ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఈ ఎంపీ సీట్లలో ఆ కుటుంబాలదే హవా

కోట్ల విజయభాస్కర్ రెడ్డి

ఫొటో సోర్స్, Kotla Jayasurya Prakash Reddy/FB

ఫొటో క్యాప్షన్, కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆరుసార్లు ఎంపీగా గెలిచారు
    • రచయిత, జక్కుల బాలయ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కుటుంబాల హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది అసెంబ్లీ అయినా, పార్లమెంట్ అయినా, దాదాపు మూడు, నాలుగు దశాబ్దాలకు పైగా కొన్ని కుటుంబాలు పాతుకుపోయాయి.

తండ్రి, ఆ తర్వాత కుమారుడు, లేదంటే అదే కుటుంబానికి చెందిన వ్యక్తిని నిలబెడుతూ దశాబ్దాలుగా ఆయా నియోజకవర్గాల్లో తమ హవా కొనసాగిస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన, కొత్త పార్టీల ఆవిర్భావంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, సమీకరణలు మారిపోయినా తమ నియోజకవర్గాలపై పట్టు నిలుపుకునేందుకు, గత ‘ఘనకీర్తి’ని కొనసాగించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు వారసులు.

ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ నుంచి మొదలుపెడితే, ఏపీలోని చిట్టచివరి జిల్లా సిక్కోలు వరకూ ఈ జాబితా కాస్త పెద్దదే.

అయితే, 2009లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, ఉమ్మడి రాష్ట్ర విభజనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది.

అప్పటి వరకూ తమ తమ నియోజకవర్గాలపై బలంగా పట్టున్న నేతలు కొందరు తమ నియోజకవర్గాలను మార్చుకోవాల్సి వచ్చింది. అయినా కొత్త నియోజకవర్గాల్లోనూ కొందరు సత్తాచాటగా, మరికొందరు రాజకీయ సమీకరణలు, ఎత్తుగడల్లో వెనకబడిపోయారు. ఇంకొందరు తెరమరుగైపోయారు.

ఎన్నికల పోరులో నెగ్గితే ఐదేళ్లు, అదే ఓడిపోతే అసలు కంటికి కనిపించకుండా నేతలు కనుమరుగైపోతున్న ఈ రోజుల్లోనూ, గెలుపోటములతో సంబంధం లేకుండా నియోజకవర్గంపై పట్టు నిలుపుకుంటున్నారు కొందరు.

అలాంటి కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి

ఫొటో సోర్స్, Kotla Jayasurya Prakash Reddy/FB

ఫొటో క్యాప్షన్, కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి

1977 నుంచి కర్నూలు ఎంపీ రేసులో కోట్ల కుటుంబం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబం 1977 నుంచి కర్నూలు పార్లమెంట్ సీటుపై పట్టు నిలుపుకుంటూ వచ్చింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆరుసార్లు కర్నూలు ఎంపీగా ఎన్నికయ్యారు.

1977, 1980, 1989,1991, 1996, 1998 లోక్ సభ ఎన్నికల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గెలుపొందారు. 1984లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏరాసు అయ్యపు రెడ్డి చేతిలో తొలిసారి ఓటమి చవిచూశారు.

కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1982 సెప్టెంబర్ నుంచి 1983 జనవరి వరకూ, ఆ తర్వాత 1992 నుంచి 1994 మధ్య ఆయన ఏపీ సీఎంగా వ్యవహరించారు.

1992‌ అక్టోబర్‌లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం పదవి చేపట్టిన తర్వాత అసెంబ్లీకి పోటీ చేయాల్సి వచ్చింది. 1993లో జరిగిన ఉప ఎన్నికలో పాణ్యం నుంచి ఆయన పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రేణుకా చౌదరిపై గెలుపొందారు.

ఆ తర్వాత కర్నూలు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 1994లో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు.

1999 పార్లమెంట్ ఎన్నికల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి కేఈ కృష్ణమూర్తి గెలుపొందారు. ఆ తర్వాత రెండేళ్లకు 2001లో విజయభాస్కర్ రెడ్డి మరణించారు.

తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కొడుకు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి 2004, 2009 ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా విజయం సాధించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో రైల్వే శాఖ సహాయమంత్రిగా పనిచేశారు.

