అరవింద్ కేజ్రీవాల్: అవినీతిపై పోరాడి, అవే ఆరోపణల్లో చిక్కుకున్న ఆప్ అధినేత ప్రస్థానం ఇదీ

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది.
దిల్లీ మద్యం పాలసీ కుంభకోణంతో ముడిపడిన మనీ ల్యాండరింగ్ కేసులో ఆయన అరెస్టయ్యారు.
2011లో దేశంలో పెద్దయెత్తున జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంతో రాజకీయ పునాది వేసుకున్న కేజ్రీవాల్, నేడు అదే అవినీతి 'మరక'తో అరెస్టయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
సామాజిక కార్యకర్తగా వీధుల్లోకి కేజ్రీవాల్
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివిన కేజ్రీవాల్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్‌ఎస్) అధికారిగా పనిచేశారు.
2002లో కేజ్రీవాల్ ఐఆర్‌ఎస్‌కు వీడ్కోలు పలికి, సామాజిక కార్యకర్తగా దిల్లీ వీధుల్లోకి వచ్చారు.
ఇక్కడే కేజ్రీవాల్ 'పరివర్తన్' పేరుతో ప్రభుత్వేతర సంస్థను స్థాపించారు. కొందరు స్నేహితులతో కలిసి అక్కడ క్షేత్రస్థాయి మార్పులు తీసుకురావాలని భావించారు.
కేజ్రీవాల్ తర్వాత చాలా ఏళ్ల వరకు దిల్లీలోని సుందర్ నగర్‌లో సమస్యలపై పనిచేస్తూ వచ్చారు. సమాచార హక్కు కోసం జరుగుతున్న ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించారు.
సుందర్ నగర్‌లో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఆయన అక్కడే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవారు. అక్కడి ప్రజల ప్రాథమిక అవసరాలు తెలుసుకున్నారు. వాటిని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుండేవారు.
కేజ్రీవాల్‌కు 2006లో 'ఎమర్జింగ్ లీడర్‌షిప్' విభాగంలో రామన్ మెగసెసే అవార్డు దక్కింది. దీంతో ఆయనకు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.
2010లో దిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో చోటుచేసుకున్న అవినీతిపై ప్రజల్లో ఆగ్రహం పెరిగింది.
ఆ సమయంలో ‘ఇండియా అగైనెస్ట్ కరప్షన్’ ఉద్యమం సోషల్ మీడియాలో ఊపందుకొంది. కేజ్రీవాల్ దానిని ముందుండి నడిపించారు.

ఫొటో సోర్స్, Getty Images
లోక్‌పాల్ ఉద్యమం
2011 ఏప్రిల్‌లో గాంధేయవాది, సమాజ సేవకుడిగా పేరు గాంచిన అన్నా హజారే దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర అవినీతికి వ్యతిరేకంగా జన్ లోక్‌పాల్ డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగినప్పుడు, ఆ వేదికపై అన్నా వెనుక కేజ్రీవాల్ కనిపించారు.
2011 ఆగస్టులో దిల్లీ రామలీలా మైదాన్‌లో అన్నాహజారే జనలోక్‌పాల్ కోసం పెద్ద ఉద్యమం చేశారు.
తర్వాత కేజ్రీవాల్ దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సభలు నిర్వహించడం ప్రారంభించారు.
వేదికపైకి రాగానే ఆయన, నేతలపై విరుచుకుపడేవారు. వారి అవినీతి చిట్టాలు విప్పేవారు. దాంతో కేజ్రీవాల్‌కు ఒక 'యాంగ్రీ యంగ్‌మన్' ఇమేజ్ వచ్చేసింది.
వ్యవస్థతో విసిగిపోయిన ఆయన మార్పు కోరుకునేవారు. దాంతో దేశంలో వేల మంది యువత ఆయనతో కలిశారు.
తర్వాత కేజ్రీవాల్ మొదటి అతిపెద్ద ధర్నా 2012 జులైలో జంతర్ మంతర్ దగ్గర జరిగింది. నిరాహారదీక్ష చేస్తున్న కేజ్రీవాల్ మనోబలం పెంచేందుకు అప్పుడు అన్నా హజారే కూడా జంతర్ మంతర్ దగ్గరికి వచ్చారు.
రోడ్డుపై ఉద్యమిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న కేజ్రీవాల్, తన 10 రోజుల నిరాహార దీక్ష ముగియగానే, "మనం చిన్న పోరాటం నుంచి పెద్ద పోరాటం వైపు వెళ్తున్నాం. పార్లమెంటును శుద్ధి చేయాలి. ఇక ఉద్యమం రోడ్డు మీదా ఉంటుంది.. పార్లమెంటు లోపల కూడా జరుగుతుంది. అధికారాన్ని దిల్లీలో అంతం చేసి దేశంలోని ప్రతి గ్రామం దగ్గరకూ చేర్చాలి" అన్నారు.

