ఎంపీ వద్దు, ఎమ్మెల్యేనే కావాలని నేతలు ఎందుకు పట్టుబడుతున్నారు?

ఫొటో సోర్స్, PRALHAD JOSHI
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్యే అభ్యర్థుల ఇళ్లు, కార్యాలయాల దగ్గర సందడి కనిపిస్తోంది. కానీ, ఎంపీలు లేదా ఎంపీ అభ్యర్థుల కార్యాలయాల వద్ద హడావిడి అంతగా కనిపించడం లేదు.
ప్రచారంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులే ఎక్కువగా హడావిడి చేస్తుంటే, ఎంపీ అభ్యర్థులు ప్రచారంలో అంతగా కనిపించడం లేదు. రాజకీయ పార్టీల తరపున ఎన్నికల బరిలో దిగేందుకు టికెట్లు ఆశిస్తున్న వారు కూడా పార్లమెంట్ కంటే అసెంబ్లీకి వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు.
ఎమ్మెల్యేల వివరాలను పుట్టుపూర్వోత్తరాలు సహా చాలా మంది ప్రజలు చెప్పగలుగుతున్నారు. ఎంపీల విషయంలో అది కనిపించడం లేదు. ఎమ్మెల్యేలతో పోలిస్తే ఎంపీలకు ప్రజలతో సంబంధాలు తక్కువే. ఇది కొంత కాలం నుంచి చూస్తున్నదే. మరి ఈ పరిస్థితికి కారణాలేంటి?
రాజకీయ చర్చల్లో వినిపించని ఎంపీ పేరు
ఎన్నికల సమయంలో ఒకే పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కలిసి ప్రచారానికి వెళ్లడం, ఒకరిని గెలిపించాలని మరొకరు అభ్యర్థించడం కనిపిస్తుంటుంది.
కానీ, ఒకసారి ఎన్నికలు పూర్తైన తర్వాత ఎమ్మెల్యే కనిపించినంతగా ప్రజల్లో ఎంపీ కనిపించరనే వాదన ఉంది. చాలా మంది ఎంపీ కార్యాలయాల వద్ద కూడా ప్రజల రాకపోకలు పెద్దగా కనిపించవు.
అలాగే, ఏదైనా కార్యక్రమానికి ఎంపీలు ప్రొటోకాల్ ప్రకారం హాజరవుతూ ఉంటారు. కానీ అక్కడికి వచ్చిన సాధారణ ప్రజల్లో జరిగే రాజకీయ చర్చల్లో ఎంపీ పేరు పెద్దగా వినిపించదు. కొన్ని నియోజకవర్గాల్లో ఎంపీ పేరును చాలా మంది ప్రజలు చెప్పలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది.
ఇలాంటివి చూసినప్పుడు ఎంపీలకు, ప్రజలకు మధ్య రాజకీయంగా మెరుగైన సంబంధాలు ఉండవనే విషయం నిజమేననే అభిప్రాయం ఏర్పడుతుందని ఆంధ్రా యూనివర్సిటీ జర్నలిజం విభాగం ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి అన్నారు.

ఎంపీలకు, ప్రజలకు మధ్య పెరిగిన దూరం: డీవీఆర్ మూర్తి
గతంలో ఎంపీకి, ప్రజలకు మధ్య నేరుగా సంబంధాలు ఉండేవి, గత 20, 25 ఏళ్లుగా క్రమంగా ఎంపీలకు, ప్రజలకు మధ్య సంబంధాలు తగ్గుముఖం పడుతున్నాయని రాజకీయ విశ్లేషకుడు ఎం.యుగంధర్ రెడ్డి బీబీసీతో అన్నారు.
ఆర్థిక సంస్కరణలకు ముందు టెలిఫోన్, గ్యాస్ కనెక్షన్లు ఇప్పించాలని అడిగేందుకైనా ఎంపీ ఆఫీసుల వద్ద ప్రజలు కనిపించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఉదాహరణకు విశాఖపట్నం, శ్రీకాకుళం ఎంపీ ఆఫీసుల వద్దకు బీబీసీ బృందం వెళ్లినప్పుడు, అక్కడ దాదాపు ఎవరూ కనిపించలేదు.
