజెన్సీ తెలిపింది. ఈ విషయంపై స్పందన కోసం బీబీసీ ఐడీఎఫ్‌(ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్)ని సంప్రదించింది.

గాజాకి మానవతా సాయాన్ని సమన్వయం చేస్తున్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యవర్గం ఇలా చెప్పింది. ''హమాస్‌ చెర నుంచి మా బందీలను విడిపించడం, హమాస్ నుంచి గాజాను విముక్తి చేయడంతో పాటు గాజాలోని సాధారణ పౌరులకు మానవతా సాయం అందించే ప్రయత్నాలను కూడా ముమ్మరం చేస్తాం'' అని తెలిపింది.

వీడియో క్యాప్షన్, కాల్పుల విరమణ చర్చల్లో నెలకొన్న ప్రతిష్టంభన

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)