మాస్కోలో 137 మందిని చంపేసిన సంస్థతో భారత్‌కు ముప్పు ఉందా?

దాడులు

ఫొటో సోర్స్, Getty Images

రష్యా రాజధాని మాస్కో పరిసర ప్రాంతంలోని క్రోకస్ కన్సర్ట్ హాల్‌పై దాడి తరువాత మరోసారి ఇస్లామిక్ స్టేట్ వార్తలలో నిలిచింది. ఈ గ్రూపును గతంలో ఐఎస్ లేదా ఐసిస్‌గా పిలిచేవారు.

ఈ దాడిలో 137 మంది చనిపోయారని రష్యా అధికార యంత్రాంగం తెలిపింది.

ఈ దాడి తమ పనేనంటూ ఐఎస్ గ్రూపు ఓ వీడియోను విడుదల చేసింది.

దీనిపై రష్యా స్పందించలేదు. రష్యా అనుమానాలన్నీ యుక్రెయిన్‌పైనే ఉన్నాయి.

యుక్రెయిన్‌ మాత్రం ఈ దాడితో తాము సాధించేదేమీ లేదంటూ స్పందించింది.

కానీ ఈ దాడుల వెనుక ఇస్లామిక్ స్టేట్ ఖుర్సాన్ ప్రావిన్స్ గ్రూపు ఉందనే విషయాన్ని కొట్టిపారేయలేమని అమెరికా చెబుతోంది.

ఇంతకూ ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఏమిటి? దీనిపై ఇండియా ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందా?

రష్యాలో దాడి

ఫొటో సోర్స్, Getty Images

ఇస్లామిక్ స్టేట్ గ్రూపును ఐసిస్ – కె, ఐఎస్‌కేపీ అని పిలుస్తారు. ఖుర్సాన్ అనే పదం అఫ్గానిస్థాన్, పాకిస్తాన్ సరిహద్దు దేశాలను, మధ్య ఆసియా దేశాలను సూచిస్తుంది. ఈ గ్రూపు అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌లలో చురుకుగా ఉంది.

అఫ్గనిస్తాన్‌లోని అన్ని అతివాద జిహాదీ గ్రూపుల కంటే ఈ ఐఎస్‌కేపీని చాలా ప్రమాదకరమైనదిగా పరిగణిస్తుంటారు. ఇస్లామిక్ స్టేట్ ఇరాక్, సిరియాలలోని ఎక్కువ భాగాలను ఆక్రమించుకున్న సమయంలో 2014-15 మధ్య ఈ సంస్థ పురుడుపోసుకుంది.

ఐఎస్‌కేపీకి తాలిబాన్లతో అనేక విభేదాలు ఉన్నాయి. ఐఎస్‌కేపీ అప్గాన్ నుంచి జిహాదీలను నియమించుకుంటుంది. తాలిబాన్ ఇక ఎంతమాత్రం తిరుగుబాటు గ్రూపు కాదని ఈ సంస్థ భావిస్తోంది. అలాగే పాకిస్తాన్‌లోకి ఈ గ్రూపు విస్తరిస్తోంది.

అప్గానిస్తాన్‌లో తూర్పు ప్రావిన్స్‌ అయిన నాన్‌గ్రహర్‌లో వీరికి మూడు నుంచి ఐదు వేల మంది సభ్యులున్నారని భద్రతా నిపుణులు చెబుతున్నారు.

అయితే తాలిబాన్లు, అఫ్గాన్ భద్రతా దళాలు, అమెరికా సంయుక్త దళాలతో జరిగిన పోరులో చాలా మంది సభ్యులను ఇది కోల్పోయింది. పాకిస్తాన్, అప్గానిస్తాన్ మధ్య మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా నాన్‌గ్రహర్ మార్గం నుంచే జరుగుతుంది.

ఆగస్టు 15న తాలిబాన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు, పుల్ – ఎ – చర్కీ జైలు నుంచి పెద్ద సంఖ్యలో ఖైదీలను విడుదల చేశారు. వీరిలో ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా సంస్థలకు చెందిన మతతత్త్వవాదులు ఉన్నారు.

రష్యాలో దాడి

ఫొటో సోర్స్, Getty Images

తాలిబాన్లతో సంబంధం ఉందా?

