మహిళలకు సున్తీ: ఇప్పటి వరకు ఉన్న నిషేధాన్ని తొలగించడంపై గాంబియా మహిళలు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇవా ఆంటివెరోస్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
మహిళల జననేంద్రియ భాగాల్ని కత్తిరించడం లేదా తొలగించడం( ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్-ఎఫ్‌జీఎం)పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని గాంబియా పార్లమెంట్ నిర్ణయించింది.
దీంతో దేశంలో లక్షలమంది అమ్మాయిలకు ఇప్పటి వరకు రక్షణగా ఉన్న ఒక చట్టాన్ని వెనక్కి తీసుకున్నట్లు అవుతోంది.
జననేంద్రియ భాగాల్ని కత్తిరించడం లేదా తొలగించడాన్ని సున్తీ లేదా ఖత్నా అని కూడా అంటారు. మరోవైపు సున్తీ లేదా ఖత్నా విధానాలను పూర్తిగా నిషేధించాలని ఐక్యరాజ్యసమితి కూడా పిలుపునిచ్చింది.
ఈ నిషేధాన్ని వెనక్కి తీసుకోవాలనే బిల్లుకు అనుకూలంగా మార్చి 18న నేషనల్ అసెంబ్లీలో మెజార్టీ సభ్యులు ఓటేశారు. మూడు నెలల్లో తుది ఓటింగ్ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో ఈ బిల్లుపై తమ నిర్ణయాన్ని కమిటీలకు సమర్పించారు.
ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే, ఈ విషయంలో మహిళలకు చట్టపరంగా కల్పించిన రక్షణలను వెనక్కి తీసుకున్న తొలి దేశంగా గాంబియా నిలవనుంది.
2015లో తీసుకొచ్చిన నిషేధాన్ని వెనక్కి తీసుకోవడం అంటే, మహిళల జననేంద్రియ భాగాల్ని తొలగించడానికి వ్యతిరేకంగా ఎన్నో దశాబ్దాల పాటు తాము పడ్డ కష్టమంతా వృథా అయినట్లని మానవ హక్కుల కార్యకర్తలు అన్నారు.
‘‘ఇప్పటికే మా కమ్యూనిటీలోనే ఎఫ్‌జీఎం(సున్తీ)ని బహిరంగంగా చేపడుతున్నారని వస్తున్న రిపోర్టులు పెరుగుతున్నాయి. ఒకవేళ ఈ చట్టాన్ని వెనక్కి తీసుకుంటే, ఏం జరుగుతుందో మీరు ఊహించండి’’ అని గాంబియాలో మహిళా హక్కుల కార్యకర్త, సున్తీ నుంచి బయటపడ్డ బాధితురాలు ఫతౌ బల్దేహ్ చెప్పారు.
సున్తీకి ముగింపు పలకాలనే లక్ష్యంతో సంస్థను ఏర్పాటు చేసిన జహా దుకురా కూడా ఈ ఓటింగ్ ఫలితాలను వ్యతిరేకించారు. గాంబియా చరిత్రలోనే ఇది అత్యంత బాధాకరమైన రోజని అన్నారు.
‘‘ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే, బాల్యవివాహాల చట్టానికి వ్యతిరేకంగా కూడా చట్టసభ్యులు వెళ్తారు. గృహహింస చట్టానికి వ్యతిరేకంగా వెళ్లే అవకాశం ఉంటుంది’’ అని ఆమె బీబీసీతో అన్నారు.
ఇది కేవలం మహిళల జననేంద్రియ భాగాలను కత్తిరించడం లేదా తొలగించడమే కాదు, మహిళలను, వారి శరీరాలను పూర్తిగా నియంత్రణలోకి తీసుకోవడమేనని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
స్త్రీ జననేంద్రియ భాగాల్ని తొలగించడం(ఎఫ్‌జీఎం) అంటే ఏమిటి?
''స్త్రీ జననేంద్రియంలో వెలుపలి భాగాన్ని కోసివేయడం లేదా చర్మాన్ని తొలగించడాన్ని 'ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్' (ఎఫ్‌జీఎం)గా వ్యవహరించాలి'' అని ఐక్యరాజ్యసమితి నిర్వచించింది.
ఈ విధానాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా ఐక్యరాజ్యసమితి పరిగణిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌జీఎం పద్ధతికి ముగింపు పలుకుతూ, 2012 డిసెంబర్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది.
ఎఫ్‌జీఎం అనేది చాలా బాధాకరమైన విషయమని, ఈజిప్ట్‌కు చెందిన సినీ నిర్మాత, బ్లాగర్ ఒమ్నియా ఇబ్రహిం అన్నారు.
