TS-TG: పాత నంబర్ ప్లేట్లను మార్చాలా, ట్యాక్సులు పెరుగుతాయా? 6 సందేహాలు, సమాధానాలు...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ మారనుంది. ఇప్పటివరకు ఉన్న టీఎస్ స్థానంలో టీజీ అని రానుంది. రిజిస్ట్రేషన్ సిరీస్‌ను టీజీగా మారుస్తూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
1988 మోటారు వెహికల్ చట్టం సెక్షన్ 41లోని సబ్ సెక్షన్ 6 ప్రకారం మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాహనాల సిరీస్‌లో మార్పులు చేయాలని నిర్ణయించింది.
ఫిబ్రవరి 5న జరిగిన మంత్రివర్గ సమావేశంలో టీజీగా మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. దీనిపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపించగా.. కేంద్రం ఆమోదం తెలిపింది.

ఫొటో సోర్స్, FB/TELANGANA CMO
ఏపీ నుంచి టీఎస్‌గా మార్పు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘ఏపీ’ సిరీస్‌తో వాహనాల రిజిస్ట్రేషన్ జరిగేది.
2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్‌పై పెద్దఎత్తున చర్చ నడిచింది.
అప్పటికే ప్రచారంలో ఉన్న ‘టీజీ’ అక్షరాలు వాడాలా.. లేక కొత్తవి ఎంచుకోవాలా.. అన్న విషయంపై చర్చ సాగింది. చివరికి తెలంగాణ స్టేట్ కనుక టీఎస్ అని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీనిపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు, కేంద్రం కూడా ఆమోదం తెలిపింది.
1989 మోటారు వాహనాల చట్టాన్ని తెలంగాణ అందిపుచ్చుకుంది. అందులో రూల్ 80 ప్రకారం 2014 జూన్ 17న తెలంగాణలో వాహనాలకు సిరీస్‌ను టీఎస్‌గా నిర్ణయిస్తూ అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలలో టీఎస్ 01 నుంచి టీఎస్36 వరకు ఉన్నాయి.
ఇవి కాకుండా ఆర్టీసీ బస్సులకు ‘జెడ్’, పోలీసు డిపార్ట్మెంట్ వాహనాలకు ‘‘పీ’’ సిరీస్ వర్తిస్తుంది.
తెలంగాణ రవాణా శాఖ లెక్కల ప్రకారం...2023 నవంబరు నాటికి రాష్ట్రంలో అన్ని రకాల వాహనాలు కలిపి 1,60,81,666గా తేలాయి.
ఇందులో అత్యధికంగా 1,18,17,135 ద్విచక్రవాహనాలు కాగా.. 21,32,256 కార్లు ఉన్నాయి. మిగిలినవి ట్రాక్టర్ ట్రాలీలు, ఆటోలు తదితర వాహనాలున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడు ఏం జరగనుంది?
ప్రస్తుతం వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ మరోసారి మారడంతో వాహనదారుల్లో కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి.
పాత వాహనాలకు నంబర్ల పేట్లు మార్చుకోవాలా.. ఎప్పటి నుంచి ‘టీజీ’ అమల్లోకి వస్తుంది? నంబర్లలో మార్పులు ఏం వస్తాయి.. ఇలాంటి సందేహాలు రావడం సహజం.
వీటిని రవాణా రంగ నిపుణులు సీఎల్ఎన్ గాంధీ, తెలంగాణ రవాణా శాఖ సంయుక్త కమిషనర్ (జేటీసీ) రమేశ్ దృష్టికి బీబీసీ తీసుకెళ్లగా వారు దీనిపై స్పందించారు.
1. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది సరే, వెంటనే అమల్లోకి వచ్చినట్లేనా..?
టీఎస్ బదులుగా టీజీగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే అమల్లోకి రాదన్నారు జేటీసీ రమేశ్. దీన్ని నోటిఫై చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాలని, అప్పుడే వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ మార్పులు జరుగుతాయని చెప్పారు.
‘‘రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జీవోలో ఫలానా తేదీ నుంచి టీజీ సిరీస్ అమలు చేయాలని ఉంటుంది. బహుశా నేడో, రేపో ప్రభుత్వ ఉత్తర్వులు రావొచ్చు. దానికి తగ్గట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఆర్టీవో కార్యాలయాలలో కొత్త సిరీస్ అమల్లోకి తీసుకువస్తారు’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
2. వాహనాల నంబర్లలో మార్పులు జరుగుతాయా?
కొత్త సిరీస్‌కు తగ్గట్టుగా వాహనాల నంబర్లలోనూ మార్పులు జరుగుతాయని రమేశ్ వివరించారు.
‘‘టీజీతో ప్రారంభమయ్యే రిజిస్ట్రేషన్ సంఖ్య కొత్తగా మొదలవుతుంది. అంటే ఉదాహరణకు టీజీ 09 0001తో వాహన రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. ఇందులో ౦9 కార్యాలయం కోడ్.. ౦౦౦1 అనేది వెహికల్ నంబరుగా ఉంటుంది.’’ అని వివరించారు.
3. ఇప్పటికే స్లాట్లు తీసుకున్న వాహనదారులకు కొత్త సిరీస్ ప్రకారమే రిజిస్ట్రేషన్ చేస్తారా..?
ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్న వారికి కొత్త సిరీస్ ప్రకారం రిజిస్ట్రేషన్ ఉండదు. కొత్తగా తీసుకునే స్లాట్లకే కొత్త సిరీస్ వర్తిస్తుందని వాహన రంగ నిపుణులు సీఎల్ఎన్ గాంధీ వివరించారు.
ఒకవేళ వాహదారులు కొత్త సిరీస్ కావాలనుకుంటే...పాతది క్యాన్సిల్ చేసుకుని మళ్లీ కొత్తగా స్లాట్ తీసుకోవాలి. ఇప్పటివరకు తీసుకున్న స్లాట్లు పూర్తయ్యాకే.. కొత్త స్లాట్లకు కొత్త సిరీస్ నంబర్లను ఇస్తారు.
కొన్నిసార్లు ఫ్యాన్సీ నంబర్లు బుక్ చేసుకుని ఉంటారు. అలాంటప్పుడు వారికి ఆ నంబరునే కేటాయించాల్సి ఉంటుంది.
4. ఇప్పటికే ‘టీఎస్’ సిరీస్ తో ఉన్న వాహనాలను ‘టీజీ’ అని మార్చుకోవాలా..?
టీఎస్ ఉన్న వాహనాలను మార్చుకోవాల్సిన అవసరం ఉండదని సీఎల్ఎన్ గాంధీ చెబుతున్నారు. దీనికి చట్టం కూడా ఒప్పుకోదని తెలిపారు.
‘‘కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకే కొత్త సిరీస్ కేటాయిస్తారు తప్ప పాత వాహనాల నంబరు ప్లేట్లను మార్చుకోనక్కర్లేదు. ఆ వాహనాలు అవే నంబరు ప్లేట్లతో కొనసాగుతాయి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వుల్లో స్పష్టత వస్తుంది. గతంలోనూ ఏపీ నుంచి టీఎస్ గా మార్చుకోవాలని ప్రభుత్వం చెప్పింది. ఆ విషయంపై కోర్టులో కొందరు వాహనదారులు కేసులు వేశారు. పాత వాహనాలకు పాత సిరీస్‌నే కొనసాగించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది. అందుకే ఇప్పుడు కూడా కొత్త వాహనాలకు మాత్రమే కొత్త సిరీస్ ప్రకారం నంబర్లు ఇచ్చే వీలుంటుంది’’ అని గాంధీ చెప్పారు.
పైగా గత పదేళ్లలో లక్షల వాహనాలు తెలంగాణలో రిజిస్టర్ అయ్యాయి. వాటన్నింటిని మార్చాలంటే కొన్ని నెలలు పడుతుందని చెబుతున్నారు. అందుకే తెలంగాణలో ఇకపై ఏపీ, టీఎస్, టీజీ.. ఈ మూడు సిరీస్‌లతో వాహనాలు తిరిగేందుకు వీలుంటుంది.
5. పాత వాహనానికి కొత్త సిరీస్ కావాలంటే ఏం చేయాలి?
ఇలా కొత్త సిరీస్ తీసుకోవాలనుకోవడం కొంత ఆర్థిక భారం, ఇబ్బందితో కూడుకున్నదని గాంధీ చెప్పారు.
‘‘ఇందుకు ఒక మార్గం ఉంది. ముందుగా తమ వాహనానని వేరొక రాష్ట్రానికి బదిలీ చేసుకుంటూ తెలంగాణ రవాణా శాఖ వద్ద ఎన్‌వోసీ (నో అబ్జక్షన్ సర్టిఫికెట్) తీసుకోవాలి. ఆ తర్వాత వేరొక రాష్ట్రానికి తీసుకెళ్లి... అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. తర్వాత అక్కడి నుంచి బదిలీ చేసుకునేందుకు వీలుగా మళ్లీ ఎన్వోసీ తీసుకోవాలి. దాన్ని తీసుకువచ్చి తెలంగాణకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అప్పుడు కొత్త సిరీస్ కేటాయించేందుకు వీలుంటుంది.’’ అని వివరించారు గాంధీ.
6. కొత్త సిరీస్ వస్తే ట్యాక్సులు పెరుగుతాయా?
కొత్త సిరీస్ వస్తే కేవలం టీఎస్ స్థానంలో టీజీ వచ్చి.. మొదట్నుంచి నంబర్లు మొదలవుతాయి. అంతే తప్ప ట్యాక్సులు పెరగడం ఉండదు. ఇప్పుడు ఉన్న ట్యాక్సుల ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.
ఇవి కూడా చదవండి:
- ఆంత్రోపోసిన్: మనం కొత్త యుగంలోకి అడుగుపెట్టామా? శాస్త్రవేత్తల మధ్య గొడవేంటి?
- ఆంధ్రప్రదేశ్: వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఎప్పుడు వస్తాయి?
- కోటిన్నర జీతం, ఇల్లు, ఇతర సౌకర్యాలు.. ఈ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- గజనీ మహ్మద్: సోమనాథ్ ఆలయం నుంచి కొల్లగొట్టిన ధనమెంత?
- శ్రీశైలం: దట్టమైన నల్లమల అడవిలో వేలమంది జరిపే ఈ యాత్ర ఏంటి, ఎలా సాగుతుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














