ఈడీ ఎవరినైనా అరెస్టు చేయొచ్చా? అన్ని అధికారాలు ఎలా వచ్చాయి?

ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ డైరక్టరేట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కీర్తి దూబే
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21 గురువారం రాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది.

దిల్లీ మద్యం పాలసీ కుంభకోణంతో ముడిపడిన మనీ ల్యాండరింగ్ కేసులో ఆయన అరెస్టయ్యారు.

కేజ్రీవాల్ అరెస్టుకు ముందు మొత్తం తొమ్మిదిసార్లు ఆయనకు సమన్లు పంపింది ఈడీ. వాటిని తిరస్కరించారు కేజ్రీవాల్.

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ కేజ్రీవాల్ అరెస్టయ్యారు.

ఏడు దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరుగనుంది.

కేజ్రీవాల్ అరెస్ట్‌పై ప్రతిపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దర్యాప్తు సంస్థల్ని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటోందని ఇప్పటికే పలుమార్లు ఆరోపణలు చేశాయి.

ఆ ఆరోపణలు పదే పదే ఎందుకు తెరమీదకు వస్తున్నాయి? అందులో నిజమెంత? ప్రధాని, ముఖ్యమంత్రి సహా ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం ఈడీకి ఉందా?

సోనియా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

యూపీఏ X ఎన్డీఏ

రెండేళ్లుగా కొనసాగుతోంది దిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసు.

దిల్లీ ప్రభుత్వం 2021లో తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీ‌లో అక్రమాలు జరిగాయని, మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిలో అరెస్టయిన మనీష్ సిసోదియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ 2023 నుంచి జైల్లోనే ఉన్నారు.

అంతకుముందు, ఈ ఏడాది జనవరిలో ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది ఈడీ.

మార్చి 2022లో పార్లమెంట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, 2004-14 మధ్య ఈడీ 112 చోట్ల నిర్వహించిన సోదాల్లో రూ.5,346 కోట్ల నగదును సీజ్ చేసినట్లు తెలిపింది.

2014-22 మధ్య బీజేపీ పాలనలో ఈడీ మొత్తం 3,010 సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో లక్ష కోట్లకు పైగా ఆస్తుల్ని అటాచ్ చేసింది.

ఎనిమిదేళ్లలో అనగా, 2014-22 మధ్య కాలంలో ప్రతిపక్షంలోని ప్రముఖ రాజకీయ నాయకులపై ఈడీ నమోదు చేసిన కేసుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగిందని నిరుడు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనం ప్రచురించింది.

2014-22లో ఈడీ దర్యాప్తు చేస్తున్న వాటిలో 121 కేసులు ప్రముఖ రాజకీయ నాయకులవి కాగా, వారిలో 115 మంది ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. అంటే, 95 శాతం కేసులు ప్రతిపక్ష నేతలకు సంబంధించినవే.

దీనిని మనం యూపీఏ హయాంలో జరిగిన వాటితో పోలిస్తే 2004-14లో ఈడీ 26 మంది రాజకీయ నాయకుల కేసులను దర్యాప్తు చేయగా, వారిలో 14 మంది ప్రతిపక్షంలోని వారు.

డిసెంబర్ 2022 లోక్‌సభ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిస్తూ, ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులకు సంబంధించిన డేటా తమ వద్ద లేదని తెలిపింది.

అందుకు సమాధానంగా ‘రాజకీయ నాయకులు, సామాన్యులను వేర్వేరుగా చూడం’ అని చెప్పింది.

ఈడీ మాదిరిగానే సీబీఐ కేసుల సమాచారాన్ని విశ్లేషించగా, యూపీఏ పదేళ్ల పాలనలో 72 మంది రాజకీయ నాయకులపై సీబీఐ దర్యాప్తు జరిపింది. వారిలో 43 మంది అంటే దాదాపు 60 % మంది ప్రతిపక్షంలో ఉన్నవారే.

ఎన్డీఏ హయాంలో 2014-22 మధ్య కాలంలో 124 మంది సీబీఐ విచారణను ఎదుర్కొన్నారు. వీరిలో 118 మంది అంటే 95 % మంది ప్రతిపక్షంలో ఉన్నవారు.

