మ్యూచువల్ ఫండ్స్: ఇండెక్స్ ఫండ్స్ ప్రాచుర్యం పొందడానికి కారణం ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఐవీబీ కార్తికేయ
- హోదా, బీబీసీ కోసం
"నా సలహా చాలా స్పష్టం. 10% ప్రభుత్వ బాండ్లలో మిగిలిన 90% ఏదైనా తక్కువ ధర కలిగిన ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మదుపు చేయడం."
మదుపు మార్గాల గురించి అడిగిన ప్రశ్నకు వారెన్ బఫెట్ సమాధానం ఇది.
బఫెట్ మాత్రమే కాకుండా అనేక మంది ఇతర నిపుణులు కూడా ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మదుపు చేయడం మదుపుదారులకు చాలా లాభదాయకమని చెప్పారు.
హెన్రీ సింగిల్టన్ లాంటి కొందరు ఇండెక్స్ ఫండ్స్ ప్రభావాన్ని విమర్శించినా దశాబ్దాలుగా ఇండెక్స్ ఫండ్స్ ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి.
ఇండెక్స్ ఫండ్స్ ఇంత ప్రాచుర్యం పొందటానికి ప్రధాన కారణం ఒక ఫండ్ మేనేజర్ మీద ఆధారపడకుండా సదరు సూచికలో ఉన్న కంపెనీల షేర్లలో మదుపు చేయడం అనే సులభమైన సూత్రాన్ని పాటించడం.
ఏదైనా కంపెనీ ఒక సూచికలో చేరాలంటే ఎంతో అధ్యయనం జరుగుతుంది కాబట్టి సహజంగా నష్టభయం తక్కువగానే ఉంటుంది.
ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని లాభాలను గడించడం ఇండెక్స్ ఫండ్స్ ప్రత్యేకత.
భారత మ్యూచువల్ ఫండ్స్ సమాఖ్య వారి వెబ్‌సైట్ ప్రకారం డెబిట్, ఈక్విటీ కలుపుకుని ప్రస్తుతం 73 రకాల సూచీలు భారత స్టాక్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
మ్యూచువల్ ఫండ్ కంపెనీలు వీటిలో ఏ సూచీ ఆధారంగానైనా ఫండ్స్ మొదలు పెట్టే అవకాశం ఉంది.
ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ సమాఖ్య వారి గణాంకాల ఆధారంగా వివిధ తరగతుల్లోని సూచీల పనితీరు ఎలా ఉందో చూద్దాం.
మూడేళ్ల కాలపరిమితి, ఐదేళ్ల కాలపరిమితి, పదేళ్ల కాలపరిమితి ఆధారంగా వీటి పనితీరు చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
లార్జ్ క్యాప్ ఫండ్స్
కింద ఇచ్చిన పట్టిక ప్రకారం లార్జ్ క్యాప్ తరగతిలో మొత్తంగా 30 ఫండ్స్ మార్కెట్లో ఉన్నాయి.
వీటిలో కేవలం 9 ఫండ్స్ మాత్రమే మూడేళ్ల కాలపరిమితిలో సూచీని మించిన పనితీరు చూపించాయి. మిగిలిన ఫండ్స్ పనితీరు, సూచీ కంటే అధ్వానంగా ఉంది.
ఐదేళ్ల కాలపరిమితిలో కేవలం 8 ఫండ్స్ మాత్రమే సూచీని మించిన పనితీరు చూపించాయి. అంటే ఈ సూచీల ఆధారంగా నడిచే ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మదుపు చేసిన వారికి ఇతర ఫండ్స్ ద్వారా మదుపు చేసే వారికంటే ఎక్కువ ఆదాయం వస్తుంది.


