సార్వత్రిక ఎన్నికలు 2024: ఈవీఎంల పనితీరుపై చీఫ్ ఎన్నికల కమిషనర్ ఏమన్నారు?

ఫొటో సోర్స్, ECI
18వ లోక్‌సభ ఎన్నికల తేదీలను విడుదల చేసింది భారత ఎన్నికల కమిషన్.
ఏడు దశల్లో ఓటింగ్ నిర్వహించి, జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడిస్తామని తెలిపింది.
ఎన్నికలు జరిగే రాష్ట్రాల షెడ్యూల్‌ను విడుదల చేయడానికి ముందు ఎన్నికల నిర్వహణకు తాము ఎలా సన్నద్ధం అవుతున్నారో తెలిపారు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్.
ఎందుకని ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించాల్సి వస్తుందో కూడా ఆయన మీడియాకు వివరించారు. ఈవీఎంలపై ఉన్న అనుమానాల గురించి సమాధానాలు ఇచ్చారు.
ఇంకా ఆయన ఏమన్నారు?

1. ఏడు దశల్లోనే ఎందుకు?
ఏడు దశల్లో ఎన్నికల నిర్వహణ అనేది అనవసరమని, అది అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా ఉందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయనే ప్రశ్నకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ బదులిస్తూ, “దేశంలోని భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా అన్ని ప్రాంతాలకు ఏకకాలంలో చేరుకోవడం సాధ్యం కాదు. భద్రతా దళాలపై ఉండే ఒత్తిడిని కూడా ఆలోచించాలి” అన్నారు
“అంతేకాక, పండుగల సమయం. హోలీ, రంజాన్, రామనవమి పండుగలు ఉన్నాయి. అందుకోసమే తేదీల్లో మార్పులు, అంతేకానీ ఎవరికో లబ్ధి లేదా నష్టం కలిగించడానికి కాదు. ఆ ఆరోపణలు నిజం కాదు. వాస్తవాల గురించే మనం మాట్లాడాలి” అన్నారు.
ఆయా రాష్టాల్లోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
2. ఈవీఎంలపై అనుమానాలేంటి?
ఈవీఎంల పనితీరుపై ప్రతిపక్షాల ఆరోపణలపై జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు రాజీవ్ కుమార్ బదులిస్తూ,
“ఈ ప్రశ్నలు చాలాసార్లు వచ్చాయి. ట్యాంపరింగ్, కంప్యూటర్‌తో హ్యాకింగ్, ఫలితాల మార్పు వంటి పిటీషన్లను పలు రాష్ట్రాల్లోని హైకోర్టులు, సుప్రీం కోర్టులు పలు పిటీషన్లను విచారించి, అన్నింటినీ తిరస్కరించాయి” అన్నారు.
“అంతేకాదు, ఈవీఎంల ద్వారా నిర్వహించిన పోలింగ్‌లో అధికార పార్టీలు ఓటమిపాలైన సందర్భాలూ ఉన్నాయి” అంటూ ఈవీఎంలపై ప్రచురించిన పుస్తకాన్ని మీడియాకు చూపి, “ఇందులో ఈవీఎంలకు సంబంధించి 40కు పైగా కేసులను విచారించిన రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు సవివరంగా ఉన్నాయి. నిపుణులు కూడా చదవాలి” అన్నారు.

ఫొటో సోర్స్, AFP
3. టోటలైజర్ ఎందుకు ఉపయోగించరు?
బూత్‌కు కేటాయించిన ఈవీఎం మిషన్ నెంబర్‌ల ఆధారంగా ఏ అభ్యర్థికి ఏ బూత్‌లో ఎక్కువ లేదా తక్కువ ఓట్లు వచ్చాయో తెలుసుకునే అవకాశం ఉందని ఓ జర్నలిస్ట్ అన్నారు.
అందుకు ఆస్కారం ఇవ్వకుండా ఉండేందుకు టోటలైజర్ పరికరంతో అన్ని మిషన్ల నుంచి ఫలితాలు ఒకేసారి తెలుసుకోవచ్చని, ఎందుకని టోటలైజర్‌ను వినియోగించట్లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ప్రశ్నించారు.
అందుకు, “బూత్‌ల వారీగా ఫలితాలు తెలుసుకోవడం మంచిది కాదని నేనూ అంగీకరిస్తున్నాను. కానీ, చాలా మిషన్లను టోటలైజర్ పరికరంతో అనుసంధానం చేసి ఫలితాలు వెల్లడించడం క్లిష్టతతో కూడుకున్నది. ఎందుకంటే, ఒక్క మిషన్ పనితీరుపైనే చాలామంది ప్రశ్నిస్తున్నారు. టోటలైజర్ పరికరంతో లెక్కిస్తే వారు ఇంకేమంటారో తెలీదు” అన్నారు.
రాజకీయ వ్యవస్థ కొత్త సాంకేతికతను స్వాగతించాలని అన్నారు. ఆ సమయం వస్తుందని తాను ఆశిస్తున్నానని చెప్పారు.