ప్రతిపక్షాలపై నియంత్రణ సాధించేందుకు మోదీ ప్రభుత్వం దర్యాప్తు ఏజెన్సీలను ఉపయోగించుకుంటోందని ప్రతిపక్షంలోని పార్టీలు గత కొన్ని నెలలుగా ఆరోపణలు చేస్తున్నాయి.

అయితే, యూపీఏ అధికారంలో ఉన్న 2013లో సుప్రీంకోర్టు, సీబీఐను ఉద్దేశించి ‘పంజరంలో చిలుక’ అని వ్యాఖ్యానించింది.

కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ఏజెన్సీలను ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వినియోగిస్తోందన్న ఆరోపణలు కొత్తేమీ కాదు. ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఇలాంటివి గతంలోనూ జరిగాయి. కానీ, గడిచిన పదేళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఈ స్థాయిలో వినియోగించడం కొత్త ట్రెండ్.

ఈడీ

చట్టంలో మార్పులతో శక్తిమంతంగా ఈడీ

2019లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్‌(పీఎమ్ఎల్ఏ)లో మార్పులు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.

అందులో భాగంగా ఈడీకి మనీలాండరింగ్ కేసుల్లో ప్రత్యేక అధికారాలు కల్పించింది.

సెక్షన్ 17లోని సబ్ సెక్షన్ (1), సెక్షన్ 18లో మార్పులు చేసింది. ఆ ప్రకారం ప్రజల ఇళ్లలో తనిఖీలు, సోదాలు, అరెస్ట్ చేసేందుకు ఈడీకి అధికారం ఇచ్చింది. అంతకుముందు ఇతర దర్యాప్తు ఏజెన్సీలు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో మనీలాండరింగ్‌కు సంబంధించిన సెక్షన్లు ఉంటే మాత్రమే ఈడీ జోక్యం చేసుకునేందుకు వీలు ఉండేది.

పీఎమ్ఎల్ఏ చట్టంలో చేసిన మార్పులతో, ఈడీ స్వయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయొచ్చు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ సవరణలకు సంబంధించిన బిల్లును లోక్‌సభలో ద్రవ్య బిల్లు(మనీ బిల్‌)గా ప్రవేశపెట్టారు. మనీ బిల్లు అయితే దీనిని నేరుగా లోక్‌సభలో ప్రవేశపెట్టొచ్చు. మెజారిటీ సభ్యుల ఆమోదంతో బిల్ చట్టంగా మారుతుంది.

గమనించాల్సిన విషయమేంటంటే, 2019లో రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేదు. పీఎంఎల్ఏలో సవరణల బిల్లును మనీ బిల్లుగా ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించి, ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది.

బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి, బిల్లుకు ఆమోదం లభించాలనే ఉద్దేశంతోనే మనీబిల్లుగా ప్రవేశపెట్టిందని ఆరోపించింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అయితే, న్యాయస్థానం ఆ సవరణలను సమర్థించింది.

ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు మరిన్ని అధికారాలు కల్పించడం అవసరమని కోర్టులో వాదనలు వినిపించింది కేంద్రం.

ఈడీ ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చా?

యూపీఏ హయాంలో, రూ.30 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ డబ్బు ప్రమేయమున్న కేసులను పీఎమ్ఎల్ఏ కింద నమోదు చేసేవారు.

అందువల్ల 2012 వరకు చూస్తే, 165 మనీలాండరింగ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి.

2013లో చట్టంలో సవరణలు చేసి రూ.30 లక్షల పరిమితిని రద్దు చేశారు. ఎంత తక్కువ మొత్తంలో డబ్బు అయినా సరే, పరిశీలనలోకి తీసుకున్నారు.

2019లో చేసిన మార్పులు మాత్రం ప్రధానమైనవి. ఆ మార్పులతోనే ఈడీ అధికార పరిధి పెరిగింది. మోదీ సర్కార్ చట్టాన్ని మరింత కఠినతరం చేసింది.

పీఎంఎల్ఏలో చేర్చిన 45వ సెక్షన్ ప్రకారం ఈడీ అధికారులు వారెంట్ లేకుండానే ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేయవచ్చు.

