కర్ణాటక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు డబ్బులిచ్చిన బీజేపీ ఎంపీ.. ఆయన ఎవరు? ఎంత ఇచ్చారు?

ఎలక్టోరల్ బాండ్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • బీజేపీ ఎంపీ ఒకరు కాంగ్రెస్ పార్టీకి భారీ విరాళం ఇచ్చారు.
  • ఒక కంపెనీ మీద ఐటీ రైడ్స్ జరిగిన కొద్ది రోజులకే ఆ కంపెనీ నుంచి బీజేపీకి వరదలా విరాళాలు వచ్చాయి.
  • టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే, ఆరోపణలు ఎదుర్కొన్న కంపెనీ నుంచి టీడీపీకి కోట్లలో డబ్బులు ముట్టాయి.

ఇలా ఒకటేమిటి.. రాజకీయ పార్టీలకు ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్లలో చిత్రవిచిత్రాలెన్నో.

తెలుగునాట పుట్టిన కంపెనీలు దేశంలోని ప్రముఖ రాజకీయ పార్టీలకు ధారాళంగా కోట్ల రూపాయలు విరాళాలుగా ఇచ్చాయి. ఇలా ఇవ్వడానికి కాస్త ముందో, వెనకో ఆయా కంపెనీలపై ఐటీ దాడులు జరగడమో లేదా ప్రభుత్వాల నుంచి ఏదో రూపంలో లబ్ధి పొందడమో జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన ఏయే కంపెనీలు విరాళాలు ఇచ్చాయి, ఎంతెంత ఇచ్చాయి అనే అంశాలపై బీబీసీ అందిస్తున్న ప్రత్యేక విశ్లేషణాత్మక కథనం ఇది.

మేఘా ఇంజినీరింగ్: రూ. 1,186 కోట్లు

మేఘా, వెస్టర్న్ యూపీ పవర్ కలిపి రాజకీయ పార్టీలకు ఇచ్చిన మొత్తం రూ. 1,186 కోట్లు.

ఇందులో మేఘా గ్రూపు బీఆర్ఎస్‌కు రూ.195 కోట్లు, బీజేపీకి రూ.664 కోట్లు, టీడీపీకి రూ. 48 కోట్లు, జనసేన పార్టీకి రూ. 14 కోట్లు, వైఎస్సాఆర్సీపీకి రూ. 37 కోట్లు, బిహార్‌లోని జేడీయూకు రూ.10 కోట్లు, తమిళనాడులోని డీఎంకేకు రూ. 85 కోట్లు, కర్ణాటకలోని జేడీఎస్‌కు రూ.5 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.128 కోట్లు ఇచ్చింది.

బీఆర్ఎస్, బీజేపీలకు తెలంగాణ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సహా అనేక సందర్భాల్లో బాండ్ల రూపంలో డబ్బులు ఇచ్చింది మేఘా కంపెనీ.

2021 ఏప్రిల్ 3న డీఎంకే (ఎన్ క్యాష్ చేసుకున్న) కోసం రూ.40 కోట్ల విలువైన 40 బాండ్లను మేఘా ఇంజినీరింగ్ కంపెనీ కొనుగోలు చేసింది.

తమిళనాడులో 2021 ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల ముందు ఇది జరిగింది. ఆ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఇతర సందర్భాల్లో కూడా డీఎంకేకు విరాళాలు ఇచ్చింది మేఘా.

కాంగ్రెస్‌కు ఇచ్చిన విరాళాల్లో సింహ భాగం (రూ.128 కోట్లలో రూ.110 కోట్లు) కేవలం తెలంగాణ ఎన్నికల ముందు అంటే 2023 అక్టోబరు, నవంబరు నెలల్లోనే మేఘా గ్రూపు ఇచ్చింది.

ఎలక్టోరల్ బాండ్లు

ఫొటో సోర్స్, Getty Images

శ్రీ సిద్ధార్థ ఇన్ఫ్రాటెక్ అండ్ సర్వీసెస్ (బండారు నరసింహారావు, గొట్టిపాటి శశికళ్యాణ్)

ఈ కంపెనీ తెలంగాణ ఎన్నికలకు ముందు, 2023 నవంబరులో వివిధ పార్టీల బాండ్లను కొనుగోలు చేసింది.

