బదాయు: ‘నా పిల్లలను చంపిన హంతకుడి సోదరుడు జావేద్‌ను ఎన్‌కౌంటర్ చేయొద్దు’ అని ఆ తండ్రి ఎందుకంటున్నారు...

బదాయు మర్డర్
ఫొటో క్యాప్షన్, హత్యకు గురైన చిన్నారుల తల్లి సంగీతా దేవి
    • రచయిత, అనంత్ ఝాణనె
    • హోదా, బీబీసీ ప్రతినిధి, బదాయు నుంచి

ఆయూష్‌కి 13 ఏళ్లు, ఆహాన్‌కి 8, పీయూష్‌కి 10 ఏళ్ల వయసు. ఈ ముగ్గురు అన్నదమ్ములు అమ్మానాన్న, నానమ్మతో కలిసి బదాయులోని బాబా కాలనీలో ఉంటున్నారు.

హోలీ పండుగ దగ్గరపడుతుండడంతో పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని, వాళ్లమ్మ సంగీతా దేవి పిల్లల కోసం కొత్త బట్టలు, చెప్పులు కూడా కొన్నదని వారి తండ్రి వినోద్ కుమార్ చెప్పారు.

అయితే, హొలీకి ముందు సంగీత ఇంట్లో జరిగిన విషాద ఘటనతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

ఆయూష్, ఆహాన్‌లను మంగళవారం సాయంత్రం వాళ్ల డాబాపైన సాజిద్ అనే వ్యక్తి హత్య చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.

వినోద్ కుమార్ ఇంటి ముందే సాజిద్ సెలూన్ షాప్ ఉండేది.

బదాయు మర్డర్
ఫొటో క్యాప్షన్, నానమ్మ మున్నీ దేవి

హత్యలను చూసిన మరో చిన్నారి పీయూష్

మేం ఇంటిపైకి వెళ్లి చూసినప్పుడు, అక్కడ ఏం జరిగిందో అర్థమైంది.

తన ఇద్దరు సోదరుల హత్యను కళ్లారా చూసిన పీయూష్, తాను ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నానని చెప్పాడు.

మేం వెళ్లేసరికి పీయూష్ తన తల్లి సంగీతా దేవి కాళ్ల దగ్గర పడుకుని ఉన్నాడు.

అతని వేలికి కట్టుకట్టి ఉంది. సాజిద్ తనపై కూడా దాడి చేయగా తాను తప్పించుకుని పారిపోయానని పీయూష్ చెబుతున్నాడు.

‘‘ నేను పైకి వెళ్లగానే నన్ను కూడా చంపడానికి ప్రయత్నించాడు. అన్నయ్య కింద పడి ఉన్నాడు. అక్కడున్న గాజు తగిలి అతని (నిందితుడు సాజిద్) కాలు జారింది. ఈ లోగా నేను అక్కడి నుంచి పారిపోయా. అన్నయ్యని చంపేశారు, అమ్మా, నాన్న, నాయనమ్మ కేకవేసి పిలిచాను." అని పీయూష్ చెప్పాడు.

చిన్నారుల తల్లి సంగీతా దేవి తన కాళ్లపై ఉన్న గాయాలను చూపిస్తూ, ''పిల్లల మృతదేహాలను పోస్టుమార్టానికి తీసుకెళ్లకుండా అడ్డుకున్నప్పుడు పోలీసులు నన్ను తోసేయడంతో పడిపోయా'' అని చెప్పారు.

''అమ్మా ...పైన ఏం జరుగుతుందో చూడండి అంటూ అరుస్తూ వచ్చాడు. ఆ తర్వాత అతను (నిందితుడు సాజిద్) పైనుంచి కత్తితో వచ్చి, ఆమెను (సంగీత) చూపిస్తూ పిలుస్తున్నాడు. మేం గట్టిగా అరుస్తూ వెంటనే గేటు మూసేశాం. ఆ తర్వాత పోలీసులు వచ్చి అతన్ని తీసుకెళ్లారు'' అని పీయూష్ నానమ్మ మున్నీ దేవి తెలిపారు.

క్రాఫ్ చేయించుకోవడానికి పిల్లలు ఇంటి ఎదురుగా ఉన్న సాజిద్ షాప్‌కే వెళ్లేవారని మున్నీదేవి చెప్పారు.

అతను పరిచయం లేని వ్యక్తేమీ కాదు. కాలనీ మొత్తానికీ తెలుసు. క్రాఫ్ చేయించుకోవడానికి కాలనీవాళ్లు అతని దుకాణానికి వెళ్లేవారు.

