ఎలక్టోరల్ బాండ్స్: పార్టీలకు బాండ్ల రూపంలో డబ్బులివ్వడం, దేవుడి హుండీలో డబ్బులు వేయడం దాదాపు ఒకటేనా...దాతల పేర్లు తెలుసుకోవడం అంత కష్టమా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, ఉమాంగ్ పొద్దర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి రాజకీయ పార్టీల నుంచి అందిన సమాచారాన్ని ఎన్నికల సంఘం తన వెబ్‌సైటులో అందుబాటులో ఉంచింది.
ఎలక్టోరల్ బాండ్ల రాజ్యాంగబద్ధతను విచారించే సమయంలో, అన్ని రాజకీయ పార్టీల నుంచి ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని సేకరించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎవరు ఏ బాండ్‌ను ఇచ్చారు? ఎంత మొత్తానికి బాండ్ ఇచ్చారు? ఏ అకౌంట్లోకి, ఏ తేదీన ఈ మొత్తాన్ని డిపాజిట్ చేశారు? వంటి వివరాలను రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల సంఘం తీసుకుంది.
ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి అంటే 2018 నుంచి 2023 సెప్టెంబర్ వరకున్న ఈ సమాచారాన్ని ఎన్నికల సంఘం సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకు సమర్పించింది.
ప్రస్తుతం ఈ సమాచారాన్ని ఎన్నికల సంఘం తన వెబ్‌సైటులో కూడా పొందుపరిచింది.
కొన్ని పార్టీలు ఎవరు బాండ్ల ఇచ్చారు? ఎంత మొత్తానికి ఇచ్చారు? ఎప్పుడు వాటిని నగదుగా మార్చుకున్నారు వంటి సమాచారాన్నంతా ఎన్నికల సంఘానికి అందించాయి.
కానీ, కొన్ని పార్టీలు మాత్రం ఏ బాండ్ రూపంలో, ఎంత మొత్తంలో నగదు విరాళంగా వచ్చిందో మాత్రమే తెలిపాయి, తప్ప ఎవరి నుంచి ఈ డబ్బులు వచ్చాయో చెప్పలేదు.

ఫొటో సోర్స్, AFP
ఏ రాజకీయ పార్టీ ఎలాంటి సమాచారాన్ని ఇచ్చాయి?
ప్రధాన రాజకీయ పార్టీలలో ఏఐఏడీఎంకే, డీఎంకే, జనతా దళ్(సెక్యులర్) పార్టీలు, అలాగే సిక్కిం డెమొక్రాటిక్ ఫ్రంట్, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ వంటి చిన్న పార్టీలు కూడా తమకు ఈ బాండ్లు ఎవరు ఇచ్చారో తెలిపాయి.
ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్, జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్‌లు 2019 వరకున్న దాతల వివరాలను అందించాయి. ఈ పార్టీలు తమకు అందిన విరాళాల అప్‌డేటెడ్ సమాచారాన్ని 2023 నవంబర్‌లో ఎన్నికల సంఘానికి సమర్పించినప్పటికీ, దాతల సమాచారాన్ని మాత్రం అందివ్వలేదు.
వీటితో పాటు, ఇంకా చాలా పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు అందించిన దాతల వివరాలను ఎన్నికల సంఘానికి తెలుపలేదు.
బాండ్ మొత్తం, వాటిని ఎప్పుడు నగదుగా మార్చుకున్నారన్న విషయాన్ని మాత్రమే తెలిపాయి. కొన్ని పార్టీలు కొనుగోలు తేదీ, పొందిన తేదీని మాత్రమే ఎన్నికల సంఘం వద్ద ప్రస్తావించాయి.
బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చిన వారి పేర్లను ఎన్నికల సంఘానికి తెలుపని పార్టీల్లో బీజేకీ, కాంగ్రెస్ కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఎందుకు దాతల పేర్లను బహిర్గతం చేయడం లేదు?
రాజకీయ పార్టీలకు ఎవరు విరాళాలు అందిస్తున్నారు, ఎంత మొత్తంలో వారి నుంచి డబ్బును పొందుతున్నాయో సమాచారాన్ని సేకరించాలని 2019 ఏప్రిల్‌లో ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ ఆదేశాల ద్వారా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందలేరని, ఎందుకంటే ఇవి బేరర్ బాండ్లు అని, వాటిని ఎవరు కొనుగోలు చేశారో ప్రస్తావించరని ఆ సమయంలోనే పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఏ బాండ్‌ను ఎవరు ఇచ్చారో తెలియదని ఏ పార్టీ అయినా చెప్పొచ్చని, అప్పుడు వారి వాదన సరైనదే అవుతుందని చెప్పారు.