బీజేపీ: రూ. 20 కోట్లు

కాంగ్రెస్: రూ.10 కోట్లు

తెలుగుదేశం పార్టీ: రూ.కోటి

2022 నవంబరులో బీజేపీకి రూ.30 కోట్లు

ఎలక్టోరల్ బాండ్లు

రాంకో సిమెంట్స్

మొత్తం రూ. 54 కోట్ల విలువైన బాండ్లను రాంకో సిమెంట్స్ కొనుగోలు చేసింది.

2022 డిసెంబరులో వైఎస్సాఆర్సీపీకి రూ. 15 కోట్లు ఇచ్చింది.

2022 డిసెంబరులో తెలుగుదేశానికి రూ. 5 కోట్లు ఇచ్చింది.

దీనికి రెండు నెలల ముందు అంటే 2022 సెప్టెంబర్‌లో నంద్యాలలో రాంకో సిమెంట్స్ ఒక భారీ పరిశ్రమను ప్రారంభించింది.

2023 ఏప్రిల్‌లో వైఎస్సాఆర్సీపీకి రూ. 5 కోట్లు ఇచ్చింది.

2023 ఏప్రిల్‌లో బీజేపీకి రూ. 5 కోట్లు ఇచ్చింది.

2023 నవంబరు (తెలంగాణ ఎన్నికల సమయం)లో బీజేపీకి రూ. 20 కోట్లు ఇచ్చింది.

2023 నవంబరులో వైఎస్సాఆర్సీపీకి రూ. 4 కోట్లు ఇచ్చింది.

బాండ్ల రూపంలో తెలుగుదేశం పార్టీకి రూ.218 కోట్లు వచ్చాయి.

ఫొటో సోర్స్, TELUGUDESAMPARTYOFFICIAL/YT

ఫొటో క్యాప్షన్, బాండ్ల రూపంలో తెలుగుదేశం పార్టీకి రూ.218 కోట్లు వచ్చాయి.

అరబిందో.. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. ఎలక్టోరల్ బాండ్స్

దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో పారిశ్రామికవేత్తల పరంగా ప్రముఖంగా వినిపించిన పేరు పి. శరత్ చంద్రారెడ్డి. ఈయన అరబిందో కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నారు.‌

దిల్లీ లిక్కర్ కేసులో శరత్ చంద్రారెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 2022 నవంబరు 10వ తేదీన అరెస్టు చేసింది.

ఆ తర్వాత అయిదు రోజులకు, అంటే నవంబరు 15న రూ.5 కోట్ల విలువైన బీజేపీకి చెందిన ఐదు ఎలక్టోరల్ బాండ్లను అరబిందో కంపెనీ కొనుగోలు చేసింది.

వీటితోపాటు మొత్తంగా బీజేపికి చెందిన రూ. 34.5 కోట్ల విలువైన బాండ్లను వివిధ సందర్భాల్లో అరబిందో కంపెనీ కొన్నది.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

2022 జనవరి 5న రెండు బాండ్ల ద్వారా రూ.2 కోట్లు బీజేపీకి అరబిందో ఫార్మా కంపెనీ తరపున క్రెడిట్ అయ్యాయి. ఇవి కాకుండా అదే రోజున మరో పది బాండ్ల ద్వారా రూ.10 లక్షల చొప్పున అంటే కోటి రూపాయల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. అంటే మొత్తంగా ఆ రోజున రూ.3 కోట్ల విలువైన బాండ్లను అరబిందో కొన్నది.

2022 జులై 22న కోటిన్నర విలువ చేసే బీజేపీ (ఎన్‌క్యాష్ చేసుకున్న) బాండ్లను కొనుగోలు చేసింది అరబిందో. ఇందులో ఒకటి రూ.కోటి విలువైన బాండు కాగా, మరో అయిదు రూ.పది లక్షలు విలువ చేసేవి ఉన్నాయి.

2023 నవంబరు 8న రూ. 25 కోట్లు విలువ చేసే బాండ్లను అరబిందో కొనింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు బాండ్లను కొనుగోలు చేసింది. బీజేపీ వీటిని ఎన్‌క్యాష్ చేసుకున్న చేసుకుంది.

అలాగే 2022 ఏప్రిల్ 8న రూ. కోటి విలువైన 15 బాండ్లను అరబిందో కొనుగోలు చేసింది. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వీటిని ఎన్‌క్యాష్ చేసుకుంది. తద్వారా రూ.15 కోట్లు బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లాయి.

వీటితోపాటు తెలుగుదేశం పార్టీకి 2021 ఏప్రిల్ 3న ఏడు బాండ్ల ద్వారా అరబిందో కంపెనీ రూ.2 కోట్ల 50 లక్షలు అందించింది.

