ఎలక్టోరల్ బాండ్స్: ఐటీ దాడులు, కొత్త కాంట్రాక్టులు, రాజకీయ పార్టీలకు విరాళాలు

ప్రధాని మోదీతో సీఎం రమేశ్

ఫొటో సోర్స్, FACEBOOK/CMRAMESH

ఫొటో క్యాప్షన్, సీఎం రమేశ్ 2019 జూన్‌లో బీజేపీలో చేరారు.
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కంపెనీ ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. అయితే మేఘాతో పాటూ, అనేక ఆంధ్ర-తెలంగాణ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చాయి.

అదే సమయంలో చాలా సంస్థలపై ఇన్‌కమ్ ట్యాక్స్, ఈడీ సోదాలు జరగడం, కేసులు పెట్టడం వంటివీ జరిగాయి. విరాళాలు ఇచ్చిన కొన్ని సంస్థలు కేంద్రం నుంచో ఆయా రాష్ట్రాల నుంచో కాంట్రాక్టులు పొందడం కనిపిస్తుంది.

తేదీల వారీగా చూసినప్పుడు చాలా సందర్భాల్లో సోదాల తేదీలు, విరాళాలు ఇచ్చిన తేదీలు దగ్గరగా ఉండటం కనిపిస్తుంది. అయితే, ఆయా సంస్థలు ఇచ్చిన విరాళాలు ఏయే పార్టీలకు చేరాయన్న విషయం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తి వివరాలు ఇచ్చాకే తెలుస్తుంది.

బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థ సారథి రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి...ఇలా చాలామంది పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

సీఎం రమేశ్:

రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బీజేపీ నేత సీఎం రమేశ్‌కి చెందినది.

ఆ కంపెనీకి 2023 జనవరి 14న హిమాచల్ ప్రదేశ్‌లోని సున్నీలో 382 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కింది. అది 1098 కోట్ల రూపాయల ప్రాజెక్ట్.

ఎస్వీజేఎన్ లిమిటెడ్ అనే ప్రభుత్వ సంస్థ నుంచి ఈ కాంట్రాక్ట్ పొందింది రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ. ఎస్వీజేఎన్ అంటే సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్, భారత ప్రభుత్వం, హిమాచల్ ప్రభుత్వాల ఉమ్మడి విద్యుత్ తయారీ సంస్థ ఇది.

2023 జనవరి 27న ఆ సంస్థ 5 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళం ఇచ్చింది. అదే ఏడాది ఏప్రిల్ 11వ తేదీన, అంటే కర్ణాటక ఎన్నికలకు ముందు ఆ సంస్థ 40 కోట్ల రూపాయల విలువైన బాండ్స్ కొన్నది.

ఎలక్టోరల్ బాండ్స్
ఫొటో క్యాప్షన్, సన్నీ డ్యామ్ హైడ్రో ప్రాజెక్ట్ వివరాలు

ఆ కంపెనీకి 2021 డిసెంబరులో ఎన్టీపీసీ నుంచి ఒకటి, ఎన్ఎండీసీ నుంచి ఒకటి కలిపి మొత్తం రెండు బొగ్గు గనులు, ఝార్ఖండ్ రాష్ట్రంలోనివి కాం‌ట్రాక్టు దక్కాయి.

ఇక 2023 సెప్టెంబరులో ముంబై మెట్రోరైల్ ప్రాజెక్టులో భాగంగా కశేలి మెట్రో డిపో కాంట్రాక్టు దక్కింది. అలాగే అదే నెలలో కళ్యాణ్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు కూడా దక్కింది. ముంబైలో ఖర్గర్ టన్నెల్ కాంట్రాక్టు అక్టోబరులో వచ్చింది.

చింతకుంట మునుస్వామి రాజేశ్ (సీఎం రాజేశ్ – సీఎం రమేశ్ సోదరుడు) ఈ కంపెనీ డైరెక్టర్. రిత్విక్ రమేశ్ అంటే సీఎం రమేశ్ కుమారుడు ఈ సంస్థ ఆపరేషన్స్ విభాగం ప్రెసిడెంట్. ఇది సీఎం రమేశ్ స్థాపించిన కంపెనీ, ప్రస్తుతం అధికారిక వివరాల ప్రకారం ఆయన ఆ కంపెనీలో లేరు.