''పార్లమెంట్ సభ్యుడు(ఎంపీ) అంటే రాష్ట్రం తరపున కేంద్రంతో మాట్లాడేందుకు ఒక ప్రతినిధిగా మాత్రమే ప్రజలు చూస్తున్నారు. ఓటేసి ఎన్నుకున్న తమ కోసం పని చేయాల్సిన ఒక ప్రజా ప్రతినిధి అన్నట్లు చూడటం లేదు. దానికి తగ్గట్టుగానే ఎంపీలు కూడా ఎన్నికల సమయంలో ఏవో హామీలు ఇవ్వడమే కానీ, ఆ తర్వాత వాటిని నెరవేర్చడం కానీ, ప్రజలకు వాటి విషయంలో అప్డేట్ చేయడం కానీ దాదాపు ఉండడం లేదు. ప్రజలు దీనిని పెద్దగా పట్టించుకోరు. విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక హోదా వంటివి ఈ కోవలోకే వస్తాయి'' అని ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి అన్నారు.
''సామాన్యులకు ఎమ్మెల్యేలతో ఉన్నంత అవసరం ఎంపీలతో ఉండదు. పార్టీలు కూడా ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు బాగా వ్యాపారాలు, డబ్బున్న వాళ్లను, స్థానికతతో సంబంధం లేకుండా ఏ ప్రాంతం వారినైనా మరో ప్రాంతంలో ఎంపీగా పోటీకి నిలబెడుతున్నాయి. ఇలాంటి వారితో సామాన్య ప్రజలు వెళ్లి మాట్లాడేందుకు వెనకాడతారు. దీంతో ఎంపీ పదవి అనేది ప్రజల కోసం అని కాకుండా, రాజకీయంగా అదో పెద్ద పదవి అనే ఆలోచన ప్రజల్లో ఏర్పడుతుంది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజల మధ్య తిరిగితే ఏ నాయకుడినైనా తాము నెత్తిన పెట్టుకుంటామని శ్రీకాకుళానికి చెందిన సత్యం అనే వ్యక్తి చెప్పారు.
‘‘ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, కార్పొరేటర్ అయినా తమ పరిధిలో ఉన్న ప్రజల సమస్యలను తీరుస్తారనే ఎన్నుకుంటాం. మా దగ్గరకు రాకపోతే వారు ఒకరున్నారనే విషయం మాకెలా తెలుస్తుంది’’ అని ఆయన ప్రశ్నించారు.

ఎమ్మెల్యే సీటుకే నేతల మొగ్గు
ప్రజలకు, పార్లమెంట్ సభ్యులకు మధ్య దూరం పెరగడం నిజమేనని రాజకీయ నాయకులు కూడా చెబుతున్నారు. ఎంపీ సీటు కంటే ఎమ్మెల్యే సీటుకే ప్రస్తుత రాజకీయాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో డిమాండ్ ఉంది.
ఏపీలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరుగనుండగా, ఎమ్మెల్యే సీట్లపై సాగుతున్న చర్చ, రచ్చ అంతా ఇంతా కావు. ఎంపీ సీట్ల విషయంలో అది తక్కువే.
చాలా చోట్ల ఎంపీ సీటు ఇస్తామని పార్టీ చెప్పినా తమకు ఎమ్మెల్యే సీటే కావాలని అభ్యర్థులు పట్టుబడుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ సీటు రెండింట్లో ఏది కావాలో కోరుకోమని పార్టీ అడిగినా నేతలు ఎమ్మెల్యే సీటుకే మొగ్గు చూపుతున్నారు.
“ఎమ్మెల్యే ఎక్కువగా ప్రజలతో మమేకమై ఉంటాడు. ఎమ్మెల్యేల కంటే కార్పొరేటర్లకు ప్రజలతో కలిసేందుకు ఇంకా మంచి అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలో బాగా చర్చకు వచ్చే ఒక అంచనా ప్రకారం చూస్తే, కార్పొరేటర్‌గా బరిలోకి దిగే వ్యక్తులకు 75 శాతం వ్యక్తిగత గుర్తింపు, 25 శాతం పార్టీ గుర్తింపు ఉండాలి. అదే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 50 వ్యక్తిగత గుర్తింపు, 50 శాతం పార్టీ ఇమేజ్ కావాలి. అదే ఎంపీ స్థాయికి వచ్చేసరికి 25 శాతం వ్యక్తిగత గుర్తింపు, 75 శాతం పార్టీ గుర్తింపు సరిపోతుంది” అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బీబీసీతో అన్నారు. ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు.