ఇందులో రెండు రూ.కోటి విలువ చేసే బాండ్లు ఉన్నాయి. మరో అయిదు రూ.10 లక్షల విలువ చేసే బాండ్లు ఉన్నాయి.

ఎలక్టోరల్ బాండ్లు

ఫొటో సోర్స్, AFP

మై హోం

నిర్మాణ రంగంలో ప్రముఖ కంపెనీగా ‘‘మై హోం’’కు పేరుంది.

ఈ కంపెనీ రూ. 24.6 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది.

2023 జులైలో బీఆర్ఎస్ పార్టీకి రూ.15 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది మైహోం కంపెనీ.

బీజేపీకి రూ.5 కోట్లు, కాంగ్రెస్ పార్టీకి రూ.4.5 కోట్లు చొప్పున నవంబరు 2023లో బాండ్లను కొనింది.

సరిగ్గా తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీల కోసం బాండ్లను కొనుగోలు చేసింది మై హోం కంపెనీ.

ఎలక్టోరల్ బాండ్లు

ఫొటో సోర్స్, TELANGANACMO

టీడీపీకి విరాళం ఇచ్చిన జగన్ సన్నిహితుడి కంపెనీ

కడప కేంద్రంగా పనిచేసే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడికి చెందిన కంపెనీ.

ఈ కంపెనీలో 2023 డిసెంబర్‌లో ఐటీ సోదాలు జరిగాయి. సరిగ్గా నెల తరువాత, అంటే 2024 జనవరి 11న ఒకేసారి రూ. 40 కోట్ల బాండ్లు కొన్నది ఈ కంపెనీ.

ఇవన్నీ తెలుగుదేశం పార్టీ కోసం కొనుగోలు చేసిన బాండ్లు.

ఈ కంపెనీకి కడపలో ఒక ప్లాంటు, ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక ప్లాంటు ఉన్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లు తయారు చేస్తారు. మామిడిపూడి విక్రమ్ రెడ్డి, నర్రెడ్డి విశ్వేశ్వర రెడ్డి, లోమడ మురళీ మోహన్ రెడ్డి, కొల్లా శరత్ చంద్ర, నర్రెడ్డి వంశీ రెడ్డి, వెన్నం సుధీర్, కనకధార శ్రీనివాసన్ అనే వ్యక్తులు ఈ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారు. ఎన్ విశ్వేశ్వర రెడ్డి సీఎండీ.

2023 మే, అక్టోబర్ నెలల్లో తెదేపా సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేఖరుల సమావేశం నిర్వహించి షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వం ఈ కంపెనీ నుంచి అత్యధిక ధరకు కరెంటు ట్రాన్స్‌ఫార్మర్లు కొన్నదని సోమిరెడ్డి ఆరోపించారు.

ఆ తర్వాత 2024 జనవరిలో తెలుగుదేశం పార్టీ కోసం బాండ్లను కొనుగోలు చేసింది ఈ కంపెనీ.

నవయుగ

నవయుగ కంపెనీ మీద 2018 అక్టోబరులో ఐటీ రైడ్స్ జరిగాయి. 2019 ఏప్రిల్‌లో ఆ కంపెనీ వారు రూ. 30 కోట్లు, 2019 అక్టోబరులో రూ. 15 కోట్లు, 2022 అక్టోబరులో రూ. 10 కోట్ల బాండ్లు కొన్నారు. మొత్తం రూ. 55 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశారు. ఇవన్నీ బీజేపీకి ఎన్ క్యాష్ చేసుకున్న బాండ్లే.

ఈ సంస్థ గతంలో పోలవరం కాంట్రాక్టు కొంత కాలం చేసింది. కాళేశ్వరంలో కూడా కొంత వర్క్ చేసింది. సీవీ రావు ఈ సంస్థ చైర్మన్ కాగా, చింతా శ్రీధర్ ఈ సంస్థ ఎండీ.

ఎలక్టోరల్ బాండ్లు

ఫొటో సోర్స్, Getty Images

బీజేపీ ఎంపీ.. కాంగ్రెస్ పార్టీకి విరాళం

రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఎం రమేశ్‌కు చెందినది.

