కేంద్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఏర్పాటుపై సుప్రీం కోర్టు స్టే, దీనిపై వివాదం ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఉమంగ్ పొద్దర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
డిజిటల్ మాధ్యమాలలో ప్రసారమయ్యే వార్తలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ పై సుప్రీం కోర్టు స్టే విధించింది.
ఈమేరకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశాలు ఇచ్చారు. బాంబే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా కేంద్రప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసిందని, 2023లో చేసిన చట్టసవరణల చెల్లుబాటుపై రాజ్యాంగ పరమైన తీవ్ర ప్రశ్నలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో దీనిపై స్టే విధిస్తున్నట్టు సుప్రీం కోర్టు తెలిపింది.
భావప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అని దీనిపై రూల్ 3(1)(బి)(5) ప్రభావం ఎలా ఉంటుందో బాంబే హైకోర్టు విశ్లేషించాల్సిన అవసరం ఉందని, బాంబే హైకోర్టులో తుది తీర్పు వచ్చేవరకు కేంద్రం నోటిఫికేషన్ ను వాయిదా వేయాలని సుప్రీం కోర్టు తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే 'ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్' ఏర్పాటుపై స్టే విధించాలని బాంబే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అయితే, మార్చి 13న ఈ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
ఐటీ ఇంటర్మీడియరీ రూల్స్-2021 ప్రకారం ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్‌ను రూపొందిస్తామని కేంద్ర ప్రభుత్వం అంటోంది. కాగా, ఈ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్‌ను 2023లో చట్టంలో చేర్చారు. తప్పుడు సమాచారాన్ని అరికట్టడమే తమ ఉద్దేశమని ప్రభుత్వం అంటోంది. అయితే ఈ యూనిట్‌ను చట్టంలో చేర్చాలనుకోవడంతో వివాదాలతో చుట్టుముట్టాయి.

ఫొటో సోర్స్, ANI
ఇది భావప్రకటనా స్వేచ్ఛను, ప్రభుత్వాన్ని విమర్శించే స్వతంత్ర మీడియా వ్యవస్థను అణిచివేసే ప్రయత్నం అని పలువురు జర్నలిస్టులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఈ ఏడాది జనవరి 31న, బొంబాయి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ యూనిట్ రాజ్యాంగబద్ధతపై భిన్నమైన తీర్పును ఇచ్చింది. దీంతో ప్రస్తుతం మూడో జడ్జి ఈ కేసు విచారణ చేపట్టారు.
కాగా, ఈ కేసులో తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ యూనిట్ ఏర్పాటు నిలిపి వేయాలన్నది పిటిషనర్ల వాదన. ప్రభుత్వం కూడా ఎలాంటి యూనిట్ ఏర్పాటుచేయబోమని అఫిడవిట్ కూడా సమర్పించింది.
అయితే, యూనిట్ ఏర్పాటుపై స్టే కోసం దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో ప్రభుత్వం ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్టు నోటిఫికేషన్ జారీచేయగా, సుప్రీం కోర్టు స్టే విధించింది.
ఇంతకీ ఈ 'ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్' ఎలాంటి మార్పులను తెస్తుంది, ఇంటర్నెట్ వినియోగదారులు వినియోగించే కంటెంట్‌ను ఇది ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్
2023లో ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్-2021 సవరించింది కేంద్రం.
ఈ కొత్త సవరణలతో ఫ్యాక్ట్ చెకింగ్ పరిధిలోకి టెలికాం సర్వీసెస్, వెబ్ హోస్టింగ్ సర్వీసెస్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వెబ్‌సైట్‌లు, గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్‌లూ వస్తాయి.
ఈ మాధ్యమాల్లో ప్రభుత్వం గురించి అసత్యంగా వస్తున్నాయని భావించే కంటెంట్‌ను నియంత్రించనున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని సవరించిన నిబంధనలు పేర్కొంటున్నాయి.
కేంద్ర ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన ఏదైనా వార్తను 'నకిలీ, తప్పుడు లేదా తప్పుదోవ పట్టించేది'గా ప్రకటించే అధికారం ఈ యూనిట్‌కు ఉంటుంది.
ఈ చట్టాన్ని స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సవాలు చేశారు.
