ఏఎంఎఫ్ఐ: ఏ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత రిస్క్, ఏయే ఫండ్స్ పనితీరు ఏంటో చెప్పే సంస్థ, ఈ సమాచారాన్ని ఎలా వాడుకోవాలి?

మ్యూచువల్ ఫండ్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఐవీబీ కార్తికేయ
    • హోదా, బీబీసీ కోసం

గత కొన్నేళ్ళుగా రీటెయిల్ మదుపరులను విపరీతంగా ఆకర్షిస్తున్న మదుపు మార్గం మ్యూచువల్ ఫండ్స్.

‘మ్యూచువల్ ఫండ్స్ సహి హై’ అనే నినాదంతో మ్యూచువల్ ఫండ్స్‌పై అవగాహన కల్పిస్తోంది భారత మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (AMFI - అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా).

లాభాపేక్ష లేని సంస్థగా 1995లో ఏర్పాటైన ఈ సమాఖ్య మదుపరుల ప్రయోజనాలే ధ్యేయంగా నడుస్తోంది.

అంతేకాక అటు సెబి, ఇటు భారత ప్రభుత్వం వద్ద మ్యూచువల్ ఫండ్ మదుపరుల వాణి వినిపించడానికి కూడా ఈ సంస్థ పనిచేస్తోంది.

నైతిక విలువలతో, పారదర్శకంగా పని చేయడం తమ ప్రధాన లక్ష్యంగా చెప్పుకొంటున్న ఈ సంస్థలో వివిధ ఆర్థిక సంస్థలకు చెందిన అధికారులు సలహాదారులుగా, మార్గనిర్దేశకులుగా ఉన్నారు.

వీరి వెబ్‌సైట్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి సమగ్రంగా అధ్యయనం చేయడానికి అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచారు.

భారతీయ స్టేట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లాంటి ప్రముఖ బ్యాంకులతోపాటు ఆదిత్య బిర్లా, సుందరం మ్యూచువల్ ఫండ్స్ లాంటి సంస్థలు కూడా ఈ అసోసియేషన్‌లో భాగస్వాములుగా ఉన్నాయి.

ఇలా అందరి ప్రాతినిధ్యం ఉండటం వల్ల ఈ సంస్థ అందించే సమాచారాన్ని చాలామంది ఇన్వెస్టర్లు నమ్ముతున్నారు.

మ్యూచువల్ ఫండ్స్

ఫొటో సోర్స్, Getty Images

మదుపరులకు కలిగే ఉపయోగాలు..

ఈ అసోషియేషన్ అందిస్తున్న సమాచారం, దాని వల్ల మదుపరులకు కలిగే ఉపయోగాన్ని చూద్దాం:

1. మ్యూచువల్ ఫండ్స్:

ఈ అసోసియేషన్ వెబ్సైట్లో మ్యూచువల్ ఫండ్స్ ఎలా పని చేస్తాయి, వివిధ రకాలైన మ్యూచువల్ ఫండ్స్, ఏ మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ ఎంత ఉంటుంది లాంటి విషయాలను విపులంగా చర్చించారు.

అలాగే, ఎన్.ఏ.వి, ఎక్స్పెన్స్ రేషియో లాంటి సూచికలకు అర్థం ఏమిటి వాటిని ఏ సందర్భంలో ఎలా అన్వయించుకోవాలో కూడా చెప్పారు. అంతే కాక, మ్యూచువల్ ఫండ్స్‌పై ఉండే అపోహల గురించి కూడా ప్రస్తావించారు.

2. మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీలు:

వివిధ రకాలైన మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎలా మదుపు చేయాలి, చేసిన మదుపును ఎలా వెనక్కు తీసుకోవాలి లాంటి విషయాలను వివరంగా చెప్పారు.

ఇవి మదుపరులకు తమ లావాదేవీలు సులభంగా చేసుకునేలా తోడ్పడతాయి.