‘అక్రమార్జనలతో సంపద సృష్టి’ పరిధి కూడా పెరిగింది. ఆ ప్రకారం.. ఎవరైనా సరే, అక్రమంగా సంపాదించిన డబ్బుతో నేరుగా కానీ, పరోక్షంగా కానీ, ఏదైనా ఆస్తిని సృష్టించారని ఈడీ భావిస్తే చర్యలు తీసుకునే అధికారం ఉంది.

సాధారణంగా పోలీసులు సమన్లు జారీ చేస్తే, ఆ వ్యక్తిని సాక్షిగా పిలుస్తున్నారో లేదా నిందితుడిగా పిలుస్తున్నారో చెప్పాల్సి ఉంటుంది. కానీ, ఈడీ జారీ చేసే సమన్లలో ఆ వివరాలను తెలియపర్చాల్సిన అవసరం లేదు.

ఈడీ విచారణ సమయంలో, ఈడీ అధికారుల సమక్షంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని అధారంగా న్యాయస్థానంలో సమర్పించవచ్చు.

ఇతర కేసుల్లో ఆ వాంగ్మూలం సీఆర్పీసీ 164ని అనుసరించి మేజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు చేస్తేనే న్యాయపరంగా చెల్లుబాటు అవుతుంది.

కానీ, పీఎంఎల్ఏకు సంబంధించినంతవరకు మేజిస్ట్రేట్‌కు ఈడీపై పర్యవేక్షణ అధికారం లేదు.

సాధారణ ఎఫ్ఐఆర్‌లలో, నిందితులకు ఎఫ్ఐఆర్‌‌ కాపీని పొందే హక్కు ఉంది. కానీ, మనీలాండరింగ్ కేసులో నిందితుడికి కాపీని పొందే వీలు లేదు.

ఈడీ ఆ కేసులో ఛార్జ్‌షీట్ ఫైల్ చేసేంతవరకు తనపై ఏ సెక్షన్ల కింద అభియోగాలు మోపారో నిందితుడికి తెలీదు. ఛార్జ్‌షీట్ ఫైల్ చేసేందుకు ఈడీకి 60 రోజుల సమయం ఉంటుంది.

అయితే, పీఎంఎల్ఏ కేసుల విషయంలో ప్రధానమైనదేంటంటే, నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితులపైనే ఉంటుంది.

ముఖ్యంగా ఎఫ్ఐఆర్ లేనప్పుడు, నిందితులకు బెయిల్ పొందడం కూడా కష్టంగా మారుతుంది. ఎఫ్ఐఆర్ లేకుండా తన మీద మోపిన ఆరోపణలపై నిందితులు న్యాయస్థానంలో వాదించడం సాధ్యంకాదు.

నవాబ్ మాలిక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నవాబ్ మాలిక్

ఆరోపణల్లో నిజమెంత?

2023లో నమోదైన కొన్ని కేసులను లోతుగా పరిశీలించి, సమాచారాన్ని సేకరించింది బీబీసీ.

నిజంగానే సీబీఐ, ఈడీలను రాజకీయ ప్రత్యర్థులపై వినియోగించారా అనే విషయంతోపాటు ప్రతిపక్ష నేతలు పార్టీ మారి, బీజేపీలో చేరాక ఆ కేసుల్లో ఏం జరిగిందన్న అంశాలను కూడా విశ్లేషించింది. అందుకోసం ప్రతిపక్ష నాయకులు అరెస్టయిన మహారాష్ట్రతోపాటు కొన్ని కేసుల్ని ఎంచుకుంది.

మహారాష్ట్ర - రెండు ఉదాహరణలు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫిబ్రవరి 23, 2022లో ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్‌ను కొన్ని గంటలపాటు ప్రశ్నించి, అరెస్ట్ చేసింది.

దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్‌తో సన్నిహిత సంబంధాలున్న సలీమ్ పటేల్‌ నుంచి మార్కెట్ ధర కన్నా చాలా తక్కువ ధరకే భూమిని కొనుగోలు చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. 22 ఏళ్ల క్రితం నాటి కేసు ఇది. మనీలాండరింగ్ కేసుగా ఈడీ నమోదు చేసింది.

అంతకుముందు, జనవరి 2021లో, నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్‌ను డ్రగ్స్‌కు సంబంధించిన కేసులో అరెస్ట్ చేసింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ).

