ఈజిప్ట్ పిరమిడ్లు దెబ్బతింటున్నా బాగు చేయకూడదా... ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
ఈజిప్టులోని గిజా పిరమిడ్‌ను నాలుగున్నర వేల సంవత్సరాల క్రితం నిర్మించారు. గొప్ప నాగరికత శక్తి, సామర్థ్యాలకు ప్రతీకగా గిజా పిరమిడ్ నిలిచింది. కైరోకు నైరుతి దిశగా ఎడారిలో ఇది ఉంటుంది. అయితే, గిజాతో పాటు దానికి సమీపంలో నిర్మించిన మరో రెండు పిరమిడ్లు ముందు ఉన్నట్లుగా లేవు.
గత కొన్ని దశాబ్దాల్లో వీటికి చాలా నష్టం జరిగింది. పిరమిడ్ల లోపల ఉంచిన సంపదను దోచుకెళ్లారు. నిర్మాణం బయటి పొర కూడా దెబ్బతింది.
ఇప్పుడు గిజాకు చెందిన మెనకౌరే పిరమిడ్‌పై పెద్ద వివాదం నెలకొంది. ఈజిప్టులోని యాంటిక్విటీస్ డిపార్ట్‌మెంట్ ఈ పిరమిడ్లను పునరుద్ధరించాలని అనుకుంటోంది. వాటికి మరమ్మతుల చేసి మెరుగులు దిద్దాలని భావిస్తోంది.
ఈ ప్లాన్‌ను శతాబ్దపు అతిపెద్ద ప్రాజెక్టుగా పేర్కొన్న ఈజిప్టు యాంటిక్విటీస్ డిపార్ట్‌మెంట్ అధిపతి, ఇది ప్రపంచానికి ఈజిప్టు ఇచ్చిన బహుమతిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
కానీ, చాలామంది ఈ పునరుద్ధరణ ప్రాజెక్టు, పురావస్తుశాఖ పరిరక్షణ నియమాలు, నిబంధనలకు అనుగుణంగా లేదని భావిస్తున్నారు.
ఈ ప్లాన్ మీద ఈజిప్టుతో పాటు బయటి నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఈ కారణంగా, బహుశా అడ్మినిస్ట్రేషన్ ఈ అంశం మీద ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
పిరమిడ్ల సమస్య
ఈజిప్టు పిరమిడ్లు నిజానికి సమాధులని యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన ఈజిప్టాలజీ ప్రొఫెసర్ ఈడెన్ డాడ్సన్ అన్నారు. రాయల్ పిరమిడ్లు ఒక ప్రత్యేక రకమైన పిరమిడ్లు అని ఆయన చెప్పారు. వీటికి మూడు అంశాలుంటాయని, అందులో ఒకటి వాటి ఎత్తు (పాయింటెడ్ టాప్) అని వివరించారు.
‘‘రాయల్ పిరమిడ్ లోపల ఒక గది ఉంటుంది. అందులో ఒక సమాధి ఉంటుంది. కొన్ని నమ్మకాల ప్రకారం, ఇది మరణానంతర పడకగది. రాజ సమాధికి సంబంధించిన మరో అంశం ఏంటంటే, మరణించిన వ్యక్తి ఈ ప్రపంచంతో పాటు, ఇతర ప్రపంచానికి మధ్య సంప్రదింపులు జరుపుతారని నమ్ముతారు.
అందుకే, అక్కడ ఒక మందిరం లేదా ప్రార్థనా స్థలం కూడా ఉంటుంది. ప్రజలు ప్రార్థనలు చేసుకోవచ్చు. మరణించిన వారికి అర్పణలు చేయవచ్చు. అక్కడ మృతుల ఆత్మ ఈ ప్రపంచంలోకి వస్తుందని నమ్ముతారు. పిరమిడ్ల నిర్మాణ సమయంలో అంటే క్రీ.పూ 2600- క్రీ.పూ 1550 మధ్య కాలంలో పిరమిడ్లను ఈ రెండు కోణాలలో చూశారు. అప్పటివారికి అవి సమాధులు, అలాగే ప్రార్థనస్థలాలు కూడా’’ అని ఆయన వివరించారు.
