బంగాళాఖాతంలో చేపలు దొరకడం కష్టమవుతోందా? ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏం జరుగుతోంది?

సముద్రంలో పైప్‌లైన్
ఫొటో క్యాప్షన్, పరిశ్రమల నుంచి నేరుగా సముద్రంలోపలికి పైప్‌లైన్ల నిర్మాణం జరుగుతోంది.
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

దేశంలోనే పొడవైన సముద్ర తీర ప్రాంతాన్ని కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి.

సుమారు 972 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం వెంబడి లక్షల మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు.

కానీ, ఇటీవలి కాలంలో మత్స్యకారుల్లో తీవ్ర అలజడి కనిపిస్తోంది. తరచూ ఆందోళనల బాట పడుతున్నారు.

ఓవైపు ఆయిల్ తవ్వకాలు, మరోవైపు ఫార్మా కంపెనీలు, ఇతర పారిశ్రామిక సంస్థల మూలంగా తమ మనుగడకే ముప్పు ఏర్పడుతోందంటూ రోడ్డెక్కుతున్నారు.

కాకినాడ నుంచి తుని వైపు వెళ్లే బీచ్ రోడ్డును 10 రోజులుగా దిగ్బంధించి, వాహనాల రాకపోకల్ని అడ్డుకుంటున్నారు మత్స్యకారులు.

అంతకుముందు కాకినాడలోనూ భారీ ప్రదర్శనలు జరిగాయి.

ఆందోళనలు ఉద్రిక్తంగానూ మారి, ఈ నెల 8వ తేదీన బోట్లను తగులబెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

మత్స్యకారుల ఆగ్రహానికి కారణమేంటి, సముద్రంలో వేట నిలిపివేసి, రోడ్డుపై బైఠాయించే పరిస్థితి రావడమేంటి అనే చర్చ మొదలైంది.

కాకినాడలో మత్స్యకారుల ఆందోళన
ఫొటో క్యాప్షన్, మార్చి 8న బోటు తగులబెట్టి నిరసనలు తెలిపిన మత్స్యకారులు

పెరుగుతున్న కాలుష్య తీవ్రత

ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి, ముఖ్యంగా విశాఖపట్నం-కాకినాడల మధ్య పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం పెరుగుతోంది.

కేఎస్ఈజెడ్‌తోపాటు పెట్రో కారిడార్ పేరుతో వివిధ ప్రాజెక్టులకు అనుమతినిస్తున్నారు. వాటిలో ముఖ్యంగా ఫార్మా కంపెనీలు ఎక్కువగా ప్రారంభిస్తున్నారు.

ఆయిల్ కంపెనీల కార్యకలాపాలు కూడా ఊపందుకున్నాయి. ఇటీవలే కేజీ బేసిన్ పరిధిలో చమురు తవ్వకాలను ఓఎన్జీసీ చేపట్టింది. ఆయిల్, గ్యాస్ తవ్వకాలతో పాటు నిక్షేపాల వేట కోసం ఆయిల్ కంపెనీలు నిత్యం సర్వేలు నిర్వహిస్తూ ఉంటాయి.

ఫార్మా కంపెనీల నుంచి వచ్చే కలుషిత జలాలు నేరుగా సముద్రంలో కలుస్తుండటం, మరోవైపు ఆయిల్ తవ్వకాల పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు విధిస్తున్న ఆంక్షలు మత్స్యకారులకు ఇబ్బందిగా మారాయి.

కాకినాడ తీరంలో గడిచిన రెండు దశాబ్దాల్లో వివిధ హేచరీలు, వాటి సంఖ్యకు మించి వంటనూనెల శుద్ధి కర్మాగారాలు ఎక్కువగా వెలిశాయి. వాటి నుంచి వచ్చే వ్యర్థాలను నేరుగా సముద్రంలో కలిపేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

కాకినాడ పోర్టు ఆధారిత పరిశ్రమలకు తోడు, కాకినాడ సెజ్ పరిధిలో కొత్త పరిశ్రమలు కూడా ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి.