పారాచూట్‌పై వస్తున్నారు, వెళ్తున్నారు: యుగంధర్ రెడ్డి
‘‘కనీసం ఆ 25 శాతం వ్యక్తిగత గుర్తింపు ఉన్నవాళ్లను కూడా రాజకీయ పార్టీలు ఎంపీలుగా తీసుకోవడం లేదు. పూర్తిగా కొత్త ముఖాలనే పార్లమెంట్ నియోజకవర్గాలపై వదులుతూ, తమ పార్టీని చూసి గెలిపించండి అని అడుగుతున్నారు. కానీ, ఆ వ్యక్తి ఎంపీగా ఎలా సరిపోతారనే విషయాన్ని చెప్పడం లేదు’’ అని రాజకీయ విశ్లేషకుడు ఎం.యుగంధర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
“ఇవాళ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎంపీలుగా వ్యాపారవేత్తలు, బాగా డబ్బున్నోళ్లు పారాచూట్ వేసుకుని వచ్చి వాలిపోతున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచినా, ఓడినా అదే పారాచూట్‌పై వెళ్లిపోయి తమ వ్యాపారాలు చేసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ప్రస్తుత రాజకీయాల్లో ఎంపీకి స్థానికత, స్థానికులు అనేవి అర్థంలేని పదాలుగా మరిపోయాయి’’ అని జనసేన పార్టీ నాయకుడు పీవీఎస్ఎన్ రాజు బీబీసీతో అన్నారు.
ఎంపీలు పొడవాటి కార్లలో తిరుగుతూ, ఇంద్రభవనాల్లాంటి బంగ్లాల్లో నివపిస్తుంటే సాధారణ పౌరులు వెళ్లి కలిసే ధైర్యం కూడా చేయలేకపోతున్నారని ఆయన చెప్పారు. అలాగే, గెలిచిన తర్వాత ఎక్కువ మంది ఎంపీలు దిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకోవడం, వాళ్ల వ్యాపారాలు పెంచుకోవడానికే పరిమితమవుతున్నారే కానీ, ప్రజల కోసం ఆలోచించడం లేదని అభిప్రాయపడ్డారు.
పరిధి తక్కువైతేనే మెరుగైన సంబంధాలు: విశాఖ ఎంపీ
ప్రజలతో ఎంపీలు మంచి సంబంధాలు నెలకొల్పడమనేది దాదాపు అసాధ్యమని విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బీబీసీతో అన్నారు.
ఆయన్ను విశాఖ తూర్పు శాసనసభ నియోజకవర్గం సమన్వయకర్తగా వైసీపీ నియమించింది.
“నేను ఎమ్మేల్యేగానైనా, ఎంపీగానైనా పోటికి సిద్ధమే. ఎంపీగా ప్రజలకు వీలైనంత సేవ చేశాను. కానీ ఏడు నియోజకవర్గాల్లోని ప్రజలందరితో మంచి సంబంధాలు నెలకొల్పడం సాధ్యం కాదు. నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణతో ఎంపీల సంఖ్య పెరిగినా దేశంలోని ఏ ఎంపీ కూడా, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు చేరువైనంతగా ప్రజలకు దగ్గర కాలేరు.
ఏడాదిలో పార్లమెంట్ సమావేశాలు, ఇతర సమావేశాలకే 150 రోజులు పోతుంది. మిగతా రోజుల్లో నియోజకవర్గాల్లో తిరగడం, వారి సమస్యలు తెలుసుకునేందుకు కొన్ని రోజులు కేటాయించినా, ప్రజల్లో గుర్తింపు పొందడం కష్టం. ఎంపీలకు ప్రజలతో ఎక్కువగా కలిసే అవకాశం కూడా లభించదు” అని సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.
ఏ రాజకీయ నాయకుడికైనా ఎంత చిన్న పరిధి ఉంటే ప్రజలతో అంత కనెక్షన్ ఉంటుందని, అదే ఎంపీల విషయంలోనూ వర్తిస్తుందని ఆయన చెప్పారు.
పార్లమెంట్ నియోజకవర్గమంతా తిరగడం కష్టం: కూన
ఒక నియోజకవర్గ ఎంపీకి, ఆ నియోజకవర్గ ప్రజలతో సరైన సంబంధాలు ఉండకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ బీబీసీతో అన్నారు.
‘‘ఒక ఎంపీ 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయాల్సి ఉంటుంది. ఏడు నియోజవకర్గాల్లో తిరుగుతూ, అక్కడి ప్రజలతో సంబంధాలు నెరపడమంటే ఒక వ్యక్తికి కష్టమైన పని. విస్తీర్ణంపరంగా చూసుకుంటే ఏడు నియోజకవర్గాలకు దాదాపు 100 కిలోమీటర్ల పరిధి వస్తుంది. ఒక ఎంపీ నియోజకవర్గం అంతటా తిరగడమంటే కష్టమే. కానీ, తిరిగగలిగితే ప్రజల్లో మంచి పట్టు సాధించవచ్చు.
