స్పెయిన్: ప్రపంచ పర్యటకులను ఆకర్షిస్తున్న యూరప్‌లోని ప్రాచీన ఓర్కె పట్టణం

ఫొటో సోర్స్, Susana Giron
- రచయిత, సుశాన గిరోన్
- హోదా, బీబీసీ కోసం
చరిత్రపూర్వం మనుషులు యూరప్‌లో తొలిసారిగా అడుగు పెట్టిన ప్రాంతం అత్యంత కఠిన పరిస్థితులుండే గ్రెనడా పీఠభూమి. పధ్నాలుగు లక్షల ఏళ్ల కిందట చరిత్ర పూర్వపు మానవులు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని పురావస్తు తవ్వాకాల్లో బయటపడిన ఆధారాలు చెబుతున్నాయి.
దక్షిణ స్పెయిన్‌లోని ఎత్తైన గ్రెనాడా పీఠభూమిపై 1300 మంది జనాభా నివాసముండే ఓర్కె పట్టణం ఉంది. పొడి బంజర భూములు, లోతైన లోయలు, స్వచ్చమైన జలాశయాలు ఈ పట్టణం చుట్టూ కనిపిస్తాయి. స్పెయిన్‌లోని దక్షిణాదిన మారుమూలలో ఉండగే ఆండలూషియాలోని ఈ ప్రాంతానికి వచ్చే పర్యటకుల సంఖ్య తక్కువే కానీ ఇక్కడ కనిపించే యూరప్ గత చరిత్రపు అరుదైన ఆనవాళ్లుపర్యటకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
ఈశాన్య గ్రెనాడా నుంచి 140 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం ద్వారా ఓర్కె పట్టణం చేరుకుంటారు. దారిలో కొన్ని అందమైన ప్రాంతాలను దాటుకుంటూ వెళ్తారు. వాటిలో రంపపు గట్లులాంటి కొండ ప్రాంతాలుండే సియెర్రా డీ హ్యూటర్ పార్క్ , గడ్డి మైదానాలుండే సియెర్రా డీ బాజా పార్క్‌లను దాటుకుంటూ కొండపైన ఉండే అందమైన ఓర్కేకు చేరుకుంటారు.
ఐరోపా ఖండంలోనే అత్యంత ప్రాచీన మానవ శిలాజాలు ఇక్కడున్నాయని కొందరు భావిస్తారు. ఈ గ్రామీణ ప్రాంతంలో పురావస్తు శాఖ జరిపిన పరిశోధనల్లో యూరోపియన్లు ఎక్కడి నుంచి వచ్చారని మాత్రమే కాదు, అసలు యూరప్‌లో అడుగు పెట్టే సమయానికి ఆనాటి ప్రపంచపు సహజ భౌగోళిక పరిస్థితులెలా ఉండేవని కూడా అవగాహన ఏర్పడుతుంది.

ఫొటో సోర్స్, Susana Giron
రైతు పొలంలో దొరికిన రాళ్లను చూసి పురావస్తు శాఖ ఎందుకు ఆశ్చర్యపోయింది?
టోమస్ సెర్రానో అనే స్థానిక రైతు 1976లో తన పొలంలో శిలాజ అవశేషాల్లాంటివేవో బయట పడుతున్నట్లు గుర్తించారు. ఆయనకు దొరికిన వస్తువులను సెర్రానో తన చుట్టుపక్కల వారికి, బంధువులకు వాటిని చూపించడం మొదలుపెట్టారు. ఎముకలను పోలిన రాళ్లు తనకు దొరికాయని చెప్పారు.
వీటి విషయంలో స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వగా, వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, కాటలన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియెంటాలజీ కి చెందిన ముగ్గురు సభ్యులు ఈ ప్రాంతానికి వచ్చి సెర్రానోకు దొరికిన వాటిని పరిశీలించారు. అవి సామాన్యమైన రాళ్లు కాదని వాళ్లు ఆయనకు చెప్పారు.