ఐఎస్‌కేపీకు తాలిబాన్లతో సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు సంస్థలు హక్కానీ నెట్ వర్క్ ద్వారా కలిసి పనిచేస్తుంటాయి. ఐఎస్‌కేపీకు హక్కానీ నెట్ వర్క్ మధ్య బలమైన సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

కాబూల్ భద్రతను తాలిబాన్లు ఖలీల్ హక్కానీకి అప్పచెప్పారు.

ఖలీల్ హక్కానీపై అమెరికా 5 మిలియన్ డాలర్ల నజరానా ప్రకటించింది.

ఆసియా పసిఫిక్ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ సజ్జన్ గోహెల్ అప్గానిస్తాన్ పరిణామాలను ఏళ్ళ తరబడి గమనిస్తున్నారు.

‘‘2019-2021 నుంచి మధ్య జరిగిన అనేక పెద్ద పెద్ద దాడులలో ఐఎస్‌కేపీ హక్కానీ నెట్ వర్క్ ఉమ్మడి పాత్ర ఎక్కువగా ఉంది. పాకిస్తాన్‌లో హక్కానీ నెట్ వర్క్, ఇతర తీవ్రవాద సంస్థలు చురుకుగా ఉన్నాయి’’ అని ఆయన చెప్పారు.

అయితే ఐసిస్‌కేపీకు తాలిబాన్లతో అనేక విభేదాలు ఉన్నాయి.

తాలిబాన్లు జిహాదీ మార్గాన్ని వదిలేశారని, ఖతార్ రాజధానిలోని దోహాలోనీ విలాసవంతమైన హోటళ్ళతో బేరమాడే శక్తిని తాలిబాన్లు కోల్పోయారని ఆ సంస్థ ఆరోపిస్తోంది.

తాలిబాన్ పాలనకు ఇస్లామిక్ స్టేట్ మతతత్వవాదుల నుంచి సవాళ్ళు ఎదురుకానున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

అప్గానిస్తాన్‌లో కొన్నేళ్ళుగా జరిగిన ఆత్మాహుతి దాడుల బాధ్యతను ఇస్లామిక్ స్టేట్ ఖురసాన్ బ్రాంచే తీసుకుంది. వీళ్ళు బాలికల పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రసూతి ఆస్పత్రులపై దాడులు చేశారు.

అమెరికా దళాలు అప్గానిస్తాన్ నుంచి 2021లో వైదొలగిన సందర్భంలో కాబూల్ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడిలో 170 మంది చనిపోవడానికి కారణం తామేనని ఐఎస్‌కేపీ ప్రకటించుకుంది.

ఈ సంస్థకు పాశ్చత్య దేశాలే లక్ష్యం. అయితే ఇప్పడు రష్యాపై ఎందుకు దాడిచేసిందనేది ప్రశ్నగానే ఉంది.

లష్కరే తోయిబాతో సంబంధాలు

సిరియాలో ఐఎస్‌కేపీ పోరాటానికి రష్యా వ్యతిరేకంగా నిలిచింది. సోవియట్ కాలంలో అప్గానిస్తాన్‌పై రష్యా దాడులు చేయడం, చెచెన్యాలోని ఇస్లామిక్ తిరుగుబాటు దారులపై రష్యా చర్యలు తీసుకోవడం ఈ సంస్థకు రుచించలేదు.

ఈజిప్ట్‌లో రష్యన్ విమానాన్ని2015లో పేల్చి వేశారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుని, విమాన ప్రమాదానికి కారణమైన బాంబును తమ మ్యాగజైన్‌లో ప్రచురించింది.

కాబూల్‌లో 2022లో రష్యన్ ఎంబసీ బయట ఆత్మాహుతి పేలుడు కూడా తన పనేనని ఈ సంస్థ చెప్పింది.

ఇప్పటిదాకా అయితే ఇస్లామిక్ స్టేట్ ఆర్గనైజేషన్ భారత్‌లోకి ప్రవేశించలేకపోయింది. ఈ సంస్థకు భారత్ వ్యతిరేక సంస్థలైన జైషే మహ్మద్, లష్కరే తోయిబా లాంటి సంస్థలతో సంబంధాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)