కాకినాడ పరిధిలో క్రమంగా పెరుగుతోన్న కాలుష్యం

‘వలలు తెగిపోతున్నాయి’

వ్యర్థాలను సముద్ర జలాల్లోకి వదిలేందుకు సముద్ర అంతర్భాగంలో పైప్ లైన్లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ సెజ్ పరిధిలో అరబిందో సంస్థకు చెందిన లైపిజ్ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించే సన్నాహాల్లో ఉంది. ఇప్పటికే ట్రయల్ రన్ నడుస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సమీపంలోనే దివీస్ ఫార్మా కంపెనీ నిర్మాణం కూడా జరుగుతోంది.

ఈ పరిశ్రమల పైప్ లైన్ల నిర్మాణం జరిగింది.

సముద్రంలోపలికి సుమారు కిలోమీటరు మేర పైప్‌లైన్ వేసి అక్కడ వ్యర్థాలు వదులుతున్నారన్నది మత్స్యకారుల ఆరోపణ.

"పైప్‌లైన్‌తో చాలా చిక్కులు వస్తున్నాయి. తీరానికి సమీపంలో అయితే అందరికీ కాలుష్యం కనిపిస్తుందనే ఉద్దేశంతో సముద్రం లోపలికి కిలోమీటరుపైగా దూరం పైప్‌లైన్ వేసి, అక్కడ కలుషిత జలాలు వదిలేస్తున్నారు. దాని వల్ల మాకు వేట దొరకడం లేదు. ఎంత దూరం వెళ్లినా ఫలితం దక్కడం లేదు. సాయంత్రానికి వలలో ఏమయినా పడితేనే మాకు తిండి దొరికేది. లేదంటే పస్తులే. సముద్రంలో వేట తగ్గిపోతుండడంతో మేమంతా అవస్థల్లో పడ్డాం" అని బీబీసీతో చెప్పారు కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన ఉమ్మిడి అప్పారావు.

దానికితోడు పైప్‌లైన్‌ల భద్రత కోసం ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మెల వల్ల తమ వలలకు ముప్పు వాటిల్లుతోందని అప్పారావు అన్నారు. తమ వలలు చిక్కుకుపోయి, తెగిపోవడంతో ఎందుకూ పనికిరావడం లేదని అంటున్నారు.

మత్స్యకారులు

తొండంగి మండలంలోని ఏవీ నగరం సమీపంలో ప్రారంభానికి సిద్దమయిన అరబిందో అనుబంధం పరిశ్రమ కోసం చోడిపల్లిపేట సమీపంలో సముద్ర తీరాన పైప్ లైన్ ఏర్పాటు చేశారు.

ఈ పైప్‌లైన్ నిర్మాణం కోసం స్థానిక మత్స్యకారులకు కొంత నష్టపరిహారం అందించారు. ఒక్కో కుటుంబానికి రూ.1.2 లక్షల చొప్పున అందించినట్టు స్థానికులు బీబీసీకి తెలిపారు.

కేవలం పైప్‌లైన్ నిర్మించిన గ్రామానికి మాత్రమే పరిహారం చెల్లించారు గానీ, సమీపంలోని తమకు కూడా పరిహారం ఇవ్వాల్సిందేనంటూ కోనపాపపేట వాసులు కోరుతున్నారు.

కాకినాడ మత్స్యకారుల డిమాండ్‌లు

"మేము వల వేస్తే ఒడి కారణంగా ఎటు వైపైనా వెళ్లిపోతుంది. నాలుగైదు కిలోమీటర్ల దూరంలో సముద్రం అటూ ఇటూ కదులుతుంది. అలాంటప్పుడు మా వలలు సముద్రంలో పైప్‌లైన్ కోసం వేసిన సిమెంట్ దిమ్మెలకు తగిలి తెగిపోతున్నాయి.

