వ్లాదిమిర్ పుతిన్: రష్యా అధ్యక్షుడిని అత్యంత శక్తిమంతంగా మార్చిన ఆ మూడు కారణాలు ఇవే...

పుతిన్

ఫొటో సోర్స్, GETTY IMAGES/BBC

ఫొటో క్యాప్షన్, రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఐదోసారి ఎన్నికయ్యారు
    • రచయిత, హరియట్ ఒర్రెల్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

వ్లాదిమిర్ పుతిన్. ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2030వరకు అధ్యక్షుడిగా ఉంటారు. తన గెలుపు రష్యాను శక్తిమంతం చేస్తుందని, ప్రగతిపథంలో పయనింపచేస్తుందని పుతిన్ చెప్పారు.

పుతిన్‌కు ఎన్నికలలో 87శాతం ఓట్లు వచ్చాయి. కిందటిసారి ఎన్నికల్లో ఆయనకు 76.7శాతం ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి ప్రత్యర్థులు ఎవరు పోటీ చేయకుండా చేయడంతోపాటు రాజకీయ వ్యవస్థను, మీడియాను, ఎన్నికలను క్రెమ్లిన్ తొక్కిపెట్టింది.

రష్యాలో ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా సాగలేదని పశ్చిమ దేశాలు ఖండించాయి.

యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ కూడా ఈ ఆరోపణలు చేసినవారిలో ఒకరు. పుతిన్ ఓ నియంత అని, ఆయనకు అధికారం వ్యసనంలా మారిందని అభివర్ణించారు.

పుతిన్‌కు ఇప్పుడు 71 ఏళ్ళు. ఆయన మొట్టమొదటిసారి 1999లో రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జోసెఫ్ స్టాలిన్ తరువాత అత్యధికాలం అధ్యక్షునిగా ఉన్నది పుతినే. ఇప్పుడు స్టాలిన్ రికార్డును కూడా ఆయన బద్దలు కొట్టారు.

రష్యా -యుక్రెయిన్ యుద్ధం మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఎంతోమంది రష్యన్లు ఈ యుద్ధంలో చనిపోతున్నారు. పశ్చిమదేశాలు రష్యాను ఏకాకిని చేశాయి.

అయినా పుతిన్ శక్తిమంతంగా మారడానికి గల మూడు కారణాలు తెలుసుకుందాం.

పుతిన్

ఫొటో సోర్స్, GETTY IMAGES/BBC

ఫొటో క్యాప్షన్, పుతిన్ ‌ను తీవ్రంగా విమర్శించిన అలెక్సీ నావల్నీ జైల్లో మృతి చెందారు

1. వ్యతిరేక గళాల అణచివేత

పాత్రికేయుడు అండ్రీ సొల్దతోవ్ ప్రస్తుతం లండన్ ప్రవాసంలో ఉన్నారు. 2020లో ఆయన బలవంతంగా రష్యాను వీడాల్సి వచ్చింది.

‘‘దేశంలో జరిగే రాజకీయ చర్చలన్నింటినీ ఎలా అణచివేయాలో పుతిన్‌కు బాగా తెలుసు. ఈ విషయంలో పుతిన్ ఘటికుడు. తన రాజకీయ ప్రత్యర్థులను ఏరిపారేయడంలో ఆయన నిజంగా దిట్ట’’ అని చెప్పారు.

2024 ఎన్నికల బ్యాలెట్‌లో పుతిన్ కాకుండా మరో ముగ్గురు అభ్యర్థుల పేర్లు మాత్రమే ఉన్నాయి. వీరెవరికీ పుతిన్‌తో తలపడే స్థాయి లేదు. వీరంతా యుక్రెయిన్‌తో యుద్ధం విషయంలో పుతిన్‌ను సమర్థించినవారే.

