అలెక్సీ నవాల్నీ: రష్యాలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ప్రమాదకరమే, అయినా వెనక్కి తగ్గేది లేదంటున్న ప్రతిపక్ష నేతలు

ఫొటో సోర్స్, SHUTTERSTOCK
- రచయిత, సారా రెయిన్‌ఫోర్డ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ మరణం తర్వాత కూడా కటకటాల్లో మగ్గుతున్న మరో రాజకీయ ఖైదీ ‘మార్పు తప్పదనే’ ఆశను వదులుకోవడం లేదు.
“స్వేచ్చ చాలా ఖరీదైనది” ఈ వాక్యం ప్రతిపక్ష కార్యకర్త వ్లాదిమిర్ కారా ముర్జా జైల్లో నుంచి నాకు రాసిన ఉత్తరంలోనిది.
ఆయన తన రాజకీయ మార్గదర్శి బోరిస్ నెమట్సోవ్‌ను ప్రస్తావిస్తూ ఈ వాక్యం రాశారు. నెమట్సోవ్‌ను 2015లో మాస్కోలోని రష్యా అధ్యక్షుడి భవనం సమీపంలో హత్య చేశారు.
ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవాల్నీ చనిపోయారు.
ఆధునిక రష్యాలో ప్రతిపక్షానికి ఏనాడూ సరైన గౌరవం దక్కలేదు. మార్పు కోసం వాళ్లు చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కడం లేదు.
నవాల్నీ మరణం పట్ల ప్రజల్లో గూడు కట్టుకున్న ఆగ్రహం బయటకు వ్యక్తం కాకపోవడానికి కారణం అలాంటి భయాలే కావచ్చు. ఆయనను స్మరించుకుంటూ పుష్పాంజలి ఘటించినందుకే వేల మందిని అరెస్టు చేశారు.
ఇంత జరుగుతున్నప్పటికీ కారా ముర్జా మాత్రం మార్పు పట్ల తన నమ్మకాన్ని, ఆశను కోల్పోలేదు.
స్వేచ్చతో కూడిన దేశంలో జీవించే అవకాశం కోసమే నవాల్నీ, నెమట్సోవ్ పోరాడారని...ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతిపక్ష కార్యకర్తలు మరింతగా కష్టపడాలని ఆయన పిలుపిచ్చారు.
కారా ముర్జా తన లక్ష్యం ఏంటో ఎప్పుడో నిర్ణయించుకున్నారు. “గొంతెత్తి మాట్లాడటం వల్ల మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తెలుసు” అని 2022లో అరెస్టైన తర్వాత ఆయన నాకు చెప్పారు. అయన ఇంకా ఏమన్నారంటే
“ఏం జరిగినా సరే, నిశబ్ధంగా ఉండటం ఎంత మాత్రం సాధ్యం కాదు” అన్నారు.

ఫొటో సోర్స్, REUTERS
బలమైన వ్యక్తులు
అలెక్సీ నవాల్ని వయసు 47 ఏళ్లు. కారా ముర్జా వయసు 42 ఏళ్లు. వీళ్లిద్దరూ వ్యక్తిత్వపరంగా భిన్నమైన వ్యక్తులు.
నవాల్నీ సామాజిక మాధ్యమాల పరంపర నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు, అద్భుతమైన వక్త, ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి. సహజ సిద్ధమైన నాయకుడు
కారా ముర్జా సున్నిత వ్యవహారశైలి ఉన్న మేథావి. ప్రజల్ని పోగేసి పోరాడటం కంటే చాపకింద నీరులా వ్యవహారాలు నడపడంలో నేర్పరి.
రష్యాలో ఇప్పటికీ ఆయన గురించి చాలా మందికి తెలియదు.
అయితే రష్యాకు పుతిన్ శాశ్వతం కాదని రాజకీయ స్వేచ్చ సాధ్యమేననే ఒకే విషయాన్ని ఈ ఇద్దరూ బలంగా నమ్మారు.
ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో ఉన్న వారి అవినీతిని నవాల్నీ తన వీడియోల ద్వారా బహిర్గతం చేస్తే, విదేశాల్లో రష్యన్ సంపన్నులు దాచుకున్న ఆస్తులు, డబ్బులపై ఆంక్షలు విధించేలా కారా ముర్జా యూరోపియన్ దేశాలతో వ్యవహారాలు నడిపేవారు.