రాయల్ పిరమిడ్ల కోసం పిరమిడ్ ఆకారాలను ఎందుకు ఎంచుకున్నారనే అంశం గురించి నిర్దిష్టంగా ఏదైనా చెప్పడం కష్టమని ఈడెన్ డాడ్సన్ అన్నారు. కానీ, పిరమిడ్ ఆకారం ఎంచుకోవడానికి ఈజిప్టులో ‘రా’ అని పిలిచే సూర్య దేవుడికి సంబంధం ఉండొచ్చని ఆయన భావించారు. ఈజిప్టు పురాణాల్లో సూర్యదేవుడిని దేవుళ్లందరికీ తండ్రిగా పరిగణిస్తారు.
పిరమిడ్ ఆకారం, ఆకాశం నుంచి భూమ్మీద పడే సూర్యకిరణాల వ్యాప్తిని ప్రతిబింబిస్తుందనేది మరో నమ్మకం. గిజాలోని మూడు పిరమిడ్లలో మెన్‌కౌరే పిరమిడ్ అతిచిన్నది. దాని ఎత్తు 60 మీటర్లు. దాని అడుగుభాగం నేల మీద అన్ని దిశల్లో 100 మీ. వరకు వ్యాపించి ఉంటుంది.
మెన్‌కౌరే పిరమిడ్ చిన్నదైనప్పటికీ ఇతర పిరమిడ్ల కంటే అద్భుతంగా ఉంటుందని డాడ్సన్ భావిస్తున్నారు. ఆ పిరమిడ్ కింది భాగంలోని గోడలు గ్రానైట్‌తో కప్పి ఉంటాయి.
అన్ని పిరమిడ్ల బయటివైపు గోడలు ఇప్పుడు దాదాపు మెట్లలా తయారయ్యాయి. కానీ, ఒకప్పుడు ఈ గోడల మీద నున్నటి రాళ్ల పొర ఉండేది.
ఇందుకోసం పాలిష్ చేసిన సున్నపురాయిని వాడారు. మెన్‌కౌరే పిరమిడ్ దాదాపు సగభాగం గ్రానైట్ రాళ్లతో ఉంటుంది.
ఈ ఎరుపు రంగు గ్రానైట్ ఒక్కో దిమ్మె బరువు దాదాపు 200 కిలోలకు పైగా ఉంటుంది. 500 మైళ్ల దూరంలో ఉన్న అస్వాన్ నుంచి నైలు నది మీదుగా తెప్పల ద్వారా ఈ గ్రానైట్‌ను తీసుకొచ్చారు.
‘‘మెన్‌కౌరే పిరమిడ్ బయటి గోడల మీద నున్నటి రాళ్ల పూత పూర్తిగా పాడైంది. పిరమిడ్‌లోని ఒక గోడ మీద పెద్ద రంధ్రం ఉంది. ఈజిప్టుకు చెందిన ఒక మధ్యయుగపు రాజు దీన్ని కూల్చేయడానికి ప్రయత్నించారని చెబుతారు. ఇప్పుడు ఈ పిరమిడ్‌లో గ్రానైట్ పొర కేవలం 15-29 శాతం మాత్రమే చెక్కుచెదరకుండా ఉంది.
పిరమిడ్ చుట్టూ ఉన్న ఇసుకలో విరిగిపడిన గ్రానైట్ బ్లాక్స్ ఉన్నాయి. సున్నపురాయి పొర కూడా ఇప్పటికే దానిపై నుంచి తీసేశారు. బహుశా, మధ్యయుగపు కైరో ఆ రాళ్లను తొలగించి, మసీదుల్లో ఉపయోగించారేమో’’ అని ఆయన అన్నారు.