పుతిన్‌ కు వ్యతిరేకంగా ఉన్నవారిని జైల్లో పడేయడమో, చంపడమో, లేదంటే వారు దేశం విడిచిపోయేలా చేయడమో చేస్తారు. కానీ ఇలాంటి పద్ధతులేవీ తమ దేశంలో లేవని రష్యన్ ప్రభుత్వం ఖండిస్తుంది.

రష్యా అధ్యక్ష ఎన్నికలు ఇంకా ఒక నెలలో మొదలవుతాయనగా, పుతిన్ బద్ధశత్రువు 47 ఏళ్ళ అలెక్సీ నావల్నీ జైల్లో మరణించారు.

మోసం, కోర్టు ధిక్కరణ, తీవ్రవాదం తదితర అభియోగాలపై ఆయనకు జైలుశిక్ష పడింది. అయితే ఈయనపై మోపిన అభియోగాలన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని చెబుతారు.

పుతిన్‌ను వ్యతిరేకించిన ఉన్నతస్థాయి రాజకీయ నాయకులు, జర్నలిస్టులు చనిపోయారు.

ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూప్ నాయకుడు ప్రిగోజిన్ విమానం కూలిన దుర్ఘటనలో మరణించారు.

రష్యా సైన్యానికి వీరు ఎదురుతిరిగిన కొన్ని నెలల తరువాత ఈ ఘటన జరిగింది.

పుతిన్‌ను బహిరంగంగా విమర్శించే బోరిస్ నెమ్‌త్సోవ్ ను కూడా 2015లో క్రెమ్లిన్ బ్రిడ్జిపై కాల్చి చంపారు.

2006 మొదట్లో చెచెన్యా యుద్ధ సమయంలో జర్నలిస్ట్ అన్నా పోలిత్కోవస్కయాను మాస్కోలో కాల్చి చంపారు.

‘‘జర్నలిస్టులు హత్యకు గురయ్యేచోట, రాజకీయనాయకులు, హక్కుల కార్యకర్తలు జైళ్లలో చనిపోయే దేశంలో జీవించడం నిజంగా భయానకం’’ అన్నారు సోల్దతోవ్.

‘‘మానసికంగా ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే సాధారణ జనం క్రెమ్లిన్‌ ఏం చేసినా తలవంచుతున్నారు. బతికి ఉండటం ముఖ్యం కాబట్టి వారు అలా చేస్తున్నారు. అంతేకానీ క్రెమ్లిన్ చేసే పనులన్నింటినీ వారు సమర్థిస్తున్నారని కాదు’’ అంటారు సోల్దతోవ్.

సాధారణ ప్రజానీకంలో ఉండే అసమ్మతిని కూడా పుతిన్ అణచివేయడానికి ప్రయత్నించారు. యుక్రెయిన్‌పై దాడి తరువాత 2022లో క్రెమ్లిన్ కొత్త సెన్సార్‌షిప్ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ వ్యతిరేక భావాలు, రష్యన్ మిలటరీని చులకన చేయడాన్ని నేరంగా ప్రకటించారు.

ఈ చట్టం కింద నేరం రుజువైతే ఐదేళ్ళు జైలు శిక్ష విధిస్తారు.

ఎలక్షన్ల సందర్భంగా జరిగిన నిరసనలు ఎటువంటి ప్రభావాన్ని చూపలేదని అధ్యక్షుడు పుతిన్ చెప్పారు.

‘‘దేశం చాలా బలహీనంగా ఉందని పుతిన్ నమ్ముతున్నారు’’ అంటారు సోల్దతోవ్. అందుకే దేశంలో ఏ తరహా అసమ్మతినైనా అణిచివేయాలని పుతిన్ చూస్తారు. కేవలం ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు రోడ్డుపై నిరసన వ్యక్తం చేసినా అది తదుపరి విప్లవానికి దారి తీయవచ్చని భావిస్తున్నారు.