సెర్రానో పొలం, దాని పరిసర ప్రాంతం క్రమంగా ఆర్కియాలజీ తవ్వకాలు జరిపే ప్రాంతంగా మారిపోయింది. కొన్నేళ్లకు పురావస్తు శాస్త్ర నిపుణుల బృందం ఓర్కేకు చేరుకున్నారు. పదిహేను లక్షలు లేదా పదహారు లక్షల ఏళ్ల నాటి అత్యంత భారీ క్షీరదాల శిలాజ అవశేషాలు ఈ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు.
బాజా సరస్సుకి సమీపంగా ఉండే ప్రాచీన ఓర్కె పట్టణం ప్రాంతంలో, మంచినీటి చెరువులున్న పుష్కలంగా ఉన్న కాలంలో, ప్రాచీన శిలాజ అవశేషాలు భూమి పొరలుగా ఏర్పడ్డాయని పురావస్తు నిపుణుల బృందం చెబుతోంది. ఇక్కడ ఎముకలు నిక్షిప్తమై ఉన్నాయి. భూమిలో పాతిపెట్టి ఉన్న వాటిని సున్నపు బురద కప్పేస్తోంది.

ఫొటో సోర్స్, Susana Giron
యూరప్‌లో బయటపడ్డ 14 లక్షల ఏళ్ల నాటి చిన్నారి దంతం
సెర్రానో పొలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే బర్రాంకో లియోన్ ప్రాంతంలో, 2002లో ఆశ్చర్యానికి గురిచేసే విషయాలు బయటపడ్డాయి. అక్కడున్న లోయలోని పద్నాలుగు మీటర్ల లోపల ఒక చిన్నారి దంతం బయటపడింది.
సమగ్రమైన పరీక్షా విధానాల ద్వారా ఆ దంతం 14 లక్షల సంవత్సరాల నాటిదని నిర్ధరించారు. అది యూరప్ ఖండంలోనే అత్యంత పురాతన హోమో జినస్ శిలాజమని చెబుతున్నారు.
అవక్షేపాలున్న భూమి పొరల్లోంచి జాగ్రత్తగా తవ్వితీసిన దంతాలు, ఆదిమానవులు అగ్గి రాజేయడాన్ని మొదలుపెట్టిన కాలానికి చెందిన ఒక చిన్నారిదని భావిస్తున్నారు.
ఈ చిన్న శిలాజ అవశేషం పురాతన ప్రపంచపు ఆనవాళ్లను మన ముందు ఉంచుతోంది. మన పూర్వీకులు వేటను కొనసాగిస్తూనే తాము ఎవరికీ వేటగా మారకుండా తప్పించుకుంటోన్న యుగమది.

ఫొటో సోర్స్, Susana Giron
పెద్ద పెద్ద కోరలుండే పులులు యూరప్‌లో తిరిగేవా?
ఓర్కె ప్రాంతంలో బయటపడిన శిలాజాల్లోని అత్యంత ఆశ్చర్యకర విషయం ఏంటంటే, అవి కేవలం ప్రాచీన మానవులకు సంబంధించిన విశేషాలనే కాదు, దక్షిణ యూరప్ ప్రాంత ప్రాచీన సహజ ప్రకృతి అందాల గురించీ మనకు చెబుతున్నాయి.
దాదాపు 16 లక్షల ఏళ్ల క్రితం, ఓర్కె బాజా అని పిలిచే సరస్సు ఈ ప్రాంతాపై ఆధిపత్యం చూపింది. అయితే ఈ సరస్సు కుంచించుకుపోతున్న తరుణంలో తాజా భూగర్భజలాలు ఆ ప్రాంతాలో నిండుకున్నాయి. దీని కారణంగా ఈ ప్రాంతంలో విభిన్న జీవజాతులు ఎదిగాయి.
వాటిలో మమూత్‌లని పిలిచే భారీ దంతాలున్న ఏనుగులు, కోరల వంటి దంతాలుండే పెద్ద పులులు, హైనాలు, నీటి గుర్రాలు, జింకలు ఉండేవి. ఇవన్నీ కూడా సహజ ప్రకృతి అందాల మధ్య కలిసిమెలసి జీవించేవి. వాటితో పాటు యూరప్‌లోని మొట్టమొదటి మానవులు కూడా కలిసి జీవించేవారు.
