ఐరన్ సిలిండర్‌‌‌ను బాడీకి బిగించుకుని 78 ఏళ్ళు జీవించిన పాల్ అలెగ్జాండర్

పాల్ అలెగ్జాండర్, పోలియో, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్

ఫొటో సోర్స్, GOFUNDME

ఫొటో క్యాప్షన్, "ద మ్యాన్ ఇన్ ద ఐరన్ లంగ్‌" గా గుర్తింపు పొందిన పాల్ అలెగ్జాండర్
    • రచయిత, ఇడో వాక్, క్యాట్ స్నోడన్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ చిన్నప్పుడే పోలియో బారిన పడ్డారు. ఆయన శరీరంలో ఊపిరితిత్తులు పని చేయకపోవడంతో బయట నుంచి గాలి అందించేలా ఒక ఐరన్ లంగ్‌ను ఏర్పాటు చేశారు. దాని సాయంతో ఆయన 78 ఏళ్ళు జీవించారు.

అలెగ్జాండర్‌కు ఆరేళ్లు ఉన్నప్పుడు 1952లో పోలియో సోకింది. దీంతో, ఆయనకు మెడ కింద బాగం అంతా చచ్చుబడి పోయింది.

ఆయన స్వతంత్రంగా ఊపిరి తీసుకోలేకపోయారు. దీంతో ఆయన శరీరాన్ని డాక్టర్లు ఓ ఐరన్ సిలిండర్‌లో పెట్టారు. అదే ఆయనకు ఊపిరితిత్తులుగా పని చేసింది. అప్పటి నుంచి ఆయన జీవితం అంతా అందులోనే గడిచింది.

శారీరంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ అలెగ్జాండర్ న్యాయవిద్య పూర్తి చేశారు. న్యాయవాదిగా కోర్టుల్లో కేసులు వాదించారు. అనేక పుస్తకాలు రాశారు.

”ఇనుప ఊపిరితిత్తులతో జీవించిన పాల్ అలెగ్జాండర్ మరణించారు” అని ఆయన కోసం నిధులు సేకరిస్తున్న సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

‘పాల్ కాలేజ్‌కు వెళ్లారు. న్యాయవాది కూడా అయ్యారు. ఆయన అందరికీ రోల్ మోడల్” అని పాల్ సోదరుడు ఫిలిప్ అలెగ్జాండర్ తెలిపారు.

“వాడు నేను ఆడుకునేవాళ్లం, తిట్టుకునే వాళ్లం, కొట్టుకునేవాళ్లం. మాకు ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది. పార్టీలు చేసుకునేవాళ్లం. మేమిద్దరం కలిసి సంగీత కచేరీలకు వెళ్లేవాళ్లం. వాడు నాకు ప్రత్యేకంగా ఎప్పుడూ కనిపించలేదు. నేను అసలలా ఆలోచించలేదు” అని ఆయన బీబీసీతో చెప్పారు.

సొంతంగా ఆహారం తీసుకోలేని పరిస్థితి ఉన్నా, తన సోదరుడు ఎప్పుడూ ఇతరులపై ఆధారపడే వాడు కాదని, వీలైనంత వరకూ తన పనులు తానే చేసుకునే వాడని ఫిలిప్ చెప్పారు.

ఇటీవల కొన్ని వారాలుగా పాల్ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. అప్పటి నుంచి అన్నదమ్మలిద్దరూ ఎక్కువ సమయం కలిసే గడిపారు. ఇద్దరూ కలిసి ఐస్‌క్రీమ్ తినేవారు.

పోలియో, ఐరన్ లంగ్స్
ఫొటో క్యాప్షన్, పాల్ అలెగ్జాండర్ సోదరుడు ఫిలిప్ అలెగ్జాండర్

ఐరన్ లంగ్స్ అంటే ఏమిటి?

1952లో ఆయన అనారోగ్యం పాలైనప్పుడు డాలస్‌లోని డాక్టర్లు ఆయనకు ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. అయితే, పోలియో కారణంగా ఆయన సొంతంగా ఊపిరి తీసుకోలేకపోయారు.

ఆయన శరీరానికి ఐరన్ లంగ్ అని పిలిచే ఒక మెటల్ సిలిండర్ అమర్చారు. ఆయన మెడ నుంచి కింది బాగం అంతా ఈ సిలిండర్‌లోనే ఉండేది.

