‘వడ్డీతో సహా చెల్లిస్తా’.. జైలు నుంచి విడుదలైన తరువాత కవిత ఏమన్నారంటే..

ఫొటో సోర్స్, BRS
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిల్లీలోని తిహాడ్ జైలు నుంచి మంగళవారం రాత్రి విడుదలయ్యారు.
దిల్లీ మద్యం పాలసీ కేసులో కొద్ది నెలలుగా జైలులో ఉన్న ఆమెకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
కేటీఆర్, హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు ఆమెకు స్వాగతం పలికారు.
బుధవారం ఆమె హైదరాబాద్ వెళ్లనున్నట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు.
జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఆమె ‘నేను కేసీఆర్ బిడ్డను, తప్పు చేయను, మొండిదాన్ని, అనవసరంగా నన్ను జైలుకు పంపి జగమొండిని చేశారు. నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసినవారికి వడ్డీతో సహా చెల్లిస్తాం’ అన్నారు.

ఫొటో సోర్స్, KALVAKUNTLA KAVITHA/FACEBOOK
మధ్యాహ్నం బెయిల్ మంజూరు
అంతకుముందు మంగళవారం మధ్యాహ్నం ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో కవితకు బెయిలు ఇవ్వడాన్ని ఈడీ తరపు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె విచారణకు సహకరించడం లేదని, బెయిల్ నిరాకరించాలని కోర్టుని కోరారు.
కవిత తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. ఈ కేసులో కవిత ఐదు నెలలుగా దిల్లీలోని తిహార్ జైలులో ఉన్నారు.
కేసులో దర్యాప్తు పూర్తి కావడం, విచారణ దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉండటాన్ని గుర్తించిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ బెంచ్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
‘‘దర్యాప్తు పూర్తైంది. చార్జ్‌షీట్ ఫైల్ చేశారు. నిందితురాలు ఇంకా కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదు. ఆమె ఐదు నెలలుగా జైలులో ఉన్నారు. కేసు విచారణ త్వరగా పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ కోర్టులో అనేక ఇతర కేసుల్లో చెప్పినట్లే విచారణ ఖైదీలు జైల్లో ఉండి శిక్ష అనుభవించకూడదు.” అని కోర్టు వ్యాఖ్యానించింది.
కవితను మార్చ్ 15న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి దిల్లీ తీసుకొచ్చారు.
దిల్లీ మద్యం విధానంలో అక్రమాల ఆరోపణలకు సంబంధించి సీబీఐ, ఈడీ కేసు నమోదు చేశాయి.
రెండు కేసుల్లో రూ.10 లక్షల చొప్పున వ్యక్తిగత పూచికత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సాక్ష్యాలను ప్రభావితం చెయ్యకూడదని, పాస్‌పోర్ట్‌ను దర్యాప్తు అధికారులకు సమర్పించాలని సూచించింది.
దిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను 2024 ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది.
ఇప్పటి వరకు కవిత దిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, FB/Kalvakuntla Kavitha
దిల్లీ మద్యం పాలసీ కేసు: అసలేం జరిగింది?
2021 వరకూ దిల్లీలో గవర్నమెంటే మద్యం అమ్మేది. తరువాత ప్రైవేటుకు ఇద్దాం అనుకున్నారు. ఆ క్రమంలో పెట్టిన రూల్స్‌లో గోల్‌మాల్ జరిగిందన్నది బీజేపీ ఆరోపణ. దీనిపై సీబీఐ ఎంక్వైరీ వేయించారు నాటి లెఫ్టినెంట్ గవర్నర్. దీంతో మొత్తానికి ఆ పాలసీయే వద్దు, పాత పద్ధతిలోనే వెళ్లాలని నిర్ణయించింది ఆప్ ప్రభుత్వం.
కొంచెం వివరంగా చూస్తే, 2021 నవంబర్ నుంచి కొత్త విధానం అమలయింది. ప్రైవేటు సంస్థలకు మందు అమ్మే పద్దతి ప్రారంభించడంతోపాటు, మాఫియాను నియంత్రించడం, ప్రభుత్వానికి ఆదాయం పెంచడం, వినియోగదారుల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చినట్టు దిల్లీలోని ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త విధానం వల్ల గతం కన్నా ఎక్సైజ్ ఆదాయం 27 శాతం పెరిగి రూ. 890 కోట్లకు చేరుకుందని చెప్పింది.
ఎంఆర్‌పీ కన్నా తక్కువ ధరలకు మద్యం అందించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. అందుకు అనుగుణంగా విక్రయదారులకు డిస్కౌంట్లు అందించింది. తద్వారా వినియోగదారులకు మేలు కలుగుతుందని తెలిపింది.
మద్యం రిటైలర్లు, ఒకటి కొంటే ఒకటి ఉచితంగా ఇస్తూ విక్రయాలు పెంచుకున్నారు. పలు బ్రాండ్లపై ఎంఆర్‌పీ కన్నా తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి రావడంతో దిల్లీలో అమ్మకాలు పెరిగాయి.