ఓర్కె ప్రాజెక్టు డైరెక్టర్, పాలియాంథ్రోపాలజిస్ట్ జువాన్ మనుయెల్ జిమీనెజ్ అరెనాస్ చెబుతున్న దాని ప్రకారం, ప్రస్తుతం మనముందున్న గ్రేట్ ఆఫ్రికన్ పార్కుల్లోని జీవావరణ వ్యవస్థ, ఓర్కె ప్రాంత జీవావరణ వ్యవస్థను పోలి ఉందన్నారు.
అయితే దాదాపుగా ఎడారిలాంటి ప్రాంతాల్లో నీటిగుర్రాలు హాయిగా స్వేచ్ఛగా బతికాయని, చిన్నసైజు ముఖాలుండే హైనాలు ఆలీవ్ అటవీ ప్రాంతంలోనూ, మంచినీటి చెరువుల దగ్గరుండే ఓక్ చెట్ల కింద సేదతీరేవని ఊహించడం కాస్త కష్టమని కూడా అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Susana Giron
చరిత్రపూర్వపు సిలికాన్ వ్యాలీ ఎలా ఉండేది?
కొన్నేళ్లపాటు కొనసాగిన తవ్వకాల్లో ఆశ్చర్యం కలిగించే మరికొన్ని విషయాలు కూడా బయటపడ్డాయి. 14 లక్షల సంవత్సరాల క్రితం ఇక్కడికొచ్చి స్థిరపడిన మూలవాసులు, వినూత్న పద్దతుల్లో రాతి పరికరాలను తయారు చేసేవారని తెలిసింది.
అయితే ఈ పరికరాల తయారీ పద్దతులు క్రమంగా కనుమరుగై, మరో 4 లక్షల ఏళ్ల తర్వాత తిరిగి వినియోగంలోకి వచ్చాయి. ఈ కారణంతోనే దీనిని చరిత్ర పూర్వ కాలానికి చెందిన సిలికాన్ వ్యాలీగా ప్రకటించారు నిపుణులు.
వాటిలో స్ఫిరాయిడ్స్ అని పిలిచే గోళాకారంలోని రాతి బంతులు ఉన్నాయి. ఆసక్తి రేపే సున్నపురాయి సాధనాలను చూస్తే ఆ కాలంలోని మూలవాసుల మేథో సామర్థ్యాలకు అద్ధం పడుతున్నాయి.
మ్యాథమేటిక్స్‌లోని జియోమెట్రీ అంశంలో వాళ్లకున్న జ్ఞానాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. అలానే ముడిసరుకుల వినియోగంలో వాటి భౌతిక లక్షణాల గురించీ తెలుస్తోంది. ఇలాంటి సాధనాలను చెక్కాలంటే అందుకు అవసరమైన ముడిసరుకుల కోసం చూసుకోవాలి.
సుత్తివంటి పరికరంతో అత్యంత నైపుణ్యంగల మెలకువతో దెబ్బలు వేయాలి. బర్రాంకో లియోన్ ప్రాంతంలోని రాళ్లను చెక్కేవారికి వాళ్లు చెక్కుతున్న వస్తువు తుదిరూపంపైన చెక్కడానికి ముందే స్పష్టమైన అవగాహన ఉండేదని నిపుణులు భావిస్తున్నారు.
వాళ్ల చేతులు, మణికట్టులోని నరాలు, కండరాలను మెళుకువతో కదిలించే నిర్థిష్టమైన స్కిల్స్ వాళ్ల సొంతమని భావిస్తున్నారు. ఎంతో నైపుణ్యతో వాళ్లు చెక్కే తీరు క్రమంగా వారి వారసత్వంగా మారిందని కూడా చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Susana Giron
పర్యటకుల కోసం ఓర్కె గైడెడ్ టూర్లు
చరిత్రపూర్వం ఓర్కె ప్రాంత ప్రాముఖ్యతను, స్థానిక భౌగోళిక సంపదను గుర్తించి 2020లో ఈ ప్రాంతాన్ని యునెస్కో వరల్డ్ జియోపార్కుగా ప్రకటించారు.