లక్షల ఖరీదైన వలలు కూడా ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. బోట్లు కూడా దెబ్బతింటున్నాయి. మాకు కూడా పరిహారం ఇవ్వాలి. కేవలం ఒక్క గ్రామానికి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు" అని కారే రమణ అనే మత్స్యకారుడు తెలిపారు.

ఉపాధి కోల్పోయి, వలలు నష్టపోయి, బోట్లు దెబ్బతింటున్న తాము, పది రోజులుగా వేటకు కూడా వెళ్లకుండా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం స్పందించడం లేదని రమణ ఆవేదన వ్యక్తంచేశారు.

మత్స్యకారుల నిరసనలు
ఫొటో క్యాప్షన్, పరిహారం కోరుతూ మత్స్యకారులు నిరసనలు చేపట్టారు.

ఓఎన్జీసీ నుంచి నష్టపరిహారం కోరుతూ..

అరబిందో పరిశ్రమ కారణంగా నష్టపోతున్నామని కొందరు నిరసనలు చేస్తుండగా, ఓఎన్జీసీ చేపట్టిన సైస్మిక్ సర్వే కారణంగా నష్టపోతున్న మత్స్యకారులను ఆదుకోవాలంటూ మరోవైపు ఉద్యమం సాగుతోంది. ఇందుకు పాలక వైఎస్సార్సీపీ నేతలు కూడా మద్దతుగా నిలిచారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి నేతలు మత్స్యకారుల ప్రదర్శనలో పాల్గొన్నారు.

ఓఎన్జీసీ కార్యకలాపాల కారణంగా మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటోందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. నష్టపరిహారం హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దాంతో అరబిందో ప్రభావిత ప్రాంతాల్లో మత్స్యకారులతో కాకినాడ ఆర్డీవో నాయకత్వంలో అధికారులు చర్చలు జరుపుతున్నారు.

ఉప్పాడ తీరం
ఫొటో క్యాప్షన్, కొత్తగా నిర్మితమయ్యే ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలను వదిలేందుకే సముద్రంలోపలికి కిలోమీటర్ మేర పైప్‌లైన్లు ఏర్పాటు చేస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆధ్వర్యంలో ఓఎన్జీసీ ప్రభావిత మత్స్యకారుల సమస్యలపై సంప్రదింపులు జరిపారు.

"ఉప్పాడ నుంచి ఉప్పలంక వరకూ ఐదు మండలాల మత్స్యకారులు నష్టపోతున్నారు. ఓఎన్జీసీ జాయింట్ డైరెక్టర్ దిగివచ్చారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన చర్చల ప్రకారం నెల రోజుల్లో సర్వే చేస్తామన్నారు. నష్టాన్ని అంచనా వేసి, పరిహారం చెల్లించేందుకు అధికారులు అంగీకరించారు” అని మత్స్యకార నాయకుడు బందన వెంకటేశ్వర రావు చెప్పారు.

“ఓఎన్జీసీ వల్ల నష్టపోయే ప్రతి గ్రామానికి అభివృద్ధిలో సహాయంతోపాటు పరిహారం చెల్లించేందుకు ముందుకొచ్చారు. మత్స్యకార గ్రామాలకు దీనివల్ల మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం" అని అన్నారు.

మత్స్యకార గ్రామాల్లో విద్య, వైద్య సదుపాయాల అభివృద్ధి, ఉపాధి కల్పనపై ఓఎన్జీసీ అధికారులు హామీ ఇవ్వడం వల్ల తమ ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆయన బీబీసీకి తెలిపారు.

చేపల వేటకు వెళ్లేవారు

గతంలోనూ ఆందోళనలు

బంగాళాఖాతాన్ని ఆనుకుని మత్స్య సంపద మీద ఆధారపడి జీవనం సాగించే వారి ఉపాధికి ఆటంకం కల్పిస్తున్నారంటూ గతంలో కూడా పలు పోరాటాలు జరిగాయి.

