ప్రశాంత్ కిశోర్: '2024 ఎన్నికల తర్వాత ఏమీ ఉండదని ప్రజలు అనుకోవాలని బీజేపీ కోరుకుంటోంది'

 ప్రశాంత్ కిశోర్, ఎన్నికల వ్యూహకర్త, రాజకీయాలు

ఫొటో సోర్స్, JANSURAAJ.ORG

ఫొటో క్యాప్షన్, జన్ సురాజ్ అభియాన్ యాత్రలో మాట్లాడుతున్న ప్రశాంత్ కిశోర్
    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2024 ఎన్నికల తర్వాత ఏమీ ఉండదని ప్రజలు అనుకోవాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటోందని ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ అభియాన్ సమన్వయకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పారు.

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రతిపక్షాలు చావో రేవో అన్నట్లు భావించడం చాలా పెద్ద పొరపాటని ఆయన చెప్పారు. బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రతిపక్షాల వ్యూహాలపైనా ప్రశ్నలు లేవనెత్తారు ప్రశాంత్ కిశోర్.

“ప్రతిపక్షాలు మరోసారి పెద్ద తప్పు చేస్తున్నాయి. ఇదొక వ్యూహాత్మక తప్పిదం. 2024 ఎన్నికల తర్వాత ఏమీ ఉండదని ఎవరైనా అంటే, అలా ప్రజలు అనుకోవాలనే బీజేపీ కోరుకుంటోంది. ఎన్నికల తర్వాత ఇంకేమీ ఉండదని అనుకుంటే, ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేస్తే తర్వాత ఇక ఎలాంటి ప్రశ్నలు అడక్కూడదు” అని ప్రశాంత్ కిశోర్ చెప్పారు.

2024లో ఎవరో ఒకరు గెలుస్తారు, ఎవరో ఒకరు ఓడిపోతారు. దానర్థం ప్రతిపక్షం ఉండదని, ప్రజల్లో వ్యతిరేకత ఉండదని కాదు. దేశంలో సమస్యలు లేవని, ఉద్యమాలు జరగవని కాదు. బీజేపీ గెలిస్తే దేశం అంతా ఆ పార్టీ ఏం చేసినా అంగీకరిస్తుందనీ కాదన్నారు ప్రశాంత్ కిశోర్.

బీజేపీకి ఓటు వేస్తే 2024 తర్వాత ఏమీ ఉండదని అందుకే తమకు ఓటు వేయాలని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. అలా అడగడం ద్వారా వాళ్లు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. వాళ్లు ఇలా చెప్పకూడదు. అది వాస్తవం కూడా కాదు.

తాను బిహార్‌లోనే ఉన్నట్లయితే ఎన్నికల్లో పోటీ చేసి ఉండేవాడినని ఆయన చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే తాను పూర్తి స్థాయి సైన్యంతో రంగంలోకి దిగుతానని అన్నారు. ఒక వేళ ఈ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయినా తర్వాత అయినా తనకు అవకాశం వస్తుందన్నారు.

ఈసారి ఎన్నికల్లో 400 సీట్లు సాధించాలని ప్రకటించడం ద్వారా ప్రధాని మోదీ ఎన్నికల అజెండాను సెట్ చేసినట్లు ఈ ఎన్నికల వ్యూహకర్త అభిప్రాయపడ్డారు. మోదీ ఈ ప్రకటన చేసిన తర్వాత ఎన్నికల్లో గెలుపు ఓటములు అనే వాదన పక్కన పెట్టి అందరూ బీజేపీ 400 సీట్లు సాధిస్తుందా లేదా అని చర్చించుకునేలా చేయడంలో మోదీ వ్యూహాత్మకంగా విజయం సాధించినట్లేనని చెప్పారాయన.

రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమి

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఎన్నికల వ్యూహాల్లో ప్రతిపక్షాలు ఆలస్యం చేశాయన్న ప్రశాంత్ కిశోర్

లోక్‌సభ ఎన్నికలు, ప్రతిపక్షాల ఐక్యతకు ప్రయత్నాలు

ఎన్నికలకు సమయం తక్కువగా ఉంది. ఈ కొద్ది పాటి సమయంలో ప్రతిపక్షాల సంసిద్దత ఎలా ఉంది?. ఎన్నికల్లో విపక్షాల స్టాండ్ ఏంటి?

ఈ ప్రశ్నకు సమాధానంగా ప్రతిపక్షాలు చాలా సమయాన్ని వృథా చేశాయని చెప్పారు.