బదాయు మర్డర్
ఫొటో క్యాప్షన్, పిల్లల తండ్రి వినోద్ కుమార్

జావేద్‌ని కూడా ఎన్‌కౌంటర్ చేస్తే అసలు నిజం బయటికి రాదు - తండ్రి

నిందితుడు సాజిద్ తనకు, తన కుటుంబానికి తెలిసినవాడేనని హత్యకు గురైన చిన్నారుల తండ్రి వినోద్ కుమార్ చెప్పారు.

అతనికి కాస్మొటిక్స్ దుకాణం ఉందని, అక్కడ కొన్ని వస్తువులు కొంటుండేవాడినని ఆయన చెప్పారు.

‘‘నా భార్య ఫోన్ చేసి డబ్బులు బదులు కావాలని అడుగుతున్నారని చెప్పింది. రేపు ఇస్తామన్నారులే ఇవ్వు అని నా భార్యతో చెప్పాను’’ అని వినోద్ వెల్లడించారు.

తాము సాజిద్ వెంటపడ్డామని, తమపై దాడి చేయడంతో కాల్పులు జరిపామని, ఈ ఎన్‌కౌంటర్‌లో అతను చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు.

వినోద్ కుమార్ మాట్లాడుతూ, ‘‘ సాజిద్ సోదరుడు జావేద్‌ని పట్టుకోవాలి. అతనితో మాట్లాడాలి, ఇలా ఎందుకు జరిగిందో కనుక్కోవాలి. వాళ్లకి మేమేం హాని చేశాం? దీని వెనక ఎవరున్నారో తెలిస్తేనే ఇలా ఎందుకు జరిగిందో అర్ధమవుతుంది. అతన్ని కూడా చంపేస్తే అసలు నిజం బయటికి రాదు.'' అని వినోద్ కుమార్ అన్నారు.

ఆయూష్, ఆహాన్ ఇద్దరూ బాగా చదివేవారని వినోద్ కుమార్ అన్నారు.

వచ్చే సోమవారం హోలీ కావడంతో వాళ్లమ్మ వాళ్లకి కొత్త బట్టలు, చెప్పులు తెచ్చింది. ''ఇప్పుడవి అలా పడి ఉంటాయి'' అని వినోద్ కుమార్ అన్నారు.

''మాకు భయమేస్తోంది. పిల్లలను ఎందుకు చంపారో తెలియదు. అసలు వాళ్లకి ఏం కావాలి? అతనితో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. నా పిల్లలను చంపేంత శత్రుత్వం అసలే లేదు, ఇలా ఎందుకు చేశారు?'' అని ప్రశ్నిస్తున్నారు వినోద్ కుమార్.

బదాయు మర్డర్
ఫొటో క్యాప్షన్, సాజిద్ తల్లి నజ్రీన్

సాజిద్ కుటుంబం ఏమంటోంది?

ఈ ఘటన జరిగిన ఇంటికి 12 కిలోమీటర్ల దూరంలోని సాఖాను గ్రామంలో సాజిద్, జావేద్‌ల ఇల్లు ఉంది.

తన భార్య ప్రసవం కోసం సాజిద్ అప్పు అడిగాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. అయితే, అది నిజం కాదని సాజిద్, జావేద్‌ల తల్లి నజ్రీన్ చెబుతోంది.

"పోలీసులు వచ్చి మీ అబ్బాయి పిల్లలను చంపేశాడని చెప్పారు. వాడు కూడా చచ్చిపోతాడు, అంతయక్రియలకు ఏర్పాట్లు చేసుకోండన్నారు. వాణ్ని కూడా చంపేస్తారు'' అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్‌కౌంటర్‌లో సాజిద్ చనిపోయాడని పోలీసులు చెప్పరా అని ఆమెను అడిగినప్పుడు, ''మీ అబ్బాయి చనిపోయాడని చెప్పడానికి పోలీసులు వచ్చారు. అతన్ని కాల్చి చంపారు'' అని నజ్రీన్ అన్నారు.

తన కుమారులను ఇందులో ఇరికిస్తున్నారని, ఆ కుటుంబంతో మాకు ఎలాంటి శత్రుత్వం లేదని ఆమె చెప్పారు.

ప్రస్తుతం జావేద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతని కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, బదాయులో ఇద్దరు చిన్నారుల దారుణ హత్య, నిందితుడి ఎన్‌కౌంటర్.. అసలేం జరిగిందంటే..

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)