ఆ కంపెనీకి 2023 జనవరి 14న హిమాచల్ ప్రదేశ్‌లోని సునీలో 382 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కింది. దాని విలువ రూ.1098 కోట్లు. ఎస్వీజేఎన్ లిమిటెడ్ అనే ప్రభుత్వ సంస్థ నుంచి ఈ కాంట్రాక్ట్ పొందింది రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ. ఎస్వీజేఎన్ అంటే సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్. భారత ప్రభుత్వం, హిమాచల్ ప్రభుత్వం ఉమ్మడి విద్యుత్ తయారీ సంస్థ ఇది.

ఆ సంస్థ 2023 జనవరి 27న రూ. 5 కోట్ల విలువ చేసే బాండ్లు కొన్నది. వీటిని టీడీపీ ఎన్ క్యాష్ చేసుకుంది.

మరో రూ. 40 కోట్ల బాండ్లను 2023 ఏప్రిల్‌లో కొనుగోలు చేసింది ఈ కంపెనీ.

సరిగ్గా కర్ణాటక ఎన్నికల ముందు ఈ బాండ్లను కొనింది.

కాంగ్రెస్ కోసం రూ.30 కోట్ల విలువైన 30 బాండ్లు, జేడీఎస్ కోసం రూ.10 కోట్లు విలువ చేసే పది బాండ్లను రిత్విక్ కంపెనీ కొన్నది.

ప్రధాని మోదీ, సీఎం రమేశ్

ఫొటో సోర్స్, FACEBOOK/CMRAMESH

ఫొటో క్యాప్షన్, సీఎం రమేశ్ 2019 జూన్‌లో బీజేపీలో చేరారు.

సీఎం రమేశ్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.

ఆ కంపెనీకి 2021 డిసెంబరులో ఎన్టీపీసీ నుంచి ఒకటి, ఎన్ఎండీసీ నుంచి ఒకటి కలిపి మొత్తం రెండు బొగ్గు గనులు, ఝార్ఖండ్ రాష్ట్రంలోని కాంట్రాక్టు దక్కాయి.

ఇక ముంబయి మెట్రోరైల్ ప్రాజెక్టులో భాగంగా కశేలి మెట్రో డిపో కాంట్రాక్టు 2023 సెప్టెంబర్‌లో దక్కింది. అలాగే, అదే నెలలో కళ్యాణ్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు, ముంబయిలోని ఖర్గర్ టన్నెల్ కాంట్రాక్టు 2023 అక్టోబరులో దక్కాయి.

చింతకుంట మునుస్వామి రాజేశ్ (సీఎం రాజేశ్ – సీఎం రమేశ్ సోదరుడు) ఈ కంపెనీ డైరెక్టర్.

రిత్విక్ రమేశ్ అంటే సీఎం రమేశ్ కుమారుడు ఈ సంస్థ ఆపరేషన్స్ విభాగం ప్రెసిడెంట్. ఇది సీఎం రమేశ్ స్థాపించిన కంపెనీ, ప్రస్తుతం ఆయన ఆ కంపెనీలో లేరు.

2014లో టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడు అయిన రమేశ్, 2019లో బీజేపీలో చేరారు. 2018 అక్టోబరులో ఆయన కడప ఇంట్లో, హైదరాబాద్ ఆఫీసుల్లో ఐటీ, ఈడీ సోదాలు జరిగాయి. ఆ తరువాత 2019 జూన్‌లో ఆయన బీజేపీలో చేరారు.

ఎలక్టోరల్ బాండ్లు

ఫొటో సోర్స్, Getty Images

నాట్కో ఫార్మా

నాట్కో ఫార్మా కంపెనీ కాంగ్రెస్‌కు రూ.12 కోట్ల 25 లక్షలు ఇచ్చింది. ఇందులో మొదట 2019 అక్టోబరులో 25 లక్షల విలువైన బాండ్లు కొనుగోలు చేసింది. తర్వాత 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రూ.12 కోట్ల విలువైన బాండ్లు కొన్నది.

బీఆర్ఎస్ పార్టీ కోసం రూ.20 కోట్ల బాండ్లను కొనుగోలు చేయగా, అందులో రూ.10 కోట్ల విలువైన బాండ్లు తెలంగాణ ఎన్నికల ముందు కొన్నది.

అలాగే బీజేపీ కోసం రూ.15 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయగా, తెలంగాణ ఎన్నికల ముందు అంటే 2023 నవంబరులో రూ.10 కోట్ల విలువైన బాండ్లు కొన్నది.

అలాగే తెలుగుదేశం పార్టీ కోసం రూ.14 కోట్లు, వైఎస్సార్సీపీకి చెందిన రూ.3 కోట్లు, జనసేన కోసం రూ.5 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది.

