డే లైట్ సేవింగ్స్: గడియారంలో ఓ గంట ముందు, వెనకలకు జరిపితే ప్రాణాలకు ప్రమాదమా, ఈ విధానాన్ని కొన్ని దేశాలు ఎందుకు వద్దంటున్నాయి?

డేలైట్ సేవింగ్స్ టైమ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జెనిఫర్ చెసాక్
    • హోదా, జర్నలిస్ట్

డేలైట్ సేవింగ్స్ (పగటి వెలుతురుకు అనుగుణంగా గడియారాల్లో మార్పులు) విధానంలోని అనుకూల, ప్రతికూల అంశాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతోంది. కొన్ని దేశాలు ఇప్పటికే ఈ విధానాన్ని వద్దనుకుని వదిలేశాయి.

గత దశాబ్దం కాలంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని దేశాలు, రాష్ట్రాలు డేలైట్ సేవింగ్స్ టైమ్‌ విధానాన్ని పలు కారణాలతో వదిలేశాయి. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి.

డేలైట్ సేవింగ్స్ టైమ్‌ విధానంలో వసంత కాలం(మార్చి-ఏప్రిల్ నెలల మధ్య )లో గడియారంలో ఒక గంటను ముందుకు జరపడం, చలికాలంలో ప్రామాణిక సమయానికి ఒక గంటను వెనక్కి జరపడం చేస్తుంటారు.

ప్యూ రీసెర్చ్ సెంటర్ 2023 పరిశీలన ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సగం దేశాలు అంతకుముందు గడియారంలో ఈ మార్పులను అనుసరించేవి. కానీ, ఈ దేశాలు ఇప్పుడు గడియారంలో ఈ మార్పులను పాటించడం లేదు.

మూడింట ఒక వంతు దేశాలు మాత్రమే ఈ పాత విధానాన్ని అనుసరిస్తున్నాయని ప్యూ రీసెర్చ్ సర్వేలో తెలిపింది.

డేలైట్ సేవింగ్స్

ఫొటో సోర్స్, Getty Images

యూనైటెడ్ స్టేట్స్‌లో అనేక రాష్ట్రాల్లో, యూరప్‌లో పలు దేశాల్లో, కెనడా, ఆస్ట్రేలియా, లాటిన్ అమెరికా, బ్రెజిల్‌లోని పలు ప్రాంతాలు, కరేబియన్‌లు ఇంకా ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇప్పటికీ వారి గడియారాలను డేలైట్ సేవింగ్స్‌ టైమ్‌కు అనుగుణంగా మార్చుతున్నాయి.

కానీ, ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలు మాత్రం ఈ విధానాన్ని పూర్తిగా పక్కనపెట్టేశాయి. వీటిలో చాలా వరకు ఆసియా, ఆఫ్రికాలో ఉన్నాయి.

ఈ పదేళ్లలో, అజర్‌బైజాన్, ఇరాన్, జోర్డాన్, నమిబియా, రష్యా, సమోవా, సిరియా, తుర్కియే, ఉరుగ్వే, మెక్సికోలో చాలా ప్రాంతాలు ఈ విధానానికి స్వస్తి పలికినట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపింది.

అమెరికాలో కూడా హవాయి, అరిజోనాలు కూడా ఈ విధానాన్ని వదిలిపెట్టాయి.

అయితే, డేలైట్ సేవింగ్స్ టైమ్‌ను దేశాలు ఎందుకు వదిలిపెడుతున్నాయి?

డేలైట్ సేవింగ్స్‌ను వదిలిపెట్టేందుకు ప్రధాన కారణం భద్రతా, ఆరోగ్యం, వాతావరణ మార్పులని వైద్య నిపుణులు చెబుతున్నారు.

గడియారాల మార్పులకు, నిద్ర అంతరాయల నుంచి గుండెపోట్ల వరకు వచ్చే ఆరోగ్య సమస్యలకు మధ్య సంబంధాలుంటున్నాయని కొన్ని పరిశోధనలను సూచిస్తున్నట్లు న్యూ మెక్సికో స్టేట్ యూనివర్సిటీ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ జగ్దీష్ కుబ్‌చందనీ చెప్పారు.

‘‘ప్రమాదాలు, మానసిక ఆరోగ్యం, సంక్షేమం వంటి చాలా విషయాలు దీని వల్ల ప్రభావితమవుతున్నట్లు ఇతర అధ్యయనాలు, నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు’’ అని అన్నారు.