ఫొటో సోర్స్, ECI
4. అరుణ్ గోయల్ రాజీనామాపై ఏమన్నారు?
గతవారం ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాపై జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ బదులిస్తూ, "ఆయన మా బృందంలో ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. కానీ, ప్రతి సంస్థలో వారికంటూ సొంత నిర్ణయాలు ఉంటాయి. వాటిని మనం గౌరవించాలి" అన్నారు.
"ఎన్నికల సంఘంలో అసమ్మతి ఉంటూనే ఉంటుంది. అందరి అభిప్రాయాలను గౌరవిస్తాం" అన్నారు.
5. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై..
ఎన్నికల కోడ్ అమలు తమ ప్రధాన నాలుగు సవాళ్లలో ఒకటని అన్నారు రాజీవ్ కుమార్.
పీఎం నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని, అయితే, ప్రతిపక్ష నేతలపై చర్యలు తీసుకున్నట్లు వారిపై ఎందుకు తీసుకోవడంలేదని ఓ జర్నలిస్ట్ ఆయన్ను ప్రశ్నించారు.
దానిపై రాజీవ్ కుమార్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.
“ఇలా మీరు మమ్మల్ని ప్రశ్నించొచ్చు. గత 11 ఎన్నికల సమయంలో మాకు అందిన ఫిర్యాదులపై మా స్పందనలు కూడా చూడండి” అన్నారు.
“ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదు వచ్చిన వెంటనే మేం స్పందిస్తాం. క్యాంపెయినర్ ఎవరైనా సరే, ఉపేక్షించం. తగిన చర్యలు తీసుకుంటాం” అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
6. జమ్ము, కశ్మీర్‌లో ఎన్నికలు ఎందుకు లేవు?
జమ్ము, కశ్మీర్‌లో ఎన్నికలు జరపకపోవడానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ రెండు కారణాలు చెప్పారు.
ఒకటి: జమ్ము-కశ్మీర్ రీఆర్గనైజేషన్ చట్టం 2019లో అమల్లోకి వచ్చింది. అప్పటికి రాష్ట్రంలో 107 అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో 47 స్థానాలు పీఓకేలో ఉన్నాయి. తరువాత 2022లో మళ్ళీ డీలిమిటేషన్ చేసి సీట్ల సంఖ్యను 107 నుంచి 114కు పెంచారు. వాటిలో రిజర్వేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ఈమేరకు డిసెంబర్‌లో రీఆర్గనైజేషన్ చట్టానికి సవరణ చేశారు. కానీ, అప్పటికే ఎన్నికల కమిషన్ లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా నిమగ్నమైందని సీఈసీ చెప్పారు.
రెండు: “మేం కశ్మీర్ ప్రజలను కలుసుకోవడానికి వెళ్ళాం. అక్కడి రాజకీయ పార్టీలు లోక్‌సభ ఎన్నికలతో పాటే తమ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరాయి. కానీ, ప్రభుత్వ యంత్రాంగం మాత్రం అది సాధ్యం కాదని చెప్పింది. ఎందుకంటే, అక్కడ కనీసం 1,000 మంది అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశం ఉంది. వారి రక్షణ కోసం భద్రతా బలగాలను అధిక సంఖ్యలో మోహరించాల్సి వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
7. నగదు పట్టుబడినప్పుడు తీసుకునే చర్యలేంటి?
ఇటీవల 11 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు రూ. 3,500 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల కమిషన్ తెలిపింది. దీనిపై ఒక జర్నలిస్ట్, మరి అంత డబ్బు పట్టుబడినప్పుడు ఎవరెవరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అయితే, ఆ సమాచారాన్ని సీఈసీ వెల్లడి చేయలేదు.
దీనికి సూటిగా బదులివ్వకుండా 2019 ఎన్నికల సందర్భంగా తమిళనాడులోని వెల్లూరులో పట్టుబడిన నగదు గురించి చెబుతూ రాజీవ్ కుమార్, “చాలా రాష్ట్రాల్లో డబ్బు చాలా శక్తిమంతంగా మారింది. ఈ విషయంలో మేం సీరియస్‌గా ఉన్నాం. ఇటీవలి దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల్లో మేం ఈ సమస్యను చాలా వరకు కట్టడి చేశాం. ఈ విషయంలో ఆందోళన అవసరం లేదు” అని బదులిచ్చారు.
ఇవి కూడా చదవండి:
- ఆస్కార్ వేదికపైకి జాన్ సీనా నగ్నంగా ఎందుకు వచ్చారు?
- జింకల్లో కొత్త జాతి గుర్తింపు.. ఇది ఎక్కడ ఉంది?
- సీఏఏ: పౌరసత్వ సవరణ చట్టం అమలుకు నిబంధనలను విడుదల చేసిన కేంద్రం, దీనివల్ల ఏం జరుగుతుంది?
- రోజుల వ్యవధిలో అక్కాచెల్లెళ్లకు ఒకే తరహాలో గుండెపోటు, హఠాత్తుగా వచ్చే సమస్య ఎంత ప్రమాదకరం?
- జీఎన్ సాయిబాబా: ‘నేను ఇంతకాలం బతుకుతానని జైలు అధికారులు కూడా అనుకోలేదు’
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