అయితే, వెబ్ హోస్టింగ్ సర్వీసెస్, సోషల్ మీడియా మాదిరి న్యూస్ వెబ్‌సైట్‌లు నేరుగా ఇంటర్మీడియరీ నిర్వచనం కిందకు రావు. తప్పుడు వార్తలను ఇంటర్నెట్ నుంచి మాత్రం తొలగించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఇది ఎలా నడుస్తుంది?
తమ ప్లాట్‌ఫారమ్స్‌లో తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రదర్శించకుండా లేదా అప్‌లోడ్ చేయకుండా ఉండేలా మధ్యవర్తులు తగిన చర్యలు తీసుకోవాలని ఐటీ నిబంధనలు చెబుతున్నాయి.
దీని కారణంగా, ఇంటర్మీడియరీ ఆ సమాచారాన్ని 36 గంటలలోపు తొలగించవలసి ఉంటుంది. కంటెంట్‌కు వ్యతిరేకంగా నమోదయ్యే కేసుల నుంచి ఉన్న రక్షణను కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
ప్రస్తుతం, వ్యక్తుల తరపున పోస్ట్ చేసిన సమాచారం విషయంలో వెబ్‌సైట్‌లు, సర్వీస్ ప్రొవైడర్‌లకు రక్షణ ఉంది. ఇతరులు పోస్ట్ చేసిన కంటెంట్‌కు వెబ్‌సైట్ బాధ్యత వహించకుండా కాపాడుతుంది.
ఇక, ఇంటర్మీడియరీ ద్వారా నియమితమైన ఫిర్యాదుల పరిష్కార అధికారిని సంప్రదించే అవకాశం వినియోగదారుకు ఉంటుంది.
గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ నిర్ణయంతో వినియోగదారు సంతృప్తి చెందకపోతే, ఫిర్యాదుదారు గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీని సంప్రదించవచ్చు. కేంద్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ ఇది.

ఫొటో సోర్స్, STRDEL
ఈ చట్టాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు.
ఈ చట్టంపై ప్రజా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సవరణను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సంపాదకుల సంస్థ 'ఎడిటర్స్ గిల్డ్' ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య కలవరపెడుతోందని, ప్రభుత్వం తనకు సంబంధించిన వార్తలను సెన్సార్ చేయగలదని గిల్డ్ భావిస్తోంది.
యాక్సెస్ నౌ, ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ వంటి 17 డిజిటల్ హక్కుల సంస్థలు కూడా ఈ సవరణ రాజ్యాంగానికి అనుగుణంగా లేదని, ఇది వాక్ స్వాతంత్య్ర హక్కును ప్రమాదంలో పడేస్తుందనే అభిప్రాయం వ్యక్తంచేశాయి.
దీనిని 'అసమ్మతిని అణిచివేసేందుకు' ఉపయోగించవచ్చనే అనుమానం కూడా వ్యక్తంచేశాయి. ఈ చట్టం రాజకీయ వ్యంగ్యం, పేరడీ లేదా రాజకీయ వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకోవచ్చని పిటిషనర్లు కోర్టులో వాదించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం ఏం చెబుతోంది?
చట్టంలోని కొత్త ఐటీ నిబంధనలను ప్రభుత్వం సమర్థించుకుంటోంది. నకిలీ వార్తలు సర్క్యులేట్ అయితే తీవ్రమైన "ప్రజా సంక్షోభం, పబ్లిక్ ఆర్డర్, జాతీయ భద్రతకు ముప్పు" ఏర్పడుతుందని పేర్కొంది.
ఈ నిబంధనలు వ్యక్తి భావప్రకటనా స్వేచ్ఛ లేదా వాక్ స్వాతంత్య్రాన్ని నిరోధించవని ప్రభుత్వం చెబుతోంది. ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని కూడా అందులో అందించినట్లు తెలిపింది.
ప్రభుత్వ పత్రాలలో ఉన్న వాస్తవాలు, గణాంకాలకు విరుద్ధమైన కల్పిత, నిరాధారమైన కంటెంట్ మాత్రమే ఈ యూనిట్ నిరోధిస్తుందని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వ ఫ్యాక్ట్ చెకింగ్
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ప్రభుత్వానికి చెందిన ఫాక్ట్ చెక్ యూనిట్ ఒకటి నడుస్తోంది. ఆ యూనిట్ కొన్ని వార్తలను ఫేక్ అని ప్రకటించడంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు.
