కానిస్టేబుల్ లలిత్: అమ్మాయి అబ్బాయిగా మారిపోయి, తండ్రి కూడా అయ్యారు

ఫొటో సోర్స్, KIRAN SAKALE
- రచయిత, శ్రీకాంత్ బంగాలే
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘లలిత.. లలిత్‌గా మారిపోయారు. ఒక అమ్మాయి అబ్బాయిగా మారిపోయి, తండ్రి కూడా అయ్యారు’’
ఇది చెప్పేటప్పుడు, లలిత్ సాల్వే కళ్లలో మెరుపు కనిపించింది.
లలిత్ సాల్వే ప్రస్తుతం మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతంలో నివసిస్తున్నారు.
లలిత్ భార్య సీమా 2024 జనవరి 15న పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. లలిత్, సీమ తల్లిదండ్రులు అయ్యారు.
ఆ రోజును గుర్తు చేసుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయని అంటున్నారు లలిత్.
లలిత్ ప్రయాణం అంత తేలిగ్గా సాగలేదు. ఆయన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.
శస్త్రచికిత్సకు ముందు తనకు లలితా సాల్వేగా గుర్తింపు ఉండేది. లలితకు చిన్నప్పటి నుంచీ తన శరీరం వేరు అనే భావన ఉండేది. జననేంద్రియాల దగ్గర కొన్ని గడ్డలను గమనించినప్పుడు వైద్యుడి వద్దకు వెళ్లినట్లు లలిత చెప్పారు.
అప్పుడు డాక్టర్ తను స్త్రీ కాదు పురుషుడు అని నిర్ధరించారు. 2018 నుంచి 2020 వరకు 3 సర్జరీలు చేయించుకున్నారు. ఆ తర్వాత లలితకి ‘లలిత్ సాల్వే’గా కొత్త గుర్తింపు వచ్చింది.

ఫొటో సోర్స్, LALIT SALVE
లలిత్ సాల్వేకు చేసిన శస్త్రచికిత్స 'జెండర్ రీ అసైన్ మెంట్ సర్జరీ' కాదు, అది జెనిటల్ రీకన్‌స్ట్రక్షన్ శస్త్రచికిత్స అని డాక్టర్ రజత్ కపూర్ బీబీసీకి చెప్పారు.
2020లో సీమాను పెళ్లి చేసుకున్నారు లలిత్ సాల్వే.
‘‘నేను పెళ్లి చేసుకోగలనా? అని డాక్టర్‌ను అడిగాను. అప్పుడు డాక్టర్, నువ్వు ఫిట్‌గా ఉన్నావని నీకనిపిస్తే కచ్చితంగా చేసుకోవచ్చని చెప్పారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను’’ అని తెలిపారు.
2020 ఫిబ్రవరి 14న సంభాజీనగర్‌కు చెందిన యువతి సీమా బన్సోడేను పెళ్లి చేసుకున్నారు. కానీ, ఈ నిర్ణయం తీసుకోవడం వారికంత తేలిక కాలేదు.
‘‘ఒకప్పుడు నన్ను చూసి నవ్వేవారు, స్త్రీ.. పురుషుడిగా ఎలా మారుతుందో అని నన్ను ఆటపట్టించేవారు. వెక్కిరిస్తూ ఉండేవారు. ఆ మాటలను ప్రతీసారి పడాల్సి వచ్చింది. అందులోంచి బయటకి వచ్చాను. ఇప్పుడు నేను దానిని అధిగమించాను. నన్ను నేను స్త్రీ నుంచి పురుషునిగా మార్చుకున్నాను. ఆ తర్వాత మరో పోరాటం మొదలైంది. నా పెళ్లి గురించి జనం రకరకాలుగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇలాంటి వ్యక్తిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? లలిత్‌కి వధువు ఎలా దొరుకుతుంది?’’ అని అనేవారని లలిత్ సాల్వే చెప్పారు.
‘‘ ఇప్పుడు పెళ్లయింది. పెళ్లయ్యాక, ఓకే.. నీలాంటి వాడు తండ్రి ఎలా అవుతాడు? వధువు తన జీవితాన్ని నాశనం చేసుకుందని అనేవారు. కానీ, ఇప్పుడు నేను తండ్రి కూడా అయ్యాను’’ అని చాలా గర్వంగా చెప్పారు లలిత్ సాల్వే.

ఫొటో సోర్స్, LALIT SALVE
లలిత్, సీమా పెళ్లయిన 3 సంవత్సరాల తరువాత బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు.
‘‘ప్రెగ్నెన్సీ వార్త తెలిసిన రోజు చాలా సంతోషించాను. ఎలా అనిపించిందో చెప్పలేను. మాటల్లో వివరించలేను. మా అమ్మకు శుభవార్త చెప్పాను. మేం మా కుటుంబ సభ్యుల నుంచి విషయం బయటికి వెళ్లనివ్వలేదు. మొదటి 3 నెలల వరకు ప్రెగ్నెన్సీ గురించి బయటపెట్టకూడదని మేమిద్దరం నిర్ణయించుకున్నాం’’ అని లలిత్ సాల్వే చెప్పారు.
