రబియా బల్జీ: యుద్ధరంగంలో ప్రియుడిని కాపాడిన అఫ్గాన్ యువరాణి 'ప్రేమకథ'

ఫొటో సోర్స్, HAMED NAWEED/LEMAR AFTAAB
- రచయిత, దలియా వెంచురా
- హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్
"అన్నింటికన్నా ముఖ్య విషయం ఏంటంటే... ఇదొక ప్రేమకథ."
అబ్దులా షాదాన్ ఈ మాట బీబీసీతో చెప్పారు. ఆయన అఫ్గానిస్తాన్‌లో బీబీసీ వరల్డ్ సర్వీస్ కోసం పని చేస్తున్నారు. అంతేకాదు, ఆయన ఒక నటుడు కూడా. ఈ 'ప్రేమకథ' ఇతివృత్తంగా తీసిన సినిమాలోని కథానాయకుల్లో ఆయన ఒకరుగా నటించారు.
ఈ చారిత్రక చిత్రం మధ్యయుగాల నాటి యువరాణి రబియా బల్జీ జీవితాన్ని చూపించింది. ఆమెను ఎంతో మంది ఆరాధించారు, ప్రేమించారు. ఇప్పటికీ ఆమెను అభిమానించే వాళ్ళున్నారు. ఆమె ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించారు. కానీ, ఆమె ప్రేమకు ఆమోదం లభించలేదు. చివరకు రబియా తన సోదరుడి చేతిలో చనిపోయారు.
"ఆమె ప్రేమకు చిహ్నం. ప్రేమకోసం అన్నింటినీ త్యాగం చేసిన వ్యక్తి. అందుకే, ప్రపంచమంతటా ఆమెను ఇప్పటికీ చాలా మంది ఆరాధిస్తున్నారు" అని ఆ సినిమాలో రబియా ప్రియుడిగా నటించిన షాదాన్ చెప్పారు.
పవిత్ర ప్రేమతో కన్యగా మిగిలిపోయిన ఒక ముస్లిం సాధ్వి రబియా అని చెప్పవచ్చు, స్త్రీవాదుల కోణం నుంచి చూస్తే ఆమె ప్రేమ కోసం దేన్నయినా ఎదిరించడానికి సిద్ధపడిన సాహసి అని ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీలో ఆంథ్రొపాలజీలో పీహెచ్‌డీ చేస్తున్న షమీమ్ హుమాయూన్ అన్నారు.
అంతేకాదు, ఇస్లాం స్వర్ణయుగానికి సంబంధించిన గొప్ప కవులలో రబియా ఒకరని, అఫ్గాన్ చరిత్రలో ఎంతో గౌరవాన్ని అందుకున్న ప్రముఖుల్లో ఆమె ఒకరని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో రీసర్చ్ చేస్తున్న మునాజా ఎబ్తికార్ అన్నారు.
రబియా ప్రాచీన బల్ఖ్ ప్రాంతానికి చెందినవారు. ఇప్పుడది ఈశాన్య అఫ్గానిస్తాన్‌లో ఉంది. గణిత, ఖగోళ శాస్త్రాల్లో పండితులైన అల్బుమసర్ వంటి వారు 9వ శతాబ్దంలో ఓ వెలుగు వెలిగింది బల్ఖ్‌లోనే. అంతేకాదు, పదో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత తాత్వికుడు, శాస్త్రవేత్త అవిసెన్నా పుట్టింది కూడా ఈ నగరంలోనే.
రబియా క్రీస్తు శకం 947లో పుట్టినట్లు చెబుతారు. కానీ, కచ్చితమైన తేదీ ఏమిటన్నది తెలియదు. ఆమె తొలినాళ్ళ జీవితం కూడా పెద్దగా చరిత్రలో నమోదు కాలేదు. అయినప్పటికీ, ఆమె కథ తరాలు దాటి మరో తరానికి వినిపిస్తూనే ఉంది. ఆమె జీవితంలోని ముఖ్యమైన ఘటనలు ఇవీ అంటూ ప్రముఖంగా రాసిన పుస్తకాలు ఉన్నాయి. వీటిలో ఎబ్తికార్ రచన కూడా ఉంది. 'పవిత్ర బల్ఖ్ భూమిలో...' అంటూ ఆయన రచన మొదలవుతుంది.
'పవిత్ర బల్ఖ్ భూమిలో...'

