లోక్‌సభ ఎన్నికలు 2024: కొత్త ఓటర్ ఐడీ కార్డును ఎలా పొందాలి, 6 ప్రశ్నలు- సమాధానాలు

సార్వత్రిక ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

లోక్‌సభ ఎన్నికలు-2024 షెడ్యూల్‌ను శనివారం భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఏప్రిల్ 19 నుంచి 7 దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల అవుతాయి.

ఎన్నికల తేదీలు ప్రకటించడంలో చాలామంది ఆరోజున ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు.

ఎన్నికలు అనగానే గుర్తొచ్చే మరో ముఖ్యమైన అంశం ఓటర్ ఐడీ కార్డు.

దేశంలోని ప్రతీ పౌరుని వద్ద ఉండాల్సిన పత్రంగా ఓటర్‌ ఐడీ కార్డును పరిగణిస్తారు.

కొత్త ఓటర్ ఐడీ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి? 17 ఏళ్ల వారు కూడా ఓటర్ ఐడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చా? ఓటర్ ఐడీ కార్డులో మార్పులు ఎలా చేసుకోవచ్చు? ఇలాంటి అనేక ప్రశ్నలకు ఈ కథనంలో సమాధానాలు మీకు దొరుకుతాయి.

సార్వత్రిక ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

1. పదిహేడేళ్లు నిండిన వారు ఓటర్ ఐడీకి దరఖాస్తు చేసుకోవచ్చా?

భారత్‌లో 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు లభిస్తుందనే సంగతి అందరికీ తెలుసు. మామూలుగా తల్లిదండ్రులు తమ పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాతే డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డు వంటి వాటికి దరఖాస్తు చేసేందుకు ఆసక్తి చూపుతారు.

కానీ, 17 ఏళ్లు నిండిన వారు కూడా ముందుగా ఓటర్ గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో ఓటర్ల జాబితాలో మీ పేరును చేర్చాలంటే ఆ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండాలి అనే నిబంధన ఉండేది.

కానీ, చాలామంది సకాలంలో ఓటర్ ఐడీ కార్డు దరఖాస్తు చేయరు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావిడిగా ఓటర్ ఐడీ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు అనేక తప్పులు జరిగే ఆస్కారం ఉంటుంది.

భారత్ వంటి అధిక జనాభా కలిగిన దేశంలో జరిగే ఎన్నికల్లో యువ ఓటర్లు పెద్ద మొత్తంలో ఉంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని 2022లో కొత్త నిబంధన ప్రవేశపెట్టారు. దీని ప్రకారం, 17 ఏళ్లు నిండిన వ్యక్తి ఓటర్ ఐడీ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే, వారికి 18 ఏళ్లు నిండిన తర్వాత ఓటర్ జాబితాలో పేరును చేర్చుతారు.

దరఖాస్తుదారులకు జనవరి 1న కాకుండా ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలని ఎన్నికల సంఘం చెప్పింది. అంటే, ఓటర్ల జాబితాను ప్రతీ మూడు నెలలకు ఒకసారి అప్‌డేట్ చేస్తుంటారు. కాబట్టి, ఏ క్వార్టర్‌లో మీకు 18 ఏళ్లు నిండుతాయో చూసుకొని ముందుగానే మీరు ఆన్‌లైన్‌లో ఓటర్ కార్డు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

కొత్త ఓటర్ ఐడీ కార్డు కోసం భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌ (https://voterportal.eci.gov.in/) నుంచి ఫామ్ 6ను డౌన్‌లోడ్ చేసి, దాన్ని పూర్తిగా నింపి మళ్లీ అప్‌లోడ్ చేయాలి. మీరు అందించిన వివరాలను ధ్రువీకరించడానికి తగు ధ్రువపత్రాలను కూడా జోడించాలి. ప్రభుత్వ ఈ-సేవా కేంద్రాల ద్వారా కూడా మీరు ఓటర్ ఐడీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

లేదా, మీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి ఫామ్ 6 దరఖాస్తును నింపాలి. 17 ఏళ్లు నిండిన వారు మాత్రమే కాకుండా కొత్తగా ఓటర్ కార్డు దరఖాస్తు చేసుకునేవారు కూడా ఇదే విధానాన్ని అనుసరించవచ్చు.

ఓటర్ ఐడీ కార్డు

ఫొటో సోర్స్, Getty Images

2. ఓటర్ జాబితాలో పేరును ఎలా చేర్చాలి?

