అర ఎకరంలో 60 బోర్లు, సాగునీటి కష్టాలకు ఐకమత్యంతో చెక్ పెట్టిన అనంతపురం రైతులు
- రచయిత, తులసీప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
అనంతపురం జిల్లాలో సాగునీటి ఎద్దడిని కళ్లకు కట్టే దృశ్యమిది.
పుట్లూరు మండలంలో ఉన్న మడుగుపల్లిలో అర ఎకరం పొలంలో ఒకటి రెండు కాదు ఏకంగా 60 బోర్లు వేశారు రైతులు.
సాధారణంగా రైతులు తమ బోరు పక్కనే వేరే ఎవరినీ బోర్లు వేయనివ్వరు.
కానీ ఇక్కడ నీటి ఎద్దడి రైతుల మధ్య ఐకమత్యం తీసుకొచ్చింది.
ఆ ఊరిలో కొందరు ఒకరితో ఒకరు మాట్లాడకపోయినా, పంటలు, నీళ్ల విషయంలో మాత్రం కలసిమెలసి ఉంటారు.

‘పొలాల్లో ఎక్కడా బోర్లు పడలేదు. ఒక చోట నీరు పడడంతో రైతులందరం అక్కడే బోర్లు వేసుకున్నాం. పట్టా ప్లేస్‌లు ఉన్నాయి ఆ పట్టా ప్లేసుల్లో ఆ రైతును అడిగి వేసుకున్నారు బోర్లు. ఇంకోచోట 40, 50 బోర్లు ఉన్నాయి. పైపులు కూడా ఒకరి పొలంలోంచి మరొకరు వేసుకుంటారు’ అని మడుగుపల్లికి చెందిన రైతు నాగేశ్వరరెడ్డి చెప్పారు.
మడుగుపల్లి జనాభా 2 వేలకు పైనే. ప్రస్తుతం అక్కడ ఎక్కువ బోర్లు ఉన్న పొలంలో వేసిన అన్నీ బోర్ల నుంచీ నీరు వస్తోంది.
చాలా ప్రాంతాల్లో వేసిన బోర్లలో నీళ్లు అడుగంటడంతో గ్రామస్థులు ఇక్కడ ఇలా సామూహికంగా బోర్లు వేసుకుని, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేసుకుంటున్నారు.

మొదట ఊరిలో గుడి దగ్గర బోరు వేశామని.. అక్కడ 140 బోర్లు ఉండేవి కానీ కొన్నాళ్లకు నీరు తగ్గిపోయిందని నాగేశ్వర రెడ్డి చెప్పారు.
అక్కడ నీరు తగ్గిపోవడంతో రైతులంతా ప్రస్తుతం ఈ ప్రదేశంలో 60 బోర్లు వేసినట్లు ఆయన తెలిపారు.
గ్రామంలో సుమారు 400 బోర్లు ఉంటాయని ఆయన చెప్పారు. 20 ఏళ్ల కిందట వరకు అందరూ వర్షాధారంగా వేరుశెనగ వేసేవాళ్లమని.. ఇప్పుడు భూగర్భ జలాలతో తోటలు వేస్తున్నామని చెప్పారు.
మోటార్లు, డ్రిప్ ఇరిగేషన్ వచ్చాక బాగుందన్నారు నాగేశ్వర రెడ్డి.
మడుగుపల్లిలో వేరుశనగతో పాటూ టమోటా, మిర్చి, కూరగాయలు పండిస్తున్నారు.

కాగా గ్రామంలో మిగతా చోట్ల భూగర్భ జలాలు అడుగంటినా ఇక్కడ ఒక్క దగ్గరే నీరు ఎందుకు వస్తుందో జియాలజిస్టులు వివరించారు.
‘భూగర్భంలో లైమ్ స్టోన్ కరిగిపోయి చుట్టుపక్కల నీరంతా ఒక్క చోట చేరే అవకాశం ఉంటుందని, 30, 40 బోర్లు ఒకే చోట ఉన్నప్పుడు భూగర్భంలో నీరు ఉన్న ప్రదేశమంతా విస్తరిస్తూ చుట్టూ ఉన్న అన్ని చానల్స్ అక్కడికి వచ్చి కలిసే అవకాశం ఉంటుంది. అలాంటి చోట బోర్లు ఎన్ని వేసుకున్నా కానీ వాటర్ ఫ్లో ఉన్నంత కాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అని ఎస్వీ యూనివర్సిటి ఫ్యాకల్టీ, కన్సల్టెంట్ జియాలజిస్ట్ సుబ్బారెడ్డి చెప్పారు.

ఆ ప్రాంతంలో ఉన్న రాతి నిర్మాణాల వల్లే ఇలా ఒకే చోట నీటి వనరులు ఎక్కువగా ఉండడం, ఒక్కోచోట నీళ్లు లేకపోవడం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఒక్కోసారి ఐదేళ్ల వరకూ నీటి సమస్య ఉండదని, ఒక్కోసారి అవి హఠాత్తుగా ఎండిపోయే ప్రమాదం కూడా ఉంటుదని తెలిపారు.
ఈ ప్రాంతంలో లైం స్టోన్ ఉంటుందని.. భూగర్భంలో లైమ్ స్టోన్ కేవిటీస్ ఏర్పడి పెద్ద పెద్ద గుహలు ఏర్పడతాయని, ఆ గుహల్లాంటి ప్రాంతంలోకి భూగర్భజలం చేరుతుందని ఎస్వీ యూనివర్సిటీ జియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ మధు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఈడీ ఎవరినైనా అరెస్టు చేయొచ్చా? అన్ని అధికారాలు ఎలా వచ్చాయి?
- ఆమె 58 ఏళ్ల వయసులో మళ్లీ తల్లయింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వివరణ కోరింది...చట్టం ఏం చెబుతోంది?
- మనిషి మెదడులోకి పురుగులు ఎలా వస్తాయి?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- 'కలుపు దెయ్యాల'ను 141 ఏళ్ల కిందట భూమిలో పాతిపెట్టినా చావలేదు... అవి ఇలాఎంతకాలం జీవిస్తాయి?
బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