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం రాజకీయ సమీకరణలు మారిపోయాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఉనికి కోల్పోయే పరిస్థితి తలెత్తింది.

2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ మూడో స్థానానికే పరిమితమయ్యారు.

ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక విజయం సాధించగా, టీడీపీ అభ్యర్థి బీటీ నాయుడు రెండో స్థానంలో నిలిచారు.

తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 ఎన్నికలకు ముందు కోట్ల కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి, డాక్టర్ సంజయ్ చేతిలో పరాజయం పాలయ్యారు.

1977 నుంచి ఇప్పటి వరకూ కోట్ల కుటుంబం కర్నూలు ఎంపీ బరిలో నిలుస్తూనే వచ్చింది.

వైఎస్ జగన్

ఫొటో సోర్స్, YS Avinash Reddy/FB

ఫొటో క్యాప్షన్, వైఎస్ జగన్

కడపలో వైఎస్ ఫ్యామిలీ

దాదాపు మూడు దశాబ్దాలకు పైగా కడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం సత్తా చాటుతోంది. ఎన్నికల వేళ అభ్యర్థులు మారినప్పటికీ వైఎస్ కుటుంబానికి చెందిన వారే విజయం సాధిస్తూ వస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేసిన వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, 2009లో అధికారంలోకి వచ్చిన కొద్దినెలలకే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు.

1978లో పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. 1989లో కడప పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎంపీ అయ్యారు.

ఆ ఎన్నికలో మొత్తం పోలైన ఓట్లలో దాదాపు 60 శాతం ఓట్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పోలయ్యాయి.

1991లో పదో పార్లమెంట్‌‌కు జరిగిన ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి భారీ మెజార్టీతో టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొత్తం పోలైన ఓట్లలో 75.29 శాతం ఓట్లు సాధించారు.

అనంతరం 1996లో వైఎస్ మూడోసారి ఎంపీగా గెలిచారు. ఈ ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి కందుల రాజమోహన్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. కేవలం 5,445 ఓట్ల తేడాతో వైఎస్ విజయం సాధించారు.

1998లో వరుసగా నాలుగోసారి కడప ఎంపీగా గెలిచారు వైఎస్. టీడీపీ అభ్యర్థి కందుల రాజమోహన్ రెడ్డిపై యాభై వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఆ తర్వాత జరిగిన 1999 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అదే ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన సోదరుడు వివేకానంద రెడ్డి కడప ఎంపీగా గెలిచారు. 2004లో మాజీ మంత్రి ఎంవీ మైసూరా రెడ్డిపై వివేకానంద రెడ్డి విజయం సాధించారు.

2009లో వైఎస్ తనయుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తొలిసారి కడప ఎంపీగా ఎన్నికయ్యారు. తన తండ్రి హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయిన తర్వాతి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు కడప ఎంపీగా ఎన్నికయ్యారు.

తర్వాత జరిగిన 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ మరో సోదరుడు వైఎస్ భాస్కర్ రెడ్డి కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డి వైసీసీ అభ్యర్థిగా పోటీ చేసి కడప ఎంపీగా గెలుపొందారు.

1989లో వైఎస్‌ దగ్గరి నుంచి ఇప్పటి వరకూ దాదాపు మూడున్నర దశాబ్దాలుగా కడప పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ కుటుంబీకులే ఎంపీగా గెలుపొందుతూ వస్తున్నారు.

అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్‌లో తిరుగులేని ఎంఐఎం

తెలంగాణలో నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్ పార్లమెంట్‌ స్థానంలో ఏఐఎంఐఎం పార్టీ సత్తా చాటుతోంది. 1984లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి నాలుగు దశాబ్దాలుగా ఒవైసీ కుటుంబం ఎదురులేని విజయాలు సాధిస్తూ వస్తోంది.

1984, 1989, 1991, 1996, 1998, 1999 పార్లమెంట్ ఎన్నికల్లో సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ వరుస విజయాలు నమోదు చేశారు. ఆలిండియా మజ్లిస్ - ఇ - ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) అధ్యక్షుడిగా సలావుద్దీన్ ఒవైసీ సుదీర్ఘ కాలం కొనసాగారు. 1989 నుంచి 99 వరకూ ఏఐఎంఐఎం తరఫున హైదరాబాద్ ఎంపీగా గెలుస్తూ వచ్చారు.

