విశాఖ పోర్టులో దొరికిన డ్రై ఈస్ట్‌ ఏమిటి

Dried Yeast

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

విశాఖలో సీబీఐ ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో చేపట్టిన ఆపరేషన్‌లో పెద్ద మొత్తంలో డ్రైడ్ ఈస్ట్ పట్టుకుంది. ఇప్పటీకే రెండుసార్లు ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్‌కి ప్రాథమిక పరీక్షలు చేసిన సీబీఐ శుక్రవారం ఆ శాంపిల్‌ను ఇన్‌స్ట్రమెంటల్ అనాలసిస్‌కు పంపించింది.

దీని ఫలితం వచ్చేందుకు వారం నుంచి పది రోజులు పట్టొచ్చని తమకు సీబీఐ అధికారులు చెప్పారని సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు తెలిపారు.

మరోవైపు శుక్రవారం ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సీబీఐ తనిఖీలు చేసింది.

ఈ తనిఖీల్లో కంపెనీ సిబ్బంది, కూలీల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆయా సంస్థల్లో శాంపిల్స్ ను సేకరించారు.

విశాఖ పోర్టు

ఫొటో సోర్స్, Lakkojusrinivas

కాకినాడతో పాటు ఒంగోలు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలలో ఉన్న సంధ్యా ఆక్వా కంపెనీల్లో ఈ సోదాలు జరిగాయి.

కాగా.. కంటైనర్‌లో ఉన్నది రొయ్యల మేతలో కలిపే ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్టేనని ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ ప్రతినిధులు చెప్తుండగా.. సీబీఐ మాత్రం అనుమానాస్పద డ్రగ్ సబ్‌స్టెన్స్ ఇందులో దొరికిందంటూ కేసు నమోదు చేసి కంటైనర్‌ను సీజ్ చేసింది.

ఈ నేపథ్యంలో అసలు ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ అంటే ఏమిటి? దీనిని ఉపయోగించి డ్రగ్స్ తయారు చేయవచ్చా? లేదంటే దీనిలో డ్రగ్ కలిపి తర్వాత వేరు చేసి తీసుకోవచ్చా అనే చర్చ జరుగుతోంది.

ఈ సందేహాలపై ఆంధ్ర యూనివర్సిటీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ వి. సిద్దయ్యతో బీబీసీ మాట్లాడింది.

విశాఖ డ్రగ్స్ కేసు

ఫొటో సోర్స్, lakkojusrinivas

ఈస్ట్ అంటే?

ఈస్ట్ అంటే ఫంగస్. మనం చదువుకునేటప్పుడు సైన్స్‌లో శిలీంధ్రాల గురించి చదువుకున్నాం.

సరళంగా చెప్పుకోవాలంటే శిలీంధ్రాలు అంటే ఒక రకమైన సూక్ష్మక్రిములు. వీటిని ఒక చోట నిల్వ చేసి వాటిలోని నీటి పరమాణువులను తొలగించి డ్రైడ్ ఈస్ట్ తయారు చేస్తారు.

దీనిలో రెండు రకాలున్నాయి. ఒకటి ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్, మరొకటి యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్. వివిధ రకాలైన ఉపయోగాలను దృష్టిలో పెట్టుకుని యాక్టివ్, ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్టులను తయారు చేస్తారు.

వీటిని రోజువారి జీవితంలో రొట్టెలు, కేక్‌లు బేక్ చేసేందుకు, పెరుగు పులియడానికి, దోసెలు పిండి తయారుకావడానికి ఉపయోగిస్తాం. యాక్టివ్, ఇనాక్టివ్ ఫాంలోని డ్రైడ్ ఈస్ట్ వీటి కోసం ఉపయోగిస్తాం.

డ్రై ఈస్ట్

ఫొటో సోర్స్, Getty Images

యాక్టివ్, ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ మధ్య తేడా ఏంటి

ఈస్టుని వివిధ రకాలైన అవసరాలకు యాక్టివ్, ఇనాక్టివ్ రూపంలో వాడుతుంటాం. ఈస్ట్ అనేది మంచి పోషకం కూడా. అందుకే వీటిని ఆక్వా ఇండస్ట్రీలో వినియోగిస్తుంటారు.

