బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన 25 టన్నుల కంటైనర్‌లో ఉన్నవేంటి? అవి డ్రగ్సా, రొయ్యల మేతలో వాడేవా?

కార్గో

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

బ్రెజిల్ నుంచి విశాఖపట్నం తీరానికి వచ్చిన 25 టన్నుల డ్రైడ్ ఈస్ట్‌ కంటైనర్‌లో డ్రగ్స్ ఉన్నట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దీనిపై రాజకీయంగా పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.

డ్రగ్స్ అంటూ సీబీఐ అనుమానిస్తున్న మెటీరియల్ తామే ఆర్డర్ చేశామని, ఇది ష్రింప్‌లకు(రొయ్యలకు) మేతగా వేసే పదార్థాల్లో కలిపేదని విశాఖకు చెందిన సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ సంస్థ చెప్పింది.

ప్రాథమిక పరీక్షల్లో అనుమానాస్పదంగా ఈ పదార్థాలు ఉండటంతో తుది నిర్ధరణ కోసం సీబీఐ ల్యాబ్‌కు పంపినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

రొయ్యల మేత ఆర్డర్ చేస్తే డ్రగ్స్ వచ్చాయా? లేదా రొయ్యల మేతనే సీబీఐ అనుమానిస్తున్న డ్రగ్స్ పదార్థాలకు దగ్గరగా ఉందా? ఈ పదార్థాలను ఎవరికి పంపించారు? ఎక్కడ నుంచి విశాఖకు వచ్చాయి? దీనిపై అధికారులకు సమాచారం ఎలా అందింది? డ్రగ్స్‌ తరలింపుగా అనుమానిస్తున్న ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడానికి కారణమేంటి?

పోర్టులోని కంటైనర్లు
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

బ్రెజిల్ నుంచి విశాఖ సిరిపురానికి...

సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ 25 టన్నుల డ్రైడ్ ఈస్ట్‌ను బ్రెజిల్ కంపెనీ నుంచి ఆర్డర్ చేసింది. విశాఖకు డెలివరీ చేయాలంటూ తమ ఆర్డర్‌లో పేర్కొంది.

ఈ ఏడాది జనవరి 14న బ్రెజిల్‌లోని సాంటోస్ పోర్ట్ (Santos Port) నుంచి బయల్దేరిన కంటైనర్ మార్చి 16న విశాఖ చేరుకుంది. బ్రెజిల్ నుంచి ఒక్కో బ్యాగులో 25 కేజీల చొప్పున్న 1000 బస్తాలతో డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ విశాఖకు వచ్చింది.

అయితే, ఈ కంటైనర్‌లో డ్రగ్స్ ఉన్నట్లు ఇంటర్‌పోల్ నుంచి తమకు సమాచారం అందిందని, దీంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టినట్లు సీబీఐ తెలిపింది.

‘ఆపరేషన్ గరుడ’లో భాగంగా సీబీఐ ఈ కంటైనర్‌ను పరిశీలించింది. అయితే, ఈ కంటైనర్ విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ కంపెనీకి చెందినదని సీబీఐ మీడియా ప్రకటనలో తెలిపింది.

డ్రగ్స్ ఉన్నట్లు అనుమానిస్తూ సీబీఐ విడుదల చేసిన పత్రికా ప్రకటన

ఫొటో సోర్స్, CBI

ఫొటో క్యాప్షన్, కంటైనర్‌లో డ్రగ్స్ ఉన్నట్లు అనుమానిస్తూ సీబీఐ విడుదల చేసిన పత్రికా ప్రకటన

ఆ ప్రైవేటు సంస్థ ప్రతినిధులను పిలిచి వారి ఎదుటే సీబీఐ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో అనుమానాస్పద పదార్థాలను గుర్తించినట్లు చెప్పింది. విశాఖలోని కస్టమ్స్, డీఆర్ఐలతో కలిసి సీబీఐ ఈ ఆపరేషన్‌ను చేపట్టింది.

నార్కోటిక్స్ డిటెక్షన్ మెకానిజమ్‌లను ఉపయోగించి చేపట్టిన ప్రాథమిక పరీక్షల్లో ఈ కంటైనర్‌లోని డ్రైడ్ ఈస్ట్‌లో డ్రగ్స్ కలిపి ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు సీబీఐ మార్చి 21న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

మొత్తం సరుకును స్వాధీనం చేసుకున్నామని, ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపింది.

 కున్నం హరికృష్ణ
ఫొటో క్యాప్షన్, సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కున్నం హరికృష్ణ

మేం ఆర్డర్ చేసింది రొయ్యల మేత: సంధ్య, ఆక్వా ఎక్స్‌పోర్ట్స్

కంటైనర్‌ను సీబీఐ సీజ్ చేయడం, విశాఖలో 25 టన్నుల డ్రగ్స్ స్వాధీనం వంటి వార్తలు రావడంతో మార్చి 21 రాత్రి సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కున్నం హరికృష్ణ, వైస్ ప్రెసిడెంట్ గిరిధర్ మీడియాతో మాట్లాడారు.