చాలామంది జర్నలిస్టులు కూడా ఈ యూనిట్ తరచుగా ప్రభుత్వాన్ని విమర్శించే సమాచారాన్ని 'నకిలీ' అని లేబుల్ చేస్తుందని ఆరోపించారు.
ప్రభుత్వ ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీ స్వయంగా నకిలీ, తప్పుదోవ పట్టించే వార్తలను ఎలా ప్రచారం చేసిందో బీబీసీ ఇంతకు ముందు రిపోర్టు చేసింది.
ఈ యూనిట్‌ను ప్రభుత్వ ప్రతిష్టను ఎక్కువ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నట్లు ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ 'ఆల్ట్ న్యూస్' సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా ఆరోపించారు.
ఇతర ఫ్యాక్ట్ చెకర్‌లు తరచుగా చేసే విధంగా పీఐబీ ఫాక్ట్ చెక్‌కు సెట్ ప్రాసెస్ ఉండదని ఆయన ఆరోపిస్తున్నారు. పీఐబీ పూర్తి సందర్భం ఇవ్వకుండా 'సరైన లేదా తప్పు' అని ప్రకటిస్తుందని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
బాంబే హైకోర్టులో ఇప్పటివరకు ఏం జరిగింది?
ఈ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై బాంబే హైకోర్టు చాలారోజులుగా విచారణ జరుపుతోంది.
జనవరి 31న, బాంబే హైకోర్టు దాని రాజ్యాంగబద్ధతకు సంబంధించి భిన్న తీర్పులు ఇచ్చింది.
ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్‌కు సంబంధించిన నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ గౌతమ్ పటేల్ పేర్కొన్నారు.
'ప్రభుత్వ పనితీరు', 'నకిలీ', 'తప్పుదోవ పట్టించడం' అనే పదాలను నిర్వచించలేదని న్యాయమూర్తి తెలిపారు.
ధర్మాసనంలోని మరో జడ్జి జస్టిస్ నీలా గోఖలే ఈ నిబంధనలు రాజ్యాంగబద్ధమైనవేనని పేర్కొన్నారు.
సమాచారాన్ని తొలగించాల్సిన అవసరం లేదని, అయితే, ఇంటర్మీడియరీ కూడా నిరాకరిస్తూ, సమాచారాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుందని జస్టిస్ నీలా గోఖలే అన్నారు.
యూనిట్ పనితీరు ఇంకా తెలియదని, పక్షపాతం ఉందనిపిస్తే బాధితులు కోర్టును ఆశ్రయించవచ్చన్నారు.
వ్యంగ్యానికి, పేరడీకి, విమర్శలకు లేదా అభిప్రాయానికి ఈ నియమం వర్తించదని న్యాయమూర్తి తెలిపారు.
ఇప్పుడు ఈ అంశాన్ని మూడో న్యాయమూర్తి ముందు ఉంచారు.
ఇవి కూడా చదవండి:
- ఫ్రామౌరో: మతం కాదు, సైన్స్ ఆధారంగా తొలి ప్రపంచ పటాన్ని చిత్రించిన సన్యాసి... గడప దాటకుండానే ఆయన ఈ అధ్భుతాన్ని ఎలా సాధించారు?
- గుజరాత్ యూనివర్సిటీ: 'నమాజ్ చేస్తుండగా మాపై దాడి చేశారు, మేం చదువు ఎలా పూర్తి చేయాల'ని ప్రశ్నిస్తున్న విదేశీ విద్యార్థులు
- జింకల్లో కొత్త జాతి గుర్తింపు.. ఇది ఎక్కడ ఉంది?
- సీఏఏ: పౌరసత్వ సవరణ చట్టం అమలుకు నిబంధనలను విడుదల చేసిన కేంద్రం, దీనివల్ల ఏం జరుగుతుంది?
- రోజుల వ్యవధిలో అక్కాచెల్లెళ్లకు ఒకే తరహాలో గుండెపోటు, హఠాత్తుగా వచ్చే సమస్య ఎంత ప్రమాదకరం?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