మెన్‌కౌరే పిరమిడ్ పునరుద్ధరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఈజిప్టు యాంటిక్విటీస్ డిపార్ట్‌మెంట్ అధిపతి డాక్టర్ ముస్తఫా వజీరీ నేతృత్వంలో ఈ పనులు జరుగుతున్నాయి. ముస్తఫా వజీరీ ఒక ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త. కానీ, పిరమిడ్ల పునరుద్ధరణ కోసం ఆయన చేస్తోన్న ప్రణాళిక వివాదాల్లో చిక్కుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
పిరమిడ్ల పునరుద్ధరణ ప్రణాళికలు
నెల రోజుల క్రితం ముస్తఫా వజీరీ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ముస్తఫా, మెన్‌కౌరే పిరమిడ్ సమీపంలోని ఒక గ్రానైట్ రాయి మీద నిల్చొని ఉండటం కనిపిస్తుంది. పిరమిడ్ మీద అనేక మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీనిబట్టి అక్కడ ఇప్పటికే పని ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
ఆ వీడియో చూసిన తర్వాత, అక్కడ పని ఎంత పెద్ద ఎత్తున జరుగబోతుందో ఊహించలేమని న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్ యూనివర్సిటీకి చెందిన పురాతన చరిత్ర ప్రొఫెసర్ డాక్టర్ జెన్నిఫర్ హాలమ్ అన్నారు. గతంలో ఎన్నడూ ఇంత పెద్ద ఎత్తున అక్కడ పనులు జరుగలేదని చెప్పారు.
‘‘పిరమిడ్‌ను ఎలా మరమ్మతు చేయాలనుకుంటున్నారో ఆ వీడియోలో ఆయన చూపించారు. అక్కడ కార్మికులతో ఆయన అరబిక్‌లో మాట్లాడుతున్నారు. పిరమిడ్ చుట్టూ పడి ఉన్న శిథిలాలను కార్మికులు తొలగిస్తున్నట్లుగా కనిపించింది. మీడియాకు చూపించాలనే ఉద్దేశంతోనే ఆ వీడియోను తీసినట్లుగా అనిపించింది’’ అని హాలమ్ అన్నారు.
ఈ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురావస్తు శాస్త్రవేత్తలు, ఈజిప్టు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఈజిప్టు ప్రభుత్వం తక్షణమే ఈ ఘటనపై నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ, పిరమిడ్ పునరుద్ధరణ ప్రణాళికను వ్యతిరేకించింది.
ఆయన ఒక జపనీస్ గ్రూపుతో సంప్రదింపులు జరిపినట్లు మాకు తెలిసిందని హాలమ్ అన్నారు. మెన్‌కౌరే పిరమిడ్”ను గ్రానైట్‌తో రీకోట్ చేయాలనుకుంటున్నట్లుగా తెలిసింది. గిజాలోని ఇతర పిరమిడ్లలో వాడిన రాళ్లకు భిన్నంగా ఈ గ్రానైట్ ఉంటుంది. పిరమిడ్ నిర్మాణంలో ఈ గ్రానైట్ రాళ్లను వాడుతామని వారు చెబుతున్నారు. ఏడు వరుసలకు సరిపోయేంత గ్రానైట్ ఇప్పటికే అక్కడ ఉంది’’ అని హాలమ్ చెప్పారు.
పిరమిడ్ మీద తొమ్మిది వరుసల గ్రానైట్ పొరలు కనిపించకుండా పోయాయని, వాటిని మళ్లీ పిరమిడ్‌కు అమర్చాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇలా చేయడం మంచిదేనా?
‘‘ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, అక్కడ ఉపయోగించిన సున్నపురాయి నాణ్యత సరిగా లేకపోవడం వల్ల గ్రానైట్ పొరలు ఊడిపోయాయా? లేక వందల ఏళ్ల వాతావరణ పరిస్థితుల కారణంగా గ్రానైట్ బ్లాక్స్ చెడిపోయాయా? ఇప్పుడు అవి సరైన స్థితిలోనే ఉన్నాయా? లేదా? అనే అంశాల్ని పరిశీలించారా?