అయితే, ఇవన్నీ స్వల్ప కాల ప్రభావాలేనని, మరిన్ని దీర్ఘకాలిక అధ్యయనాలు కావాల్సి ఉందని ఆయన చెప్పారు.

డేలైట్ సేవింగ్స్ వల్ల నిద్ర -మెలకువ ఉండే సమయాల్లో అంతరాయం

డేలైట్ సేవింగ్స్‌కు అనుగుణంగా చేపట్టే గడియారాల మార్పు వల్ల సర్కాడియన్ రిథమ్‌ అంటే వేళకు నిద్ర -మెలకువ ఉండే సమయాలకు అంతరాయం కలుగుతుంది. ఈ అంతరాయం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి.

‘‘మన సర్కాడియన్ రిథమ్‌కు అత్యంత కీలకమైన సింక్రోనైజర్ ఏమిటంటే డేలైట్...అంటే పగటి వెలుతురు. ఒక సింక్‌లో ఉండేలా మన శరీరానికి ఇది సాయం చేస్తుంది’’ అని నిద్ర, వెలుతురుకు బహిర్గతమయ్యే విషయాలపై అధ్యయనం చేసే ఇంజనీర్ టోర్డ్ వింగ్రెన్ చెప్పారు.

ఉదయం పూట వెలుతురు తగిలేలా ఉండటం ఒక సర్కాడియన్ రిథమ్‌ను సూచిస్తుంది. కళ్ల ద్వారా కాంతికి ఎక్స్‌పోజర్ కావడంపై స్పందించే మెదడులోని మన మాస్టర్ బాడీ క్లాక్, హార్మోనల్ ప్రక్రియలను చేపట్టడాన్ని ప్రారంభిస్తుంది. ఈ హార్మోన్‌లు ఒత్తిడి, రక్తపోటు నియంత్రణ, ఆకలి, తృప్తిని కలిగించే స్పందనలను ప్రభావితం చేస్తాయి.

చీకటి సమయానికి బహిర్గతం కావడం కూడా మంచి విషయమే. ఇది మన శరీరంలో మెలటోనిన్‌ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ మన శరీరాన్ని నిద్ర కోసం సిద్ధం చేస్తుంది.

కానీ, గడియారాల మార్పుల వల్ల, సాయంత్రం వేళల్లో అదనపు వెలుతురు మన నిద్ర వేళలను, కాలయాపనలను ఆలస్యం చేస్తుందని కుబ్‌చందనీ వివరించారు.

గడియారాన్ని ముందుకు జరపడం నిజంగా హానికరమైనదేనని క్లినికల్ స్లీప్ మెడిసిన్ జర్నల్‌లో అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు రాసిన 2020 పొజిషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.

డేలైట్ సేవింగ్స్ నేరుగా సోషల్ జెట్‌ లాగ్‌పై ప్రభావం చూపుతుందన్నారు.

సహజమైన నిద్ర -మెలకువ ఉండే వ్యవధికి, పనికెళ్లడం, స్కూల్‌కు వెళ్లడం, ఫ్యామిలీ వంటి పనుల్లో తలమునకలయ్యే జీవనానికి మధ్యన దీర్ఘకాలికంగా ఉండే తప్పుడు అమరికను వర్ణించేందుకు పరిశోధకులు ‘‘సోషల్ జెట్ లాగ్’’ అనే పదాన్ని వాడారు.

సోషల్ జెట్ లాగ్ అనేది ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్, కార్డియోవస్క్యులర్ వ్యాధి, డిప్రెషన్‌కు కారణమవుతుందని తెలిపారు.

కారు ప్రమాదాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డేలైట్ సేవింగ్స్ విధానానికి అనుగుణంగా గడియారాల మార్పుకు, పెరుగుతున్న ప్రాణాంతకమైన కారు ప్రమాదాలకు మధ్య సంబంధం ఉన్నట్లు కనుగొన్న స్పెయిన్‌లోని పరిశోధకులు

డేలైట్ సేవింగ్స్ వల్ల వచ్చే భద్రతాపరమైన సమస్యలు

డేలైట్ సేవింగ్స్ టైమ్ విధానంతో ప్రాణాంతకమైన ట్రాఫిక్ ప్రమాదాలు, పని ప్రాంతాల్లో ప్రమాదాలు, మెడికల్ ఎర్రర్స్ (వైద్యంలో తప్పులు దొర్లడం), మొత్తంగా మరణాలను పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ప్రాణాంతకమైన కారు ప్రమాదాలు, డేలైట్ సేవింగ్స్ టైమ్‌కు మధ్యనున్న సంబంధంపై 2018లో స్పెయిన్‌లోని పరిశోధకులు ఒక పేపర్ రాశారు. అది ఎపిడెమియాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది.