గతంలో జీఎస్పీసీ వంటి సంస్థల కార్యకలాపాలను అడ్డుకోవడానికి సముద్రంలో బోట్ల ర్యాలీ నిర్వహించి, రిగ్‌‌ను ముట్టడించే ప్రయత్నాలు కూడా చేశారు.

ప్రస్తుతం ఓఎన్జీసీ కార్యకలాపాలను అడ్డుకునే ఆందోళనల్ని తాత్కాలికంగా విరమించినప్పటికీ, అరబిందో ప్రభావిత గ్రామాల్లో మాత్రం ఆందోళనలు కొనసాగుతున్నాయి.

వారితో కూడా చర్చలు జరుపుతున్నామని, అన్నీ కొలిక్కి వస్తాయని ఆశిస్తున్నట్టు కాకినాడ జిల్లా మత్స్యశాఖ అధికారులు బీబీసీకి తెలిపారు.

మరోవైపు అరబిందో కారణంగా నష్టపోతున్న మత్స్యకారుల ఆందోళన విషయమై ఆ సంస్థ ప్రతినిధులను బీబీసీ సంప్రదించింది. అధికారికంగా స్పందించేందుకు వారు నిరాకరించారు.

తాము కేవలం సముద్రపు నీటిని శుద్ధి చేసి, తమ పరిశ్రమ అవసరాల కోసం వినియోగిస్తున్నామని, దానికోసమే పైప్‌లైన్ ఏర్పాటు చేసినట్టు అరబిందో పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

సముద్రపు నీటి కోసమే పైప్‌లైన్ అయితే సముద్రంలో కిలోమీటరు పైగా దూరంగా వేయాల్సిన అవసరం లేదంటూ మత్స్యకార సంఘాల ప్రతినిధులు అంటున్నారు.

కాకినాడ మత్స్యకారులు
ఫొటో క్యాప్షన్, క్రమంగా తమ వేటపై ప్రభావం పడి, ఉపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు చెప్తున్నారు.

మత్స్యకారులు ఏం కోరుతున్నారు?

ఓఎన్జీసీ అధికారులు సర్వే నిర్వహించి, వివిధ మండలాల మత్స్యకారులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా, అరబిందో సంస్థ నుంచి కూడా తమకు పరిహారం చెల్లించాలని మత్స్యకార సంఘాలు కోరుతున్నాయి.

ఉపాధి కోల్పోతున్న తమకు ప్రతి రేషన్ కార్డుకు నెలకు రూ. 20 వేలకు తగ్గకుండా ప్రయోజనాలు అందించాలని కోనపాపపేట వాసులు కోరుతున్నారు.

సముద్రంలో కాలుష్యాన్ని అరికట్టే చర్యలు అమలుకాకపోవడంతోనే మత్స్యకారుల ఉపాధి సమస్య ఏర్పడుతోందని పర్యావరణవేత్త తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి చెప్పారు.

"సముద్ర కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. కాకినాడ తీరంలో సముద్రపు కోత వంటి ముప్పు కొనసాగుతుంటే, కాలుష్యం కారణంగా ఈ సమస్య మరింత పెరుగుతోంది. దానిని అదుపు చేసేందుకు అవసరమైన చర్యలు కనిపించడం లేదు. ఇది పెనుముప్పుకు దారితీసే ప్రమాదం ఉంది. తక్షణమే చర్యలు తీసుకోవాలి” అన్నారు.

సముద్రం మీద ఆధారపడిన వారి ఉపాధి పరిరక్షణ, సముద్ర పర్యావరణం కాపాడడం వంటివి అత్యవసరమని చెప్పారు. “పెరుగుతున్న పారిశ్రామికాభివృద్ధి మూలంగా సంప్రదాయ మత్స్యసంపదకు ముప్పు వాటిల్లుతున్న తరుణంలో, పర్యావరణం కోసం తగిన చర్యలు తీసుకోకపోతే అందరికీ అవస్థలు తప్పవు” అన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)