గాజా: ఆకాశం నుంచి ఆహారం జారవిడవడంపై వివాదం ఎందుకు?

ఇజ్రాయెల్ - గాజా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లూయిస్ బరూచో
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్, బీబీసీ అరబిక్

జోర్డాన్‌తో కలిసి మంగళవారం ఉత్తర గాజా ప్రాంతంలో 36,000 ఆహార ప్యాకెట్లను ఆకాశం నుంచి జారవిడిచినట్లు అమెరికా తెలిపింది. ఇటీవలి కాలంలో ఉమ్మడిగా చేపట్టిన రెండో మిషన్ ఇది.

తినడానికి సరైన తిండి లేక, స్వచ్ఛమైన తాగునీరు లేక దాదాపు 30,000 మంది పాలస్తీనియన్లు ఇబ్బందులు పడుతున్నారని, ఉత్తర గాజాలో పిల్లలు ఆకలితో చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన చేసిన మరుసటి రోజు ఈ సాయం అందింది.

కానీ, రోజురోజుకీ పెరుగుతున్న అక్కడి అవసరాలను అవి తీర్చలేవని స్వచ్ఛంద సంస్థలు చెబుతుండడం చర్చకు దారితీసింది.

సాయం అందించడంలో క్షేత్రస్థాయి వైఫల్యానికి ఇది ప్రతీకగా నిలుస్తోంది.

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కారణంగా, మానవతా సాయం తీసుకొస్తున్న కాన్వాయ్‌లోని లారీలు ఈజిప్ట్ నియంత్రణలోని రఫా క్రాసింగ్, ఇజ్రాయెల్ నియంత్రణలోని కెరెమ్ షాలోమ్ క్రాసింగ్ ద్వారా దక్షిణ గాజాకు చేరుకుంటున్నాయి. కానీ, ఇజ్రాయెల్‌లో అక్టోబరు 7న హమాస్ దాడి తర్వాత మొదట ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభించిన ఉత్తర గాజాకు మాత్రం కొద్ది నెలలుగా దాదాపు ఎలాంటి సాయమూ అందడం లేదు.

ఉత్తర గాజా ప్రాంతంలో ప్రజాజీవనం కుప్పకూలడంతో ప్రాథమిక సాయం కోసం పంపించిన వాహనాలను అన్నార్తులు పడి దోచుకోవడంతో తీవ్ర గందరగోళం తలెత్తిందని, అది హింసాత్మకంగా మారి దోపిడీకి దారితీసిందని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(డబ్ల్యూఎఫ్‌పీ) తెలిపింది. అందువల్ల ఉత్తర గాజాకు ఆహార పంపిణీని నిలిపివేస్తున్నట్లు ఫిబ్రవరి 20న ప్రకటన చేసింది.

ప్రైవేట్ కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో పశ్చిమ గాజా ప్రాంతానికి పంపిన మానవతా సాయం తీసుకొస్తున్న వాహనాల దగ్గరకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించి 100 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ కాన్వాయ్‌కు ఇజ్రాయెల్ దళాలు భద్రతగా ఉన్నాయి.

ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరపడంతో డజన్ల కొద్దీ పాలస్తీనియన్లు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. సహాయం తీసుకొస్తున్న కాన్వాయ్‌లోని లారీలు తొక్కడం లేదా ఢీకొట్టడం వల్ల చనిపోయారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. కాన్వాయ్ మీదకు వచ్చి ఎగబడుతున్న వారిలో ముప్పుగా భావించిన వారిపై సైనికులు కాల్పులు జరిపినట్లు పేర్కొంది.

అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడుల్లో 1200 మంది మరణించగా, 253 మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఆ దాడుల అనంతరం ఇజ్రాయెల్ సైన్యం గాజాలో వైమానిక, భూతల దాడులను ప్రారంభించింది. ఇప్పటి వరకూ గాజాలో 30,000 మందికి పైగా మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇజ్రాయెల్ - గాజా

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, నిరాశలో కూరుకుపోయిన పాలస్తీనియన్లు సాయం తీసుకొస్తున్న లారీలను చుట్టుముట్టారు

'సరిపోవడం లేదు'

గత కొన్నివారాల్లో గాజా ప్రాంతంలో 20కిపైగా ఎయిర్‌డ్రాప్స్ (ఆహార ప్యాకెట్లు, ఔషధాలను హెలికాప్టర్లు, విమానాల ద్వారా జారవిడవడం) జరిగాయి. అమెరికా, జోర్డాన్‌తో కలిసి ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్ ఈ ఎయిర్‌డ్రాప్స్ చేశాయి.

