లోక్ సభ ఎన్నికలు 2024: ఏడు దశల్లో పోలింగ్, జూన్ 4న రిజల్ట్స్

లోక్‌సభ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 19 నుంచి 7 దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 04న విడుదలవుతాయి.

తెలంగాణలో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజక వర్గానికి జరగాల్సిన ఉప ఎన్నిక జనరల్ ఎలక్షన్ నాలుగో దశలో అంటే మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ స్థానాలతోపాటు, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు నాలుగో దశలో అంటే మే 13న ఒకేసారి పోలింగ్ జరగనుంది.

మొత్తం మీద మే 13 రెండు తెలుగు రాష్ట్రాలలో లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ, తెలంగాణలో ఒక నియోజక వర్గం ఉప ఎన్నిక ఒకే రోజు జరగనున్నాయి.

లోక్ సభ ఎన్నికలు

ఫొటో సోర్స్, NarendraModi/X

ఏ దశలో ఎన్ని సీట్లకు ఎన్నికలు?

మొదటి దశ ఓటింగ్ 2024 ఏప్రిల్ 19న నిర్వహించనున్నారు, ఇందులో 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది.

రెండో దశ ఓటింగ్ 2024 ఏప్రిల్ 26న నిర్వహించనున్నారు, ఇందులో 13 రాష్ట్రాల్లోని 89 స్థానాలకు ఓటింగ్ ఉంటుంది.

మూడో దశ ఓటింగ్ 2024 మే7న నిర్వహించనున్నారు, ఇందులో 12 రాష్ట్రాల్లోని 94 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది.

నాలుగో దశ ఓటింగ్ 2024 మే 13న నిర్వహించనున్నారు, ఇందులో 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది.

ఐదో దశ ఓటింగ్ 2024 మే 20న నిర్వహించనున్నారు, ఇందులో 8 రాష్ట్రాల్లోని 49 స్థానాల్లో ఓటింగ్ జరుగుతుంది.

ఆరో దశ ఓటింగ్ 2024 మే 25న నిర్వహించనున్నారు, ఇందులో 7 రాష్ట్రాల్లోని 57 స్థానాల్లో ఓటింగ్ జరగనుంది.

ఏడో దశ ఓటింగ్ జూన్ 1, 2024న నిర్వహించనున్నారు, ఇందులో 8 రాష్ట్రాల్లోని 57 స్థానాల్లో ఓటింగ్ జరుగుతుంది.

జూన్ 4 నఓట్ల లెక్కింపు జరుగుతుంది, ఈ ప్రక్రియ జూన్ 6 లోపు పూర్తవుతుంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, పంజాబ్, గుజరాత్, దిల్లీ, హరియాణా స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.

రాజస్థాన్, మణిపూర్, కర్ణాటక, త్రిపురలో రెండు దశల్లో, అస్సాం, ఛత్తీస్‌గఢ్‌లో మూడు దశల్లో, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఐదు దశల్లో, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి.

పోటీ ప్రధానంగా ఎవరి మధ్య?

లోక్ సభ సీట్ల లెక్కప్రకారం చూస్తే ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 80 స్థానాలు ఉండగా, మహారాష్ట్రలో 48, పశ్చిమ బెంగాల్‌లో 42, బిహార్‌లో 40, తమిళనాడులో 39 సీట్లు ఉన్నాయి.

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆరు జాతీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, సీపీఎం, బహుజన్ సమాజ్ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ (పీఏ సంగ్మా ఏర్పాటు చేసిన పార్టీ, ఉత్తరప్రదేశ్‌లో జాతీయహోదా సాధించిన తొలి పార్టీ), ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల రణరంగంలో తలపడనున్నాయి.

ఈ ఎన్నికలు ప్రధానంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే (నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్) కూటమికి ఇండియా కూటమికి మధ్య జరగనున్నాయి.

ఎన్డీయే మోదీ సారథ్యంలోనే మూడోసారి ఎన్నికల బరిలోకి దిగబోతోంది. కానీ, ఇండియా కూటమికి ఎవరు సారథ్యం వహించనున్నారో ఇంతవరకూ ప్రకటించలేదు.

జాతీయ పార్టీ హోదా ఉన్న పార్టీల్లో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) మినహా మిగిలిన పార్టీలన్నీ కూటమిలో భాగమే.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో పీఏ సంగ్మాకి చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ, నితీష్ కుమార్ పార్టీ జనతాదళ్ యునైటెడ్, చంద్రబాబు నాయుడి తెలుగుదేశం పార్టీ, ఏకనాథ్ శిందె పార్టీ శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, జయంత్ చౌదరికి చెందిన రాష్ట్రీయ లోక్‌దళ్, హెచ్‌డీ దేవెగౌడ పార్టీ జనతాదళ్(ఎస్) సహా మరికొన్ని చిన్న, పెద్ద పార్టీలు ఉన్నాయి.