అయోధ్యలో రామాలయ ప్రతిష్టాపనకు చాలా సంవత్సరాల నుంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికలకు కొన్ని నెలల ముందు అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభిస్తారనే విషయం దేశంలో అందరికీ తెలుసు.

అలాగే, సార్వత్రిక ఎన్నికలు 2024 ఏప్రిల్- మే మధ్య జరుగుతాయనే విషయం కూడా అందరికీ తెలుసు. అన్నీ తెలిసి కూడా ఇండియా కూటమిని ఎన్నికలకు కొన్ని నెలల ముందు ప్రారంభించడం ఏంటి?. దాన్ని రెండు మూడేళ్ల క్రితం ఎందుకు ఏర్పాటు చేయలేదు?.ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడకుండా ఎవరు ఆపారు? అని ఆయన ప్రశ్నించారు.

“వాళ్లు మూడేళ్ల క్రితమే రైతుల సమస్యల్ని లేవనెత్తి ఉండవచ్చు. రెండు మూడేళ్ల క్రితమే సీట్ల పంపకం గురించి మాట్లాడుకుని ఉండవచ్చు. అలా చేసి ఉంటే ప్రజలు దాని గురించి బాగా అర్థం చేసుకుని ఉండేవారు.”

ప్రశాంత్ కిశోర్, జన్ సురాజ్ యాత్ర

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బిహార్‌లో మార్పు కోసమే జన్ సురాజ్ యాత్ర

బిహార్‌లో మార్పుపై ఆశలు

పశ్చిమబెంగాల్‌లో బీజేపీ ఈసారి మెరుగైన స్థాయిలో లోక్‌సభ సీట్లను గెలుచుకుంటుందని ప్రశాంత్ కిశోర్ అంచనా వేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలు సాధించినా.. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడింది.

బిహార్ విషయానికొస్తే అక్కడి ప్రజల జీవితాలను మార్చేందుకు ఏదైనా చేయాలని అనుకుంటున్నానని, కేవలం అధికారం మారడం మాత్రమే కాదని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు తాను గడించిన అనుభవం రీత్యా మహాత్మ గాంధీ మార్గమే అందరికీ ఆదర్శమని భావిస్తున్నట్లు చెప్పారు.

ప్రజల ఆలోచనా ధోరణి మారనంత వరకు సమాజంలో పెద్ద పెద్ద మార్పులేవీ రావని, ఒక వేళ వచ్చినా అలాంటివి అర్థ రహితమని అన్నారు. చెప్పారు.

జన్ సురాజ్ అభియాన్ యాత్ర మొదలు పెట్టినప్పుడు ప్రజలు ఎవరికి ఓటు వేయాలనే దాని గురించి కాకుండా ఎందుకు ఓటు వేయాలనే దాని గురించి చెప్పాలని అనుకున్నానని ఆయన అన్నారు.

పీకే, ఐ ప్యాక్, బిహార్, జన్ సురాజ్ యాత్ర

ఫొటో సోర్స్, JANSURAAJ.ORG

ఫొటో క్యాప్షన్, ప్రజల జీవితాల్లో మార్పు తేవడమే తన లక్ష్యమంటున్న పీకే

భారతదేశంలో గాంధీయిజం

గతంలో కంటే ఇప్పుడు మహాత్ముడి సిద్ధాంతాల అవసరం ఎక్కువగా ఉందని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. ప్రస్తుతం దేశంలోని నగరాలు, పట్టణాల్లో మహాత్ముడి గురించి పట్టించుకోవడం, ఆయన చెప్పిన అంశాల తగ్గిపోయిందని భావిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అన్నారు.

“2015-16లో నేను దేశంలోని 2500 కాలేజీల్లో సర్వే నిర్వహించాను. మహాత్మా గాంధీ ఇప్పటికీ సామాజికంగా, రాజకీయంగా ఎక్కువ మంది ఇష్టపడే వ్యక్తి అని ఆ సర్వేలో తేలింది” అని ప్రశాంత్ చెప్పారు.

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో 'జన్‌ సూరజ్‌' పాత్ర ఏమిటని అడిగినప్పుడు, ఎన్నికల గురించి తాను పట్టించుకోవడం లేదని ప్రజల్లో చైతన్యం కల్పించడమే లక్ష్యంగా తన యాత్రను కొనసాగిస్తానని ఆయన చెప్పారు.