పుతిన్

ఫొటో సోర్స్, GETTY IMAGES/BBC

ఫొటో క్యాప్షన్, రష్యా, యుక్రెయిన్ యుద్ధం మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది

2. రష్యా – యుక్రెయిన్ యుద్ధం

ఎన్నికల తరువాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పుతిన్ మాట్లాడుతూ యుక్రెయిన్‌పై దాడులు కొనసాగుతాయని ప్రకటించారు.

యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టి మూడేళ్ళవుతున్నా చాలామంది అనుకున్నంత త్వరగా విజయం సాధించలేకపోతోంది. పుతిన్ ఈ యుద్ధాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారని బెర్లిన్ లోని రష్యన్ రాజనీతిజ్ఞుడు డాక్టర్ ఎక్టారినా షల్మన్ చెప్పారు. ‘‘ఇది రష్యన్లు తమను తాము చూసుకునే విధానాన్ని, బయటి ప్రపంచాన్ని, వారి నాయకులను చూసే తీరును ప్రభావితం చేసింది’’ అంటారు.

ఫిబ్రవరి 24, 2022 న జరిగిన దాడి దేశం వెలుపల ఉన్నవారికి కనిపించినట్టుగా దేశం లోపలివారికి పెద్దవిషయంగా కనిపించలేదని గట్టిగా నమ్ముతున్నారు ఎక్టారినా షల్మన్.

మొదట్లో రష్యన్లకు ఇది గొప్పగానే అనిపించింది. ఎప్పుడైతే సెప్టెంబర్ 2022న సైనిక సేకరణ మొదలైందో అప్పుడు వారి ఆందోళనలు తారస్థాయికి చేరాయి. ప్రజలు చాలా భయపడిపోయారు. యుద్ధంపట్ల ప్రజలలో విముఖత పెరిగింది.

ఇదే విషయాన్ని సోల్దతోవ్ కూడా నమ్ముతున్నారు.

‘‘యుద్ధానికి రష్యన్ల మద్దతు తగ్గిందనే విషయాన్ని పుతిన్ మార్చేస్తున్నారు’’ అంటారాయన.

అయితే యుక్రెయిన్ ‌పై యుద్ధంలా కాకుండా యుక్రెయిన్‌కు సహకరించే దేశాలపై యుద్ధం అనే రీతిలో పుతిన్ చేసిన వ్యాఖ్యలు జనంలో మరో కోణాన్ని తట్టిలేపాయి.

‘‘ఇక ఇదెంత మాత్రం యుక్రెయిన్‌తో యుద్దం కాదు. పశ్చిమ దేశాలతో యుద్ధం. ఇది చాలామంది రష్యన్లను గర్వపడేలా చేస్తోంది. ఎందుకంటే యుద్ధం ఓ చిన్నదేశంతో కాకుండా, ఓ పెద్ద శత్రవుతో కూడా పోరాడుతున్నారనే భావనలోకి వెళుతున్నారు’’ అని చెప్పారు సోల్దతోవ్.

ఫిబ్రవరి 29న పుతిన్ తన ప్రసంగంలో యుక్రెయిన్‌కు బలగాలు పంపడంపై పశ్చిమదేశాలను హెచ్చరించారు.

స్వీడన్, ఫిన్లాండ్ నాటోలో చేరితే తమ భద్రతను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.

‘‘దేశంలో నాతో సహా ప్రతి ఒక్కరికి స్కూల్లో ప్రపంచంలో రష్యా ఒక్కటే సామ్రాజ్యమని, దానిని ప్రజలు శాంతియుతంగా నిర్మించుకున్నారని’’ బోధించారని చెప్పారు సోల్దతోవ్.

‘‘ప్రతి ఒక్కరు మనపై దాడిచేయడానికి ప్రయత్నిస్తున్నారనే పుతిన్ మాటలను జనం నమ్మాలంటే నాటో బలగాలు రష్యా బోర్డర్ వైపు కదిలితే, అప్పుడు జనం పుతిన్ కథలు నమ్ముతారు’’ అన్నారు సోల్దతోవ్.