శుక్రవారం జారవిడిచిన సహాయ ప్యాకేజీల్లో కొన్ని చిక్కుడు గింజలు, మహిళలకు సంబంధించిన ఆరోగ్య అవసరాలు ఉన్నాయని బీబీసీ అరబిక్‌కు చెందిన లైఫ్‌లైన్ రేడియోతో గాజా నివాసి ఇస్మాయిల్ మోక్బెల్ చెప్పారు. ఇజ్రాయెల్- హమాస్ ఘర్షణ ప్రారంభమైన తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకునేందుకు ఈ అత్యవసర రేడియో సర్వీసు ఏర్పాటైంది.

గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి సమీపంలో పడిన సహాయ ప్యాకేజీ నుంచి సాయం పొందలేకపోయానని అబూ యూసెఫ్ అనే మరో వ్యక్తి చెప్పారు.

''అనూహ్యంగా ఒకసారి ఆకాశంలోకి చూసినప్పుడు పారాచూట్లు కనిపించాయి. దీంతో అవి కిందకు దిగేవరకూ చూస్తూ ఉండిపోయాం. 500 మీటర్ల దూరంలో కిందపడింది. అక్కడ చాలా మంది ఉన్నారు. కానీ, అందులో ఉన్న సాయం చాలా తక్కువ. ఏదీ మా వరకూ రాలేదు'' అన్నారు.

ఈ ప్రాంతంలో చాలా మంది ఉన్నారని, వారి ప్రాథమిక అసవరాలను తీర్చేందుకు ఆ సాయం సరిపోదని మోక్బెల్ అన్నారు.

''పారాచూట్ల ద్వారా కిందపడుతున్న సాయం ఆ ప్రాంతంలోని వేల మంది పౌరులకు కనిపిస్తోంది. కానీ అక్కడ వందలు, వేలల్లో జనం ఎదురుచూస్తుంటారు. వారిలో కేవలం 10 మంది నుంచి 20 మందికి మాత్రమే అవి దక్కుతున్నాయి. మిగిలిన వారు ఒట్టిచేతులతో వెనుదిరగాల్సిందే. దురదృష్టకరమేంటంటే, ఆకాశం నుంచి సాయం జారవిడిచే పద్ధతి గాజా ఉత్తర ప్రాంతానికి అంత అనువైనది కాదు'' అన్నారాయన.

''భూమార్గంలో లేదా నీటి మార్గంలో వచ్చి సాయం చేయడం ఉత్తమం. ఈ ఎయిర్‌డ్రాప్ విధానం ఇక్కడి జనం అవసరాలను తీర్చలేదు.''

ఇజ్రాయెల్ - గాజా

ఫొటో సోర్స్, US CENTRAL COMMAND

ఫొటో క్యాప్షన్, జోర్డాన్‌తో కలిసి చేసిన ఎయిర్‌డ్రాప్‌లు గాజాకు మరింత సాయం అందించే నిరంతర ప్రయత్నంలో భాగమని అమెరికా మిలిటరీ తెలిపింది

ఖరీదైనది, ప్రమాదకరం కూడా...

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఐసోలేటెడ్ ట్రూప్స్‌ని(ఎవరికీ తెలియని రహస్య దళాలు) పంపించేందుకు తొలిసారి ఈ ఎయిర్‌డ్రాప్స్ పద్ధతిని వినియోగించారు. అనంతరం మానవతా సాయం అందించేందుకు ఉత్తమ సాధనంగా మారాయి. ఐక్యరాజ్యసమితి మొదటిసారి 1973లో ఈ పద్ధతిని అనుసరించింది.

అయితే, సాయం అందించేందుకు ఇతర అన్ని అవకాశాలూ విఫలమైనప్పుడు ఎయిర్‌డ్రాప్స్ విధానం చివరి ప్రయత్నమని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ 2021లో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. చివరిసారిగా దక్షిణ సూడాన్‌లో డబ్ల్యూఎఫ్‌పీ ఎయిర్‌డ్రాప్స్ చేసింది.