“మా సంస్థ 2005 నుంచి ఆక్వా రంగంలో ఉంది. కొత్త ఫీడ్ ఫ్యాక్టరీ ప్రారంభించాం. దీనికి డ్రైడ్‌ ఈస్ట్ ముడిసరుకు. ఇది రొయ్యల మేతకు ఉపయోగిస్తాం. భారత్‌లో దొరుకుతుంది, కానీ బ్రెజిల్‌లో ఐసీసీ తయారు చేసే డ్రైడ్ ఈస్ట్ నాణ్యత బాగుంటుందని అక్కడ నుంచి 25 టన్నుల డ్రైడ్ ఈస్ట్‌ను బుక్ చేశాం. ఈ ఏడాది జనవరి 14న బ్రెజిల్ నుంచి బయలు దేరి మార్చి 16న భారత్‌కు చేరుకుంది” అని హరికృష్ణ చెప్పారు.

“ఈ నెల 19న సీబీఐ బృందం మమ్మల్ని విశాఖ పోర్టుకు రమ్మని పిలిచింది. మేం అక్కడికి వెళ్లాక, సరుకు ఉన్న కంటైనర్‌ను పరిశీలించి, డ్రైడ్ ఈస్టుకు కొన్ని ప్రాథమిక పరీక్షలు నిర్వహించింది. పరీక్షలు అనంతరం డ్రైడ్ ఈస్టులో డ్రగ్స్‌గా అనుమానిస్తున్న కొన్ని పదార్థాలు ఉన్నాయని సీబీఐ తెలిపింది. ఈ నెల 20న కూడా మరోసారి పరీక్షలు నిర్వహించింది. అప్పుడు కూడా డ్రగ్స్ ఉన్నట్లు తేలిందని సీబీఐ తెలిపింది. అయితే, ఇవి ప్రాథమిక పరీక్షలు కావడంతో తుది నిర్ధరణకు నమూనాలను ల్యాబ్‌కు పంపించామని, 10 రోజుల్లో ఫలితాలు వస్తాయని మాకు సమాచారం ఇచ్చారు” అని హరికృష్ణ తెలిపారు.

బ్రెజిల్ కంపెనీ వాళ్లు పంపిన మెటీరియల్‌లో ఏముందనే కాంపోజిట్ డిటైల్స్‌తో పాటు ఆ మెటీరియల్ హెల్త్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన కంటైనర్ సీల్ కూడా సరిగానే ఉందని తెలిపారు.

బ్రెజిల్‌లోని ఐసీసీ కంపెనీ నుంచి తాము తొలిసారిగా సరుకు తెప్పించామని, అయితే దానిలో ఏముందో ఇంకా తమకు తెలియదని, సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని హరికృష్ణ చెప్పారు.

కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గిరిధర్
ఫొటో క్యాప్షన్, కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గిరిధర్

‘కంటైనర్‌లో ఎర్ర చందనం ఉందని చెప్పి పిలిపించారు’

‘‘మీ పేరుతో వచ్చిన కంటైనర్‌లో ఎర్రచందనం ఉంది. వెంటనే మిమ్మల్ని పోర్టుకు రమ్మని సీబీఐ అధికారులు చెప్పారని షిప్పింగ్ ఏజెంట్ నుంచి ఫోన్ వచ్చింది’’ అని సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గిరిధర్ అన్నారు.

“ఎర్రచందనం రావడమేంటని పోర్టుకు వెళ్తే, అక్కడ అధికారులు మాకు వచ్చిన ప్యాకెట్లను చూపించారు. ఇవి డ్రగ్స్ అని అనుమానిస్తున్నామని, వీటిని పరీక్షిస్తామంటూ కొన్ని శాంపిల్స్ తీసుకున్నారు. వాటిని అక్కడ పరీక్షిస్తే రంగు మారాయని, అందుకే డ్రగ్స్ అని అనుమానిస్తున్నామని సీబీఐ అధికారులు చెప్పారు’’ అని తెలిపారు.

ఆ కంటైనర్‌ను సీజ్ చేసి పోర్టులోనే ఉంచారు. ల్యాబ్‌కు పంపిన శాంపిల్ ఫలితాలు వస్తే అప్పుడు ఏం చేయాలో నిర్ణయిస్తామని సీబీఐ అధికారులు చెప్పారని గిరిధర్ తెలిపారు.