ఫొటో సోర్స్, MUNAZZA EBTIKAR
'పవిత్ర బల్ఖ్ భూమిలో, వేలాది మసీదులున్న నగరంలో బల్ఖ్ ఎమిర్ (రాజు) కూతురుగా రబియా జన్మించారు. ఆమెను గులాబీ నీళ్ళతో స్నానం చేయించి, పట్టు వస్త్రాలలో చుట్టి, బంగారు ఊయలలో పెట్టారు. ఆమె పుట్టిన రోజు బల్ఖ్ అంతా సంబరాలు చేసుకుంది...'
"రాచభవనంలో రబియా కళలు, సాహిత్యం నేర్చుకున్నారు. విలువిద్య, వేట నేర్చుకుంటూ పెరిగారు."
బాలికలు చదువుకోవడం ఆ రోజుల్లో నిషిద్ధమేమీ కాదని లండన్ యూనివర్సిటీలోని ఓరియంటల్-ఆఫ్రికన్ స్టడీస్ విభాగానికి చెందిన నర్గీస్ ఫర్జాద్ చెప్పారు. "ఇస్లాంకు పూర్వం ఉన్న సంస్కృతి, సంప్రదాయాలు ఈ ప్రాంతంలో చక్కగా కొనసాగాయి. సంపన్నులు, ఉన్నత వర్గాల వారి అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానంగా చదువుకున్నారు" అని ఆమె చెప్పారు.
"సంపన్నుడు, ఉదారవాది అయిన తండ్రి కూతురైన రబియా సాహిత్యాన్ని బాగా ఒంటబట్టించుకున్నారు. ఆనాటి సమానిద్ కవి శ్రేష్ఠులైన రుడాకీ ఆమె భాషా పాటవాన్ని, కవిత్వ శిల్పాన్ని మెచ్చుకున్నారు" అని నర్గీస్ చెప్పారు.
అంతదాకా అంతా ఆనందంగా గడిచిపోయింది.
"ఆమె రూపం, వాక్కు ఎంతో అందంగా ఉండేవి. దాంతో, ఆమెను ఎంతో మంది ఆరాధించేవారు. రబియా తన కవిత్వం వినిపిస్తుంటే అప్పటి కవులు, రచయితలు మంత్రముగ్ధులైపోయేవారు. ఆమె తన కవిత్వం తల్లితండ్రుల హృదయాలనే కాదు, మొత్తం బల్ఖ్ నగర ప్రజల మనసులను గెల్చుకున్నారు."
కానీ, ఆమె సోదరుడు హరిస్‌కు మాత్రం అదంతా నచ్చేది కాదు. రబియా పట్ల అతడు అసూయతో రగిలిపోయేవాడు.
రబియా తండ్రి తన చివరి క్షణాలలో కుమారుడు హరిస్‌ను పిలిచి సోదరి బాగోగులు చూసుకోవాలని కోరారు. కానీ, తండ్రి తరువాత వారసత్వంతో రాజ పదవిని చేపట్టిన హరిస్ ఆ మాటలేవీ పట్టించుకోలేదు. సోదరి జీవితానికి దారుణమైన ముగింపును ఇవ్వడంలో అతడే కీలకపాత్ర పోషించాడు.
రక్త లేఖలు...

ఫొటో సోర్స్, FARHAT CHIRA
ఒకరోజు రబియా తన బాల్కనీ నుంచి కిందకు చూసినప్పుడు హరిస్‌కు వైన్ అందిస్తున్న ఒక అందమైన యువకుడు కనిపించాడు. అతడి పేరు బక్తాష్. టర్కీకి చెందిన బానిస. హరిస్ సేవకుడిగా పని చేసేవాడు. అతడిని చూడగానే రబియా మనసు పారేసుకుంది. ఆ క్షణమే రబియా ప్రేమకథ మొదలైంది. ప్రేమ కవిత్వం మొదలైంది. ఆ క్షణమే ఆమె జీవిత విషాదాంతానికి నాంది అయింది.
'రబియా తన ఇష్టసఖి ద్వారా బక్తాష్‌కు ప్రేమలేఖలు పంపించేవారు.
కళ్ళ ముందు లేనివాడా
కళ్ళ ముందే ఉండేవాడా
ఎక్కడున్నావ్?
రా.. వచ్చి, నా కళ్ళకూ హృదయానికీ ఉత్సవాన్ని ప్రసాదించు
లేదా ఖడ్గంతో నా జీవితాన్ని ముగించు'
ఇలాంటి అందమైన ప్రేమలేఖలకు అంతే అందమైన బదులు కూడా వచ్చేది ఆమెకు.