ముందుగా బిహార్ మొత్తం పాదయాత్ర చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చానని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. యాత్ర తర్వాత ప్రజా సదస్సు ఏర్పాటు చేసి, వారితోపార్టీ పెట్టాలా వద్దా అనే దానిపై చర్చించి, అందరి నుంచి ఆమోదం పొందిన తర్వాతే పార్టీ పెడతానని అన్నారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారా అనే ప్రశ్నకు, లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తాను ప్రయాణం ప్రారంభించలేదని చెప్పారు.

అయితే, బిహార్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు 'జన్ సూరజ్' యాత్రను పూర్తి చేసి కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనుకుంటన్నట్లు ఆయన చెప్పారు.

నిధులు, జన్ సురాజ్ యాత్ర

ఫొటో సోర్స్, JANSURAAJ.ORG

ఫొటో క్యాప్షన్, తన నుంచి సాయం పొందిన వ్యక్తులే యాత్రకు నిధులు ఇస్తున్నారన్న ప్రశాంత్

'జన్ సురాజ్' యాత్ర ఖర్చులు ఎవరు భరిస్తున్నారు?

'జన్ సురాజ్' యాత్రకు సంబంధించి లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ, ప్రశ్నలు వస్తూనే ఉంటాయని, కొంతమంది పని అదేనని అన్నారు. వారు తమ పనిని నిజాయితీగా, కచ్చితత్వంతో చెయ్యాలని చెప్పారు.

“యాత్రలో నేను ఏం మాట్లాడుతున్నానో కాదు, ఏం చేస్తున్నానో చూడాలని ప్రజలకు చెబుతుంటాను.. మీ అనుభవం ఆధారంగా నా పనితీరుని అంచనా వేయండి. మీకు నచ్చితే నాతో చేరండి” అని నేను ప్రజలకు చెబుతున్నానని అన్నారీ ఎన్నికల వ్యూహకర్త.

ప్రజలను ఎలా సంఘటితం చేయాలి, ప్రజలను సంఘటితం చేయడం ద్వారా రాజకీయ పార్టీని ఎలా ఏర్పాటు చేయాలి అనే ఒకే ఒక ఫార్ములా తన వద్ద ఉందని ప్రశాంత్ చెప్పారు. రాజకీయ పార్టీ ప్రారంభిస్తే అది ఎన్నికల్లో పోటీ చేయడం ఎలా? విజయం సాధించడం ఎలా? అనే దానిపైనా తనకు వ్యూహాలు ఉన్నాయన్నారు.

'జన్ సురాజ్' యాత్రకు డబ్బులు ఎలా వస్తున్నాయనే ప్రశ్నకు స్పందిస్తూ, కొన్నేళ్లుగా, తాను వివిధ రాష్ట్రాల్లో పార్టీలు విజయం సాధించేందుకు పని చేశానని చెప్పారు. అయితే ఏ రాజకీయ పార్టీ ఆయనకు డబ్బులు ఇవ్వడం లేదన్నాకు.

జన్‌ సురాజ్‌ యాత్రకు ప్రజలు డబ్బుల ఇస్తున్నారు. అలాగే, నేను ఎన్నికల్లో సాయం చేసిన వాళ్లు కూడా నిధులు అందిస్తున్నారు. వాళ్లకు నాపై విశ్వాసం ఉంది. ప్రశాంత్ కిశోర్ ప్రయత్నిస్తే కచ్చితంగా మంచి ఫలితం వస్తుంది అని నమ్ముతున్నారు. అందుకే నాకు సాయం చేస్తున్నారు.’’

ఆర్జేడీ, తేజస్వీ యాదవ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బిహార్ యువతకు ఆశాకిరణంగా ఎదుగుతున్న తేజస్వీ యాదవ్

తేజస్వీ యాదవ్ బిహర్ యువతకు మార్గదర్శి అని అనుకోవచ్చా?

రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్‌ ఎదుగుదలతో పాటు ఆయనను యువతకు మార్గదర్శిగా అభివర్ణించబడడంపై ప్రశాంత్‌ కిశోర్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో చెక్క కుండలను మళ్లీ మళ్లీ అందించలేమని చెప్పారు.

ఆర్జేడీ 15 ఏళ్ల ఆటవిక పాలనను చూసిన వారికి, ఆ పార్టీ, దాని అనుబంధ వ్యక్తులను ముందు సీటులో కూర్చోబెట్టడం ఇష్టం లేదని చెప్పారు.

ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అన్న ప్రశ్నకు స్పందిస్తూ అవి ఎన్నికలపై ప్రభావం చూపుతాయని అనుకోవడం లేదని చెప్పారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంత ఓటర్లు దీన్ని అస్సలు పట్టించుకోరని చెప్పారు.

 సందేశ్ కాలీ, పశ్చిమబెంగాల్, బీజేపీ

ఫొటో సోర్స్, SHIB SHANKAR CHATTERJEE / BBC

ఫొటో క్యాప్షన్, సందేశ్‌కాలీ వివాదంతో అధికార పార్టీకి నష్టమేనన్న పీకే

పశ్చిమబెంగాల్‌లో సందేశ్‌ఖాలీ అంశం నుంచి ఎవరు లబ్ధి పొందుతారు?

పశ్చిమ బెంగాల్‌లో సందేశ్‌ఖాలీ అంశంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య పోరుపై ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ, అలాంటి అంశాలు సరైనవా లేదా తప్పా అనేది దర్యాప్తు సంస్థల విచారణలో తేలుతుందని అన్నారు. అయితే, ఈ అంశం ప్రజల్లోకి వచ్చినప్పుడు, దాని ప్రభావం కచ్చితంగా అధికార పార్టీ మీదనే ఉంటుందని చెప్పారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ బలహీనపడిందని అనడం సరికాదని, అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ చాలా కష్టపడి బీజేపీని ఓడించిందని అన్నారు.

"తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో గట్టిగా కృషి చెయ్యకపోతే, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చే సీట్లు 2019 లేదా అంత కంటే మెరుగ్గా రావచ్చు.”

2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి మద్దతు పెరిగిందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తృణమూల్ తన పునాదిని కాపాడుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందని ఆయన చెప్పారు.

యువత, ఎన్నికల వ్యూహకర్త, పార్టీ స్థాపన

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బిహార్ యువతలో ప్రశాంత్ కిశోర్‌కు ఆదరణ పెరుగుతోందా?

సామాన్యుల్లో ప్రశాంత్ కిశోర్ ఇమేజ్ ఎలా ఉంది?

బిహార్‌లో జన్ సురాజ్ యాత్రను ప్రారంభించిన ప్రశాంత్ కిశోర్.. ఏడాదిన్నరగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ఇప్పటి వరకు 14 జిల్లాలలో పర్యటించారు.

ప్రస్తుతం బిహార్‌లోని సహర్సా జిల్లాలోని దేహాద్ గ్రామంలో ఉన్న ప్రశాంత్ కిశోర్‌ను కలిసేందుకు బీబీసీ బృందం అక్కడకు వెళ్లినప్పుడు దారిలో అనేక చోట్ల ఆయన చిత్రంతో స్వాగత ద్వారాలు ఉన్నాయి.

చాలా చోట్ల, రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు, స్తంభాలపై జన్ సురాజ్, జై శ్రీరామ్ అనే పసుపు జెండాలు కనిపించాయి.

ప్రశాంత్ కిశోర్ మీకు తెలుసా, పేరు విన్నారా, చూశారా? ఈ ప్రశ్నకు కొంత మంది ప్రశాంత్ కిశోర్ గురించి తెలియదని చెప్పారు. ఒక్కసారి ఆయన ప్రసంగం వింటే ఆలోచిస్తామని అన్నారు. ప్రశాంత్ కిశోర్ వీడియోలు చూశామని కొందరు బీబీసీతో చెప్పారు.

ప్రశాంత్ కిశోర్ సుమారు అరగంటపాటు గ్రామస్తులతో మాట్లాడారు. అక్కడే నిలబడి మొబైల్‌లో ప్రశాంత్ మాటలు వింటున్నానని, ఆయన చాలా మంచి మాటలు చెప్పారన్నారు జహూర్ ఆలం.

ప్రశాంత్ ప్రజలకు మంచి విషయాలను తెలియజేస్తున్నారని రంజిత్ కుమార్ సింగ్ అన్నారు. ఆయన మాటలు వినేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ఆయన మాట్లాడిన తర్వాత ప్రజలను అభిప్రాయాలు చెప్పాలని, ప్రశ్నలు అడగాలని కోరారు.

ఒక చోట ఆయన, ‘ప్రజా పాలన కావాలంటే ఒకటే మార్గం.. వచ్చేసారి నాయకుడి ముఖం చూసి కాదు, మీ పిల్లల ముఖాలు చూసి ఓటేయండి’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)