"ఒక ఐస్ ముక్కలా మారిపోతాం. ఎలాంటి భావాలూ ఉండవు. ప్రేమ అనే అనుభూతి ఉండదు. అన్నీ కోల్పోయినట్లుగా అనిపిస్తుంది" అని ఈజిప్టుకు చెందిన సినీ నిర్మాత ఓమ్నియా ఇబ్రహీం చెప్పారు. ఓమ్నియా కూడా ఎఫ్‌జీఎం బాధితురాలే.
"అది జరిగిన తర్వాత మానసికంగా ఎంతగానో కుంగిపోయాను. లైంగికంగా కోరికలు నశించిపోయాయి. దాంతో, ఇక నేను సెక్స్‌కి పనికిరానేమో అని అనుకునేదాన్ని. ఆ బాధ నుంచి బయటపడేందుకు నాకు ఎన్నో ఏళ్లు పట్టింది" అని ఓమ్నియా వివరించారు.
మహిళల యుక్త వయసు మొత్తంపై కూడా ఇది మానసికంగా ప్రభావాన్ని చూపుతుందని, దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఒమ్నియా చెప్పారు.
‘‘శరీరమంటే సెక్స్, ఆ సెక్స్ అనేది పాపం అని నా కమ్యూనిటీ నేర్పించింది. మనసులో నా శరీరం ఒక శాపంగా మారిపోయింది’’ అని ఒమ్నియా చెప్పారు.
చాలా దేశాల్లో సున్తీ చేయడం చట్టవిరుద్దం అయినప్పటికీ, ఆఫ్రికా, ఆసియా, మధ్య ప్రాచ్యలో చాలా ప్రాంతాల్లో దీన్ని చేపడుతూనే ఉన్నారు. సున్తీ చేయడం మామూలు విషయమేనని ఇంకా ఈ దేశాలు భావిస్తున్నాయి.

సున్తీ(ఎఫ్‌జీఎం) ఎన్ని రకాలు?
సున్తీల్లో నాలుగు రకాలు ఉంటాయి.
టైప్ 1 : క్లిటోరిడెక్టమీ – సున్నితమైన క్లిటోరిస్‌ను, దాని చుట్టూ ఉన్న చర్మాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా తొలగించడం.
టైప్ 2: ఎక్సిషన్ – క్లిటోరిస్‌ను పూర్తిగా లేదా పాక్షికంగా తొలగించడంతో పాటు, జననేంద్రియ లోపలి ముడుతల్లాంటి భాగాలను కూడా తొలగిస్తారు.
టైప్ 3: ఇన్‌ఫిబ్యులేషన్ – జననేంద్రియం లోపలి భాగంతో పాటు వెలుపలి భాగాన్ని కూడా పాక్షికంగా లేదా పూర్తిగా తొలగించి కుట్లు వేస్తారు. కుట్లు వేసేటప్పుడు చిన్న గ్యాప్‌ను మాత్రమే ఉంచుతారు.
ఈ విధానం తీవ్ర వేదనను, బాధను మిగల్చడమే కాకుండా, వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతోంది. చిన్న గ్యాప్‌తో యోనిని, మూత్రాశ్రయాన్ని మూసివేయడంతో, దాని నుంచే రుతుస్రావం, మూత్రం బయటికి వెళ్తుంది.
కొన్నిసార్లు ఇది చాలా చిన్నగా ఉండటం వల్ల, లైంగికంగా పాల్గొనేటప్పుడు లేదా పిల్లలకు జన్మనిచ్చేటప్పుడు దాన్ని కోయాల్సి వస్తుంది. ఇది తల్లికి, బిడ్డకు ప్రమాదకరంగా మారుతుంది.
టైప్ 4: ఈ విధానం చాలా ప్రమాదకరం. జననేంద్రియాన్ని పొడవడం, కత్తిరించడం, గీరడం లాంటివి చేస్తారు. సున్తీ వల్ల లైంగికానందం ఉండదు. ఇన్‌ఫెక్షన్, వంధ్యత్వం వస్తాయి.
ఇవి కూడా చదవండి:
- మనిషి మెదడులోకి పురుగులు ఎలా వస్తాయి?
- ఫ్రామౌరో: మతం కాదు, సైన్స్ ఆధారంగా తొలి ప్రపంచ పటాన్ని చిత్రించిన సన్యాసి... గడప దాటకుండానే ఆయన ఈ అధ్భుతాన్ని ఎలా సాధించారు?
- 'కలుపు దెయ్యాల'ను 141 ఏళ్ల కిందట భూమిలో పాతిపెట్టినా చావలేదు... అవి ఇలాఎంతకాలం జీవిస్తాయి?
- జింకల్లో కొత్త జాతి గుర్తింపు.. ఇది ఎక్కడ ఉంది?
- సీఏఏ: పౌరసత్వ సవరణ చట్టం అమలుకు నిబంధనలను విడుదల చేసిన కేంద్రం, దీనివల్ల ఏం జరుగుతుంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