''ఎయిర్‌డ్రాప్‌లు ఖరీదైనవి మాత్రమే కాకుండా ప్రమాదకరం కూడా. వాటి వల్ల తప్పుడు వ్యక్తులకు సాయం అందే అవకాశం కూడా ఉంది'' అని నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్ సెక్రటరీ జనరల్, యూఎన్ ఎయిడ్ మాజీ చీఫ్ జాన్ ఎగెలాండ్ బీబీసీతో చెప్పారు. ఆయన ఇటీవల మూడు రోజుల పాటు గాజాలో పర్యటించారు.

ఎయిర్‌క్రాఫ్ట్‌లు, వాటి ఇంధనం, సిబ్బందికి అయ్యే ఖర్చులు భూమార్గంలో అయ్యే ఖర్చు కంటే ఏడు రెట్లు అధికమని డబ్ల్యూఎఫ్‌పీ తెలిపింది.

అలాగే, లారీల కాన్వాయ్ తీసుకెళ్లగలిగిన వస్తువులతో పోలిస్తే విమానాలు తక్కువ పరిమాణంలోనే తీసుకెళ్లగలవని, పంపిణీలోనూ క్షేత్రస్థాయిలో సమన్వయం చాలా అవసరమని డబ్ల్యూఎఫ్‌పీ చెప్పింది.

ప్రజలు హానికరమైన వస్తువులను వాడి తమ ప్రాణాలపైకి తెచ్చుకోకుండా నిరోధించడానికి, మానవతా సాయం పంపిణీలో సమన్వయం ప్రాధాన్యాన్ని రెడ్‌క్రాస్ అంతర్జాతీయ కమిటీ నొక్కిచెప్పింది.

''పోషకాహార లోపమున్న వారికి, ఆకలితో అలమటిస్తున్న వారికి ఊహించని తినుబండారాలు, పర్యవేక్షించని ఆహార పదార్థాలను అందించడం వల్ల తీవ్ర దుష్ఫ్రభావాలు ఎదురవుతాయి. ఎయిర్‌డ్రాప్స్‌ ద్వారా వస్తువుల సరఫరా నిలిపివేయడం, లేదా క్షేత్రస్థాయిలో పంపిణీలో ఆలస్యాన్ని నివారించడం ద్వారా ఇటువంటి ప్రమాదాలను తగ్గించవచ్చు'' అని 2016లో సిరియా అంతర్యుద్ధం సమయంలో మానవతా సాయం సందర్భంగా ప్రచురించిన నివేదికలో ఆ సంస్థ హెచ్చరించింది.

వేర్వేరు ప్రాంతాల్లో సుమారు 300 మీటర్ల నుంచి 5,600 మీటర్ల వరకూ వివిధ ఎత్తుల నుంచి ఎయిర్‌డ్రాప్స్ నిర్వహించవచ్చు. ఆ పార్శిల్‌లు భూమిని తాకినప్పుడు తట్టుకునేలా బలంగా ప్యాకింగ్ చేయడం చాలా ముఖ్యమని డబ్ల్యూఎఫ్‌పీ తెలిపింది.

ఎయిర్‌డ్రాప్స్ చేసేందుకు డ్రాప్ జోన్లు విశాలంగా ఉండాలి. కనీసం ఫుట్‌బాల్ గ్రౌండ్ కంటే పెద్దవైన బహిరంగ ప్రదేశాలను ఎంచుకుంటారు. అందువల్ల గాజా తీర ప్రాంతంలో తరచూ ఎయిర్‌డ్రాప్స్ చేస్తుంటారు.

అయితే, ఇలా ఎయిర్‌డ్రాప్స్ చేసిన సాయం కొన్నిసార్లు సముద్రంలో పడడం లేదా గాలి వీయడం వల్ల ఇజ్రాయెల్‌లోకి వెళ్లి పడుతోందని కొందరు స్థానికులు తెలిపారు.

ఇజ్రాయెల్ - గాజా

ఫొటో సోర్స్, Getty Images

‘కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచాలి’

కాల్పుల విరమణ గురించి అమెరికా తన మిత్రదేశం ఇజ్రాయెల్‌పై మరింత ఒత్తిడి తీసుకురావాలని తాను అనుకుంటున్నట్లు బీబీసీ అరబిక్ 'గాజా లైఫ్‌లైన్ రేడియో'తో గాజాకు చెందిన సమీర్ అబో అన్నారు.