అక్టోబర్ 2021లో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది.

ఈ విషయమై నవాబ్ మాలిక్ ఎన్సీబీ, బీజేపీలపై మీడియా సమావేశాల్లో పలుమార్లు ఆరోపణలు చేశారు. ఆ కేసులన్నీ బూటకమని, కుట్రలో భాగంగానే ఆర్యన్‌ ఖాన్‌ను బీజేపీ, ఎన్సీబీ కిడ్నాప్ చేశాయని ఆరోపించారు.

నిరుడు ఈ కేసులో ఆధారాలు లేని కారణంగా, ఆర్యన్‌ ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది న్యాయస్థానం. సమీర్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేసింది. నవాబ్ మాలిక్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. అనారోగ్యం కారణంగా బెయిల్ మంజూరు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీతో నారాయణ్ రాణె

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రధాని నరేంద్ర మోదీతో నారాయణ్ రాణె

మహారాష్ట్ర రాజకీయాల్లో మరొకరి గురించి కూడా చెప్పాలి. ఆయనే నారాయణ్ రాణె. గతంలో ఆయన శివసేన, కాంగ్రెస్ పార్టీల్లోనూ పనిచేశారు.

1999లో శివసేన- బీజేపీ కూటమిలో కొంత కాలం ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.

2016లో బీజేపీకి చెందిన మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య ఆయనపై ఆరోపణలు చేశారు. నారాయణ్ రాణె మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, నారాయణ్ రాణె, ఆయన కుటుంబం నిర్వహించే వ్యాపారాలపై దర్యాప్తు జరపాలని కోరుతూ ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు లేఖ రాశారు.

రూ.300 కోట్లకు సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణల్ని ఎదుర్కొన్నారు నారాయణ్ రాణె.

అక్టోబర్ 2017లో నారాయణ్ రాణె కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి, మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష అనే పార్టీని స్థాపిస్తున్నట్లు, ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం నారాయణ్ రాణె కేంద్ర మంత్రిగా ఉన్నారు.

ఇంతకీ ఆ ఆరోపణలపై విచారణ జరిగిందా? కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకున్నాయా?

అదేమీ జరగలేదు.

ఈ రెండు ఉదంతాలు ఒకే రాష్ట్రానికి చెందినవి.

కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న రాణె ఇప్పుడు కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

అదే సమయంలో, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ 22 ఏళ్ల క్రితం నాటి భూమికి సంబంధించిన కేసులో గత ఏడాది నుంచి జైలులో ఉన్నారు.

హిమంత బిశ్వ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ

అస్సాంలో ఏం జరిగింది?

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేరు కొన్నేళ్లుగా వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఆయన గతంలో, తరుణ్ గొగోయ్ ప్రభుత్వంలో వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.

కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన హిమంత ఇప్పుడు బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా మారారు.

తరుణ్ గొగోయ్ ప్రభుత్వంలో శక్తిమంతమైన నాయకుడిగా ఆయనకు పేరుండేది.

గొగోయ్‌తో సన్నిహిత సంబంధాలు ఉండేవి. 2011 ఎన్నికల తర్వాత పరిస్థితి మారింది.

2014 జులైలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు హిమంత బిశ్వ శర్మ. ఆ సమయంలో శారద చిట్ ఫండ్ స్కాంలో ఆయన పేరు వినిపించింది.

ఆగస్టు 2014లో సీబీఐ ఆయన నివాసం, కార్యాలయం, ఆయన భార్య యజమానురాలిగా ఉన్న న్యూస్ ఛానెల్ కార్యాలయాల్లో సోదాలు జరిపింది.

కోల్‌కతాలో సీబీఐ కార్యాలయంలో కొన్ని గంటలపాటు ఆయన్ను ప్రశ్నించింది.

ఆ సమయంలో, శారదా గ్రూప్ యజమాని సుదీప్తొ సేన్ నుంచి హిమంత బిశ్వ శర్మ ప్రతి నెల రూ.20 లక్షలు తీసుకున్నాని ఆరోపణలొచ్చాయి.

ఆ సంస్థ వ్యాపారం సజావుగా సాగనిచ్చేందుకు ఈ డబ్బు తీసుకున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి.