తన శరీరానికి అవసరమైన గాలిని అందించే బాహ్య ఊపిరితిత్తుల్ని ఆయన “ఓల్డ్ ఐరన్ హార్స్” అని పిలిచేవారు.

ఈ సిలిండర్ ఎలా పని చేస్తుందంటే ఇందులో గాలి తిత్తులు ఉంటాయి. ఇవి బయటి గాలిని తీసుకున్నప్పుడు ఊపిరితిత్తులు విస్తరిస్తాయి. దీంతో ఆయన ముక్కు ద్వారా గాలిని పీలుస్తారు.

గాలి పీల్చుకున్న తర్వాత సిలిండర్‌లోని గాలి తిత్తులు తమ లోపల ఉన్న గాలిని వదిలేసి ఊపిరితిత్తుల మీద ఒత్తిడి పెంచుతాయి. దీంతో పాల్ గాలిని బయటకు వదిలేస్తారు.

అలా ఈ కృత్రిమ ఊపిరితిత్తులు శరీరంలో శ్వాస ప్రక్రియను కొనసాగిస్తాయి.

ఐరన్ లంగ్స్, వెంటిలేటర్, రెస్పిరేటరీ సిస్టమ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పోలియో వల్ల శ్వాస తీసుకునే శక్తిని కోల్పోయిన వారికి ఊపిరి అందించే ఐరన్ లంగ్స్

పెరిగిన అంచనాలు

ఐరన్ లంగ్స్ ద్వారా శ్వాస తీసుకోవడం అలవాటైన తర్వాత అలెగ్జాండర్ తనంత తనే ఊపిరి తీసుకోవడం నేర్చుకున్నారు. దీంతో అప్పుడప్పుడు కొంత సమయం పాటు సిలిండర్‌లో ఉండే అవసరం లేకుండానే శ్వాస తీసుకునేవారు.

అనేక మంది పోలియో బాధితులకు ఐరన్ లంగ్స్ అమర్చేవారు. వారి మాదిరిగానే పాల్ అలెగ్జాండర్ కూడా చనిపోతాడని అందరు భావించారు.

అయితే, ఆయన 78 ఏళ్లు జీవించారు. 1950లలో పోలియో వ్యాక్సీన్ కనుక్కున్న తర్వాత చిన్నగా ఈ మహమ్మారి అంతరిస్తోంది.

అలెగ్జాండర్ హైస్కూలు చదువు తర్వాత సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీలో చేరారు. 1984లో ఆస్టిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ నుంచి లా డిగ్రీ అందుకున్నారు.

న్యాయవాద పట్టా పొందిన రెండేళ్ల తర్వాత బార్‌లో సభ్యత్వం తీసుకుని న్యాయవాదిగా పని చేశారు.

“నేను నా జీవితంలో ఏదైనా సాధించాలంటే అది నా మెదడుతోనే సాధించగలనని నాకు తెలుసు” అని ఆయన 2020లో గార్డియన్ పత్రికతో చెప్పారు.

అదే సంవత్సరంలో ఆయన తన జ్ఞాపకాలతో ఒక పుస్తకం రాశారు. అది రాయడానికి ఆయనకు ఎనిమిదేళ్లు పట్టింది. ఒక ప్లాస్టిక్ కర్రను నోట్లో పెట్టుకుని కీ బోర్డు మీద అక్షరాలను టైప్ చేస్తూ కొన్ని సందర్భాల్లో స్నేహితుడికి డిక్టేట్ చేస్తూ ఆ పుస్తకాన్ని పూర్తి చేశారు.

శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించి ఆధునిక విధానాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఐరన్ లంగ్స్ క్రమేపీ కనుమరుగవుతూ వచ్చాయి. 1960లలో వెంటిలేటర్లు వచ్చిన తర్వాత వీటిని పూర్తిగా పక్కన పెట్టేశారు.

వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా అలెగ్జాండర్ ఐరన్ లంగ్స్‌ సిలిండర్‌లోనే జీవించారు. తాను దానికి అలవాటు పడిపోయానని, అందుకే అందులోనే ఉంటున్నట్లు ఆయన చెప్పారు.

ఐరన్ లంగ్‌తో సుదీర్ఘకాలం జీవించిన వ్యక్తిగా ఆయనను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది.

ఇవి కూాడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)