రొయ్యలు తినే ఆహారంలో వీటిని కలపడం ద్వారా వాటి ఎదుగుదల బాగుంటుంది. అయితే మన దేశంలో తయారైన ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్టు కంటే విదేశాల్లో తయారయ్యే దానికే డిమాండ్ ఎక్కువ. ఆక్వా ఇండస్ట్రీలోనే కాకుండా పశువుల మేతలోనూ ఇనాక్టివ్, యాక్టివ్ డ్రైడ్ ఈస్టుని వాడతారు.

సాధారణంగా యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్, గింజల రూపంలో ప్యాక్ చేసి ఉంటుంది. ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ అయితే పౌడర్ రూపంలో ఉంటుంది.

అయితే దూరం నుంచి చూస్తే రెండూ ఒకేలా కనిపిస్తాయి. కానీ ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్టుని యాక్టివ్ చేయాలంటే దానిని వేడి చేయడమో లేదా కొంత గోరువెచ్చని నీరు కలిపి వాడుతుంటారు. అవసరాన్ని బట్టి యాక్టివ్, ఇనాక్టివ్ అని అంటామే కానీ... నిజానికి రెండు డ్రైడ్ ఈస్టులు ఒకటే.

విశాఖ డ్రగ్స్ కేసు

ఫొటో సోర్స్, lakkojusrinivas

డ్రైడ్ ఈస్ట్ రొయ్యల మేతలో కలుపుతారా

ఈస్ట్, డ్రగ్స్ ఒక్కొసారి చూసేందుకు ఒకేలా ఉన్నప్పటికీ కొన్ని పరీక్షలు ద్వారా ఏదేంటో సులభంగానే గుర్తించవచ్చు. డ్రైడ్ ఈస్టు అనేది రొయ్యల మేతలో కలుపుతారు. ఇది న్యూట్రిషన్ కోసం చేస్తుంటారు.

ప్రాథమికంగా ఈస్ట్ అనేది గ్రాన్యూల్స్ అంటే చిన్న చిన్న గింజల రూపంలో ఉంటుంది. అదే డ్రగ్ అయితే పౌడర్ రూపంలో ఉంటుంది. వీటి భౌతిక రూపాల ద్వారా ప్రాథమికంగా ఒక అంచనాకి రావొచ్చు. దీని తర్వాత రసాయన పరీక్షల ద్వారా నిర్ధరించొచ్చు.

అక్కడ కూడా డ్రగ్స్‌కు సంబంధించిన పాజిటివ్ రిపోర్ట్ వస్తే.. ఆ తర్వాత గ్యాస్ కోమెటోగ్రఫీ పరికరాలను ఉపయోగించి మరింత సులభంగా డ్రగ్స్‌ని గుర్తించవచ్చు.

రొయ్యల మేతలో ఉపయోగించే ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్టులో డ్రగ్స్ కలిపే అవకాశాల్ని కొట్టిపారేయలేం.

కనీస మోతాదులో అంటే కేజీకి 50 నుంచి 100 గ్రాముల వరకు డ్రగ్స్ కలిపితే భౌతికంగా చూసి, ప్రాథమికమైన రంగు పరీక్ష ద్వారా కనిపెట్టవచ్చు. అదే తక్కువ మోతాదులో ఉంటే గ్యాస్ కోమెటోగ్రఫీ పరికరాల ద్వారా కనిపెట్టగలుగుతారు.

అలాగే మెక్రోస్కోప్‌లో చూసినప్పుడు ఫంగస్ ఆకారాన్ని బట్టి కూడా అది డ్రగ్గా, ఈస్టా అనేది తెలిసిపోతుంది.

విశాఖ డ్రగ్స్ కేసు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డ్రగ్స్ (ఫైల్ ఫొటో)

డ్రగ్స్‌ను ఇతర పదార్థాలతో కలపవచ్చా?