మొత్తం శారదా చిట్ ఫండ్‌కు సంబంధించి కేసుల్ని కలిపి విచారించాలని జనవరి 2015లో సీబీఐని ఆదేశించింది గువాహతి హైకోర్టు.

ఆగస్టు 2015లో బీజేపీలో చేరారు హిమంత బిశ్వ శర్మ.

హిమంత బిశ్వ శర్మ బీజేపీలో చేరిన దగ్గర నుంచి శారదా చిట్ ఫండ్ స్కాం‌లో దర్యాప్తు నిలిచిపోయింది అని ఫిబ్రవరి 2019లో అస్సాం కాంగ్రెస్ నేత ప్రద్యుత్ బోర్దోలోయ్ మీడియా సమావేశంలో ఆరోపించారు.

ఈ కేసుకు సంబంధించిన తదుపరి సమాచారమేమీ ఇప్పటివరకు వెల్లడికాలేదు. బీజేపీలో చేరిన హిమంత బిశ్వ శర్మ శక్తిమంతమైన నేతగా ఎదిగారు.

ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాక ఆయన్ను సీబీఐ విచారణకు పిలవలేదు.

నార్త్-ఈస్ట్ డెవలప్మెంట్ అలియన్స్ (ఎన్‌ఈడీఐ) బాధ్యతలు ఆయనకు అప్పగించారు.

ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ప్రాబల్యం పెంచడంలో ఆయన కీలకంగా వ్యవహరించారని చెబుతారు.

సోనియా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

నేషనల్ హెరాల్డ్ కేస్

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కేసును 2012లో 120 (నేరపూరిత కుట్ర), 420 (మోసం) వంటి పలు సెక్షన్ల కింద సుబ్రమణియన్ స్వామి ఫైల్ చేశారు.

పీఎంఎల్‌ఏకు సంబంధించిన సెక్షన్‌లు ఈ కేసులో పేర్కొనలేదు. అయినప్పటికీ ఈ కేసులో ఐటీ శాఖ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిందనే వాదనతో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అవి రెండూ వేర్వేరు.

ఇలాంటి పరిస్థితుల్లో ఈడీ ఈ కేసును దర్యాప్తు చేసే అధికారం ఉంది.

కానీ, ఈ కేసు 2019 కన్నా ముందే నమోదవడంతో, అప్పటికే దాఖలైన ఎఫ్ఐఆర్‌లో పీఎంఎల్ఏకు సంబంధించిన సెక్షన్లేవైనా ఉంటే, వాటిపై మాత్రమే దర్యాప్తు చేయగలదు ఈడీ.

బీజేపీ

ఫొటో సోర్స్, GETTY IMAGES

ప్రతిపక్షాలపై ఈడీ ఆయుధంగా మారిందా?

ఈడీని మోదీ సర్కార్ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందని పదే పదే ఆరోపణలు వస్తున్నాయి.

అందులో భాగంగానే, కేంద్రం మహారాష్ట్రను ఎంచుకుని, ఈడీని రాజకీయంగా వాడుకుందని కొంత మంది విశ్లేషకులు అంటున్నారు.

2023 మేలో, శివసేనలోని రెబల్ ఎమ్మెల్యేలంతా ఏక్‌నాథ్ శిందేకు మద్దతుగా నిలిచి, పార్టీలో చీలిక తెచ్చారు.

రాత్రికి రాత్రి ఈ ఎమ్మెల్యేలను గుజరాత్‌కు, అక్కడి నుంచి అస్సాంలోని గువాహటికి తరలించారు.

తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన రాజకీయ పరిణామాల్లో జులైలో ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వం బీజేపీ కూటమి మద్దతుతో కొలువుదీరింది.

ఇది మొదటి అడుగు.

ఆ సమయంలోనే ఉద్ధవ్ ఠాక్రే అసెంబ్లీలో ఈడీ-ఈడీ అంటూ నినాదాలు చేశారు. శిందే, ఆయనతోపాటు ఉన్న ఎమ్మెల్యేలు ఈడీ మీదున్న భయంతో, డబ్బులు దండుకోవాలనే ఉద్దేశంతో బీజేపీతో జట్టు కట్టారని ఆరోపణలు చేశారు ఉద్ధవ్.