ఓటర్ జాబితాలో పేరును చేర్చేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఎన్నికల సంఘానికి చెందిన ‘‘నేషనల్ ఓటర్ సర్వీస్’’ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఒకవేళ ఆన్‌లైన్‌లో చేయడం సాధ్యం కాకపోతే, నేరుగా మీ ప్రాంతంలోని ఎన్నికల అధికారుల వద్దకు వెళ్లి దరఖాస్తు ఇవ్వొచ్చు.

మీరు ఎన్నికల సంఘం ఓటర్ సర్వీసుల వెబ్‌సైట్ (https://voterportal.eci.gov.in/)లోని ఫారమ్ పేజీని లేదా ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు.

మొబైల్ యాప్ ద్వారా మొదట మీ మొబైల్ నెంబర్ లేదా ఎలక్టోరల్ ఫోటో ఐడెండిటీ కార్డు (ఈపీఐసీ) నెంబర్ ఉపయోగించి అకౌంట్‌ను క్రియేట్ చేయాలి. ఓటర్ ఐడీ కార్డులో పేరును తొలిగించడానికి లేదా వివరాల్లో సవరణ చేయడానికి ఓటర్ ఐడీ నెంబర్ అవసరం.

ఓటర్‌గా నమోదు చేసుకోవాలనకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఫారమ్-6 నింపాలి. మీరు ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారుతున్నట్లయితే కూడా ఫారమ్-6 మీకు వర్తిస్తుంది.

ఎన్నారైలు ఫారం- 6Aను నింపాలి. ఎలక్టోరల్ జాబితా నుంచి మీ పేరును తొలగించడానికి, ఏవైనా అభ్యంతరాలను తెలియజేయడానికి ఫారం 7 అవసరం.

మీ అసెంబ్లీ నియోజకవర్గంలోనే చిరునామా మార్పు కోసం ఫారం 8A నింపాలి.

ప్రభుత్వ ఈ-సేవా కేంద్రాల్లో కూడా దీన్ని చేసుకోవచ్చు.

3. ఓటర్ ఐడీ కార్డు స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?

ఎన్నికల సంఘం వెబ్‌సైట్ (https://voterportal.eci.gov.in/) ద్వారా మీ ఓటర్ ఐడీ కార్డు దరఖాస్తు స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించిన తర్వాత, మీకు రిఫరెన్స్ నంబర్ ఇస్తారు.

దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి మీరు ఈ నెంబర్‌ను ఉపయోగించుకోవచ్చు. అన్ని వివరాలను ధ్రువీకరించిన తర్వాత అధికారులు మీ చిరునామాకు కొత్త ఓటర్ ఐడీ కార్డును పంపిస్తారు. ఇదే వెబ్‌సైట్ ద్వారా ఓటర్‌ ఐడీకి సంబంధించిన ఇతర వివరాలను కూడా తనిఖీ చేయవచ్చు.

ఓటర్ఐడీ

ఫొటో సోర్స్, Getty Images

4. ఓటర్ ఐడీలో చిరునామా మార్చుకోవడం ఎలా?

ఓటర్ ఐడీలో చిరునామా మార్పును ఎన్నికల సంఘం సులభతరం చేసింది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.

తర్వాత ‘ఆన్‌లైన్ ఓటర్ రిజిస్ట్రేషన్’ సెక్షన్ మీద క్లిక్ చేయాలి. ఫారం-8ను సెలెక్ట్ చేసి అందులో వివరాలతో పాటు కొత్త చిరునామాను జాగ్రత్తగా నింపాలి.

మీ ప్రస్తుత చిరునామాను చూపే డాక్యుమెంట్ (బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డ్ వంటివి)ను అప్‌లోడ్ చేయాలి.

వివరాలను నింపి, సరైన పత్రాలను అప్‌లోడ్ చేశాక, సబ్‌మిట్ బటన్ నొక్కాలి. తర్వాత మీకు రిఫరెన్స్ నంబర్ లభిస్తుంది. దీని ఆధారంగా మీ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు.

మీరు సమర్పించిన దరఖాస్తును ఎన్నికల అధికారులు ధ్రువీకరిస్తారు. వివరాలన్నీ సవ్యంగా ఉంటే మీ ప్రస్తుత చిరునామాతో ఐడీకార్డును పొందవచ్చు.