''గాజా పౌరుడిగా చెబుతున్నా, ఈ సాయం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు'' అని ఆయన చెప్పారు. ''మేం కోరుకునేది ఏంటంటే, కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకురావడం, ఇజ్రాయెల్‌కు ఆయుధాలు, క్షిపణుల సరఫరాను నిలిపివేయడం.''

కొందరు సహాయ సిబ్బంది కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

''గాజాలో ఎయిర్‌డ్రాప్స్‌కు బదులుగా, ఇజ్రాయెల్ విచక్షణరహిత దాడులకు ఉపయోగిస్తున్న ఆయుధాల సరఫరాను నిలిపివేయడం, తక్షణ కాల్పుల విరమణ, బందీల విడుదలతో పాటు మానవతా సాయం, కనీస అవసరాలు తీర్చేందుకు అనువైన వాతావరణం కోసం ఇజ్రాయెల్‌‌పై ఒత్తిడి తీసుకురావాలి'' అని ఆక్స్‌ఫామ్ అమెరికాకు చెందిన స్కాట్ పాల్ గత వారం తన ఎక్స్ ఖాతాలో రాశారు.

''తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాలస్తీనియన్లకు సాయం అందించేందుకు, సహాయ సిబ్బంది వెళ్లేందుకు వీలుగా గాజాకు వెళ్లే అన్ని బోర్డర్లను ఇజ్రాయెల్ వెంటనే తెరిచేలా అమెరికా, యూకే, ఇతర దేశాలు చూడాలని ‘మెడికల్ ఎయిడ్ ఫర్ పాలస్తీనియన్స్’‌కు చెందిన మెలనీ వార్డ్ అన్నారు.

కానీ, సంక్షోభం తీవ్రమవుతుండడంతో గాజాలో ఎలాగైనా ఆహారం పంపిణీ చేయాలని ఇతరులు గట్టిగా వాదిస్తున్నారు.

''ఎలాగైనా గాజాకి ఆహారాన్ని తీసుకెళ్లాలని భావిస్తున్నాం. సముద్ర మార్గంలో తీసుకురావాలి'' అని ఏబీసీ న్యూస్‌తో గాజాకు ఆహారం పంపుతున్న వరల్డ్ సెంట్రల్ కిచెన్ వ్యవస్థాపకులు, చెఫ్ జోస్ ఆండ్రెస్ అన్నారు.

''జోర్డాన్, అమెరికా ఎయిర్‌డ్రాప్‌ల గురించి విమర్శించాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా. గాజాలోకి ఆహారాన్ని తీసుకెళ్లే ఎలాంటి చొరవనైనా మనం అభినందించాలి.''

''మారిటైమ్ కారిడార్‌ను తెరిచేందుకు, భూమార్గం గుండా అవసరమైన సాయం అందించేందుకు మా ప్రయత్నాలను రెట్టింపు చేస్తాం'' అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిజ్ఞ చేశారు. కానీ, ఆ ప్రయత్నాలు ఇంకా వాస్తవరూపం దాల్చలేదు.

ఉత్తర గాజా ప్రాంతానికి మానవతా సాయం తీసుకొచ్చే ట్రక్కుల కాన్వాయ్‌లకు, ఎయిర్‌డ్రాప్స్‌‌కు అనువైన వాతావరణం కల్పిస్తున్నామని, గాజా పౌరులకు మానవతా సాయం అందాలని తామూ కోరుకుంటున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికార ప్రతినిధి, రియర్ అడ్మిరల్ డేనియల్ హగేరి ఆదివారం చెప్పారు.

''హమాస్ నుంచి బందీలను విడిపించడం, హమాస్ నుంచి గాజాను విముక్తి చేయడం వంటి లక్ష్యాలను నెరవేరుస్తూనే గాజా పౌరులకు మానవతా సాయం అందేలా మా ప్రయత్నాలను కూడా విస్తరింపజేస్తాం'' అని తెలిపారు.

వీడియో క్యాప్షన్, సరిహద్దుల వద్ద సాయాన్ని అడ్డుకుంటున్న ఇజ్రాయెలీ కుటుంబాలు

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)