ఇలా ప్రైవేటు వారికి అప్పగించే క్రమంలో అనేక అక్రమాలు జరిగాయని, పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందనే ఆరోపణలు వచ్చాయి. వెంటనే సీబీఐ ఎంక్వైరీ జరిగింది. ఆ తరువాత, మనీష్ సిసోదియా ఇంటిలో సీబీఐ సోదాలు చేసింది. ఆ వెంటనే, దీని వెనుక అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె కవిత హస్తం కూడా ఉందని బీజేపీ దిల్లీ నాయకులు ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎఫ్ఐఆర్లో ప్రధాన నిందితుడిగా మనీష్ సిసోదియా
ఈ అక్రమాలపై సీబీఐ 11 పేజీల ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీష్ సిసోదియా ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ ఎఫ్ఐఆర్‌లో మరో 15 మంది పేర్లను జతచేశారు. కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు. పలు చోట్ల సీబీఐ సోదాలు చేసింది.
టెండర్ల తరువాత లైసెన్సు పొందిన వాళ్లకు అనుచితమైన ప్రయోజనాలు అందించడం కోసం, సంబంధిత అథారిటీ అనుమతి లేకుండా నేరుగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఎక్సైజ్ కమిషనర్ గోపీకృష్ణ, సిసోదియాలపై ఆరోపణలు చేసింది సీబీఐ.
''లైసెన్స్ ఫీజులలో లబ్ధి, అనుమతి లేకుండా లైసెన్సును పొడిగించటం వంటి అనుచిత ప్రయోజనాలను లైసెన్సుదారులకు కల్పించటానికి ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయటం సహా అక్రమాలు జరిగాయన్నది ఆరోపణ'' అని సీబీఐ పేర్కొంది.
ఈ మొత్తం వ్యవహారాన్ని నిర్వహించడానికి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ సిబ్బందికి ఆర్థిక ప్రయోజనాలను కల్పించడంలో సిసోదియాకు సన్నిహితులైన కొందరు వ్యాపారవేత్తలు క్రియాశీలంగా పనిచేస్తున్నారని ఈ ఎఫ్ఐఆర్‌లో ఆరోపించారు.
ఎక్సైజ్ పాలసీని అమలు చేయటానికి వీలుగా, అవసరమైన స్వల్ప మార్పులు చేసే అధికారాన్ని దిల్లీ మంత్రిమండలి ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రికి ఇచ్చిందని, కానీ ఆ తరువాత, నాటి లెఫ్టినెంట్ గవర్నర్ సలహా ప్రకారం 2021 మే 21వ తేదీన మంత్రి మండలి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుందని కూడా సీబీఐ పేర్కొంది.
అయినా కూడా, ఉప ముఖ్యమంత్రి, ఇన్‌చార్జ్ మంత్రి అనుమతితో ఎక్సైజ్ విభాగం, ప్రస్తుత ఆరోపణలకు కారణమైన నిర్ణయాలను తీసుకుని అమలు చేసిందని సీబీఐ ఆరోపించింది.
ఈ కొత్త విధానం వచ్చే సరికి దిల్లీ ఎక్సైజ్ కమిషనర్‌గా ఉన్న తెలుగు వ్యక్తి, ఐఏఎస్ అధికారి అరవ గోపీకృష్ణపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆయన్ను సస్పెండ్ చేశారు.

ఫొటో సోర్స్, BRS
ఈడీ ప్రకటనలో ఏముంది?
2024 మార్చి15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది.
ఈ కేసుకు సంబంధించి 2024 మార్చి 17వ తేదీతో విడుదల చేసిన ఒక ప్రకటనను ఈడీ 18వ తేదీన వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది.
''దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోదియా తదితర ఆప్ సీనియర్ నేతలతో కలిసి కవిత దిల్లీ మద్యం పాలసీ రూపకల్పన, అమలులో అక్రమాలకు పాల్పడ్డారు. దీనికి బదులుగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చెల్లించిన రూ.100 కోట్ల ముడుపులలో కవిత ప్రమేయం ఉంది. 2021-22 ఏడాదిలో మద్యం పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారు. అనంతరం హోల్‌సేల్ డీలర్ల నుంచి వచ్చిన లాభాలను వాటాలుగా కవిత, ఆమె అసోసియేట్స్ పంచుకున్నట్లు దర్యాప్తులో తేలింది'' అని ఈడీ ఆ ప్రకటనలో తెలిపింది.