3. పారదర్శకత:

పారదర్శకతకు పెద్దపీట వేయడం ఈ అసోసియేషన్ ప్రధాన లక్ష్యం. వివిధ మ్యూచువల్ ఫండ్స్ స్కీం వివరాలు ప్రతి నెలా అందుబాటులో ఉంచుతారు. ఫండ్ పోర్ట్‌ఫోలియో, మార్పులు చేర్పులు తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి.

పైన చెప్పిన వివరాలన్నీ కూడా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మదుపు చేయడం ఎందుకు మంచిది, ఈ మదుపు మార్గంలో ఉండే కష్టనష్టాలు ఏమిటి అనే విధంగా ఉన్నాయి.

వీటి ద్వారా ఎంతో ఉపయోగం ఉన్నప్పటికీ ఏదైనా సదరు మ్యూచువల్ ఫండ్ పనితీరుని మదుపరులకు అర్థం అయ్యేలా చెప్పవు.

అలా ప్రతీ ఫండ్ పనితీరును తెలియచెప్పడానికి అవసరమైన డేటా కూడా ఈ అసోసియేషన్ వారి వెబ్సైట్లో పొందుపరిచారు.

మ్యూచువల్ ఫండ్స్

ఫొటో సోర్స్, tradebrains.in

ఏఎంఎఫ్‌ఐ డేటాతో మదుపు నిర్ణయాలు ఎలా..

నిజానికి డేటా పరంగా ఈ అసోసియేషన్ అందిస్తున్న వివరాలు ఒక పెద్ద భాండాగారం అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఈ అసోసియేషన్ వెబ్సైట్లో‌ని డేటా ఆధారంగా ఉన్న సూచికలు ఏమిటి, వాటిని పరిశీలించి మదుపు నిర్ణయాలు ఎలా తీసుకోవాలో చూద్దాం:

1. నెలవారీ, త్రైమాసిక వివరాలు:

ఈ అసోసియేషన్ వెబ్సైట్లో ప్రతి నెల, త్రైమాసికానికి సంబంధించిన వివిధ మ్యూచువల్ ఫండ్స్ తరగతులలో జరుగుతున్న మార్పుల వివరాలను అందిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ అనే మదుపు మార్గం పనితీరు ఆ నెలలో లేదా త్రైమాసికంలో ఎలా ఉందనే విషయం ఇక్కడ తెలుసుకోవచ్చు.

2. మ్యూచువల్ ఫండ్స్ విలువ (AUM):

ప్రతీ మ్యూచువల్ ఫండ్స్ స్కీం ద్వారా మార్కెట్‌లో మదుపు చేసిన మొత్తం విలువ ఎంత అనేది, ఫండ్ పనితీరు అర్థం చేసుకోవడానికి చాలా కీలకమైన సూచిక. ఆ వివరాలను కూడా ఈ అసోషియేషన్ వెబ్సైట్ నుంచి సులభంగా పొందగలం.

3. మ్యూచువల్ ఫండ్స్ పనితీరు:

మ్యూచువల్ ఫండ్స్ పనితీరుకు సంబంధించిన విలువైన సమాచారం అసోషియేషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఒక మదుపరి రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ పనితీరును పోల్చి చూడాలంటే ఇలాంటి సమాచారం చాలా కీలకం. ఇందుకు ఉదాహరణగా కింద ఇచ్చిన పట్టిక చూద్దాం. ఈ పట్టిక అసోసియేషన్ వారి వెబ్సైట్ నుంచీ తీసుకున్నది.

మ్యూచువల్ ఫండ్స్

ఫొటో సోర్స్, amfiindia.com

ఈ పట్టికను జాగ్రత్తగా గమనిస్తే సదరు మ్యూచువల్ ఫండ్స్ స్కీం పనితీరు గురించిన కీలకమైన వివరాలు మదుపరులకు సులభంగా అర్థమయ్యే విధంగా ఉన్నాయి.