2014లో టీడీపీ నుంచి రాజ్యసభ ఎంపీ అయ్యారు. అయితే, 2018 అక్టోబరులో కడపలో ఉన్న ఆయన ఇంట్లో, హైదరాబాద్ ఆఫీసుల్లో ఐటీ, ఈడీ సోదాలు జరిగాయి. ఆ తరువాత 2019 జూన్ లో ఆయన బీజేపీలో చేరారు.

ఎలక్టోరల్ బాండ్స్

ఫొటో సోర్స్, Getty Images

బండి పార్థసారథి రెడ్డి:

హెటిరో గ్రూపు మొత్తం రూ. 60 కోట్ల విలువైన బాండ్లు కొన్నది. 2021 అక్టోబరులో హెటిరో సంస్థపై ఐటీ సోదాలు జరిగాయి. పన్ను కట్టని, లెక్కల్లో లేని 550 కోట్ల రూపాయలను ఐటీ అధికారులు గుర్తించగా, అందులో కేవలం నగదు రూపంలోనే రూ.142 కోట్లు గుర్తించారు.

అప్పట్లో ఆ డబ్బు కట్టల వీడియోలు సంచలనం సృష్టించాయి. ఆ తరువాత 2022లో హెటిరో సంస్థ వాళ్లు ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారు. అంటే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చారు. ఆ బాండ్స్ విలువ వివరాలిలా ఉన్నాయి..

  • 2022 ఏప్రిల్ హెటిరో ల్యాబ్స్, హెటిరో డ్రగ్స్ కలిపి రూ. 40 కోట్లు
  • 2023 జూలై హెటిరో డ్రగ్స్ రూ. 10 కోట్లు
  • 2023 అక్టోబర్ హెటిరో బయో ఫార్మా రూ. 5 కోట్లు
  • 2023 అక్టోబర్ హెటిరో ల్యాబ్స్ రూ. 5 కోట్లు

బండి పార్థసారథి రెడ్డి పార్లమెంటులోనే ధనవంతమైన ఎంపీగా పేరుంది. ఈయన బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

2012 నాటి వై.ఎస్. జగన్ క్విడ్ ప్రో ఆరోపణల కేసులో పార్థసారథి రెడ్డి కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు.

కోవిడ్ సమయంలో అత్యంత పేరు పొంది, విపరీతంగా బ్లాక్ మార్కెట్లో అమ్ముడైన రెమ్‌డెసీవీర్ అనే ఇంజెక్షన్ ఈ సంస్థే తయారు చేసింది.

ఎలక్టోరల్ బాండ్స్

ఫొటో సోర్స్, Getty Images

షిరిడి సాయి ఎలక్ట్రికల్స్:

కడప కేంద్రంగా పనిచేసే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్‌పై 2023 డిసెంబరులో ఐటీ సోదాలు జరిగాయి. సరిగ్గా నెల తరువాత 2024 జనవరి 11న ఒకేసారి రూ. 40 కోట్లు విలువజేసే బాండ్లు కొన్నది ఈ కంపెనీ.

వీరికి కడపలో ఒకటి, ఉత్తర‌ప్రదేశ్‌లో మరొక ప్లాంటు ఉన్నాయి. వీటిలో ట్రాన్‌ఫార్మర్లు తయారు చేస్తారు. మామిడిపూడి విక్రమ్ రెడ్డి, నర్రెడ్డి విశ్వేశ్వర రెడ్డి, లోమడ మురళీ మోహన్ రెడ్డి, కొల్లా శరత్ చంద్ర, నర్రెడ్డి వంశీ రెడ్డి, వెన్నం సుధీర్, కనకధార శ్రీనివాసన్ అనే వ్యక్తులు ఈ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారు. ఎన్. విశ్వేశ్వర రెడ్డి కంపెనీ సీఎండీ.

ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అనేక కాంట్రాక్టులు ఈ కంపెనీ చేస్తోంది.

ఏపీ ప్రభుత్వం ఈ కంపెనీ నుంచి అత్యధిక ధరకు కరెంట్ ట్రాన్స్ ఫార్మర్లు కొన్నదని సోమిరెడ్డి ఆరోపించగా, పెద్ద ఎత్తున భూములు కట్టబెట్టిందని దినకర్ ఆరోపించారు.