సీమంతం వేడుకలో లలిత్ సాల్వే బంధువులకు, పక్కింటి వారికి సీమా గర్భవతని తెలిసింది.
లలిత్ తండ్రి కాబోతున్నారనే వార్త విని చాలా మంది ఆశ్చర్యపోయారు. కొందరు నమ్మలేదు. తనలాంటి వ్యక్తి తండ్రి ఎలా అవుతాడని గుసగుసలాడుకున్నారని లలిత్ సాల్వే చెప్పారు.
‘‘లలిత్ తండ్రి అవుతున్నాడా? హే! అతనేదో చెబుతున్నాడు. ఈ విషయం గురించి సీమంతం వేడుకను ఎలా చేసుకున్నారని అనుకున్నారు. కొందరైతే నాకు ఫోన్ చేసి కన్ఫర్మేషన్ కోసం సీమంతం ఫోటోలు పంపమని అడిగారు. మీ భార్య గర్భవతని ఈ వేడుకనా! అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు’’ అని తెలిపారు.
‘‘లేదు-లేదు, అతను తండ్రి కాలేడు. అది టెస్ట్-ట్యూబ్ బేబీ అయి ఉండాలి లేదా అతన్ని తండ్రిని చేసే మరేదైనా అధునాతన సాంకేతికతైనా అయ్యుండాలి అనుకున్నారు కొందరు. పురుషునిగా మారిన స్త్రీ.. తండ్రి ఎలా అవుతారు? అనే సందేహం ప్రజల్లో నెలకొంది. ఇలా నిజంగా జరిగిందా? ఇది నిజమా? అయితే, గొప్ప విషయం! అభినందనలు! నేను తండ్రి కాబోతున్నాననే వార్త తెలియగానే ఇలా అనేక స్పందనలు వెల్లువెత్తాయి’’ అని చెప్పారు లలిత్ సాల్వే.

ఫొటో సోర్స్, KIRAN SAKAL
సీమా 2024 జనవరి 15న బిడ్డకు జన్మనిచ్చారు. లలిత్, సీమ తల్లిదండ్రులు అయ్యారు. ఆ రోజు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయని అంటున్నారు లలిత్.
‘‘సీమ ప్రసవానికి వెళ్లినప్పుడు డాక్టర్ నన్ను లోపలికి పిలిచారు. భయంతోనే వెళ్లాను. నా కాళ్లు వణుకుతున్నాయి. డాక్టర్ బిడ్డ శరీరంపై గుడ్డను తీసి, నా ఆనందాన్ని చూపించారు. అప్పుడు బిడ్డ ఏడుస్తూ ఉంది. నువ్వు ఒక అందమైన మగబిడ్డకు తండ్రివి అని డాక్టర్ చెప్పారు. అతని మాటలు విని చేతులు జోడించాను. ఉప్పొంగిపోయాను. ఆ రోజు గుర్తొస్తే ఇప్పటికీ థ్రిల్‌గా ఉంటుంది’’ అని ఆనందం వ్యక్తం చేశారు లలిత్ సాల్వే.
బిడ్డ కోసం టెస్ట్ ట్యూబ్ లేదా ఐవీఎఫ్ వంటి చికిత్స చేయించుకోలేదని లలిత్ చెప్పారు. అయితే, లలిత్ సాల్వే తండ్రి కావడం మిగతా పురుషుల కంటే ఎందుకంత ప్రత్యేకం?
‘‘ఇది భిన్నమైనది. అది ఎలాగో చెప్తాను. ఎలాంటి గుర్తింపు లేని వ్యక్తి, పురుషుడా, స్త్రీనా అని తెలియని వ్యక్తి. సామాజిక వర్గాలు, కులం, సంఘం.. ఇలా ఏ అంశాలతో సంబంధం లేకుండా ఆ గుర్తింపు వచ్చింది. నేను జీరో నుంచి నా ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. ఏమీ లేని స్థితి నుంచి ఎదిగాను. ఇది నాకు చాలా ముఖ్యం’’ అని చెప్పారు లలిత్ సాల్వే.