2004లో ఆయన కొడుకు అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అంతకుముందు ఆయన చార్మినార్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన 2009, 2014, 2019 ఎన్నికల్లోనూ అసదుద్దీన్ ఒవైసీ ఎదురులేని విజయాలు సాధించారు.

ఆయన ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు.

మాగుంట సుబ్బరామి రెడ్డి

ఫొటో సోర్స్, Magunta Sreenivasulu Reddy/FB

ఫొటో క్యాప్షన్, మాగుంట సుబ్బరామి రెడ్డి

ఒంగోలులో మాగుంట

1990లలో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా రాజకీయ ప్రవేశం చేసిన మాగుంట కుటుంబం దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఆ స్థానంపై పట్టు నిలుపుకుంటూ వస్తోంది.

ఏపీలో బడా వ్యాపారవేత్తగా పేరొందిన మాగుంట సుబ్బరామి రెడ్డి 1991లో తొలిసారి ఒంగోలు పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచారు. ఎంపీగా ఉన్న సమయంలోనే 1995లో నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో సుబ్బరామి రెడ్డి చనిపోయారు.

ఆ తర్వాత ఏడాది 1996లో జరిగిన ఎన్నికల్లో మాగుంట సుబ్బరామి రెడ్డి భార్య పార్వతమ్మ టీడీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డిపై పోటీ చేసి ఒంగోలు ఎంపీగా గెలిచారు. దాదాపు 50 వేల ఓట్లకుపైగా మెజార్టీతో రాజమోహన్ రెడ్డిపై పార్వతమ్మ విజయం సాధించారు.

రెండేళ్లకే అప్పటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కూలిపోవడంతో 1998లో వచ్చిన 12వ లోక్ సభ ఎన్నికల్లో మాగుంట సుబ్బరామి రెడ్డి సోదరుడు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎంపీగా గెలిచారు. మేకపాటి రాజమోహన్ రెడ్డిపై ఆయన గెలుపొందారు.

1999 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి పోటీ చేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి చేతిలో ఓటమి పాలయ్యారు. సుమారు 22 వేల ఓట్ల తేడాతో 1999 ఎన్నికల్లో శ్రీనివాసులు రెడ్డి ఓడిపోయారు.

2004, 2009 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ అభ్యర్థి, ఏపీ సీఎం జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. అనంతరం 2019కి ముందు వైసీపీలో చేరి ఒంగోలు ఎంపీగా నాలుగోసారి గెలిచారు.

గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా 1991 నుంచి నేటి వరకూ ఒంగోలు పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తూనే వస్తోంది మాగుంట కుటుంబం.

కింజరాపు రామ్మోహన్ నాయుడు

ఫొటో సోర్స్, Ram Mohan Naidu Kinjarapu/FB

ఫొటో క్యాప్షన్, కింజరాపు రామ్మోహన్ నాయుడు

సిక్కోలు నుంచి కింజరాపు కుటుంబం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సన్నిహితుడిగా పేరుపొందిన దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడి కుటుంబం శ్రీకాకుళం పార్లమెంట్ సీటుపై పట్టు కొనసాగిస్తోంది.

1982లో ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీతో కింజరాపు ఎర్రన్నాయుడు రాజకీయ అరంగేట్రం చేశారు.

1983లో పాతికేళ్ల వయసులో ఎర్రన్నాయుడు తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1985లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో టిక్కెట్ రాకపోయినా ఇండిపెండెంట్‌‌గా విజయం సాధించారు. 1994 టీడీపీ ఆగస్టు సంక్షోభం సమయంలో చంద్రబాబుకు వెంట ఉన్నారు.

1996లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి పోటీ చేసి గెలిచి, కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు.

అప్పటి యునైటెడ్ ఫ్రంట్ ఫ్రభుత్వ హయాంలో మాజీ ప్రధానులు హెచ్‌డీ దేవెగౌడ, ఏకే గుజ్రాల్ క్యాబినెట్‌లలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.

1996, 1998, 1999, 2004 వరకూ వరుసగా నాలుగుసార్లు శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2009లో కిల్లి కృపారాణి చేతిలో పరాజయం పాలయ్యారు.