ఈ సంస్థ వై.ఎస్. జగన్‌కి అత్యంత సన్నిహితమైనదని బీజేపీ నాయకుడు లంకా దినకర్, తెలుగుదేశం నాయకులు ఆనం వెంకటరమణా రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి వారు వేరువేరు సందర్భాల్లో ఆరోపించారు.

ఎలక్టోరల్ బాండ్స్

అరబిందో ఫార్మా:

2022 నవంబరు 10న అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ఆ వెంటనే సరిగ్గా ఐదు రోజుల తరువాత 2022 నవంబరు 15న ఈ కంపెనీ 5 కోట్ల రూపాయల బాండ్లు కొన్నది. దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆయన్ను అరెస్ట్ చేసింది ఈడీ. ఆ కంపెనీ మొత్తం వివిధ దఫాల్లో 52 కోట్ల రూపాయల బాండ్స్ కొన్నది.

2021 ఏప్రిల్లో అరబిందో సంస్థ వారు 2.5 కోట్ల విలువజేసే బాండ్లు కొన్నారు.

2022 జనవరిలో 3 కోట్ల విలువైన బాండ్లు కొన్నారు, 2022 జూలైలో కోటీ యాభై లక్షలు విలువజేేసే బాండ్లు కొన్నారు.

2022 ఏప్రిల్‌లో 15 కోట్ల రూపాయల విలువైన బాండ్లు కొన్నారు.

2023 నవంబరులో రూ. 25 కోట్లు విలువజేసే బాండ్లు కొన్నారు.

నవయుగ ఇంజినీరింగ్:

నవయుగ కంపెనీ మీద 2018 అక్టోబరులో ఇన్‌కంటాక్స్ రైడ్స్ అయ్యాయి.

2019 ఏప్రిల్‌లో వారు 30 కోట్లు, 2019 అక్టోబరులో 15 కోట్లు, 2022 అక్టోబరులో 10 కోట్ల రూపాయల బాండ్లు కొన్నారు. ఈ సంస్థ గతంలో పోలవరం పని కొంతకాలం చేసింది.

కాళేశ్వరంలో కూడా కొంత వర్క్ చేసింది. సీవీ రావు ఈ సంస్థ చైర్మన్ కాగా, చింతా శ్రీధర్ ఈ సంస్థ ఎండీ.

ఆళ్ల అయోధ్య రామిరెడ్డి:

వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ గ్రూపుకు చెందిన చెన్నై గ్రీన్ వుడ్స్ సంస్థ మొత్తం 105 కోట్ల రూపాయల బాండ్లు కొన్నది. ఈ కంపెనీలో దాసరి తారక రాజేశ్, కొల్లి అనిల్ బాబులు డైరెక్టర్లుగా ఉన్నారు.

హైదరాబాద్ రాంకీ అడ్రస్ నుంచే ఈ కంపెనీ ఉండగా, ఈ ఇద్దరూ వివిధ రాంకీ గ్రూపు కంపెనీల్లో కూడా ఉన్నారు.

2022 జనవరిలో రూ.40 కోట్లు, 2022 ఏప్రిల్ లో రూ.50 కోట్లు, 2023 అక్టోబరులో రూ.15 కోట్లు ఎలక్టోరల్ బాండ్లు ఈ సంస్థ కొన్నది.

2020 జూన్‌లో ఈయన్ను ఎంపీగా నామినేట్ చేశారు జగన్. మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఈయన సోదరుడు.

ప్రస్తుతం వైఎస్సార్సీపీలో ఉన్న మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి ఈయనకు బావ అవుతారు. ఈ సంస్థ మీద 2021 జూలైలో ఐటీ రైడ్స్ అయ్యాయి.

నాగార్జున కన్‌స్ట్రక్షన్

ఎన్సీసీ సంస్థ 60 కోట్ల రూపాయల బాండ్లు కొన్నది. 2018 మార్చిలో వీరిపై ఐటీ సోదాలు జరిగాయి. 2019 నవంబరులో రూ. 20 కోట్లు విలువజేసే బాండ్లు కొన్నారు.

తరువాత 2022 అక్టోబరులో రూ. 40 కోట్లు విలువజేసే బాండ్లు కొన్నారు. కానీ ఆ బాండ్లు కొన్న వెంటనే 2022 నవంబరులో మళ్లీ ఐటీ సోదాలు చేసింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)