1990 నుంచి 2014 మధ్య కాలంలో స్పెయిన్‌లోని రాజధాని నగరాల నుంచి సేకరించిన డేటా ప్రకారం, రోజువారీ గడియారాన్ని ముందుకు జరిపినప్పుడు ట్రాఫిక్ ప్రమాదాలు 30 శాతం పెరిగినట్లు, వెనక్కి జరిపినప్పుడు 16 శాతం పెరిగినట్లు గుర్తించారు.

డేలైట్ సేవింగ్స్ పని ప్రదేశాల్లో ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయని యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటస్టిక్స్ నుంచి సేకరించిన డేటా అప్లయిడ్ సైకాలజీ జర్నల్‌లో ప్రచురితమైన 2009 నాటి అధ్యయనం తెలిపింది.

గడియారాలను ముందుకు జరిపిన తర్వాత సోమవారం రోజు ఈ ప్రమాదాలు సుమారు 6 శాతం పెరిగినట్లు వారు కనుగొన్నారు.

2021 అబ్జర్వేషనల్ స్టడీలో డేలైట్ సేవింగ్స్ టైమ్ వల్ల మెడికల్ ఎర్రర్స్(వైద్యంలో లోపాలు) పెరుగుతున్నాయా అనే అంశంపై అమెరికాలోని మయో క్లినిక్‌కు చెందిన పరిశోధకులు అధ్యయనం చేపట్టారు.

2010 నుంచి 2017 వరకు అమెరికాలోని వివిధ సౌకర్యాల్లో భద్రతాపరమైన ప్రమాదాలపై స్వతంత్రంగా రిపోర్టు చేసిన డేటాను వీరు పరిశీలించారు. డేలైట్ సేవింగ్స్‌కు అనుగుణంగా గడియారాలను మార్చిన తర్వాత వారం ముందు, వారం చివరిలో సంభవించే మానవ తప్పిదాలను వారు పరిశీలించారు.

మొత్తంగా గడియారాలను ముందుకు జరిపిన తర్వాత ఏడు రోజుల్లో భద్రతాపరమైన ప్రమాదాలు సుమారు 19 శాతం పెరిగినట్లు వారు గుర్తించారు. గడియారాలను వెనక్కి జరిపిన తర్వాత ఏడు రోజుల్లో సుమారు 5 శాతం ప్రమాదాలు సంభవించినట్లు పేర్కొన్నారు.

గడియారాల మార్పుల వల్ల ఉద్యోగులు, కార్మికులు సగటున సుమారు 40 నిమిషాలు తక్కువగా నిద్రపోవడమే ఈ ప్రమాదాలకు కారణమని తేల్చారు.

డేలైట్ సేవింగ్స్‌తో వచ్చే ఆరోగ్య ఇబ్బందులు

సమయాల్లో మార్పుల వల్ల సంభవించే తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాల్లో ఒకటి గుండె పోటు. గుండె ఆరోగ్యంపై డేలైట్ సేవింగ్స్ టైమ్ ప్రభావాన్ని చూపిస్తుందని ఇంటర్నల్ ఎమర్జెన్సీ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన 2018 రివ్యూలో ఇటలీ పరిశోధకులు రాశారు.

అమెరికాలోని ఏడు ప్రస్తుత అధ్యయనాలపై, యూరప్‌లోని 80 వేలకు పైగా గుండె పోటు కేసులపై వారు పరిశోధన చేపట్టారు. గడియారాలను ముందుకు జరిపినప్పుడు గుండె పోట్లు 4 శాతం నుంచి 29 శాతం పెరిగినట్లు గుర్తించారు.