ఇలాంటి లక్ష్యాలను ఎంచుకున్నందుకు వాళ్లిద్దరూ భారీ మూల్యం చెల్లించారు.
నవాల్నీపై విష రసాయనాలతో దాడి జరగడానికి ఐదేళ్ల ముందు, 2015లో కారా ముర్జా కింద పడిపోయి కోమాలోకి వెళ్లారు.
రెండేళ్ల తర్వాత ఆయన మరోసారి ఇలాగే పడిపోయారు. అమెరికాలో జరిగిన పరీక్షల్లో ఆయనపై విష ప్రయోగం జరిగినట్లు తేలింది.
అయినప్పటికీ ఆయన ఎప్పుడూ తన వైఖరి మార్చుకోలేదు. యుక్రెయిన్ మీద రష్యా దాడి చేయడాన్ని వ్యతిరేకిస్తూ పుతిన్ వ్యవహార శైలిపై విమర్శలు చేస్తున్నారు.
దేశద్రోహానికి పాల్పడ్డారంటూ గతేడాది ఆయనకు 25 ఏళ్ల జైలుశిక్ష విధించారు. అయితే ఇదే కేసుకు సంబంధించి పోలీసులు సమర్పించిన చార్జ్‌షీటులో మాత్రం ఆయన ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టారని మాత్రమే ఉంది. అవి కూడా ప్రశాంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
రష్యాకు పునరాగమనం
2021లో హత్యాయత్నం నుంచి బయటపడిన తర్వాత నవాల్నీ తిరిగి రష్యా రావాలని అనుకున్నప్పుడు అందరూ ఆయన్ను మూర్ఖుడు అనుకున్నారు.
జైలుకెళ్లడానికి బదులు విదేశాల్లో తలదాచుకోవడాన్ని ఎంచుకున్న కొంతమంది ప్రతిపక్ష నేతలు మార్పు సాధ్యం కానప్పుడు త్యాగం చెయ్యడం వృధా అని వాదించేవారు.
అయితే నవాల్నీ భిన్నంగా ఆలోచించారు.
“మీ ఆశయాలకు బలముందని భావిస్తే, వాటి కోసం నిలబడేందుకు మీరు సిద్ధంగా ఉండాలి. అవసరమైతే అందుకు త్యాగాలు చెయ్యాలి” అని ఆయన చనిపోవడానికి ముందు రాశారు.
నవాల్నీ మాదరిగానే వ్లాదిమిర్ కారా ముర్జాకు భార్య పిల్లలు ఉన్నారు. ఆయనకు కూడా అమెరికాలో ఇల్లు, బ్రిటన్ పౌరసత్వం ఉంది. అయినప్పటికీ ఆయన రష్యా వచ్చేందుకు ఏనాడూ వెనుకాడలేదు.
“నేను ఎక్కడో భద్రంగా దాక్కుని రాజకీయంగా మీరు పోరాడండి అని ప్రజలకు పిలుపిచ్చే హక్కు నాకు ఉందని అనుకోవడం లేదు” అని కారా మూర్జా 2022లో జైలు నుంచి నాకు రాసిన లేఖలో చెప్పారు.
సమాజం పట్ల వారిద్దరికీ ఉన్న స్పృహకు ఇవి కొన్ని ఉదాహరణలు
ఈ ఇద్దరిలో ఒకరు చనిపోయారు. మరొకరు కుటుంబానికి వేల మైళ్ల దూరంలో ఉన్న జైలులో ఉన్నారు. ఆరు నెలలకు ఒకసారి మాత్రమే ఆయనకు కుటుంబ సభ్యులతో ఒకే ఒక్క ఫోన్ కాల్ మాట్లాడే అవకాశం వస్తుంది.
“నేను ఆయనతో మాట్లాడలేదు. ఎందుకంటే పిల్లలు ఆయనతో మాట్లాడే ఆ సమయాన్ని నేను తీసుకోవాలని అనుకోవడం లేదు” అని ఎవేగ్నియా ముర్జా చెప్పారు.
ముర్జా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. జైలులో ఆయనతో మాట్లాడేందుకు వారికి 15 నిముషాల సమయం ఇస్తారు. “ఈ 15 నిముషాల్లో ముగ్గురు పిల్లలు ఒక్కొక్కరు ఐదు నిముషాలు తండ్రితో మాట్లాడతారు. ఆ సమయంలో నేను టైమర్ పట్టుకుని నిల్చుంటాను” అని ఆమె అన్నారు.