యశోద ఆసుపత్రి

యశోదా ఆసుపత్రి పేరు విషయంలో చాలా సందేహాలు ఏర్పడ్డాయి.

దిల్లీ-యూపీలో నడిచే యశోదా ఆసుపత్రికి చట్టపరమైన పేరు ‘‘యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రై. లి., యశోద హెల్త్ కేర్ ప్రై. లి.’’

అదే సమయంలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న యశోద పేరు యశోద హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రై.లి. యశోద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, యశోద మెడిహెల్త్ కూడా హైదరాబాద్ వారివే.

ఎవరైనా కేవైసీ చేసి డబ్బు తీసుకునేటప్పుడు చట్టపరమైన పేర్లే రాయాలి. అలా రాస్తే, హైదరాబాద్‌లో ఉన్న యశోద ఆసుపత్రిని యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అని రాయకూడదు.

కానీ జాబితా ప్రకారం, బీఆర్‌ఎస్ సహా తెలుగు ప్రాంతీయ పార్టీలకు విరాళం ఇచ్చిన సంస్థ పేరు ఇలానే రాశారు.

ఈ ఆసుపత్రి బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక విరాళం ఇవ్వడం, బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌)తో యశోద యాజమాన్యానికి ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఇది హైదరాబాద్ యశోద అనే భావించాల్సి ఉంటుంది. అలా అనుకుంటే అప్పుడు ఎస్బీఐ వారు తప్పు కేవైసీ చేసినట్టు లెక్క.

2021 అక్టోబరులో కాంగ్రెస్‌కు రూ. 10 కోట్లు, బీఆర్ఎస్‌కు రూ. 5 కోట్లు, బీజేపీకి రూ. 2 కోట్లు

2022 ఏప్రిల్‌లో బీఆర్ఎస్‌కు రూ. 80 కోట్లు

2022 నవంబరులో కాంగ్రెస్‌కు రూ. 4 కోట్లు

2022 డిసెంబరులో ఆమ్ ఆద్మీకి రూ. 1 కోటి

2022 డిసెంబరులో కాంగ్రెస్‌కు రూ. 3 కోట్లు

2022 డిసెంబరులో వైఎస్సాఆర్సీపీకి రూ. 1 కోటి

2023 ఏప్రిల్‌లో కాంగ్రెస్‌కు రూ. 6 కోట్లు

2023 ఏప్రిల్‌లో బీఆర్ఎస్‌కు రూ. 4 కోట్లు

2023 అక్టోబరులో తెలంగాణ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు రూ. 41 కోట్లు

2023 అక్టోబరులో తెలంగాణ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు రూ. 5 కోట్లు

ఎలక్టోరల్ బాండ్లు

ఫొటో సోర్స్, Getty Images

కైటెక్స్‌కు 187 ఎకరాలు.. బీఆర్ఎస్‌కు రూ.25 కోట్లు

కైటెక్స్ అనేది కేరళకు చెందిన సంస్థ. తెలుగునాట పుట్టిన సంస్థ కాకపోయినా, ప్రత్యేకంగా ‌‍ఇక్కడ చెప్పుకోవాలి.

ఈ సంస్థ 2023 జులై 5న బీఆర్ఎస్‌ కోసం కైటెక్స్ గార్మెంట్స్ పేరిట రూ.15 కోట్లు విలువ చేసే ఎలక్టోరల్ బాండ్లు కొన్నది.

ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల ముందు 2023 అక్టోబరులో కైటెక్స్ గార్మెంట్స్ పేరిట రూ.6 కోట్లు, అదే నెలలో రూ.4 కోట్లు కైటెక్స్ చిల్డ్రన్స్ వేర్ పేరుతో కొన్నారు. ఇలా మొత్తంగా రూ.25 కోట్లు బీఆర్ఎస్‌కు బాండ్ల రూపంలో డబ్బులు ఇచ్చారు.

ఇక్కడ అసలు వి‌షయం ఉంది. ఈ బాండ్లు కొనుగోలు చేయడానికి ముందు 2023 మార్చిలో 187 ఎకరాలను కైటెక్స్ కంపెనీకి బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది.

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హావేలీలో భూకేటాయింపులు జరిగాయి. స్థానికులు పరిహారం తక్కువగా ఇస్తున్నారని ఉద్యమించినా, ప్రభుత్వం పట్టించుకోకుండా భూములు కట్టబెట్టింది.