''ఈ కేసులో ఇప్పటివరకు హైదరాబాద్, ముంబయి, చెన్నై సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేశాం. మనీష్ సిసోదియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్‌తో పాటు మొత్తం 15 మందిని అరెస్టు చేశాం. రూ.128.79 కోట్ల ఆస్తులను జప్తు చేశాం” అని ఈడీ ఆ ప్రకటనలో వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
కేసులో ముఖ్య పరిణామాలు, అరెస్టుల వివరాలు
2020 సెప్టెంబరు 04: అప్పటి దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా కొత్త మద్యం పాలసీపై సిఫార్సుల కోసం అప్పటి దిల్లీ ఎక్సైజ్ కమిషనర్ రవి ధావన్ నేతృత్వంలో నిపుణుల ప్యానెల్ ఏర్పాటు చేశారు.
2020 అక్టోబర్ 13: ధావన్ బృందం తన రిపోర్టును దిల్లీ ప్రభుత్వానికి సమర్పించింది. దానిని పబ్లిక్ డొమైన్‌లో ఉంచారు. 14,761 మంది ప్రజలు తమ సూచనలను పంపినట్లు ప్రభుత్వం తెలిపింది.
2021 ఫిబ్రవరి 05: పాత మద్యం పాలసీ, ప్రజల అభిప్రాయాలపై లోతుగా అధ్యయనం చేయడానికి మనీష్ సిసోదియా, పట్టణాభివృద్ధి మంత్రి సత్యేందర్ జైన్, రెవెన్యూ మంత్రి కైలాష్ ఖేలత్ నేతృత్వంలో దిల్లీ ప్రభుత్వం మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేసింది.
2021 మార్చి 22: సిసోదియా నేతృత్వంలోని కమిటీ తన సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గానికి సమర్పించింది. మంత్రిమండలి ఈ కొత్త ఎక్సైజ్ పాలసీని ఆమోదించింది.
2021 ఏప్రిల్ 15: దిల్లీ కొత్త మద్యం విధానం ఫైలును అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు పంపారు. ఆయన కొన్ని సూచనలు చేసి, విధానాన్ని సమీక్షించి అవసరమైన సవరణలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
2021 నవంబర్ 17: దిల్లీ కొత్త మద్యం పాలసీ అమలులోకి వచ్చింది.
2022 జులై 8: మద్యం విధానంపై లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు దిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ ఒక రిపోర్టు అందించారు. మద్యం విధానం రూపకల్పనలో డబ్బు చేతులు మారినట్లు ఆరోపించారు. ఆర్థిక నేరాల విభాగానికి కూడా ఆయన ఈ రిపోర్టును సమర్పించారు.
2022 జులై 22: సీబీఐ విచారణకు సిఫారసు చేస్తూ అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు.
2022 జులై 30: కొత్త ఎక్సైజ్ పాలసీ ఉపసంహరణకు నోటీసు ఇచ్చారు. ఆ తర్వాత ఆరు నెలలకు పాత మద్యం పాలసీని పునరుద్ధరించారు.
2022 ఆగస్టు 6: కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణ సహా దిల్లీ ఎక్సైజ్ శాఖకు చెందిన 11 మంది అధికారులను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా సస్పెండ్ చేశారు.
2022 ఆగస్టు 7: సిసోదియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. వీరిలో అప్పటి ఎక్సైజ్ కమిషనర్ సహా ముగ్గురు అధికారులు ఉన్నారు. వారిపై నేరపూరిత కుట్ర, మోసం అభియోగాలు మోపారు.
2022 ఆగస్టు 19: సిసోదియా ఇంట్లో సీబీఐ సోదాలు చేసింది. అంతేకాదు, కేసు దర్యాప్తులో భాగంగా ఏడు రాష్ట్రాల్లో మొత్తం 21 చోట్ల సోదాలు జరిగాయి.
2022 ఆగస్ట్ 23: దిల్లీ ఎక్సైజ్ పాలసీలో మనీలాండరింగ్ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసింది.
2022 సెప్టెంబర్ 28: ఇండోస్పిరిట్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు, వ్యాపారవేత్త , ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్ నాయర్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.
2022 అక్టోబర్ 8: దిల్లీ, హైదరాబాద్, పంజాబ్ సహా 35 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది.
2022 అక్టోబర్ 10: మద్యం వ్యాపారి అభిషేక్ బోయిన్‌పల్లిని సీబీఐ అరెస్టు చేసింది.
2023 ఫిబ్రవరి, మార్చి: అప్పటి దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాను సీబీఐ, ఈడీలు అరెస్టు చేశాయి. ఆయన ఇప్పటికీ జైలులోనే ఉన్నారు.
2024 మార్చి 15: హైదరాబాద్‌లో సోదాల అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది.
2024 మార్చి 21: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది.
2024 ఏప్రిల్ 02: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
2024 ఏప్రిల్ 11: దిల్లీలోని తిహార్ జైలులో ఉన్న కల్వకుంట్ల కవితను సీబీఐ అరెస్టు చేసింది.
2024 ఆగస్ట్ 27: తిహార్ జైలులో ఉన్న కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