ఇండియా కూటమిలో కాంగ్రెస్‌తో పాటు, వామపక్ష పార్టీలు, లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్, అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ, స్టాలిన్ పార్టీ డీఎంకే, హేమంత్ సోరెన్ సారథ్యంలోని ఝార్ఖండ్ ముక్తి మోర్చా, ఉద్దవ్ ఠాక్రేకి చెందిన శివసేన, శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ, అర్వింద్ కేజ్రీవాల్‌కి చెందిన ఆమ్ ఆద్మీ సహా మరో రెండు డజన్ల పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి.

అయితే, మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్, మాయావతి పార్టీ బీఎస్పీ, నవీన్ పట్నాయక్‌కి చెందిన బిజూ జనతాదళ్, వైఎస్ జగన్‌‌ పార్టీ వైఎస్సార్‌సీపీ, కేసీఆర్ సారథ్యంలోని బీఆర్‌ఎస్ ఏ కూటమిలో చేరతాయో ప్రకటించలేదు.

లోక్ సభ

ఫొటో సోర్స్, RahulGandhi/X

17వ లోక్‌ సభలో ఏం జరిగింది?

2019లో జరిగిన 17వ లోక్‌ సభ ఎన్నికల్లో దాదాపు 90 కోట్ల మంది ఓటర్ల జాబితాలో ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 8 కోట్ల 43 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు పొందారు.

దాదాపు 69.40 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, అందులో 45 శాతం ఓట్లు ఎన్డీయే కూటమికి రాగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి 26 శాతం ఓట్లు వచ్చాయి.

గత ఎన్నికల్లో 10 లక్షల మంది పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ జరగ్గా, ప్రతి పోలింగ్ బూత్‌లోనూ తొలిసారి వీవీప్యాట్‌ వినియోగంలోకి వచ్చింది.

ఇదొక్కటి మాత్రమే కాదు, 1950ల నుంచి గమనిస్తే, తొలిసారిగా ఓటింగ్ జాబితాకు సంబంధించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్‌‌కి ఫోన్ చేసి తెలుసుకునే సదుపాయం కల్పించారు.

17వ లోక్ సభలో మరో విశేషమేంటంటే, 78 మంది మహిళలు లోక్ సభకు ఎన్నికయ్యారు. స్వాతంత్య్రం వచ్చిన అంతపెద్ద సంఖ్యలో మహిళలు లోక్ సభకు రావడం ఇదే తొలిసారి.

అలాగే, 2019లో ఏకంగా 267 మంది మొదటిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఎంపీల్లో 475 మంది కోటీశ్వరులు ఉన్నారు. 17వ లోక్ సభ ఎంపీల సగటు సంపద విలువ 20 కోట్ల రూపాయలకు పైనేనని ఉంటుందని అంచనా.

బీజేపీకి చెందిన ఓం బిర్లా 17వ లోక్ సభ స్పీకర్‌గా ఉన్నారు. అయితే, ఈ సభలో అధికార, విపక్షాల మధ్య పెద్దగా చర్చ జరిగింది లేదు.

17వ లోక్ సభలో కేవలం 16 శాతం బిల్లులను పార్లమెంటరీ కమిటీకి పంపగా, సగానికి పైగా బిల్లులు కేవలం రెండు గంటల కంటే తక్కువ సమయంలోనే ఆమోదం పొందాయి.

ప్రభుత్వేతర సంస్థ పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసర్చ్ ప్రకారం, సగటున ఏడాదికి 55 రోజులు పార్లమెంట్ సమావేశాలు జరిగాయి.

మణిపుర్‌లో జరిగిన హింసాకాండపై అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలతో పార్లమెంట్ అనేక సార్లు వాయిదా పడింది.

అలాగే, 2023 డిసెంబర్ 12న ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీలో నుంచి పార్లమెంట్ చాంబర్‌లోకి దూకిన ఘటనతో భద్రతా లోపం కింద కేసు కూడా నమోదైంది.

లోక్ సభ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

గత ఎన్నికలు ఎన్ని దశలు?