అంతేకాదు, చరిత్రపూర్వ కాలానికి చెందిన విషయాలను ప్రదర్శించే మ్యూజియంల ఏర్పాటుతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. వీటిలో ఒకటి ఓర్కా పట్టణంలో ఉన్న ప్రైమేరోస్ పోబ్లాడోరెస్ డీ యూరోపా మ్యూజియం. అంటే యూరప్‌లో మొదటగా వచ్చి స్థిరపడిన సెటిలర్ల విషయాలకు సంబంధించిన మ్యూజియం.
ఇక్కడికొచ్చే సందర్శకులకు మన పూర్వీకులు వాడిన వినూత్న రాతి సాధనాలు కనిపిస్తాయి. భారీ ఏనుగులైన మామూత్‌ల ఎముకలు కనిపిస్తాయి.
దగ్గరలోని హ్యూస్కార్ గ్రామంలో ఉండే పియోడ్రా డెల్ లీట్రీరో కూడా మరో చెప్పుకోదగిన ప్రాంతం. స్థానిక గుహలో విస్తృతమైన పెయింటింగ్స్ కనిపిస్తాయి. ఇది బాగా పాపులర్ అయింది. జంతువుల ఆకారలతో ఎర్రటి వర్ణచిత్రాలు, 6 వేల ఏళ్ల నాటి ఇతర జీవుల బొమ్మలు, పురాతన కాలాలకు చెందిన అనేక విషయాలను మన కళ్లకు కడుతున్నాయి.
ఎత్తైన గ్రెనడా పీఠభూమి పర్యటనల కోసం కొన్ని కంపెనీలు గైడెడ్ టూర్లను కూడా నిర్వహిస్తున్నాయి. స్థానిక పురవస్తు శాఖ మ్యూజియంల నుంచి కొండ ప్రాంతాల వరకూ యూరోప్ ఆదిమానవుల ఆనవాళ్లను అనుసరిస్తూ ఆనాటి విషయాలను తెల్సుకునేందుకు ప్రజలను అనుమతిస్తున్నారు.
ముఖ్యంగా వారాంతాల్లో స్పెయిన్ మారుమూల ఉండే ఇక్కడి పరిసర బంజర భూములు, గరుకైన సున్నపురాతి పర్వతాలు, సైక్లింగ్ చేసే వారిని, దూరప్రాంతాలు నడిచేవారిని బాగా ఆకర్షిస్తాయి. ఇబ్బందిపెట్టే స్థాయిలో శీతాకాలం గాలులు వీస్తున్నా, అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా, ఔత్సాహిక పర్యటకులు ధైర్యంగా కఠిన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ మంచుకి స్వాగతం పలుకుతారు.

ఫొటో సోర్స్, Susana Giron
ఆధునిక గృహాల్లోని యూరోపియన్ గుహలు
ఓర్కెకు పశ్చిమాన 8 కిలోమీటర్ల దూరంలో గత చరిత్రకు సాక్ష్యంగా మారింది గలేరా గ్రామం. ఇక్కడ వేల సంఖ్యలో ఉండే గుహలే నివాస గృహాలుగా మారిపోయాయి. రాతి కొండల పునాదుల వరకూ కోసి ఏర్పాటు చేసిన గుహలు, గతయుగపు చరిత్ర విశేషాలను వివరిస్తాయి.
