దిల్లీ లిక్కర్ పాలసీ: కేజ్రీవాల్,కవిత సుప్రీం కోర్టు నుంచి తమ పిటిషన్లు ఎందుకు వెనక్కి తీసుకున్నారు?

కేజ్రీవాల్ అరెస్ట్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఈడీ మొత్తం 9సార్లు సమన్లు పంపింది

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

ఈడీ గురువారం రాత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయగానే అప్పటికప్పుడు అమ్ అద్మీ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ తక్షణం చేపట్టాలని కూడా కోరింది.

కానీ తరువాత కేజ్రీవాల్ ఈడీ రిమాండ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నందున పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్టు ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు తెలిపారు.

సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్ ఈ కేసును విచారించాల్సి ఉంది. ఈ బెంచ్‌లో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా త్రివేది ఉన్నారు.

కేజ్రీవాల్ దిగువ న్యాయస్థానంలో రిమాండ్‌ను ఎదుర్కొంటారని, అవసరమైతే సుప్రీం కోర్టును మరో పిటిషన్‌తో ఆశ్రయిస్తారని అభిషేక్ మనుసింఘ్వీ ఈ కేసు విచారణకు రాకముందే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు నివేదించినట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

దిగువ కోర్టులో శుక్రవారం నాడు కేజ్రీవాల్ రిమాండ్ కేసు వినాల్సి ఉందని, అదే సమయంలో సుప్రీం కోర్టు కూడా ఈ కేసు విచారణకు స్వీకరించినందున, కేజ్రీవాల్ సుప్రీంలో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు.

కేజ్రీవాల్ అరెస్ట్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, బెయిల్ కోసం ముందు ట్రైల్ కోర్టునే ఆశ్రయించాలని చెప్పిన సుప్రీం ధర్మాసనం

కోర్టులో ఏం జరిగింది?

సుప్రీం కోర్టు నుంచి పిటిషన్‌ను ఉపసంహరణ సందర్భంగా ఒకేరోజు రెండు కోర్టులలో విచారణ గురించి ప్రస్తావించగానే జస్టిస్ ఖన్నా ఆయనకు కోర్టును విడిచేందుకు అనుమతిచ్చారు. కానీ కోర్టు మాస్టర్‌కు అందేలా రిజిస్ట్రార్‌కు ఒక లేఖ ఇవ్వాల్సి ఉందని అభిషేక్ తెలపగానే, అందుకు సంజీవ్ ఖన్నా అనుమతిచ్చారు.

గతంలో ఇదే దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.

ఈ నేపథ్యంలో తన బెయిల్ పిటిషన్ విషయంలోనూ ఇలాంటి పరిణామమే ఎదురుకావచ్చని కేజ్రీవాల్ భయపడి ఉండొచ్చని భావిస్తున్నారు.

బెయిల్ కోసం దిగువకోర్టును ఆశ్రయించకుండా నేరుగా సుప్రీంకోర్టుకు రావడం తగదని, ముందు లోయర్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఇదే బెంచ్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ పై దాఖలైన పిటిషన్‌ను కూడా సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఆయనను రాంచీ హైకోర్టుకు వెళ్లమని తేల్చింది.

కవిత, హేమంత్ సోరెన్ ఉదంతాలతో సుప్రీం కోర్టు లో తనకు ఊరట లభించకపోవచ్చనే ఉద్దేశంతో కేజ్రీవాల్ తన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు.

కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో గురువారం రాత్రి ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు.

ఈ కేసుకు సంబంధించి మొత్తంగా ఈడీ కేజ్రీవాల్‌కు 9 సమన్లు పంపింది.

స్వతంత్ర భారతదేశంలో అధికారంలో ఉండగా ఓ ముఖ్యమంత్రి అరెస్ట్ అవడం ఇదే మొదటిసారి. ఈడీ అరెస్ట్ చేయకుండా ఆపలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పిన తరువాత గురువారం రాత్రి ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు.

ఈడీ విచారణ అక్రమమని కేజ్రీవాల్ చెబుతున్నారు. ప్రతిపక్షాలు కూడా కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఖండించాయి.

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తరువాత దిల్లీ సీఎం అరెస్ట్‌తో లోక్‌సభ ఎన్నికలలో ప్రతిపక్షాలను తుడిచిపెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించాయి.

కేజ్రీవాల్ ను విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఈడీ కోర్టును కోరే అవకాశం ఉందని పీటీఐ తెలిపింది.

ఈ కేసును సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ విచారించాల్సి ఉందని, కానీ ఆయన ఇరుపక్షాల న్యాయవాదులను సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు.

కొన్నిరోజుల కిందట ఇదే కేసులో కవితను అరెస్ట్ చేసినప్పుడు కూడా సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్ ఏర్పాటైంది.

కేజ్రీవాల్ అరెస్ట్

ఫొటో సోర్స్, KALVAKUNTLA KAVITHA/FACEBOOK

ఫొటో క్యాప్షన్, కవితను ఈడీ అధికారులు మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు

కవిత కేసులో ఏం జరిగింది?

దిల్లీ మద్యం పాలసీకి సంబంధించి తనకు 2023 మార్చి 7, 11 తేదీలలో ఈడీ జారీచేసిన సమన్లపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అదే ఏడాది మార్చి 15న సుప్రీం కోర్టులో రిట్ పిటిసన్ దాఖలు చేశారు.

ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీచేయాలని, అంతవరకూ దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ ఆమె ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద 2023 మార్చి7, 11 తేదీలలో ఈడీ జారీచేసిన సమన్లు మహిళలను వారు నివసించే చోటే విచారించాలన్న సీఆర్‌పీసీలోని సెక్షన్ 160 నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నాయని, వాటిని కొట్టేయాలని కోరుతూ అప్పట్లో కవిత రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

కానీ కవితను ఈనెల 15వ తేదీన ఈడీ అధికారులు హైదరాబాద్‌లో ఆమె నివాసంలో అరెస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలో గతంలో మార్గదర్శకాలు కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్ నిరర్థకం అయిపోవడంతో ఈ పిటిషన్ ఉపసంహరించుకున్నట్టు ఆమె తరపు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌధరి కోర్టుకు తెలిపారు. ఇందుకు కోర్టు కూడా అంగీకరించింది.

ఇక ఈడీ అరెస్ట్ తరువాత కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్ళాలని సుప్రీం ఆదేశించింది. ఈ కేసులో రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలపై మాత్రమే విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది. ఎవరైనా బెయిల్ కోసం దిగువ కోర్టులను ఆశ్రయించాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

కవిత, హేమంత్ సోరెన్ కేసులలో సుప్రీం కోర్టు స్పందించిన తీరుతో కేజ్రీవాల్ కూడా ట్రయల్ కోర్టు నుంచి వచ్చే ఆదేశాలు తరువాతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తారని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)