గతంలో 17వ లోక్‌ సభకి జరిగిన 2019 ఎన్నికల్లో ఏప్రిల్ 11 నుంచి మే 19 మధ్య ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. అత్యధిక సీట్లున్న మూడు ప్రధాన రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌లలో ఏడు దశల్లో ఓటింగ్ జరిగింది.

నాలుగు రోజుల అనంతరం మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 353 స్థానాలను గెలుచుకుంది.

బీజేపీ సొంతంగా 303 సీట్లు సాధించింది. కాంగ్రెస్‌ 52 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి 92 సీట్లు గెలుచుకుంది.

లోక్‌ సభలో మొత్తం ఎన్ని స్థానాలు

రాజ్యాంగంలోని ఆర్టికల్ 83 ప్రకారం, ప్రతి ఐదేళ్లకోసారి లోక్‌ సభ ఎన్నికలు నిర్వహించాలి.

రాజ్యాంగం ప్రకారం, లోక్‌ సభ స్థానాల గరిష్టంగా 552 స్థానాలు ఉండవచ్చు.

ప్రస్తుత లోక్‌ సభ స్థానాల సంఖ్య 545. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 543 స్థానాలకు సాధారణ ఎన్నికలు జరుగుతాయి.

వాటితో పాటు లోక్‌ సభలో ఆంగ్లో-ఇండియన్ల ప్రాతినిధ్యం తగ్గిందని రాష్ట్రపతి భావిస్తే, ఇద్దరు సభ్యులను నామినేట్ చేయవచ్చు.

మొత్తం సీట్లలో 131 లోక్‌ సభ స్థానాలు రిజర్వ్ కేటగిరీలో ఉంటాయి. ఈ 131 స్థానాల్లో 84 ఎస్సీ, 47 ఎస్టీ రిజర్వుడ్ సీట్లు. ఈ స్థానాల నుంచి ఎస్సీ, ఎస్టీలు మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది.

ప్రభుత్వం ఎలా ఏర్పాటవుతుంది?

ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు లోక్ సభలో 272 సీట్లు అవసరమవుతాయి. మెజార్టీ సీట్లు రాకపోయినప్పటికీ, ఇతర పార్టీలతో కూటమిని ఏర్పాటు చేయవచ్చు.

ఎన్నికల ముందు, లేదా ఫలితాల తర్వాత కూడా పార్టీలు కూటమి ఏర్పాటు చేసుకోవచ్చు.

లోక్ సభలో ప్రతిపక్ష హోదా పొందేందుకు మొత్తం పార్లమెంట్ సీట్లలో 10 శాతం, అంటే 55 సీట్లు అవసరం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు 44 సీట్లు మాత్రమే వచ్చాయి. 2019లోనూ కాంగ్రెస్‌ను 55 సీట్ల మార్కును చేరుకోలేకపోయింది. అయితే, 2014 కంటే మెరుగుపడింది.

లోక్ సభ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఏ నమూనాతో భారత ఎన్నికల ప్రక్రియ ఏర్పాటైంది?

భారత ప్రజాస్వామ్య వ్యవస్థ బ్రిటిష్ వెస్ట్‌మినిస్టర్ మోడల్‌ ఆధారంగా రూపొందింది. కానీ, బ్రిటన్‌లో ఒక్కరోజే ఎన్నికలు జరుగుతాయి.

పోలింగ్ పూర్తవడంతోనే ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తాయి. అదే రోజు రాత్రి ఓట్ల లెక్కింపు, మరుసటి రోజు ఉదయానికి ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయి.

కానీ, భారత్‌లో అలా కాదు. భద్రతా కారణాల రీత్యా అనేక దశల్లో పోలింగ్ జరుగుతుంది. ప్రతి దశలో ఓటింగ్ తర్వాతి నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ వరకూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) భద్రపరచాలి.

ఎలక్షన్ కమిషన్ సూచనల ప్రకారం, తుది దశ ఓటింగ్ ముగిసిన తర్వాతే ఎగ్జిట్ పోల్స్‌ను ప్రసారం చేయాలి.

కొద్దిరోజుల తర్వాత ఒకరోజు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

గతంలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిగినప్పుడు సాయంత్రానికి ఎవరు ముందంజలో ఉన్నారనే ట్రెండ్స్ వచ్చి, ఆ తర్వా ఫలితాలు వచ్చేవి. అందుకు చాలా సమయం పట్టేది. ప్రస్తుతం ఈవీఎంలు వినియోగిస్తుండడంతో మధ్యాహ్నానికి ట్రెండ్స్ తేలిపోయి, సాయంత్రానికి ఫలితాలు వచ్చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)