ట్రోగ్లోడైటిక్ (చరిత్రపూర్వానికి ముందు, లేదా చరిత్రపూర్వ కాలంలోనూ మనిషి గుహల్లో జీవించిన కాలం), చరిత్రపూర్వం మూలాలున్న ఈ నివాసాలు మూరిష్ యుగం నాటివని భావిస్తున్నారు. మూర్ల యుగం క్రీస్తుశకం 7వ శతాబ్దం తొలి దశకాల్లో మొదలవుతోంది. ఇక్కడి గుహలు ప్రస్తుతం సమకాలిన ప్రజావాసాలుగానే కాకుండా, ఎత్తైన పీఠభూమి ప్రాంతీయ చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. పురాతన కాలానికి, ఆధునిక కాలానికి మధ్య అనుసంధానకర్తలుగా మారాయి.
సాహస యాత్రికులను ఆకర్షించే ఈ గుహలలో బస ఏర్పాట్లు ఉంటాయి. సుందరమైన ప్రకృతి దృశ్యాలతో క్యూరేటెడ్ ఇంటీరియర్స్‌తో ప్రతీ గుహ కూడా పూర్వీకుల చరిత్రను మనకు తెలియజేస్తుంటుంది.
పురావస్తు ప్రాముఖ్యతను మించి, అక్కడ కుగ్రామాల్లో ఇంకా అనేక ఆకర్షణీయమైన అంశాలున్నాయి. గ్రామాల్లో రాళ్లతో నిర్మించిన వీధులు పర్యటకులను బాగా ఆకట్టుకుంటాయి.
అలాగే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కెఫేలు, స్థానిక మార్కెట్లు, స్పానిష్ సంస్కృతీ సంప్రదాయాల అభిరుచులకు అందరూ మైమరిచిపోతారు. ఇక్కడ గొర్రె మాంసంతో తయారుచేసే స్థానిక వంటకాన్ని కచ్చితంగా రుచి చూడాల్సిందే అంటారు ఈ ప్రాంత ప్రేమికులు.

ఫొటో సోర్స్, Susana Giron
గ్రేట్ పాత్ ఆఫ్ ద ఫస్ట్ యూరోపియన్ సెటిలర్స్ – 143 కిలోమీటర్ల ప్రయాణం
యూరప్‌లోని 143 కిలోమీటర్ల ప్రయాణాన్ని గ్రేట్ పాత్ ఆఫ్ ద ఫస్ట్ యూరోపియన్ సెటిలర్స్ అంటారు. పొరల దొంతరలుగా కనిపించే చరిత్రను అర్థం చేసుకోవాలంటే గ్రేట్ పాత్ ఆఫ్ ద ఫస్ట్ యూరోపియన్ సెటిలర్స్‌ను నేరుగా అనుసరించి తెలుసుకోవచ్చు. చరిత్రను కళ్లముందుంచే అద్భుతం 143 కిలోమీటర్ల ఈ ప్రయాణం.
హ్యూస్కర్, కాస్ట్రిల్, కాస్టిల్లెజార్, గాలెరా, ఓర్గె, లా ప్యూబ్ల డీ డాన్ ఫాడ్రికే వంటి గ్రామాల మీదుగా ఈ ప్రయాణం సాగుతుంది. ఈ మొత్తం ప్రయాణ మార్గంలో ఎత్తైన లా సాగ్ర పర్వతం గంభీరంగా కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి
- కేసీఆర్‌ను ఓడించిన ఒకే ఒక్కడు
- అహ్మదాబాద్: భారత ప్రేక్షకులు, టీమిండియా ఆటగాళ్ల తీరుపై ఆస్ట్రేలియా మీడియా ఏం రాసింది?
- శ్రద్ధా వాల్కర్ హత్య కేసు: 'నా బిడ్డ శరీరంలో కనీసం ఒక్క ముక్క ఇచ్చినా అంత్యక్రియలు చేసే వాళ్లం...'
- తిరుమల లడ్డూ తయారీలో ‘శ్రీవైష్ణవ బ్రాహ్మణులే’ ఉండాలా? టీటీడీ నిబంధనపై వివాదం ఎందుకు?
- పెండ్యాల రాఘవరావు: ఒకేసారి 3 స్థానాల్లో గెలిచిన నేత.. ఆయన తర్వాత ఇది ఎన్టీఆర్కే సాధ్యమైంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














