ప్రదీప్ శర్మ: ఈ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌కు జీవిత ఖైదు శిక్ష ఎందుకు పడింది, ఆయన గతం ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
మహారాష్ట్ర మాజీ పోలీసు అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మకు బాంబే హైకోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.
రామ్ నారాయణ్ గుప్తా అలియాస్ లఖన్ భయ్యాకు చెందిన 2009 నాటి బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో ఈ శిక్ష వేసింది.
మూడు వారాల్లోగా తనకు తానుగా వచ్చి లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.
25 ఏళ్ల పాటు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన తర్వాత గత కొన్నేళ్లుగా ప్రదీప్ శర్మ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారు. కానీ, కోర్టు నిర్ణయంతో ఆయన రాజకీయ ప్రయత్నాలకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది.

ఫొటో సోర్స్, FACEBOOK/PRADEEP SHARMA
ప్రదీప్ శర్మ ఎవరు?
పోలీసు సర్వీసు నుంచి పదవీ విరమణ అయిన తర్వాత ప్రదీప్ శర్మ రాజకీయాల్లో అవకాశాల కోసం చూశారు. అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ టిక్కెట్‌పై నలసోపారా నుంచి పోటీ చేశారు.
శర్మ కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందినది. ప్రదీప్ శర్మ తండ్రి మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో స్థిరపడ్డారు. ఆయన టీచర్‌గా పనిచేశారు. ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి ఎమ్మెస్సీ వరకు శర్మ చదువు ధూలేలోనే కొనసాగింది. ఆ తర్వాత మహారాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(ఎంపీఎస్‌సీ)కు ఎంపికై, పోలీసు సర్వీసులో చేరారు.
పోలీసు సర్వీసుల్లో చేరేందుకు ఏది తనని ప్రభావితం చేసిందో తెలుపుతూ.. ‘‘మేం ధూలేలో ఉన్నప్పుడు, మా ఇంటి పక్కన ఒక ఇన్‌స్పెక్టర్ ఉండేవారు. మేం యంగ్‌గా ఉన్నప్పుడు ఆయన్ను తరచూ చూసేవాళ్లం. ఆయన యూనిఫామ్ వేసుకుని బైకుపై వెళ్లే వారు. పోలీసు సర్వీసుల్లో చేరేందుకు ఇది కూడా ఒక కారణం’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
1983 పోలీసు బ్యాచ్ అధికారి
1983 బ్యాచ్‌కు చెందిన స్టేట్ పోలీసు సర్వీసు అధికారులు మహారాష్ట్రలో అత్యంత ప్రముఖ పోలీసు అధికారులుగా గుర్తింపు పొందారు. ఈ బ్యాచ్‌లో ప్రఫుల్లా భోసలే, విజయ్ సలాస్కర్, రవీంద్ర అంగ్రే, అస్లాం మోమిన్ వంటి వారు ఈ బ్యాచ్‌లోని పోలీసు అధికారులే. వీళ్లంతా ‘‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌లుగా’ పేరుగాంచారు.
ప్రదీప్ శర్మ కూడా ఈ బ్యాచ్‌కు చెందిన వ్యక్తే. నాసిక్ పోలీసు ట్రైనింగ్ స్కూల్‌లో శిక్షణ తర్వాత 1984లో ఈ బ్యాచ్ పోలీసు సర్వీసులో చేరింది.
ప్రదీప్ శర్మ తొలుత ముంబైలోని మహిమ్ పోలీసు స్టేషన్‌లో పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత, సబ్‌అర్బన్ ముంబై పోలీసు స్టేషన్ల చీఫ్, క్రైమ్ ఇంటెలిజెన్స్‌లో సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ వంటి పలు పదవులను చేపట్టారు.
విజయ్ సలాస్కర్‌తో ప్రదీప్ శర్మకు ఉన్న వివాదం అప్పట్లో మీడియాలో పెద్ద చర్చనీయాంశమైంది. విజయ్ సలాస్కర్ 26/11 ముంబై దాడుల్లో ఉగ్రవాదులతో పోరాడుతూ మృతి చెందారు.