పిరమిడ్ పక్కన పడిఉన్న గ్రానైట్ రాళ్లను పాలిష్ చేయలేదు. ఎందుకంటే, పిరమిడ్‌కు అమర్చే ముందే వాటిని పాలిష్ చేసి కావాల్సిన ఆకృతిలోకి తెస్తారు. ఈ గ్రానైట్ రాళ్లను పాలిష్ చేయలేదు. కాబట్టి వాటిని ఒకవేళ అమర్చితే, అంతకుముందు పిరమిడ్‌కు ఉన్న వాటితో సరితూగవు’’ అని డాక్టర్ జెన్నిఫర్ హాలమ్ అన్నారు.
మెన్‌కౌరే పిరమిడ్ వద్ద పడి ఉన్న గ్రానైట్ రాళ్లు కచ్చితంగా అదే పిరమిడ్‌లో ఎప్పుడైనా ఉపయోగించారా? లేదా? అనేది ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. మెన్‌కౌరే చిన్న వయసులోనే చనిపోయారని, అందుకే ఆయన పిరమిడ్ నిర్మాణం అసంపూర్తిగా ఉందని కొంతమంది ఈజిప్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ కారణంగానే పిరమిడ్ నిర్మాణానికి వాడిన సామగ్రి అక్కడే పడి ఉందని చెబుతారు. కానీ, ఇప్పుడు ఆ గ్రానైట్ దిమ్మలను తిరిగి పిరమిడ్‌కు అమర్చే ప్రక్రియ, పురావస్తు శాస్త్రం ప్రాథమిక సూత్రాలపై చర్చకు దారి తీసింది.
ఈ పిరమిడ్‌ను భద్రపరచడానికి బదులుగా పునరుద్ధరిస్తున్నారని డాక్టర్ జెన్నిఫర్ హాలమ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రాచీన వారసత్వాల పరిరక్షణ కోసం చేసి వెనిస్ ఒప్పందం మార్గదర్శకాలకు ఇది విరుద్ధంగా ఉందని అన్నారు.
ముస్తఫా వజీరీ, ఈ పనికి సంబంధించిన పురావస్తు శాస్త్రవేత్తలను, యునెస్కోను సంప్రదించలేదని డాక్టర్ జెన్నిఫర్ హాలెమ్ చెప్పారు. పిరమిడ్‌ల గురించి హంగామా చేయాలనే ఉద్దేశంతోనే ఆ వీడియో చేశారని అన్నారు. ఈ హంగామా కారణంగా ప్రపంచం దృష్టి, పిరమిడ్‌ల మీద కేంద్రీకృతం అయితే, పర్యటకులను ఆకర్షించడంలో సహాయపడుతుందని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పిరమిడ్ ఆకర్షణ
దేశంలోని పది శాతం జనాభాకు పర్యాటక రంగం వల్ల ఉపాధి కలుగుతుందని, అందుకే ఈజిప్టుకు పర్యాటకం చాలా కీలకమని ఫైనాన్షియల్ టైమ్స్ కైరో ప్రతినిధి హిబా సలేహ్ అన్నారు. జీడీపీలో పర్యాటకం వాటా 12 శాతం ఉంటుందన్నారు. పర్యాటకం, దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని అందిస్తుంది. ఈజిప్టు గత రెండేళ్లుగా విదేశీ మారక ద్రవ్యం కొరతతో ఇబ్బంది పడుతోంది.
ఈజిప్టు పర్యటక రంగంలో పిరమిడ్‌లే ప్రత్యేక ఆకర్షణ. ప్రతీ ఏటా లక్షల మంది పర్యాటకులు ఈజిప్టుకు వస్తుంటారు. అయితే, ఈజిప్టు ప్రభుత్వం పర్యాటకులకు ఆకర్షించడంలో చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
రాజకీయ అస్థిరత, టూరిజం మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని హిబా సలేహ్ అభిప్రాయపడ్డారు.
పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఈజిప్టు ప్రభుత్వం, దేశంలోని అనేక ప్రాచీన వారసత్వ కట్టడాల పునరుద్ధరణ, పరిరక్షణ ప్రాజెక్టులను ప్రారంభించింది.
మెన్‌కౌరే పిరమిడ్ మీద గ్రానైట్ దిమ్మలను మళ్లీ ఏర్పాటు చేయడం అనే ప్రణాళిక, ఈజిప్టులోని ప్రాచీన భవనాలను శుభ్రం చేసి మెరుగులు దిద్దే ప్రక్రియలో భాగం. కానీ, ఇలా చేయడం వల్ల వాటి అసలు రూపం చెరిగిపోతుందని చాలామంది భావిస్తున్నారు. అందుకే ఈ ప్రణాళికలను వ్యతిరేకిస్తున్నారు.
దీని గురించి ప్రజలకు, నిపుణులకు సరిగ్గా చెప్పలేకపోయారని హిబా అన్నారు. అందుకే ప్రాచీన భవనాల సంరక్షణ, వాటి మరమ్మతుల మధ్య సమతుల్యం ఎలా ఉండాలనే అంశంపై చర్చ మొదలైందని హిబా సలేహ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పిరిమిడ్‌ల పరిరక్షణ
మెన్‌కౌరే పిరమిడ్ మీద ఒక్క గ్రానైట్ రాయిని అమర్చాలనుకున్నా, అలా చేయడం వల్ల దాని నిర్మాణం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తొలుత ఇంజనీర్లు, నిపుణులు పరిశోధించాలని అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ కైరోలోని ఈజిప్టాలజీ ప్రొఫెసర్ సలీమా ఇక్రమ్ చెప్పారు. తొందరపాటు చర్యల వల్ల శాశ్వత నష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన చెందుతున్నారు.
“ఈ నిర్మాణంపై వేల ఏళ్లుగా గ్రానైట్ పొర లేదు. ఇప్పుడు మనం ఆ గ్రానైట్ పొరను అమర్చితే దాని వల్ల పిరమిడ్ సమతుల్యం మారిపోదా?
"సంరక్షకుల లక్ష్యం పురాతన నిర్మాణాలను వాటి అసలు రూపంలో సంరక్షించడం. వాటి భద్రతకు హాని కలిగించే ఏ పని చేయకూడదు’’ అని ఇక్రమ్ అన్నారు.
పిరమిడ్లు వేల ఏళ్లుగా ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఈజిప్టు పర్యాటక రంగానికి ఇది చాలా ముఖ్యం. కానీ, వాటి పరిరక్షణకు తప్పుడు పద్ధతులను ఉపయోగిస్తే వాటికి హాని కలుగుతుంది.
రెండో విషయం ఏంటంటే, పిరమిడ్లను నిర్మించినప్పుడు వాటి అసలు రూపం ఏంటో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వాటిని అలాగే వదిలేయడం ఉత్తమం.
ఇవి కూడా చదవండి:
- ఆస్కార్ వేదికపైకి జాన్ సీనా నగ్నంగా ఎందుకు వచ్చారు?
- జింకల్లో కొత్త జాతి గుర్తింపు.. ఇది ఎక్కడ ఉంది?
- సీఏఏ: పౌరసత్వ సవరణ చట్టం అమలుకు నిబంధనలను విడుదల చేసిన కేంద్రం, దీనివల్ల ఏం జరుగుతుంది?
- రోజుల వ్యవధిలో అక్కాచెల్లెళ్లకు ఒకే తరహాలో గుండెపోటు, హఠాత్తుగా వచ్చే సమస్య ఎంత ప్రమాదకరం?
- జీఎన్ సాయిబాబా: ‘నేను ఇంతకాలం బతుకుతానని జైలు అధికారులు కూడా అనుకోలేదు’
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