యుక్రెయిన్ పై యుద్ధానికి సంబంధించిన విషయాలను పశ్చిమ దేశాలు కూడా ప్రపంచానికి బలంగా చెప్పలేకపోయాయంటారు సోల్దతోవ్.

‘‘ఉదాహరణకు ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని ప్రజలు ఈ యుద్ధాన్ని తామెందుకు లెక్క పెట్టాలనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. సరిగ్గా ఈ గ్యాప్‌నే పుతిన్ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారని’’ ఆయన చెప్పారు.

పుతిన్

ఫొటో సోర్స్, GETTY IMAGES/BBC

ఫొటో క్యాప్షన్, మాస్కోలోని రష్యా సెంట్రల్ బ్యాంక్ భవనం

3.ఆర్థిక శక్తి

యుక్రెయిన్‌పై యుద్ధం తరువాత రష్యాపై అనేక ఆంక్షలు విధించినా, ఆర్థికరంగంలో రష్యా దూసుకుపోవడం అనేకమంది ఆర్థికవేత్తలను ఆశ్చరపరుస్తోంది.

‘‘దేశ ఆర్థికరంగం చక్కగా ఉంది’’ అని బీబీసీ రష్యన్ బిజినెస్ కరస్పాండెంట్ అలెక్సీకాల్మీకోవ్ చెప్పారు. ‘‘ఇది కూడా పుతిన్ ప్రతిష్ఠను పెంచింది. రష్యన్ ఆర్థిక వ్యవస్థపై దాడిచేస్తున్న పశ్చిమ దేశాలను ఎదురొడ్డి నిలుస్తున్నందున కూడా ఆయన పరపతి పెరిగింది’’ అని చెప్పారు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనాల ప్రకారం రష్యా ఆర్థిక వ్యవస్థ 2.6 శాతం పెరిగింది. 300 బిలియన్ డాలర్ల రష్యన్ ఆస్తులను స్తంభింపచేశాకా, అనేక ఆంక్షలు విధించాక , ఇక రష్యా ఆర్థికంగా కోలుకోవడం కష్టమని భావించారు.

అయితే ఈ ఆంక్షలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఏకరీతిలో అమలు చేయలేదు. దీనివల్ల రష్యా చైనా, ఇండియా, బ్రెజిల్‌తో పాటు, పొరుగుదేశాలైన కజికస్తాన్, ఆర్మేనియాతో స్వేచ్ఛగా వాణిజ్యం చేయగలుగుతోంది. ఇది పశ్చిమదేశాల ఆంక్షలను తట్టుకోవడానికి సహాయపడుతోంది.

కాల్మీకోవ్ ఈ విషయాన్ని మరింత వివరిస్తూ ‘‘రష్యా వస్తు ఎగుమతి ద్వారా డబ్బు సంపాదిస్తుంది. తనకు నచ్చిన ధరలకు వస్తువులను విక్రయిస్తుంది. చమురుపై ఆంక్షలు కేవలం అలంకారప్రాయంగా మారాయి. రష్యా నుంచి సహజ ఇంధనం, న్యూక్లియర్ ఇంధనం కొనుగోలుచేసేది యురోపియన్ దేశాలే. కానీ యురోపియన్ యూనియన్ వాటిపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు’’ అని చెప్పారు.

‘‘ఇదంతా ఆటలో భాగం. కానీ ఒక విషయం మాత్రం నిజం. పుతిన్ ప్రచార యంత్రాంగం తన పని తాను చేయడంలో చాలా గట్టిగా ఉంది’’ అని కాల్మీకోవ్ చెప్పారు.

ఏదేమైనా పుతిన్ గతంలో కంటే మరింత శక్తిమంతంగా కనిపిస్తున్నారు. కానీ ఎప్పటికైనా అది ముగియాల్సిన కథేనంటారు డాక్టర్ షల్మన్.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)