2012లో కారు ప్రమాదంలో ఎర్రన్నాయుడు మరణానంతరం ఆయన కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా కొనసాగుతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన రెండుసార్లు ఎంపీగా గెలిచారు.

1996 నుంచి ఏడుసార్లు శ్రీకాకుళం పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన కింజరాపు కుటుంబం ఆరుసార్లు విజయం సాధించింది.

రాయపాటి సాంబశివరావు

ఫొటో సోర్స్, Rayapati Sambasiva Rao/FB

ఫొటో క్యాప్షన్, రాయపాటి సాంబశివరావు

గుంటూరులో రాయపాటి

సీనియర్ పార్లమెంటేరియన్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఆచార్య ఎన్జీ రంగా ప్రాతినిధ్యం వహించిన గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి, 1996లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు రాయపాటి సాంబశివరావు.

1991 ఎన్నికల్లో ఎన్జీ రంగాను ఓడించిన టీడీపీ అభ్యర్థి ఎస్‌ఎం లాల్‌జాన్‌బాషాపై 1996 ఎన్నికల్లో దాదాపు 68 వేల పైచిలుకు ఓట్లతో రాయపాటి గెలుపొందారు. అనంతరం 1998లో జరిగిన ఎన్నికల్లోనూ లాల్‌జాన్‌బాషాపై మరోసారి గెలిచారు.

1999 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి యంపరాల వెంకటేశ్వరరావు చేతిలో ఓటమి చవిచూశారు.

అనంతరం వచ్చిన 2004, 2009 ఎన్నికల్లో మరో రెండుసార్లు గుంటూరు ఎంపీగా రాయపాటి సాంబశివరావు విజయం సాధించారు. రాష్ట్ర విభజనానంతరం తెలుగుదేశం పార్టీలో చేరిన రాయపాటి, 2014 ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంట్ నియోజవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు.

2014లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల అయోధ్య రామిరెడ్డిపై రాయపాటి సాంబశివరావు గెలుపొందారు. 2019లోనూ నరసరావుపేట నుంచే మరోసారి బరిలోకి దిగిన రాయపాటి వైసీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు చేతిలో ఓడిపోయారు.

ఏడుసార్లు పార్లమెంట్ బరిలో నిలిచిన రాయపాటి ఐదుసార్లు విజయం సాధించారు.

జి.వివేక్

ఫొటో సోర్స్, Facebook

ఫొటో క్యాప్షన్, జి.వివేక్

పెద్దపల్లి నుంచి 'కాకా'

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, కాకాగా పేరొందిన గడ్డం వెంకట స్వామి తొలిసారి 1967 ఎన్నికల్లో సిద్దిపేట ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 1971, 1977 ఎన్నికల్లోనూ సిద్దిపేట ఎంపీగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. వివిధ శాఖలకు కేంద్ర సహాయ మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు.

1989లో ఆయన పెద్దపల్లి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గానికి మారారు. ఆ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచారు.

కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన 1991, 1996 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నారు.

అనంతరం రెండేళ్ల వ్యవధిలోనే జరిగిన 1998, 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. తిరిగి 2004లో మరోసారి పెద్దపల్లి ఎంపీగా గెలిచారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా ఏడుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికైన ఒకే ఒక్కడిగా వెంకటస్వామి నిలిచారు.

2009లో ఆయన కొడుకు గడ్డం వివేకానంద(జి.వివేక్) రాజకీయ అరంగేట్రం చేశారు. పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలుపొందారు.

2014లో రాష్ట్ర విభజనానంతరం జరిగిన ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో వివేకానంద ఓడిపోయారు.

ప్రస్తుతం ఆయన చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

సాయి ప్రతాప్

ఫొటో సోర్స్, Facebook/ Sreenivas Dheeraj Thota

ఫొటో క్యాప్షన్, సాయి ప్రతాప్

రాజంపేట

దివంగత ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడైన అన్నయ్యగారి సాయిప్రతాప్ రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి దాదాపు మూడు దశాబ్దాల పాటు క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగారు

1984 పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి సుగవాసి పాలకొండ్రాయుడి చేతిలో ఓడిపోయారు.

అనంతరం 1989లో తొలిసారి రాజంపేట ఎంపీగా విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 1991, 1996, 1998 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గునిపాటి రామయ్యపై పరాజయం పాలయ్యారు.