కాందహార్ పాలకుడు బల్ఖ్ మీద దండెత్తినప్పుడు హరిస్ తన సలహాదారులను సంప్రదించి ఓ నిర్ణయానికి వచ్చాడు. బక్తాష్ సాయం లేకుండా తాను శత్రువును జయించలేనని హరిస్ గుర్తించాడు. దాంతో, అతడు బక్తాష్‌ను పిలిచి, శత్రువును అంతం చేస్తే నీకేం కావాలంటే అదిస్తాను అని వాగ్దానం చేశాడు.
బక్తాష్ తుదివరకూ పోరాడాడు. మరణం అంచుల దాకా వెళ్లాడు. కానీ, చివరకు గెలిచాడు.
"యుద్ధంలో చావు తప్పని పరిస్థితి ఎదురైనప్పుడు బక్తాష్‌ను కాపాడేందుకు ఒక ముసుగు సైనికుడు దూసుకొచ్చి శత్రువులను తరిమేశాడు. యుద్ధంలో బక్తాష్‌ను గెలిపించాడు. ముసుగుతో వచ్చిన ఆ సైనికుడు మరెవరో కాదు... రబియా."
వాళ్ళు ప్రేమించుకుంటున్నారని తెలుసుకున్న హరిస్ కోపం పట్టలేక, బక్తాష్‌ను బావిలో పడేయమని ఆజ్ఞాపించాడు. రబియాను స్నానాల గదిలో నిర్బంధించాడు.
రబియా మెడ నరాలను కోసేయాలని హరిస్ ఆదేశించాడని కొందరు చెబుతారు. మరికొందరేమో, ఆమె మణికట్టు నరాలను కోయాలని ఆదేశించాడని చెబుతారు. అమే తన మణికట్టు కోసుకున్నారని మరికొందరు రాశారు.
అయితే, ఆమె తన చివరి కవితలను తన రక్తంతోనే రాశారనే విషయాన్ని మాత్రం ఎవరూ విభేదించలేదు.
'నేను నీ ప్రేమలో బందీనయ్యాను
తప్పించుకోవడం ఇక అసాధ్యం...
సరిహద్దులు లేని సముద్రం ప్రేమ
మంచివాళ్ళెప్పుడూ అందులో ఈదాలనుకోరు..
చివరి క్షణం వరకూ ప్రేమిస్తూనే ఉండాలంటే
ఇష్టం లేని వాటినీ అంగీకరించాలి
కష్టాలను సంతోషంగా స్వాగతించాలి
విషాన్ని తేనెలా సేవించాలి...'
అంటూ ఎన్నో కవితలు రాశారు రబియా.
కొన్ని రోజుల తరువాత బక్తాష్ ఎలాగోలా బావిలోంచి తప్పించుకుని బయటపడ్డాడు. హరిస్ తల నరికేశాడు. కానీ, స్నానాల గదిలో అందమైన రబియా నిర్జీవ దేహం అతడి కంటపడింది. ఆ గది గోడలన్నీ ఆమె రక్తంతో రాసిన ప్రేమ కవితలతో నిండిపోయాయి.
అది చూసిన బక్తాష్ నేల మీద పడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఒక మహిళ... రెండు ముఖాలు

ఫొటో సోర్స్, SHAMIM HOMAYUN
"ఆమె చనిపోయాక ఎన్ని శతాబ్దాల పాటు ఎందరో కవులు ఆమె సౌందర్యాన్ని, హృదయాన్ని కీర్తిస్తూ కవితలు రాశారు" అని ఫర్జాద్ చెప్పారు.
తొలి సూఫీ కవిగా గుర్తింపు పొందిన అబూ సయీద్ అబు అ-ఖయర్ (1049), ఈ ప్రేమకథానాయిక రాసిన కవిత్వం దైవారాధనకు సంబంధించింది కాకపోయినా ప్రేమతత్వాన్నే ఆమె పవిత్ర హృదయంతో రాశారని, అందుకే ఆమె కవిత్వానికి దైవత్వం లభించిందని చెప్పారు. 13వ శతాబ్దానికి చెందిన మరో ప్రఖ్యాత సూఫీ కవి ఫరీద్ అల్-దిన్ అత్తార్ కూడా రబియా జీవిత గాథను రచిచంచారు. ఆయన రచనలోనే అబూ సయీద్ ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఇద్దరు కవుల విశ్లేషణను అర్థం చేసుకుంటే రబియా ఒక నిజమైన సూఫీ కవయిత్రి అని తెలుస్తందని హుమాయూన్ అన్నారు.
వీరి రచనల్లో రబియా ప్రేమ భౌతిక సుఖాలకు సంబంధించినది కాదు, అది ఆధ్యాత్మిక శిఖరాలను అందుకోవడానికి సంబంధించినది.