ప్రస్తుతం రాజకీయ పార్టీలు సమర్పించిన వివరాల్లో ఈ లాజిక్ ప్రతిబింబిస్తుంది.
ఈ బాండ్లు ‘బేరర్’ బాండ్లు (వీటికి రిజిస్టర్ ఓనర్ ఉండరు), వాటిపై కొనుగోలుదారుని సమాచారాన్ని ముద్రించరని 2019లోనే పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది.
ఈ బాండ్లను తమ కార్యాలయాలకు పంపిస్తారు లేదా అక్కడే ఒక బాక్సులలో పెడతారు లేదా మా పార్టీని సపోర్టు చేసే వారు వేరొకరి ద్వారా వీటిని తమకు పంపిస్తారని తృణమూల్ కాంగ్రెస్ చెప్పింది. తమ సమాచారం గోప్యంగా ఉండాలని దాతలు కోరుకుంటారని తెలిపింది. అందువల్ల ఈ బాండ్లను కొనుగోలు చేసిన సమాచారం తమ వద్ద ఉండదని తృణమూల్ కాంగ్రెస్ చెప్పింది.
ఈ బాండ్లను జారీ చేసే సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వద్ద ఈ వివరాలు ఉంటే ఉండొచ్చని కూడా తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ, కాంగ్రెస్ ఏం చెప్పాయి?
రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడానికి సంబంధించిన పలు చట్టాల్లోని ప్రొవిజన్లను భారతీయ జనతా పార్టీ 2023లో ఉటంకించింది.
ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, రాజకీయ పార్టీలు కేవలం ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ప్రతి ఏడాది వచ్చే మొత్తం వివరాలను బహిర్గతం చేయొచ్చని, కానీ, ఎక్కడ నుంచి ఈ బాండ్లు అందాయో చెప్పాల్సినవసరం లేదని బీజేపీ చెప్పింది.
ఆదాయపు పన్ను చట్టం కింద, పార్టీ కేవలం ఈ సమాచారాన్ని మాత్రమే ఇవ్వగలదని బీజేపీ తెలిపింది. చట్టం కింద ఎలక్టోరల్ బాండ్లను ఇచ్చిన వారి పేర్లను, ఇతర సమాచారాన్ని పార్టీ తమ వద్ద ఉంచాల్సినవసరం లేదని పేర్కొంది.
వైఎస్సార్ కాంగ్రెస్‌తో సహా చాలా ఇతర పార్టీలు కూడా ఎలక్టోరల్ బాండ్లను విరాళంగా ఇచ్చిన వారి సమాచారాన్ని ఇవ్వాల్సినవసరం లేదని చెప్పేందుకు ఇవే కారణాలను తెలిపాయి.
బాండ్లను ఎవరు విరాళంగా అందించారో తెలుపలేకపోవడానికి సరైన కారణాన్ని కాంగ్రెస్, బిజు జనతా దళ్ వంటి పార్టీలు చెప్పలేకపోయాయి. ఎప్పుడు బాండ్లను నగదు మార్చుకున్నాయి? వారి అకౌంట్లలోకి ఎంత మొత్తం వచ్చాయో మాత్రమే ఈ పార్టీలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి:
- గుజరాత్ యూనివర్సిటీ: 'నమాజ్ చేస్తుండగా మాపై దాడి చేశారు, మేం చదువు ఎలా పూర్తి చేయాల'ని ప్రశ్నిస్తున్న విదేశీ విద్యార్థులు
- జింకల్లో కొత్త జాతి గుర్తింపు.. ఇది ఎక్కడ ఉంది?
- సీఏఏ: పౌరసత్వ సవరణ చట్టం అమలుకు నిబంధనలను విడుదల చేసిన కేంద్రం, దీనివల్ల ఏం జరుగుతుంది?
- రోజుల వ్యవధిలో అక్కాచెల్లెళ్లకు ఒకే తరహాలో గుండెపోటు, హఠాత్తుగా వచ్చే సమస్య ఎంత ప్రమాదకరం?
- జీఎన్ సాయిబాబా: ‘నేను ఇంతకాలం బతుకుతానని జైలు అధికారులు కూడా అనుకోలేదు’
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