ఫొటో సోర్స్, ANI
విజయ్ సలాస్కర్‌తో వివాదమేంటి?
విజయ్ సలాస్కర్‌తో ఉన్న వివాదం విషయంలో న్యూస్ చానల్ టీవీ9 మరాఠితో మాట్లాడిన ప్రదీప్ శర్మ, ‘‘విజయ్ సలాస్కర్ నా ప్రాణ స్నేహితుడు. 1983లో మేం ఒకే స్క్వాడ్‌లో పోలీసు శిక్షణ తీసుకున్నాం. ఇంటిపేరులో తొలి అక్షరంతో స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తారు. తన ఇంటి పేరు సలాస్కర్, నా ఇంటి పేరు శర్మ. అలా ఇద్దరం ఒకే స్క్వాడ్‌లో ఉన్నాం. ఏడాది పాటు కలిసే ఉన్నాం. ముంబై వచ్చిన తర్వాత కూడా ఎన్నో ఏళ్ల పాటు కలిసి ఉన్నాం. క్రైమ్ బ్రాంచులో కలిసి పనిచేశాం. కలిసి కొన్ని పెద్ద పెద్ద ఆపరేషన్లు చేపట్టాం’’ అని చెప్పారు.
‘‘విజయ్ సలాస్కర్‌లో కలిసి పనిచేసిన రోజులు ఇంకా గుర్తున్నాయి. అతిపెద్ద ఇన్‌ఫర్మేషన్ నెట్‌వర్క్‌కున్న అధికారిగా విజయ్ సలాస్కర్‌ను భావిస్తాను. నాకంటే పదింతలు ఎక్కువ నెట్‌వర్క్ సలాస్కర్‌కు ఉంది’’ అని శర్మ తెలిపారు.
‘‘నాకు, సలాస్కర్‌కు మధ్య విభేదాలున్నాయని మీడియాలో ప్రచారం జరిగింది. అలాంటిదేమీ లేదు. మా వివాదాలు కేవలం సమాచారానికి సంబంధించినవే. అంతకుమించి కావు’’ అని ఆయన చెప్పారు.
రామ్ నారాయణ్ గుప్తా అలియాస్ లఖన్ భయ్యా హత్య కేసులో ప్రదీప్ శర్మ 2009లో అరెస్ట్ అయ్యారు.
ఆయనతో పాటు మొత్తం 13 మంది పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు.
థానే సెంట్రల్ జైలులో నాలుగేళ్లు గడిపిన తర్వాత 2013లో ప్రదీప్ శర్మ విడుదలయ్యారు. ఈ కేసులోనే ప్రస్తుతం ప్రదీప్ శర్మకు జీవిత ఖైదుగా శిక్ష పడింది.

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/AFP VIA GETTY IMAGES
అంబానీ కేసు ఏమిటి?
పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇల్లు ఆంటిలియా బయట బాంబు పెట్టిన మున్షుఖ్ హిరెన్ హత్య కేసులో ప్రదీప్ శర్మ పేరు వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో కూడా ప్రదీప్ శర్మను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
2021 ఫిబ్రవరి 25న ఆంటిలియా ప్రాంతంలో పేలుడు పదార్థాలతో ఉన్న ఎస్‌యూవీని గుర్తించారు.
మార్చి 5న థానేకు సమీపంలో ఈ కారు యజమాని, పారిశ్రామిక వేత్త మున్షుఖ్ హిరెన్ మృతదేహాన్ని గుర్తించారు. మన్షుఖ్ హిరెన్ హత్యలో పోలీసు అధికారి సచిన్ వాజేకు సాయం చేసినట్లు శర్మపై ఆరోపణలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- మనిషి మెదడులోకి పురుగులు ఎలా వస్తాయి?
- ఫ్రామౌరో: మతం కాదు, సైన్స్ ఆధారంగా తొలి ప్రపంచ పటాన్ని చిత్రించిన సన్యాసి... గడప దాటకుండానే ఆయన ఈ అధ్భుతాన్ని ఎలా సాధించారు?
- 'కలుపు దెయ్యాల'ను 141 ఏళ్ల కిందట భూమిలో పాతిపెట్టినా చావలేదు... అవి ఇలాఎంతకాలం జీవిస్తాయి?
- జింకల్లో కొత్త జాతి గుర్తింపు.. ఇది ఎక్కడ ఉంది?
- సీఏఏ: పౌరసత్వ సవరణ చట్టం అమలుకు నిబంధనలను విడుదల చేసిన కేంద్రం, దీనివల్ల ఏం జరుగుతుంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