లలిత్ సాల్వే 2010 నుంచి పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన బీడ్ సూపరిటెండెంట్ ఆఫ్ ఫోలీసు కార్యాలయంలో పనిచేస్తున్నారు. తన కొడుకు గురించి ఆయనకు కొన్ని కలలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, LALIT SALVE
‘‘ఇప్పటివరకు ఈ ప్రయాణం బాగానే ఉంది. కానీ నా బిడ్డకు నా ప్రయాణం కంటే తన జీవితం, తన తల్లిదండ్రులు ముఖ్యం. కాబట్టి నా కొడుకును తన తల్లిదండ్రులు, వారి గత జీవితం ఏమిటో ఆలోచించకుండా పెంచాలనుకుంటున్నాం. అతను నా తండ్రి లలిత్ సాల్వే అంటాడు, అంతే. నేను పోలీస్ కానిస్టేబుల్‌ని. నా కొడుకు ఐపీఎస్ లేదా ఐఏఎస్ ఆఫీసర్ కావాలనేది నా కల. జీవితంలో ఇదే నా ముందున్న లక్ష్యం’’ అని తన కొడుకును ఒళ్లోకి తీసుకుంటూ చెప్పారు లలిత్ సాల్వే.
ఇలాంటి సమస్యలున్న వ్యక్తులకు లలిత్ మార్గనిర్దేశం చేస్తుంటారు. వారిలో ఎక్కువమంది బిహార్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలకు చెందిన వారు.
‘‘నేను వారి సమస్యల గురించి అడుగుతాను. వాళ్లు కూడా నాలాగే సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నామని చెబుతుంటారు. అప్పుడు నేను వారిని ఎందుకు అలా చేయాలనుకుంటున్నావు?, తల్లిదండ్రులకు దాని గురించి తెలుసా? వైద్యుడిని సంప్రదించారా? అని అడుగుతాను. నేను ఈ సమాధానాలన్నింటిని విన్న తర్వాత వారికి మహిళ నుంచి పురుషుడిగా శస్త్రచికిత్స అవసరమని గుర్తిస్తే, అప్పుడు మాత్రమే వారికి సలహాలిస్తాను. నేను డాక్టర్‌తో మాట్లాడతాను. ఆ డాక్టర్‌ని సంప్రదించమని వారికి చెబుతున్నాను’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, KIRAN SAKALE
LGBTQI కమ్యూనిటీకి చెందిన వారిని మానవతా దృక్పథంతో చూడాలని లలిత్ కోరుతున్నారు.
‘‘మన సమాజం లింగమార్పిడిని, ఎల్జీబీటీక్యూని తేడాగా చూస్తుంది. మీరు ఏ ఇతర స్త్రీని లేదా పురుషుడిని చూసినట్లుగా, అదే కళ్లతో లింగమార్పిడిని ఎందుకు చూడలేరు? ట్రాన్స్ జెండర్ వ్యక్తి వీధుల్లో వెళుతుంటే ఎందుకు వింతగా చూస్తారు? లలిత్ సాల్వేను ఎందుకు ఆసక్తికరమైన కేసుగా చూస్తున్నారు? మీరు ట్రాన్స్‌జెండర్‌పై ఎందుకు వివక్ష చూపుతున్నారు? వాళ్ళని ఎందుకు వెక్కిరిస్తారు? మీరు అతన్ని మనిషిగా చూడాలన్నది నా అభిప్రాయం’’ అని తెలిపారు.
లలిత్ సాల్వే ఈ ప్రయాణం గురించి, స్త్రీ నుంచి పురుషుడిగా, ఆ తర్వాత తండ్రిగా మారిన అనుభవాన్ని అడిగినప్పుడు..‘‘లలిత నుంచి లలిత్ వరకు, స్త్రీ నుంచి పురుషుడిగా, పురుషుడి నుంచి తండ్రిగా మారే పోరాటం సుదీర్ఘమైనది, కఠినమైనది. నాలో నేనొక యుద్ధమే చేశాను. అదంతా బయట చెప్పాల్సింది కాదు. నాలుగు గోడల మధ్య ఏడవాలనుకున్నాను. కానీ, వీధుల్లోకి తీసుకొచ్చారు. ఇది చాలా పెద్ద పోరాటం. ఇప్పుడు నేను ఆ పోరాటం నుంచి బయటపడ్డాను’’ అని తెలిపారు లలిత్.
లలిత్ సాల్వే ఇప్పుడు హాయిగా ఉన్నారు, స్వేచ్ఛగా శ్వాస తీసుకుంటున్నారు, సంతోషంగా జీవిస్తున్నారు.
లలిత్ జీవితాన్ని చూసి ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి చెందిన చాలామంది నమ్మకంతో బయటకు వస్తున్నారు. వారు కుటుంబ జీవితాన్ని ప్రారంభించాలనే ఆలోచనను నిజం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఎప్పుడు వస్తాయి?
- కోటిన్నర జీతం, ఇల్లు, ఇతర సౌకర్యాలు.. ఈ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- గజనీ మహ్మద్: సోమనాథ్ ఆలయం నుంచి కొల్లగొట్టిన ధనమెంత?
- శ్రీశైలం: దట్టమైన నల్లమల అడవిలో వేలమంది జరిపే ఈ యాత్ర ఏంటి, ఎలా సాగుతుంది?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