చెన్నై గ్రీన్ వుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్: 2022 జనవరిలో తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.40 కోట్లు ఇచ్చింది. అలాగే బీఆర్ఎస్‌కు రూ. 50 కోట్లు, కాంగ్రెస్ పార్టీకి రూ. 15 కోట్లు ఇచ్చింది.

దివీస్ ల్యాబ్స్: బీఆర్ఎస్‌కు రూ. 20 కోట్లు, బీజేపీకి రూ. 30 కోట్లు, కాంగ్రెస్‌కు రూ. 5 కోట్లు ఇచ్చింది.

డాక్టర్ రెడ్డీస్

బీజేపీకి రూ. 25 కోట్లు

బీఆర్ఎస్‌కు రూ.32 కోట్లు

కాంగ్రెస్‌కు రూ.14 కోట్లు

టీడీపీకి రూ.13 కోట్లు

హెటిరో డ్రగ్స్, ల్యాబ్స్, బయో ఫార్మా కలిపి హెటిరో సంస్థ.. బీజేపీకి రూ.10 కోట్లు ఇచ్చింది. తెలంగాణ ఎన్నికలకు ముందు 2023 అక్టోబర్‌లో ఈ మొత్తాన్ని అందించింది.

అదే సమయంలో బీఆర్ఎస్‌కు రూ.50 కోట్లు ఇచ్చింది. (ఇందులో 10 కోట్లు జులై 2023లో ఇచ్చింది.)

ఎలక్టోరల్ బాండ్ పథకం రాజ్యాంగ విరుద్ధమని, వాటిని రద్దు చేస్తున్నామని సుప్రీం కోర్టు ఫిబ్రవరి 15న తీర్పునిచ్చింది.
ఫొటో క్యాప్షన్, ఎలక్టోరల్ బాండ్ పథకం రాజ్యాంగ విరుద్ధమని, వాటిని రద్దు చేస్తున్నామని సుప్రీం కోర్టు ఫిబ్రవరి 15న తీర్పునిచ్చింది.

ఎంఎస్ఎన్ ఫార్మాకెమ్ (మన్నె సత్యనారాయణ రెడ్డి, లక్ష్మీ ప్రసూన)

తెలంగాణ ఎన్నికలకు ముందు, అంటే 2023 నవంబరులో రూ.18 కోట్ల విలువైన బాండ్లను బీజేపీ కోసం ఎంఎస్ఎన్ ఫార్మాకెమ్ కంపెనీ కొన్నది.

అలాగే అంతకుముందు 2022లో బీఆర్ఎస్‌ కోసం రూ.20 కోట్ల విలువజేసే బాండ్లు కొన్నది.

మరికొన్ని కంపెనీలు కొన్న బాండ్లు

అపర్ణ ఫామ్స్ అండ్ ఎస్టేట్స్ తెలంగాణ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు రూ. 15 కోట్లు, కాంగ్రెస్‌కు రూ. 15 కోట్లు ఇచ్చింది.

భారత్ బయోటెక్ తెలుగుదేశానికి 2024 జనవరిలో రూ.10 కోట్లు ఇచ్చింది.

2023 నవంబరులో తెలంగాణ ఎన్నికల వేళ సియెంట్ లిమిటెడ్ బీజేపీకి రూ. 10 కోట్లు ఇచ్చింది.

ఎన్సీసీ రూ.60 కోట్లు విలువ జేసే బాండ్లు బీజేపీ కోసం కొన్నది. (2019 అక్టోబరులో రూ.20 కోట్లు, 2022 అక్టోబరులో రూ.40 కోట్లు)

ఎన్ఎస్ఎల్ సెజ్ హైదరాబాద్ లిమిటెడ్ రూ. 24.50 కోట్లు బీఆర్ఎస్‌కు ఇచ్చింది.

రాజపుష్ప ప్రాపర్టీస్, ఎసెట్ మేనేజ్మెంట్ కలిపి రాజపుష్ప సంస్థ బీఆర్ఎస్‌కు రూ.25 కోట్లు బాండ్ల రూపంలో ఇచ్చింది.

సాగర్ సిమెంట్స్ బీజేపీ, బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీడీపీ – ఈ అన్ని పార్టీలకు కలిపి 2023 జులైలో రెండున్నర కోట్లు ఇచ్చింది. ఒక్కో పార్టీకి లక్షల్లో మాత్రమే ఇచ్చింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)