మిడ్ క్యాప్ ఫండ్స్
కింద ఇచ్చిన పట్టిక ప్రకారం మిడ్ క్యాప్ తరగతిలో మూడు సూచీలు ఉన్నాయి. ఈ సూచీలతో పోల్చుకుంటే మొత్తంగా 29 ఫండ్స్ మార్కెట్లో ఉన్నాయి.
వీటిలో కేవలం 5 ఫండ్స్ మాత్రమే మూడేళ్ల కాలపరిమితిలో, ఐదేళ్ల కాలపరిమితిలో, 2 ఫండ్స్ మాత్రమే పదేళ్ల కాలపరిమితిలో సూచీని మించిన పనితీరును కనబరిచాయి.
అంటే కేవలం 20% ఫండ్స్ మాత్రమే సూచీని అధిగమించిన పనితీరుని కనబరిచాయి. ఈ తరగతిలో మదుపు చేసే ఉద్దేశం ఉన్నవారికి ఇది చాలా ముఖ్యమైన పాఠం.


స్మాల్ క్యాప్ ఫండ్స్
స్మాల్ క్యాప్ తరగతిలో కూడా రెండు సూచీల ఆధారంగా పనితీరును కొలిచే 24 ఫండ్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
వీటిలో కేవలం పది మాత్రమే మూడేళ్ల కాలపరిమితిలో సూచీని మించిన పనితీరు కనబరిచాయి.
ఐదేళ్ల కాలపరిమితిలో 13, పదేళ్ల కాలపరిమితిలో 9 ఫండ్లు సూచీని అధిగమించే విధంగా పనితీరు చూపాయి.
అంటే ఈ తరగతిలో కూడా సూచీ ఆధారిత ఇండెక్స్ ఫండ్ ద్వారా చేసిన మదుపు, ఇతర ఫండ్స్ కన్నా ఎక్కువ ఆదాయం ఇచ్చే అవకాశాలు ఎక్కువ.


ఫొటో సోర్స్, Getty Images
ఈ.ఎల్.ఎస్.ఎస్.
సెక్షన్ 80సీ ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చే ఈ తరగతిలో 35 ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ పరంగా రెండు సూచీలు ఈ ఫండ్స్ పనితీరు బేరీజు వేయడానికి ఉపయోగపడతాయి.
మూడేళ్ల పరిమితిలో 14, ఐదేళ్ల పరిమితిలో 11, పదేళ్ల పరిమితిలో 11 ఫండ్స్ మాత్రమే సూచీ కంటే మెరుగైన పనితీరు కనబరిచాయి.

మరిన్ని పాఠాలు
1. స్థూలంగా అన్ని తరగతులలో చాలా తక్కువ ఫండ్స్, సూచీని మించిన పనితీరు చూపాయి. అంటే సూచీలలో స్థానం పొందటానికి కంపెనీలు ఎంతో మెరుగైన పనితీరు కలిగి ఉండాలని తెలుస్తోంది.
2. దాదాపు అన్ని తరగతులలో పదేళ్ల కాలపరిమితిలో సూచీని మించిన పనితీరు సాధించిన కంపెనీలు అతి తక్కువగా ఉన్నాయి. అంటే ఎక్కువ కాలం సూచీని మించిన పనితీరు మిగిలిన ఫండ్స్ ద్వారా సాధించడం కష్టమే.
3. ఎంతో అనుభవం ఉన్న ఫండ్ మేనేజర్ల ద్వారా నడుస్తున్న ఫండ్స్ కూడా సూచీల పనితీరు కంటే వెనుకబడి ఉన్నాయి. మార్కెట్లో ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకు ఇది ఒక కొలమానం. అంటే సదరు ఫండ్ మేనేజర్, ఒక ఫండ్ ద్వారా అందించిన పనితీరును మరొక ఫండ్ విషయంలోనూ అందించగలరని ఊహించుకోవడం కూడా తప్పే.
గమనిక: ఈ కథనం పాఠకులకు అవగాహన కల్పించడానికి మాత్రమే. నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించండి.
ఇవి కూడా చదవండి:
- ఈడీ ఎవరినైనా అరెస్టు చేయొచ్చా? అన్ని అధికారాలు ఎలా వచ్చాయి?
- ఆమె 58 ఏళ్ల వయసులో మళ్లీ తల్లయింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వివరణ కోరింది...చట్టం ఏం చెబుతోంది?
- మనిషి మెదడులోకి పురుగులు ఎలా వస్తాయి?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- 'కలుపు దెయ్యాల'ను 141 ఏళ్ల కిందట భూమిలో పాతిపెట్టినా చావలేదు... అవి ఇలాఎంతకాలం జీవిస్తాయి?
బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