అంతేకాదు, ఆమె స్త్రీలోని నిఖార్సయిన ధైర్యానికి ప్రతీక అని మరికొందరు ప్రశంసిస్తారు. పురుషస్వామ్య సంప్రదాయానికి ఎదురీదిన మహిళగా ఆమెను కీర్తిస్తారు.
అఫ్గానిస్తాన్ తొలి స్వతంత్ర చిత్రంగా 'రబియా బల్జీ' కొన్ని దశాబ్దాల కింద విడుదనలైనప్పుడు జ్వాందున్ అనే ప్రముఖ పత్రిక, "ఈ సమాజంలో అణచివేతకు గురైన స్త్రీగొంతుకల నుంచి బలంగా చీల్చుకువచ్చిన నిరసన కేక" అని వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, WORLD DIGITAL LIBRARY, LIBRARY OF CONGRESS.
'ఇప్పుడైతే సాధ్యమయ్యేది కాదు...'
ఈ చిత్రంలోనే అబ్దుల్లా షాదాన్ బక్తాష్ పాత్ర పోషించారు. ఈ పాత్రలో నటిస్తూనే ఆయన రాజకుమారితో ప్రేమలో పడ్డారు. అంటే, రబియా పాత్ర పోషించిన సైమాతో ప్రేమలో పడి ఆమెను పెళ్ళి చేసుకున్నారు. ఆ పెళ్ళి అప్పట్లో ఒక సంచలనం.
"అది అత్యంత సంచలన చిత్రం. ఇప్పుడు తాలిబాన్ల పాలనలో అలాంటి సినిమా తీయడం సాధ్యం కాదు. ఆ సినిమా చిత్రీకరణలో దాదాపు 40 మంది మహిళలు పని చేశారు" అని షాదాన్ బీబీసీతో చెప్పారు.
ఆ సినిమా రబియా బలమైన వ్యక్తిత్వాన్నే కాదు ఆమె జీవన విధానాన్ని కూడా ప్రభావవంతంగా చూపించింది. 1970లలో చాలా మంది మహిళలు ఆ సినిమాలో రబియా హెయిర్ స్టయిల్స్, దుస్తులను అనుకరించారు.
నిజానికి, ఈ సినిమాను 1996లో తాలిబాన్ల ఇనుప బంధనాలలో పడి కనిపించకుండా పోయేదే. కానీ, దాదాపు ఆరువేల అఫ్గాన్ చిత్రాలను కాబుల్ లోని నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ వారు ఓ నకిలీ గోడను హడావిడిగా నిర్మించి దాని వెనకాల దాచిపెట్టి కాపాడారు.
అయితే, బల్ఖ్‌లోని రబియా సమాధిని మాత్రం మూసేశారు. సామాజిక కళంకానికి అదొక నిదర్శనమని భావిస్తున్నారు.
రబియా మరణం తరువాత ఆమె పేరు మీద ఎన్నో బాలికల విద్యా సంస్థలు, ఆస్పత్రులు వచ్చాయి. కానీ, ఇప్పుడు మళ్ళీ ఆ దేశంలో మహిళలు చదువుకోవడం అసాధ్యమైన విషయంగా మారింది.
అయితే, రబియా కథ ఈనాటి యువతుల తరానికి కూడా స్ఫూర్తిని ఇస్తోందని చెబుతున్న ఎబ్తికార్ ఏమన్నారో చూడండి: "సమాజంలోని అసహజమైన అడ్డంకులను ఎదిరించి పోరాడేందుకు ఆమె కథ ఎప్పటికీ ఈ సమాజానికి ఒక ప్రేరణ."
ఇవి కూడా చదవండి:
- ఆస్కార్ వేదికపైకి జాన్ సీనా నగ్నంగా ఎందుకు వచ్చారు?
- జింకల్లో కొత్త జాతి గుర్తింపు.. ఇది ఎక్కడ ఉంది?
- సీఏఏ: పౌరసత్వ సవరణ చట్టం అమలుకు నిబంధనలను విడుదల చేసిన కేంద్రం, దీనివల్ల ఏం జరుగుతుంది?
- రోజుల వ్యవధిలో అక్కాచెల్లెళ్లకు ఒకే తరహాలో గుండెపోటు, హఠాత్తుగా వచ్చే సమస్య ఎంత ప్రమాదకరం?
- జీఎన్ సాయిబాబా: ‘నేను ఇంతకాలం బతుకుతానని జైలు అధికారులు కూడా అనుకోలేదు’
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