ముందుగా సదరు స్కీం ఎంతటి రిస్క్ కూడుకున్నది అనే విషయం తెలుస్తోంది. అటుపైన గత ఏడాది, మూడేళ్ళు, ఐదేళ్ళు, పదేళ్ళల్లో స్కీం ఎంతగా వృద్ధి చెందింది అనే వివరాలు ఇచ్చారు. వీటితో పాటుగా స్కీం పనితీరుని పోల్చి చూసే బెంచ్ మార్క్ పనితీరు కూడా ఇచ్చారు. అంటే, ఈ డేటా ద్వారా మనకు ఏ స్కీం పనితీరు బెంచ్ మార్క్ కంటే మెరుగ్గా ఉంది అనే విషయంలో స్పష్టత వస్తుంది. ఈ అవగాహన మ్యూచువల్ ఫండ్స్ ఎన్నుకోవడంలో అత్యంత కీలకమైన విషయం.

ఇప్పుడు ఈ స్కీం పనితీరును సూచించే ఈ గణాంకాలను పైన చెప్పిన మ్యూచువల్ ఫండ్స్ విలువతో అనుసంధానం చేసి చూస్తే ఏ స్కీం ఎక్కువ ప్రాచుర్యం పొందింది అనే విషయం తెలుస్తుంది.

మ్యూచువల్ ఫండ్స్

ఫొటో సోర్స్, Getty Images

రాబడిని ఎలా పోల్చుకోవాలి..

ఇప్పుడు ఈ అసోసియేషన్ వారి వెబ్సైట్లో ఇచ్చిన డేటాను, ఇతర సమాచారాన్ని ఎలా క్రోడీకరించాలో ఒకసారి చూద్దాం:

1. ఇతర మదుపు మార్గాల్లో వచ్చే వార్షిక వడ్డీ మ్యూచువల్ ఫండ్స్ మీద వచ్చే రాబడితో పోల్చుకుంటే ఎలా ఉంది? ఈ విషయం తెలియాలంటే AMFI వారి వెబ్సైట్లో ఇచ్చిన బెంచ్ మార్క్ పనితీరు వేరే మదుపుమార్గం ద్వారా వచ్చే వడ్డీతో పోల్చి చూడాలి.

2. మన ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఎంత వరకూ రిస్క్ తీసుకోవచ్చు?

రిస్క్ మీద అవగాహన రావాలంటే రిస్కోమీటర్ పేరు మీద ఇచ్చిన వివిధ వర్గాలలో ఉండే బెంచ్ మార్క్ పనితీరు ఎంత ఉందో చూడాలి.

ఉదాహరణకు ఎక్కువ రిస్క్ ఉండే స్కీములకు, మధ్యస్థంగా రిస్క్ ఉండే స్కీములకు మధ్య పనితీరులో ఎంత తేడా ఉందో చూడాలి. ఈ తేడా ఎక్కువగా ఉంటే అప్పుడు ఎక్కువ రిస్క్ ఉన్న స్కీముల ద్వారా మదుపు చేయడం చెప్పదగిన సూచన. ఒకవేళ ఈ రెండు వర్గాల స్కీములకు సంబంధించిన బెంచ్ మార్క్ పనితీరు ఒకే విధంగా ఉంటే అప్పుడు ఎక్కువ రిస్క్ ఉన్న స్కీం ఎన్నుకోవడం వల్ల ఉపయోగం లేదు.

3. ఒకే రిస్క్ వర్గంలో ఉన్న రెండు స్కీములలో ఏది మంచిది అనే విషయం ఎలా తెలుస్తుంది?

సదరు రెండు స్కీముల మీద వివిధ కాలపరిమితులలో వచ్చిన రాబడిని పరిశీలించాలి. ఆ వివరాలు పైన ఇచ్చిన పట్టికలో ఉన్నాయి.

4. పోర్ట్ ఫోలియో నిర్మాణంలో ఈ డేటా ఎలా ఉపయోగించుకోవాలి?

మన ఆర్థిక లక్ష్యాలకు తగిన విధమైన పోర్ట్ ఫోలియో నిర్మించుకోవడానికి స్కీం ద్వారా వచ్చిన రాబడి, స్కీం విలువ, దీర్ఘ కాల పనితీరు, సదరు స్కీం మదుపు చేస్తున్న రంగాలపై అవగాహన ఉండాలి. ఈ వివరాలన్నీ AMFI వెబ్సైట్లో వివరంగా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)