విశాఖలో సీబీఐ సీజ్ చేసిన పదార్థం శాంపిల్స్ పరీక్షలకు పంపించారు. సీబీఐ అధికారులు కంటైనర్ టెర్మినల్‌లో ప్రాథమికంగా కొన్ని పరీక్షలు చేసి... వాళ్లకి ఏదైనా సందేహం వస్తే... దానిని ల్యాబ్ టెస్టుల కోసం పంపిస్తారు.

ఇటీవల కాలంలో ఇతర పదార్థాలతో డ్రగ్స్‌ని కలిపి రవాణా చేయడం చూస్తున్నాం.

మొదట ఏదైనా పదార్థంతో డ్రగ్స్ కలిపేసి, ఆ తర్వాత రసాయనాలు ఉపయోగించి డ్రగ్స్‌ని, ఆ పదార్థాన్ని వేరు చేస్తారు.

ఆక్వా ఇండస్ట్రీలో ఈస్ట్ మాత్రమే ఉపయోగించరు. పోషక విలువల కోసం ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్‌ను ఇతర పదార్థాలతో కలిపి వాడతారు.

ఆగని రాజకీయ విమర్శలు

సంధ్య ఆక్వా కంపెనీ ఎండీ కూనం వీరభద్రరావు, సీఈవో కోటయ్య చౌదరికి బీజేపీ, టీడీపీ నేతలతో సంబంధాలున్నాయని వైసీపీ అరోపిస్తోంది. ఇదే సమయంలో వీరిద్దరికి వైసీపీతో లింకులున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విశాఖ డ్రగ్స్ కంటైనర్ విషయంలో రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి.

విశాఖ పోర్టులో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టివేత విస్మయం కలిగిస్తోందని, ఈ విషయంలో రాష్ట్ర పోలీసులు, పోర్టు సిబ్బంది సహకరించకపోవడంతో చూస్తుంటే దీని వెనుక అధికార పక్షం ఉన్నట్టుగా కనిపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు.

చంద్రబాబు వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. టీడీపీ నేతలు కావాలనే వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారని... డ్రగ్స్ వ్యవహారం వెనుక టీడీపీ, బీజేపీ నేతలు ఉన్నారన్న సందేహం కలుగుతోందని అన్నారు. పురందేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయని, పురందేశ్వరి కొడుకు ఆ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారని సజ్జల ఆరోపించారు.

రాష్ట్రంలో పోలీసులు, నార్కోటిక్స్‌ విభాగం డ్రగ్స్‌ సరఫరాను అరికట్టకుండా నిద్రపోతున్నారా? అని భారతీయ జనతా పార్టీ నాయకురాలు సాధినేని యామిని ప్రశ్నించారు.

డ్రగ్స్ కంటైనర్‌ వైకాపా నేతలదేనని ఆరోపించారు. ఇదంతా కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

సీబీఐ ఆరోపణల్లో వాస్తవం లేదు: విశాఖ సీపీ

విశాఖ పోలీసుల కారణంగా సీబీఐ దర్యాప్తు ఆలస్యమైందనే ఆరోపణలపై విశాఖ పోలీస్ కమిషనర్ రవి శంకర్ స్పందించారు. ఈ కేసు పూర్తిగా సీబీఐ చూసుకుంటుందని, కేవలం సహాయం కోరితే డాగ్ స్క్వాడ్ బృందాన్ని పంపామన్నారు. తమ వల్ల సోదాలు ఆలస్యం జరిగాయనే వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.

వాళ్ల టెక్నికాలిటీ కోసం అలా రాశారు తప్పితే ఇందులో వాస్తవం లేదని రవిశంకర్ వెల్లడించారు. అంతే తప్ప వారి విధి నిర్వహణకు అడ్డుపడలేదన్నారు.

ఈ కేసు వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని అంటున్నారని... అయితే ఈ కేసు వ్యవహారం మొత్తం సీబీఐయే చూసుకుంటుందని స్థానిక పోలీసులకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)