శక్తిమంతురాలైన మహిళ
ఈ వారంలో నవాల్నీ భార్య ఒక వీడియో విడుదల చేశారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు “ఎవరూ పట్టు విడువ వద్దని” ఆ వీడియోలో ఆమె కోరారు.
“నేను స్వేచ్చా వాయువులు పీల్చే రష్యాలో ఉండాలని కోరుకుంటున్నాను. అలాంటి రష్యాను నిర్మించాలి” అంటూ తన భర్త మొదలు పెట్టిన పోరాటాన్ని కొనసాగిస్తానని యులియా నవాల్నియా చెప్పారు.
ఆమె ధైర్యం చూసి ఎవిగ్నా కారా ముర్జా నిర్ఘాంతపోయారు. “ఆమె తన జీవితంలో అత్యుత్తమమైన పని చేస్తున్నారు. ఆమె తలను తీసుకెళ్లి నిప్పల్లో పెట్టినా ఆమె తల ఎత్తుకునే నిల్చుంటున్నారు”. అని ఎవిగ్నా అన్నారు.
భర్త జైలుకెళ్లిన తర్వాత కారా ముర్జా భార్య కూడా తన వంతు పాత్ర పోషించేందుకు ముందుకొచ్చారు.
2022 ఏప్రిల్‌లో కారా ముర్జా అరెస్ట్ అయిన తర్వాత ఆమె ప్రపంచవ్యాప్తంగా పర్యటించారు. తన భర్తతో పాటు జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలకు సాయం చేయాలని పశ్చిమ దేశాలను కోరారు. అలాగే యుక్రెయిన్ మీద రష్యా దాడిని తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
పుతిన్‌ది హంతక పాలనాకాలమని ఆరోపిస్తూ అందుకు ఊదాహరణ యుక్రెయిన్ మీద యుద్ధమేనని అనేక వేదికల మీద ప్రసంగించారు.
మేము మాట్లాడినప్పుడు, ఆమె అమెరికాలోని తన పిల్లను చూసేందుకు వెళుతున్నారు. అక్కడ నుంచి ఆమె లండన్ వెళ్లి మంత్రులను కలిసి తన భర్తకు సాయం చేయాలని కోరనున్నారు. ఆయనకు బ్రిటన్ పౌరసత్వం కూడా ఉందని ఆమె గుర్తు చేశారు.
“ఆయనను జైలు నుంచి బయటకు తీసుకు వచ్చేందుకు వారు మరింత ఒత్తిడి తీసుకురావాలి. ఆయనకు సరైన వైద్యం అందించాలి” అని చెప్పారు.
“ఒక ప్రభుత్వం తమ దేశ పౌరసత్వం ఉన్న ఒక వ్యక్తి గురించి శ్రద్ధం వహించేలా చెయ్యడం ఈ రోజుల్లో చాలా కష్టం”
జైలులో వేధింపులు
నవాల్నీ మాదిరిగానే కారా ముర్జాను కూడా జైలులో వేధిస్తున్నారు.
ఆయనను నెలల తరబడి ఒక చిన్న గదిలో ఒక్కడినే ఉంచుతున్నారు. ఆయనతో ఉంచుకునేందుకు కనీసం పిల్లల ఫోటోలను కూడా అనుమతించడం లేదు.
జనవరిలో ఆయనపై మరిన్ని ఆంక్షలు విధించి వేరే జైలుకు తరలించారు. కనీసం పుస్తకాలు కూడా ఇవ్వడం లేదు.
విష ప్రయోగం వల్ల ఆయన ఆరోగ్యం దెబ్బ తింది. అది జైలులో రోజు రోజుకీ క్షీణిస్తోంది. నవాల్నీ మరణం తర్వాత కారా ముర్జాను విడుదల చేయాలని రష్యా ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రం అవుతోంది.
“ ఆయన శరీరం కుడివైపున కండరాలు దెబ్బ తింటున్నాయి. అది తీవ్రమైన అనారోగ్యానికి దారి తీస్తుంది. ఆయన మాట పడిపోవచ్చు. కుడి వైపు అంతా పక్షవాతంతో చచ్చుబడి పోవచ్చు” అని ఎవిగ్నా కారా ముర్జా మాతో చెప్పారు.
ఈ వారం ఆమె వీడియో లింక్ ద్వారా తన భర్తను చూశారు. ఆయనను మాస్కో కోర్టు జైలు నుంచి వీడియో కాలింగ్ ద్వారా విచారించింది. తనపై జరిగిన విష ప్రయోగం గురించి విచారించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసేలా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.
కోర్టు విచారణకు హాజరైనప్పుడు ఆయన నల్లటి యూనిఫామ్ ధరించి ఉన్నారు. అది ఆయన శరీరంపై చాలా వదులుగా ఉంది. గతంలో ఆయన ధరించిన పొడవాటి కోటుతో పోలిస్తే ఇది పెద్ద మార్పు.
దుస్తులు మారినా ఆయన లక్ష్యం విషయంలో మాత్రం స్పష్టంగా ఉన్నారు. ప్రజలు ఎప్పటికీ నిరాశకు లోను కావద్దని కోరారు.
కోర్టుకు హాజరైన కొంత మంది మద్దతుదారులు, రిపోర్టర్లను ఉద్దేశించి “మనకు ఆ హక్కు లేదు” అని చెప్పారు. రష్యా ఎప్పటికైనా స్వేచ్చ పొందాల్సిందేనన్నారు.
“ భవిష్యత్‌ను ఎవరూ ఆపలేరు” అని నినదించారు.

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK
ఏ భవిష్యత్తు గురించి?
కోర్టు హియరింగ్ సమయంలో రికార్డైన ఆ వీడియో క్లిప్‌ను ఎవిగ్నా కారా ముర్జా వెయ్యి సార్లు చూశారు.
“ఆయన చాలా మంచి పని, గొప్ప పని చేస్తున్నారని అనుకుంటున్నట్లు” నాతో చెప్పారు.
“ప్రజల హృదయాలు బద్దలై ఉన్నాయి. వారిలో నైతిక స్థైర్యం తగ్గుతోంది. అణచివేతకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన మాటలు వారిలో ఉత్సాహాన్ని నింపాయి. అదే ముఖ్యం”
“ఇలాంటి పరిస్థితుల్లో కూడా తలెత్తుకుని నిలబడిన వ్లాదిమిర్‌ను చూసి నిజంగా గర్వపడుతున్నాను”
ఇప్పటికీ అనేక మంది రాజకీయ ఖైదీలు జైల్లో, ప్రవాసంలో ఉన్నప్పటికీ భవిష్యత్ మీద తన భర్తకున్న ఆశావహ దృక్పథాన్ని ఎవిగ్నా మాతో పంచుకున్నారు.
“ఇప్పుడు అన్నింటి కంటే ముఖ్యం ఏంటంటే మనిషిగా ఉండటం, మనం ఏం చెయ్యగలమో చెయ్యడం”
సోవియట్ పతనం, ఆ తర్వాత జరిగిన ప్రజా ఆందోళనలు తన భర్తకు ఎప్పుడూ స్పూర్తిని ఇస్తాయని ఆమె చెప్పారు.
“1980ల చివర్లో ప్రజలు కదలి వచ్చి పోరాడే వరకు ఏమీ లేదు. ప్రజలు వీధుల్లోకి వచ్చిన తర్వాత అంతా మారిపోయింది” అని ఆమె గుర్తు చేశారు.
“పాలన బీటలు వారడం మొదలైనప్పుడు మనం ఉద్యమించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి” అన్నారామె.
ఇవి కూడా చదవండి:
- శ్రీకృష్ణుడి ద్వారక కోసం సముద్రం అడుగుకి వెళ్లిన సబ్‌మెరైన్స్, అక్కడ ఏముంది?
- ఆకాశ్ దీప్: తండ్రి, అన్నను పోగొట్టుకున్నా పట్టు వదలకుండా శ్రమించి టీమిండియాకు ఎంపికైన క్రికెటర్ కథ
- ‘సైకాలజీ ఆఫ్ మనీ’: పొదుపు మంత్రంతో ఓ చిరుద్యోగి రిటైరయ్యేనాటికి కోట్లు ఎలా కూడబెట్టాడు... మోర్గన్ హౌసెల్ ఇచ్చిన మెసేజ్ ఏంటి?
- కేజీ బేసిన్: కాకినాడ తీరంలో తొలిసారిగా చమురు వెలికితీత...భారతదేశపు చమురు అవసరాలను ఇది తీర్చగలదా
- లాటరీ తగిలినట్లు ఈ దేశం ఒక్కసారిగా సంపన్న దేశంగా ఎలా మారింది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