ఈ ఆరోపణలపై బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. “అవును.. ఈడీ- ఈడీనే. ఈడీ అంటే ఏక్‌నాథ్, దేవేంద్ర ఫడణవీస్” అన్నారు.

మహారాష్ట్రలో అధికారం చేతులు మారిన సమయంలోనే ఈడీ, శివసేన నాయకుడు సంజయ్ రౌత్‌కు సమన్లు జారీ చేసింది. ఆయన 2022 జులై 27న బీజేపీకి వ్యతిరేకంగా విమర్శలు చేశారు.

2022 ఆగస్టు 1న ముంబయి గొరేగావ్‌లోని పాత్రా చాల్ రీడెవలప్మెంట్‌‌లో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై ఆయన్ను అరెస్టు చేసింది ఈడీ.

ఈ ప్రాజెక్టును గురు ఆశిష్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, మహారాష్ట్ర హౌసింగ్ అథారిటీ సహకారంతో చేపట్టింది.

ఈ కంపెనీ హౌసింగ్ డెవలప్మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(హెచ్‌డీఐఎల్)కు సబ్సిడరీ సంస్థ.

ఈ హెచ్‌డీఐఎల్ సంస్థ పంజాబ్-మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్‌కు సంబంధించిన రూ.4300 కోట్ల అవినీతి కేసులో విచారణను ఎదుర్కొంటోంది.

ఈ సంస్థ కోట్ల రూపాయలు ప్రవీణ్ రౌత్‌ బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేసిందని ఈడీ చెబుతోంది. సంజయ్ రౌత్‌కు ప్రవీణ్ రౌత్ సన్నిహితుడు.

2022 నవంబరులో సంజయ్ రౌత్‌కు బెయిల్ మంజూరు చేసింది సెషన్స్ కోర్టు. ఆ సమయంలో, “కోర్టులో సమర్పించిన ఆధారాల ప్రకారం ఈ అవినీతి కేసులు ప్రవీణ్ రౌత్‌కు సంబంధించినవి. కానీ, సంజయ్ రౌత్‌ను ఎలాంటి కారణాలు లేకుండానే అరెస్ట్ చేశారు” అని న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది.

మొత్తంగా శివసేన ఎమ్మెల్యేలలో ఉద్ధవ్ వైపు వెళ్లిన వారు, ఏక్‌నాథ్ శిందే వైపు వెళ్లిన వారు ఎవరెవరో చూద్దాం. అలాగే, శిందే పక్షాన నిలిచిన వారి విషయంలో ఈడీ-సీబీఐ కేసుల పరిస్థితి ఏమైందో కూడా చూద్దాం.

శివసేన నాయకుడు అర్జున్ ఖోట్కర్ 2016-19లో బీజేపీ-శివసేన కూటమిలో మంత్రిగా పనిచేశారు.

మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ స్కామ్‌లో ఈడీ ఆయన్ను విచారిస్తోంది.

2022 జూన్‌లో అర్జున్ ఖోట్కర్ ఇంట్లో ఈడీ దాడులు చేసి, రూ.78 కోట్ల ఆస్తుల్ని సీజ్ చేసింది. జులైలో అర్జున్ ఖోట్కర్ ఉద్ధవ్ పక్షాన కాకుండా శిందే బృందంలో చేశారు.

ఆ సమయంలో పరిస్థితుల కారణంగా తాను నిస్సహాయుడిగా మారానని ఆయన వ్యాఖ్యానించారు.

శిందే బృందంలో చేరాక, ఆయనపై తదుపరి చర్యలు తీసుకున్నట్లుగా వార్తలేవీ రాలేదు.

మరో శివసేన నేత భావన గావ్లీ కేసు కూడా ఇలాంటిదే. ఆమెకు చెందిన డిగ్రీ కాలేజీలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. గావ్లీకి వ్యతిరేకంగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తోంది ఈడీ.

ఎన్జీవోను ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా మార్చి, కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారని ఆమెపై ఆరోపణలు చేశారు.

గావ్లీ శిందే పక్షాన చేరాక ఆ మనీలాండరింగ్ కేసులో ఏం జరిగిందన్న వార్తలయితే వినిపించలేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)