ఫొటో సోర్స్, AFP
ఆప్ ఏర్పాటు, సీఎం పీఠం
కొన్ని నెలల తర్వాత అంటే 2012 నవంబర్ 26న 'ఆమ్ ఆద్మీ పార్టీ'ని ఏర్పాటు చేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు.
తమ పార్టీలో హైకమాండ్ ఉండబోదని, ప్రజల విరాళాలతో ప్రజా సమస్యలే అజెండాగా ఎన్నికల్లో పోటీ చేస్తామని కేజ్రీవాల్ అన్నారు.
కేజ్రీవాల్ తన కోసం పనిచేయడానికి వాలంటీర్లనూ నియమించుకున్నారు. 2013లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 28 సీట్లు గెలుచుకున్నారు. అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి.
న్యూదిల్లీ నియోజకవర్గంలో అప్పటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్‌పై పోటీ చేసి, కేజ్రీవాల్ 25 వేలకు పైగా ఓట్లతో గెలిచారు. ఆ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు.
దీంతో కాంగ్రెస్ పార్టీతో కలిసే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అయితే, వీలైనంత త్వరగా జన్ లోక్ పాల్ బిల్లును ఆమోదించాలని కేజ్రీవాల్ కోరారు. కానీ, సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ మాత్రం అందుకు సిద్ధంగా లేదు.
చివరికి 2014 ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ దిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసి మళ్లీ వీధుల్లోకి వచ్చారు. మరుసటి సంవత్సరం అంటే 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ 70 సీట్లకు గానూ ఏకంగా 67 ఓట్లు గెలిచింది. 2015 ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ దిల్లీ ముఖ్యమంత్రిగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ తర్వాత 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్ విజయం సాధించింది. ఆప్ 62 చోట్ల విజయం సాధించింది. దీంతో మూడో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కేజ్రీవాల్.
ఇప్పుడు కేజ్రీవాల్ వయసు 55 సంవత్సరాలు.

ఫొటో సోర్స్, Getty Images
ఆప్ విస్తరణ, జాతీయ పార్టీ హోదా
జాతీయ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన స్థాయిని పెంచుకుంది. దానితో పాటు కేజ్రీవాల్ పేరూ మారుమోగింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మెజారిటీ సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఆ తర్వాత దిల్లీ మున్సిపల్ ఎన్నికలలో పార్టీకి మెజారిటీ లభించగా, ఉత్తర్‌ప్రదేశ్ మునిసిపల్ ఎన్నికలలో దాదాపు 100 మంది ఆప్ అభ్యర్థులు విజయం సాధించారు.
గత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆప్ ఐదు స్థానాల్లో విజయం సాధించింది. గత ఏడాది ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీకి జాతీయ పార్టీ హోదా ఇచ్చింది.
కొన్ని నెలల కిందటే 'ఇండియా' కూటమిలో చేరింది ఆమ్ ఆద్మీ పార్టీ.
ఇవి కూడా చదవండి:
- బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన 25 టన్నుల కంటైనర్‌లో ఉన్నవేంటి? అవి డ్రగ్సా, రొయ్యల మేతలో వాడేవా?
- 'కలుపు దెయ్యాల'ను 141 ఏళ్ల కిందట భూమిలో పాతిపెట్టినా చావలేదు... అవి ఇలాఎంతకాలం జీవిస్తాయి?
- జింకల్లో కొత్త జాతి గుర్తింపు.. ఇది ఎక్కడ ఉంది?
- బిర్యానీ ఎలా వండాలి? ఈ వంటకానికి రుచి తెచ్చిపెట్టే సుగంధ ద్రవ్యాలేమిటి
- సర్ ఆర్థర్ కాటన్: గోదావరి జిల్లాల ప్రజలు ఆరాధించే ఈ బ్రిటిష్ అధికారి విగ్రహానికి ఇప్పుడు ఎందుకు ముసుగు వేశారు?
- అనంతపురం: కరవుసీమలో పచ్చదనం ఎలా వచ్చింది? హార్టికల్చర్ సాగులో రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా ఎలా నిలిచింది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