ఆ తర్వాత జరిగిన 2004, 2009 ఎన్నికల్లో రాజంపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొంది, మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు.

రాష్ట్ర విభజనానంతరం 2014లో అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినప్పటికీ డిపాజిట్ దక్కలేదు. అనంతరం ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు.

చింతా మోహన్

ఫొటో సోర్స్, Dr Chinta Mohan/FB

ఫొటో క్యాప్షన్, చింతా మోహన్

చింతా మోహన్

ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం ఎంపీగా కొనసాగారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. తిరుపతి ఎస్పీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ అభ్యర్థిగా 1984లో తొలిసారి ఎంపీగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

1989, 1991, 1998, 2004, 2009 ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా విజయాలు సాధించారు. చింతా మోహన్ కేంద్ర మంత్రిగానూ పనిచేశారు.

అనంత వెంకట్రామి రెడ్డి

ఫొటో సోర్స్, Anantha venkatarami reddy/FB

ఫొటో క్యాప్షన్, అనంత వెంకట్రామి రెడ్డి

అనంతపురం..

అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు అనంత వెంకట రెడ్డి 1989లో అనంతపురం పార్లమెంట్ నియోజవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. రెండేళ్లకే వచ్చిన 1991 లోక్ సభ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు.

ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన అనంత వెంకట్రామి రెడ్డి అనంతపురం నుంచి నాలుగు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు.

1996 నుంచి 2014 వరకూ ఆరుసార్లు పోటీ చేసిన అనంత వెంకట్రామి రెడ్డి 1996, 1998, 2004, 2009లో ఎంపీగా గెలిచారు.

వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్

ఫొటో సోర్స్, MINISTRY OF PANCHAYATI RAJ

ఫొటో క్యాప్షన్, వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్

పార్వతీపురంలో కురుపాం జమీందార్

ఏపీలోని సీనియర్ పార్లమెంటేరియన్లలో కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఒకరు. ఆయన 1977‌లో తొలిసారి విజయనగరం జిల్లా పార్వతీపురం ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. అనంతరం జరిగిన 1980, 1984 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నారు.

1989, 91 పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసిన శత్రుచర్ల విజయరామరాజు చేతిలో పార్వతీపురం ఎంపీగా ఓటమి పాలయ్యారు.

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగానూ కొనసాగారు.

1999 ఎన్నికల్లో పార్వతీపురం నుంచి బరిలోకి దిగిన ఈ కురుపాం జమీందార్‌ మరోసారి ఓటమి తప్పలేదు. అనంతరం జరిగిన 2004 పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగోసారి ఎంపీగా విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం అరకు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో కేంద్ర మంత్రిగా కొనసాగారు. అటవీ హక్కుల చట్టం రూపకల్పనలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. ఒకానొక సమయంలో రాష్ట్రపతి పదవి వరించనున్నట్లు ప్రచారం కూడా సాగింది.

2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి అరకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

బండారు దత్తాత్రేయ

ఫొటో సోర్స్, Facebook/Bandaru Dattatreya

ఫొటో క్యాప్షన్, బండారు దత్తాత్రేయ

సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ

తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ కీలక నేతగా ఎదిగిన బండారు దత్తాత్రేయ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటారు. సికింద్రాబాద్ నుంచి 1984లో మొదటిసారి ఎంపీగా పోటీ చేసిన దత్తాత్రేయ మాజీ ముఖ్యమంత్రి టి. అంజయ్య చేతిలో 8 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అనంతరం 1991లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ హవాను తట్టుకుని, మాజీ ముఖ్యమంత్రి అంజయ్య భార్య మణెమ్మపై గెలుపొందారు. 1996లో జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమారుడు పీవీ రాజేశ్వర్ రావు చేతిలో ఓటమిపాలయ్యారు.

ఆ తర్వాత వచ్చిన 1998, 99 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి మరో రెండుసార్లు ఎంపీగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్ హవా కొనసాగిన 2004, 2009లో పరాజయం పాలయ్యారు. తిరిగి 2014లో మళ్లీ ఎంపీగా నెగ్గిన దత్తాత్రేయ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కొనసాగారు.

2019 సెప్టెంబర్‌లో దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన హరియాణా గవర్నర్‌గా కొనసాగుతున్నారు.

ఇవి కూడా చదవండి: