'సెక్స్‌కు ఒప్పుకో, లేదంటే కాల్చేస్తా...' ఒమన్‌కు అక్రమంగా రవాణా అయిన 50 మంది మహిళల కష్టాలు, కన్నీళ్ళు... వారిని ఒక వాట్సాప్ గ్రూప్ ఎలా కాపాడింది?

- రచయిత, ఫ్లోరెన్స్ ఫిరి, తమాసిన్ ఫోర్డ్
- హోదా, బీబీసీ ఆఫ్రికా ఐ
ఒమన్‌లో బానిసల్లా పని చేయడానికి, అక్రమ రవాణాకు గురైన 50 మంది మలావియన్ మహిళలను కాపాడటంలో ఒక వాట్సాప్ గ్రూప్ ఎలా సహాయపడిందో ‘‘బీబీసీ ఆఫ్రికా ఐ’’ పరిశోధించింది.
హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని వివరాలు మిమ్మల్ని కలచివేయవచ్చు.
ఒమన్‌లో తాను ఎదుర్కొన్న వేధింపులను తలుచుకొని 32 ఏళ్ల మహిళ కన్నీళ్లు పెట్టుకున్నారు. మెరుగైన జీవితాన్ని కోరుకుంటూ ఆమె ఒమన్ వెళ్లారు. ఆమె పేరు జార్జినా. ఒమన్‌లో జార్జినా పనిమనిషిగా పని చేశారు.
బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చిన బాధిత మహిళలు (అక్రమ రవాణాకు గురైనవారు) అందరి తరహాలోనే జార్జినా కూడా తన పూర్తి పేరును చెప్పకుండా కేవలం మొదటి పేరునే వెల్లడించారు.
దుబయ్‌లో తనకు డ్రైవర్‌గా ఉద్యోగం వచ్చిందని తొలుత ఆమె భావించారు.
మలావి దేశ రాజధాని లైలాంగ్వేలో ఆమె సొంతంగా ఒక చిన్న వ్యాపారం చేసేవారు. మధ్య ప్రాచ్యంలో మరింత డబ్బు సంపాదించవచ్చంటూ ఒక ఏజెంట్ ఆమెను సంప్రదించారు.
ఒమన్ రాజధాని మస్కట్‌లో విమానం ల్యాండ్ అయ్యాక తాను మోసపోయినట్లు ఆమె గ్రహించారు. అక్కడి ఒక కుటుంబం వారంలో ఏడు రోజులు దాదాపు రోజంతా తనతో పని చేయించేవారని ఆమె చెప్పారు.
‘‘నేను ఇక భరించలేని స్థాయికి చేరుకున్నా’’ అని ఆమె అన్నారు. రోజుకు రెండు గంటలు మాత్రమే నిద్రపోయే అవకాశం ఉండేదంటూ అక్కడి పరిస్థితులను జార్జినా వివరించారు.
యజమాని బలవంతంగా తనతో సెక్స్‌లో పాల్గొనమని వేధించడం మొదలుపెట్టారని, ఎవరికైనా చెబితే కాల్చేస్తానంటూ బెదిరించేవాడని ఆమె వాపోయారు.
‘‘ఆయన మాత్రమే కాదు. తన స్నేహితులను కూడా తీసుకొచ్చేవారు. తర్వాత వారు ఆయనకు డబ్బులు ఇచ్చేవారు’’ అని ఆమె చెప్పారు.
లైంగిక వేధింపులకు గురైన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె మాట్లాడలేకపోయారు.

‘‘నాకు చాలా తీవ్ర గాయాలయ్యాయి. చాలా కలత చెందాను’’ అని జార్జినా చెప్పారు.
గల్ఫ్ అరబ్ దేశాల్లో దాదాపు 20 లక్షల మంది మహిళా డొమెస్టిక్ కార్మికులు ఉన్నట్లు అంచనా. వలసదారుల స్వచ్ఛంద సంస్థ ‘డూ బోల్డ్’ చేసిన ఒక సర్వేను 2023 యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ రిపోర్ట్ ప్రచురించింది. ఒమన్‌లోని 400 మంది మహిళలపై చేసిన ఈ సర్వేలో దాదాపు అందరూ మానవ అక్రమ రవాణా బాధితులుగా గుర్తించారు.
అందులో మూడోవంతు మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారు. సగం మంది మీద శారీరక వేధింపులు, వివక్షకు గురైనట్లు సర్వేలో తేలింది.
జార్జినా అక్కడి పరిస్థితులను భరించలేక, ఎవరైనా సహాయం చేయాలంటూ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వేడుకున్నారు.
ఒమన్‌కు వేలాది మైళ్ల దూరంలో అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌లో ఉన్న 38 ఏళ్ల మలావియన్ సోషల్ మీడియా కార్యకర్త ఫిలిలాని మోంబే నయోని, జార్జినా చేసిన మెసేజ్‌ను చూశారు. దానిపై పరిశోధన మొదలుపెట్టారు.
తర్వాత జార్జినాతో మాట్లాడి, భద్రత కోసం జార్జినా పెట్టిన ఫేస్‌బుక్ పోస్టును తొలగించారు. జార్జినాకు తన వాట్సాప్ నంబర్ ఇచ్చారు. ఆ నంబర్, ఒమన్‌లో చాలా మంది చేతికి వెళ్లింది. దీంతో ఇది చాలా పెద్ద సమస్య అని ఆమె గ్రహించారు.

‘‘నాకు తెలిసిన మొదటి బాధితురాలు జార్జినా. తర్వాత మరో బాలిక, ఆ తర్వాత మరో ఇద్దరూ, ముగ్గురూ ఇలా వారి సంఖ్య పెరిగింది. ఇది చూడటానికి మానవ అక్రమ రవాణా కేసులా అనిపించింది. దీంతో ఒక వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశాను’’ అని బీబీసీతో ఫిలిలాని చెప్పారు.
ఒమన్‌లో ఇళ్లలో పని మనుషులుగా పనిచేస్తోన్న 50 మందికి పైగా మలావియన్ మహిళలు ఈ గ్రూప్‌లో చేరారు.
త్వరలోనే ఆ వాట్సాప్ గ్రూప్ అంతా వాయిస్ మెసేజ్‌లు, వీడియోలతో నిండిపోయింది. కొన్ని వీడియోలు చూడటానికి చాలా బాధాకరంగా ఉన్నాయి. అక్కడి మహిళలు అనుభవిస్తోన్న భయంకర పరిస్థితులను ఆ వీడియోలు చూపించాయి. చాలా మంది మహిళల నుంచి వారి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకొని, వారు అక్కడి నుంచి బయటపడకుండా అడ్డుకున్నారు.
కొంతమంది రహస్యంగా టాయ్‌లెట్లలోకి వెళ్లి తమను కాపాడాలంటూ మెసేజ్‌లు ఎలా పంపిచారో వివరించారు.
‘‘నాకు జైల్లో ఉన్నట్లుగా అనిపించింది. అక్కడినుంచి ఎప్పటికీ తప్పించుకోలేనని అనిపించింది’’ అని ఒకరు చెప్పగా, ‘‘నా జీవితం ప్రమాదంలో పడింది’’ అని మరొకరు వివరించారు.

మలావిలోని మానవ అక్రమ రవాణాకు సంబంధించిన చారిటీలతో పెలిలాని మాట్లాడటం మొదలుపెట్టారు. గ్రీస్‌లోని ‘డూ బోల్డ్’ వ్యవస్థాపకురాలు ఎకతెరీనా పొరాస్ సివొలోబోవాతో పరిచయం పెంచుకున్నారు.
గల్ఫ్ దేశాల్లోని వలస కార్మికుల కమ్యూనిటీతో కలిసి డూ బోల్డ్ సంస్థ పనిచేస్తుంది. మానవ అక్రమ రవాణా లేదా బలవంతపు లేబర్ బాధితులను గుర్తించి వారిని విడుదల చేయాలంటూ యజమానులతో చర్చలు జరుపుతుంది.
‘‘ఇళ్లలో పనులు చేయడానికి మనుషులు కావాలంటూ ఏజెంట్లకు అక్కడి యజమానులు డబ్బులు చెల్లిస్తారు. మాకు సాధారణంగా ఎదురయ్యే సవాలు ఏంటంటే, ‘నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేస్తే వాళ్లను విడుదల చేస్తామంటూ’ ఏజెంట్లు, యజమానులు చెబుతుంటారు. ఒమన్‌లోని చట్టాల ప్రకారం, యజమాని ఒక డొమెస్టిక్ వర్కర్‌ను ఎలా చూస్తున్నా యజమానిని వదిలి వెళ్లకూడదు. ఉద్యోగం కూడా మారకూడదు. దేశాన్ని విడిచి వెళ్లకూడదు’’ అని బీబీసీతో సివోలోబోవా చెప్పారు.
మధ్య ప్రాచ్యంలో దీన్ని ‘కఫాలా’ కార్మిక వ్యవస్థ అని పిలుస్తారు. కాంట్రాక్టు ఉన్నంతవరకు పనివాళ్లు, యజమానులను వదిలి వెళ్లకూడదని కఫాలా వ్యవస్థ చెబుతుంది.
యజమానికి, గృహ కార్మికుల మధ్య కాంట్రాక్టు ఉంటుందని బీబీసీకి ఒమన్‌లో మానవ అక్రమ రవాణాను నిరోధించే జాతీయ కమిటీ చెప్పింది. ఇరు వర్గాల మధ్య వివాదాలను వారంలోగా కోర్టుకు తీసుకెళ్లవచ్చని చెప్పింది.
కార్మికుల మీద యజమానులు ఏ విధంగానూ బలవంతం చేయకూడదని, వారి పాస్‌పోర్టులు, వ్యక్తిగత పత్రాలను కోర్టు అనుమతి లేకుండా స్వాధీనం చేసుకోకూడదని తెలిపింది.

ఫొటో సోర్స్, REUTERS
మస్కట్‌లో మూడు నెలలు ఉన్న తర్వాత ఫిలిలానితో పాటు ఒమన్‌లోని మరో వ్యక్తి సహాయంతో జార్జినా 2001 జూన్‌లో మలావికి తిరిగొచ్చారు.
‘‘జార్జినాకు సహాయం చేసిన తర్వాత, బాధితులకు జరుగుతోన్న అన్యాయం చూసి నాకు చాలా కోపం వచ్చింది’’ అని ఫిలిలాని అన్నారు.
జార్జినా కేసు ఆమెను మలావిలో ఇలాంటి అంశాలపై గొంతెత్తేలా చేసింది. ఈ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రభుత్వం ఒత్తిడి పెరగడం ప్రారంభమైంది.
మహిళలను తిరిగి ఇళ్లకు రప్పించాలంటూ అధికారులను డిమాండ్ చేస్తూ మలావియన్ చారిటీ సెంటర్ ఫర్ డెమొక్రసీ అండ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్స్ (సీడీఈడీఐ), ఒమెన్ సహాయక క్యాంపెయిన్‌ను ప్రారంభించింది.
పిలిలాని వాట్సాప్ గ్రూప్‌లో చేరిన మరో మహిళ పేరు బ్లెస్సింగ్స్. 39 ఏళ్ల బ్లెస్సింగ్స్ తన నలుగురు పిల్లలను లైలాంగ్వేలోని తన సోదరి స్టెవెలియాకు అప్పగించి 2022 డిసెంబర్‌లో మస్కట్‌కు వెళ్లారు.
తాను పని చేస్తోన్న ఇంటి కిచెన్‌లో బ్లెస్సింగ్స్ శరీరం తీవ్రంగా కాలిపోయింది. కానీ, యజమాని ఆమెను తిరిగి మలావికి వెళ్లనివ్వలేదు.
‘‘ఆమె శరీరం ఎంతగా కాలిపోయిందంటే, నా సోదరి ఇక చనిపోతుందనుకున్నా. అప్పుడు ఆమె మాట్లాడిన మాటలు నాకు గుర్తున్నాయి. ‘నేను ఇక్కడికి మెరుగైన జీవితం కోసం వచ్చాను. కానీ, ఇక్కడే చచ్చిపోవాలా? దయచేసి నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో’ అని వేడుకుంది. ఆ మాటలు నాకు చాలా బాధ కలిగించాయి’’ అని బీబీసీతో స్టెవెలియా చెప్పారు.
తన సోదరిని ఇంటికి తీసుకురావాలంటూ స్టెవెలియా లాబీయింగ్ ప్రారంభించారు. మొదట ఆ ఏజెంట్ కోపంగా బ్లెస్సింగ్ చనిపోయిందని చెప్పారు. కానీ, అది నిజం కాదు. చివరకు మలావి ప్రభుత్వ సహాయంతో గత అక్టోబర్‌లో బ్లెస్సింగ్ ఇంటికి చేరుకున్నారు.

‘‘నేను మళ్లీ నా పిల్లల్ని, నా కుటుంబాన్ని చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. మనుషుల్ని బానిసల్లాగా చూసే వారు ఈ భూమ్మీద ఉంటారని నాకు తెలియదు’’ అని బీబీసీతో బ్లెస్సింగ్ అన్నారు.
ఒమన్ నుంచి 54 మంది మహిళల్ని వెనక్కి తీసుకురావడానికి రూ. 1.32 కోట్ల( 1,60,000 డాలర్లు)కు పైగా ఖర్చు చేసినట్లు మలావి ప్రభుత్వం వెల్లడించింది.
23 ఏళ్ల ఐడా చివాలో మృతదేహం శవపేటికలో ఇంటికి వచ్చింది. ఆమె చనిపోయాక ఒమన్‌లో శవపరీక్ష, దర్యాప్తు జరుగలేదు.
2022లో మలావి జాతీయులైన డొమెస్టిక్ వర్కర్ల నుంచి కార్మిక మంత్రిత్వ శాఖకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, 2023లో వచ్చిన ఒక ఫిర్యాదును పరిష్కరించినట్లు ఒమన్ అధికారులు వెల్లడించారు.
‘‘యజమానులకు వెయ్యి నుంచి రెండు వేల డాలర్ల వరకు చెల్లించినందున ఈ మహిళల్లో అధికభాగం విడుదల అయ్యారు. అంటే వారి స్వేచ్ఛను కొనాల్సి వచ్చిందన్నమాట. ఈ అంశమే నన్ను బాధిస్తుంది. ఒక వ్యక్తి స్వేచ్ఛను మీరెలా కొనగలరు?’’ అని సివొలోబోవా అన్నారు.
వలసదారులకు, వారి కుటుంబాలకు భద్రతనిచ్చేలా, ప్రయోజనకరంగా ఉండేలా వలసకు సంబంధించిన నియమ నిబంధనలను రూపొందించినట్లు బీబీసీతో మలావి ప్రభుత్వ అధికార ప్రతినిధి చెప్పారు.
‘‘మలావిలోనే ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటే మహిళలు ఇలా మోసాల్లో చిక్కుకోలేరు. కాబట్టి దేశంలో అవకాశాలు సృష్టించాలి. అప్పుడే యువత ఇలా మోసపోరు’’ అని ఫిలిలాని అన్నారు.
తాను అనుభవించిన వేధింపుల నుంచి బయటకు రావడం అంత సులభం కాదని జార్జినా అన్నారు. మనశ్శాంతి కోసం సరస్సు వద్ద కూర్చుంటానని జార్జినా అన్నారు.
‘‘అలలను చూసినప్పుడు, నాకు జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే విషయం గుర్తొస్తుంది. ఒకరోజు ఇదంతా చరిత్రగా మారుతుంది’’ అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఫ్రామౌరో: మతం కాదు, సైన్స్ ఆధారంగా తొలి ప్రపంచ పటాన్ని చిత్రించిన సన్యాసి... గడప దాటకుండానే ఆయన ఈ అధ్భుతాన్ని ఎలా సాధించారు?
- గుజరాత్ యూనివర్సిటీ: 'నమాజ్ చేస్తుండగా మాపై దాడి చేశారు, మేం చదువు ఎలా పూర్తి చేయాల'ని ప్రశ్నిస్తున్న విదేశీ విద్యార్థులు
- జింకల్లో కొత్త జాతి గుర్తింపు.. ఇది ఎక్కడ ఉంది?
- సీఏఏ: పౌరసత్వ సవరణ చట్టం అమలుకు నిబంధనలను విడుదల చేసిన కేంద్రం, దీనివల్ల ఏం జరుగుతుంది?
- రోజుల వ్యవధిలో అక్కాచెల్లెళ్లకు ఒకే తరహాలో గుండెపోటు, హఠాత్తుగా వచ్చే సమస్య ఎంత ప్రమాదకరం?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