ఆన్‌లైన్‌లో కాకుండా మీ నియోజకవర్గంలోని ఎన్నికల కార్యాలయానికి వెళ్లి కూడా ఈ పని చేసుకోవచ్చు. అక్కడ ఫారం 8 నింపి, సంబంధిత రుజువులను జత చేయాలి. తర్వాత దాన్ని కార్యాలయంలో సమర్పించాలి.

దరఖాస్తు సమర్పించిన తర్వాత మీకు ఒక నంబర్ ఇస్తారు. ఓటర్ ఐడీ కార్డు స్థితిని తెలుసుకునేందుకు మీరు ఈ నంబర్‌ను ఉపయోగించుకోవచ్చు. అధికారులు మీ దరఖాస్తులోని వివరాలను ధ్రువీకరించిన తర్వాత మీకు కొత్త అడ్రస్‌తో ఓటర్ ఐడీ జారీ అవుతుంది.

ఓటర్ ఐడీ

ఫొటో సోర్స్, Getty Images

5. ఓటర్ కార్డులో పేరును మార్చుకోవడం ఎలా?

ఓటర్‌ ఐడీ కార్డులో మీ పేరు, వయస్సు, అడ్రస్, ఫోటో, పుట్టినతేదీ, తండ్రి లేదా భర్త పేరు, లింగం వంటి వివరాల్లో తప్పులు ఉంటే వాటిని సరిచేయడానికి మీరు ఫారం-8 నింపాలి.

ఇందుకోసం వెబ్‌సైట్ నుంచి ఫారం-8 ని డౌన్‌లోడ్ చేసి అవసరమైన వివరాలు నింపాలి. సరైన ధ్రువీకరణ పత్రాలు జోడించాలి. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత రిఫరెన్స్ నంబర్ ద్వారా తర్వాత దరఖాస్తు స్థితిని తనిఖీ చేయొచ్చు.

మీ వివరాలు, ధ్రువీకరణ పత్రాలు సరైనవి అయితే, సవరించిన వివరాలతో ఓటర్ ఐడీ కార్డు మీ చిరునామాకు పంపిస్తారు.

పోలింగ్ బూత్‌ను మార్చుకోవచ్చా?

ఒక నియోజకవర్గానికి చెందిన పోలింగ్ స్టేషన్‌ను జిల్లా రిటర్నింగ్ అధికారి నిర్ణయిస్తారు. పోలింగ్ కేంద్రాన్ని మార్చుకునే హక్కు ఓటర్లకు లేదని ఎన్నికల సంఘం పేర్కొంది. కాబట్టి మీకు కేటాయించిన కేంద్రంలో మాత్రమే మీరు ఓటు వేయగలరు.

6. ఓటర్ కార్డును ఎలా ధ్రువీకరించుకోవాలి?

ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఓటర్ల జాబితాలో మీ పేరును తనిఖీ చేయవచ్చు.

మీ పేరు, జిల్లా, నియోజకవర్గం పేరును నమోదు చేస్తే, అది మీ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్‌ల జాబితాను ప్రదర్శిస్తుంది.

అందులో నుంచి మీ పోలింగ్ స్టేషన్‌ను ఎంచుకొని, నిర్ధిష్ట పోలింగ్ స్టేషన్‌లోని ఓటర్ల జాబితాలో మీరు పేరు ఉందో లేదో మీరు తనిఖీ చేసుకోవచ్చు. అందులో తప్పులుంటే కరెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

నేషనల్ ఓటర్ సెర్చ్ వెబ్‌సైట్‌లో మీ పేరు, వయస్సు, తల్లి లేదా తండ్రి లేదా భర్త పేరు, రాష్ట్రం, జిల్లా, నియోజకర్గం పేరును ఉపయోగించి మీ ఓటర్ కార్డు వివరాలను తెలుసుకోవచ్చు.

ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు అందుబాటులో లేని వ్యక్తులు మీ ప్రాంతంలో ఎప్పటికప్పుడు నిర్వహించే ఓటరు శిబిరాల్లో వ్యక్తిగతంగా ఈ ఫారమ్‌లను నింపి ఇవ్వొచ్చు.

ఎన్నికల సమయంలో పోలింగ్ స్టేషన్‌గా పనిచేసే ఏదైనా భవనంలో ఈ శిబిరాలు సాధారణంగా జరుగుతాయి. ఈ శిబిరాల తేదీని ప్రభుత్వం ముందుగానే ప్రకటిస్తుంది.

వీడియో క్యాప్షన్, కొత్త ఓటర్ ఐడీ కార్డును ఎలా పొందాలి, 6 ప్రశ్నలు- సమాధానాలు

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)