ఎంపీల నియోజకవర్గ పరిధిని తగ్గించేందుకు ఇప్పుడున్న పార్లమెంట్ సభ్యుల సంఖ్యను 750కి పెంచాలనే డిమాండ్ ఉంది. పార్లమెంట్ సభ్యుల సంఖ్య, పరిధిని ఇప్పుడు మార్చాల్చిన అవసరం ఉంది. రాబోయే కొత్త ప్రభుత్వం ఇది చేస్తుందని ఆశిస్తున్నా. ఎంపీ అనేది చేతికి ఆరో వేలులాగే భావించాల్సిన పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల పరంగా ప్రజల అవసరాలు ఉంటే వాటికి మాత్రమే పార్లమెంట్ సభ్యులను సంప్రదిస్తారు’’ అని రవికుమార్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేస్తాయని ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాత్ర ఉంటుంది కాబట్టి ప్రజలు ఎక్కువగా వారి దగ్గరకే వెళ్తుంటారని వివరించారు.

‘ఎంపీలు దిల్లీకి తీసుకుని వెళ్లేవారు’
''ఎంపీ ల్యాడ్స్ కంటే కూడా ఒక వార్డులో కార్పొరేటర్ ఎక్కువ నిధులు ఏడాదిలో ఖర్చు పెట్టగలుగుతున్నారు. అలాగే, గతంలో ఎంపీలు తమ నియోజకవర్గంలోని సమస్యలపై ప్రజలను దిల్లీ తీసుకుని వెళ్లి తమ ఇళ్లలో పెట్టుకుని, ఊరంతా తిప్పుతూ వారితో కలిసి ఉండేవారు. అధికారుల దగ్గరకు తీసుకుని వెళ్లి వినతిపత్రాలు ఇప్పించడం చేసేవారు. ఆ తర్వాత ఎంపీ ఆ సమస్య పరిష్కారాలను ఫాలోఅప్ చేసేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. దీంతో క్రమంగా ప్రజలకు, ఎంపీలకు కనెక్షన్ కట్ అయిపోతోంది’’ అని యుగంధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఎంపీలు ప్రోటోకాల్ కోసం శిలాఫలకాలపై పేర్లకు, ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలకు డబ్బు సమకూర్చడం కోసమే అన్నట్లుగా తయారయ్యారని చెప్పారు.
ఎమ్మెల్యేలకైతే తక్కువ ఆర్థిక వనరులతో ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉందని ఆయన ప్రస్తావించారు. చాలా మంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యే పదవులకే పరిమితం అవుతున్నారని చెప్పారు.
ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం, అధికారంలో కొనసాగడం కోసం ఎమ్మెల్యేలపై పెట్టినంత దృష్టి ఎంపీలపై పెట్టవని డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ జర్నలిజం విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లీలా వరప్రసాద్ బీబీసీతో చెప్పారు.
‘‘బాగా డబ్బులున్న ఎవరో ఒకర్ని ఎంపీగా పెట్టేసి చోద్యం చూస్తున్నారు. ఎంపీ అభ్యర్థుల గెలుపోటములు ప్రాంతీయ పార్టీపై పెద్దగా ప్రభావం చూపకపోవడం ఒక కారణం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
జాతీయ స్థాయి రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల ఎంపీలకు పెద్దగా గుర్తింపు ఉండదని డీవీఎస్ మూర్తి చెప్పారు.
‘‘వారికి లోక్‌సభలో మాట్లాడే అవకాశం కూడా తక్కువే. ఎవరో ఒకరిద్దరు మినహా మిగతా ఎంపీలు పెద్దగా ఫోకస్ అవ్వరు. దీంతో వీరు ప్రజల్లోనూ పెద్దగా గుర్తింపు పొందరు’’ అని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- రష్యా ఆర్మీలో హెల్పర్ పని అని తీసుకెళ్లి సైన్యంలో చేర్చారు.. హైదరాబాద్ యువకుడి మరణంపై కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?
- కోల్‌కతా: దేశంలోనే తొలి అండర్‌వాటర్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని.. నిర్మాణానికి వందేళ్ల కిందటే ప్లాన్
- అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్: పాప్ స్టార్ రియానా, బిలియనేర్ బిల్‌గేట్స్, మార్క్ జుకర్ బర్గ్, ఇవాంకా ట్రంప్... ఇంకా భారతీయ హేమాహేమీల మెగా సందడి
- హిందూమతం- నా అభిమతం-5: ఆరెస్సెస్‌లో చేరడం నుంచి ముస్లింను పెళ్లి చేసుకోవడం వరకు రసికా అగాషే కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