గడియారాల మార్పుల తర్వాత గుండెపోట్లు పెరుగుతున్నాయని అన్నారు. 2004 నుంచి 2013 మధ్య కాలంలో కాలానుగుణంగా గడియారాల మార్పులు చేపట్టిన వారంలో ఆస్పత్రి పాలైన 3 వేల మందిపై పరిశీలన చేపట్టారు.

డేలైట్ సేవింగ్స్ టైమ్ మారిన తర్వాత రెండు రోజుల్లో ఇస్కీమిక్ స్ట్రోక్ వల్ల ఆస్పత్రి పాలైన వారి సంఖ్య 8 శాతం పెరిగినట్లు గుర్తించారు. గడియారాల సమయాన్ని మార్చిన తర్వాత పూర్తి వారాన్ని చూసుకుంటే, ఈ కేసుల సంఖ్య 3 శాతం పెరిగిందన్నారు.

డేలైట్ సేవింగ్స్ వల్ల కార్డియోవస్క్యులర్ హెల్త్, దాంతో పాటు మానసిక స్థితిలో మార్పులకు కారణమవుతుందని పరిశోధకులు గుర్తించారు.

ఎపిడెమియాలజీ జర్నల్‌లో ప్రచురితమైన 2017 అధ్యయనంలో, పరిశోధకులు డానిష్ సైకియాట్రిక్ సెంట్రల్ రీసెర్చ్ రిజిస్టర్‌కు చెందిన రికార్డులను పరిశీలించారు.

1995 నుంచి 2012 మధ్యకాలంలో యునిపోలార్ డిప్రెషన్ కోసం సుమారు 2 లక్షల కాంటాక్ట్‌లపై అధ్యయనం చేశారు. గడియారాల మార్పుల తర్వాత యునిపోలార్ డిప్రెషన్లు 11 శాతం పెరిగినట్లు ఈ పరిశోధకులు కనుగొన్నారు.

క్లాక్ మార్పుల తర్వాత 10 వారాల్లో ఈ పెరుగుదల బాగా కనిపిస్తుందన్నారు.

డేలైట్ సేవింగ్స్‌తో ఇంధన వాడకం తగ్గిందా?

ఈ విధానం అమలు తేదీలలో దేశాల మధ్య తేడాలున్నప్పటికీ, డేలైట్ సేవింగ్స్ టైమ్‌పై తొలుత 1916లో చర్చ జరిగింది. 1784లో కొవ్వొత్తుల వినియోగంపై పరిశీలన జరిపిన తర్వాత, బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఈ విధానాన్ని సూచించారు.

కొవ్వొత్తుల ఖర్చులను తగ్గించుకుని డబ్బులను ఆదా చేసుకునేందుకు మొత్తంగా నిద్ర సమయాలను ప్రజలు మార్చుకోవాలని చెప్పారు.

తొలి ప్రపంచ యుద్ధం సమయంలో డేలైట్ సేవింగ్స్ టైమ్‌ అనుభవాన్ని తొలుత జర్మనీ పొందినట్లు అమెరికా నేషనల్ ఆర్వైవ్స్‌లో తెలిసింది. 1916లో జర్మనీ తొలిసారి ఈ విధానాన్ని అమలు చేసింది.

ఇంధన బిల్లులను ఆదా చేసుకునేందుకు, సాయంత్రం పూట మరింత పగటి వెలుతురు ఉండటం వంటి కారణాలతో డేలైట్ సేవింగ్స్ టైమ్‌ను అమలుపరిచారు.

డేలైట్ సేవింగ్స్ టైమ్ వల్ల ఇంధన ఖర్చుల ఆదా పరిమితంగా ఉంటుందా? మిశ్రమంగా ఉంటుందా? అన్నదానిపై పరిశోధన చేశారు.

అమెరికాకు చెందిన ఒక పాత నివేదికలో ఇంధన వాడకం 0.5 శాతం తగ్గినట్లు తెలిసింది. మరో పాత నివేదికలో 4 శాతం వాడకం పెరిగినట్లు తెలిసింది.

మరోవైపు ఇంధనాన్ని ఆదా చేసుకునేందుకు డేలైట్ సేవింగ్స్ టైమ్‌ను అరిజోనా రాష్ట్రం వదిలేసింది. అమెరికాలో డేలైట్ సేవింగ్స్ విధానాన్ని అనుసరించని కొన్ని రాష్ట్రాల్లో ఇది ఒకటి.