తాము 21 వేల అమెరికా డాలర్లు (రూ.17.49 లక్షలు) విలువ చేసే 25 టన్నుల డ్రైడ్ ఈస్ట్‌ను ఆర్డర్ చేశామని తెలిపారు. సీబీఐ ఎటువంటి పరీక్షలు నిర్వహించిందో తమకు తెలియదని అన్నారు.

‘ఆపరేషన్ గరుడ’ అంటే..?

విదేశాల నుంచి దేశంలోకి అక్రమంగా మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న ముఠాలను అరికట్టేందుకు సీబీఐ ప్రారంభించిన కార్యక్రమమే ‘ఆపరేషన్ గరుడ’.

డ్రగ్స్ దందా చేస్తున్న ముఠాలను నిరోధించేందుకు ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో ఇంటర్‌పోల్ ద్వారా సమాచారం సేకరించి ఈ ఆపరేషన్ నిర్వహిస్తుంది. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది.

ఇంటర్‌పోల్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోల సమన్వయంతో గ్లోబల్ ఆపరేషన్స్ నిర్వహిస్తుంది.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీసు బలగాల సమన్వయంతో సమాచారం సేకరించి డ్రగ్స్ ముఠాలపై చర్యలు చేపడుతుంది.

పోర్టుల ద్వారా ఇతర పదార్థాలతో కలిపి అక్రమ మాదక ద్రవ్యాలను, సైకోట్రోపిక్ పదార్థాలను (alcohol, caffeine, nicotine, marijuana, certain pain medicines, heroin, LSD, cocaine and amphetamines are also psychotropic substances) రవాణా చేస్తున్న ముఠాలను అరికట్టేందుకు సీబీఐ పనిచేస్తుంది.

రెండున్నరేళ్ల క్రితం గుజరాత్‌లో రూ.9 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుకున్నారు. అప్పుడు ఆ లింకులు విజయవాడ, కాకినాడలలో బయటపడ్డాయి.

పళ్ల వ్యాపారం నిర్వహించే ఆషీ ట్రేడింగ్ కంపెనీకి ఈ డ్రగ్స్ వ్యాపారానికి ఉన్న లింక్ బయటపడింది. ఈ సంస్థ మూలాలు కాకినాడ, విజయవాడ, చెన్నైలో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

కంటైనర్లు

టీడీపీ, వైసీపీ పరస్పర ఆరోపణలు

సీబీఐ పట్టుకున్న పదార్థాలపై ఏపీలో రాజకీయంగా చర్చ ప్రారంభమైంది. ఇవి డ్రగ్స్ అని, ఇవి వైసీసీ వాళ్లవేనని టీడీపీ, జనసేన అంటుంటే, ఇవి టీడీపీకి సంబంధించినవేనని ఆరోపిస్తూ వైసీపీ ఎదురుదాడికి దిగింది.

‘‘అధికారంలోకి రావడం అసాధ్యమని తేలిపోవడంతో ఆఖరి ఘడియల్లో వైసీపీ చీకటి మాఫియాలు జాక్ పాట్‌లు కొట్టే పనిలో నిమగ్నమయ్యాయి. విశాఖను రాజధాని చేయడం దేవుడెరుగు... డ్రగ్స్ క్యాపిటల్‌గా మార్చావు కదా, జగన్’’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.

‘‘విశాఖ పోర్టులో దొరికిన 25 వేల కిలోల మాదక ద్రవ్యాల దిగుమతి వెనుక ఎవరున్నారో వెంటనే వెలికి తీయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ సర్కార్ డ్రగ్స్‌కి రాజధానిగా మార్చింది. ‘ఆపరేషన్ గరుడ’ ద్వారా రాష్ట్రంలోని డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయాలి’’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

‘‘విశాఖపట్నం తీరంలో దొరికిన 25 వేల కేజీల డ్రగ్స్‌తో టీడీపీ బాగోతం బయటపడింది. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్‌లో డ్రైడ్ ఈస్ట్‌తో మిక్స్‌ చేసి బ్యాగుల్లో డ్రగ్స్‌ తరలింపు జరిగింది. కునం వీరభద్రరావు, కునం కోటయ్య చౌదరికి చెందిన విశాఖలోని సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ పేరుతో కంటైనర్‌ బుకింగ్‌ జరిగింది’’ అని వైసీపీ ట్వీట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

ఆ సంస్థ స్పందన ఏమిటి?

రాజకీయ పార్టీల ఆరోపణలపై సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ స్పందించింది.

తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, తాము రాజకీయాలకు దూరమని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ చెప్పారు. తాము ఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేయమని, తాము వ్యాపారస్థులమని, వ్యాపారమే చేసుకుంటున్నామని అన్నారు.

అయితే, ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు వారి అవసరాలకు వాడుకుంటున్నాయని, దీనికి తామేమీ చేయలేమని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)