అరిజోనా స్టేట్ యూనివర్సిటీ ప్రకారం, ఈ రాష్ట్రం 1967లో డేలైట్ సేవింగ్స్‌ విధానాన్ని అనుసరించింది. అదే ఏడాది దీన్ని నిలిపివేసింది. ఎందుకంటే, క్లాక్ మార్పుల వల్ల ఇంధన వాడకం పెరుగుతుందని ఇది గుర్తించింది.

ఈ ఎడారి రాష్ట్రం చాలా వేడిగా ఉంటుంది. సాయంత్రం వేళల్లో కూడా ఎక్కువ సమయం పాటు ఏసీలను వాడాల్సి ఉంటుంది. దీంతో ఇంధన వాడకం, ఖర్చులు పెరిగాయి.

అబ్బాయిలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 66 శాతం అమెరికన్ రెస్పాడెంట్లు, 84 శాతం యూరోపియన్లు, 93 శాతం కెనడియన్లు డేలైట్ సేవింగ్స్ విధానాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నట్లు సర్వేల్లో వెల్లడి

డేలైట్ సేవింగ్స్ విధానం భవిష్యత్ ఎలా ఉండనుంది?

గడియారాల మార్పులకు స్వస్తి చెప్పాలని 2018లో యూరోపియన్ కమిషన్ ప్రతిపాదించింది. అయితే, యూరోపియన్ కౌన్సిల్ దీనికి అంగీకరించలేదు.

ఈ మార్పును అందిపుచ్చుకునేందుకు అనుకూలంగా యూరోపియన్ పార్లమెంట్ ఓటేసింది. మార్పు అమల్లోకి రావడానికి యూరోపియన్ కౌన్సిల్, పార్లమెంట్ ఒక ఒప్పందానికి రావాల్సి ఉంది.

రెండు నుంచి మూడేళ్ల క్రితమే స్వీడన్ డేలైట్ సేవింగ్స్ టైమ్‌ను నిలిపివేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, దాన్ని అమలు చేయలేదు.

మరోవైపు ఫ్లోరిడా సెనేట్‌లో సన్‌షైన్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను 2023 మార్చిలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో అమెరికాలో డేలైట్ సేవింగ్స్ టైమ్ విధానం శాశ్వతంగా మారనుంది. అయితే, ఈ ప్రతిపాదిత చట్టం సెనేట్‌లో ఆమోదం పొందినప్పటికీ, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఆమోదం పొందకుండా ఆగిపోయింది.

ఉదయం పూట సూర్యుని వెలుతురు ఆలస్యం, సాయంత్రం వేళ పొడిగింపు అనేవి ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

‘‘మన రోజు మంచిగా ప్రారంభం కావడానికి, మరింత మెరుగైన మానసిక స్థితికి మనకు సహజ వెలుతురు ఎంతో అవసరం’’ అని కుబ్‌చందనీ చెప్పారు.

అందుకే, ఈ విధానంపై అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది.

‘‘ఏడాది పొడవునా ప్రామాణికమైన సమయాన్ని అనుసరించడం వల్ల, మనిషి సర్కాడియన్ బయోలజీ దానికి అనుగుణంగా మారి, ప్రజా ఆరోగ్యానికి, సురక్షితకు మెరుగైన ప్రయోజనాలు అందించనుంది’’ అని ఈ బిల్లుపై స్పందిస్తూ లేఖ రాసింది ఈ సంస్థ.

‘‘ప్రజా ఆరోగ్యమనేది ప్రజల కోసం, ప్రజలకు చెందినది’’ అని కుబ్‌చందనీ అన్నారు. ‘‘అందుకే ప్రజల దృక్పథాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. డేలైట్ సేవింగ్స్ టైమ్ లేదా గడియారాల మార్పు విధానానికి మద్దతూ ఇస్తూ ఎక్కువ పోల్స్ నమోదు కాలేదు’’ అని చెప్పారు.

2018లో చేపట్టిన సర్వేలో యూరోపియన్ కమిషన్‌లో 84 శాతం రెస్పాడెంట్లు డేలైట్ సేవింగ్స్ టైమ్ ముగించాలని కోరుకున్నారు. యూకేలోని యూగౌ సర్వేలో 44 శాతం బ్రిటన్లు మాత్రమే డేలైట్ సేవింగ్స్‌ను కొనసాగించాలని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)