జాస్మిన్ పారిస్: 125 ఏళ్ల చరిత్రలో 20 మంది మగవాళ్లు మాత్రమే పూర్తిచేసిన అత్యంత కఠినమైన 100 మైళ్ల మారథాన్‌లో రికార్డ్ సృష్టించిన తొలి మహిళ

ఫొటో సోర్స్, David Miller
- రచయిత, ఏంజీ బ్రౌన్
- హోదా, బీబీసీ స్కాట్లాండ్
ప్రపంచంలోనే అత్యంత సవాళ్లతో కూడిన మారథాన్‌గా చెప్పే బార్క్‌లీ మారథాన్‌ను పూర్తి చేసిన మొదటి మహిళగా జాస్మిన్ పారిస్ చరిత్ర సృష్టించారు.
జాస్మిన్ 60 గంటల్లోగా పూర్తి చేయాల్సిన మారథాన్‌ను 99 సెకన్లు మిగిలి ఉండగానే పూర్తి చేశారు.
“మాటల్లో వర్ణించలేనంత సంతోషంగా ఉంది. నేను తప్పకుండా పూర్తి చేస్తానని బలంగా నమ్మాను” అని బీబీసీతో తన సంతోషాన్ని పంచుకున్నారు జాస్మిన్.
మారథాన్‌లలోనే ఎన్నో సవాళ్లతో కూడుకున్నదిగా చెప్పే బార్క్‌లీ మారథాన్‌ను ఏటా నిర్వహిస్తారు.
అయితే, ఇది మిగిలినవాటిలా కాదు..ప్రత్యేకమైనది. ఈ మారథాన్ నిర్వహణ వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.
అంతేకాదు, ఏటా మారథాన్ కోర్స్ మారుతుంటుంది. 100 మైళ్లు, 60,000 అడుగుల మేర ఎక్కడ, దిగడంతో కలిపి చూస్తే ఎవరెస్ట్ పర్వతాన్ని రెండు సార్లు ఎక్కినట్లుగా భావించాలి.
క్లిష్టమైన మారథాన్..
1989లో 100 మైళ్ల మారథాన్‌ను నిర్వహించడం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా 20 మంది మాత్రమే దీనిని పూర్తి చేయగలిగారు.
వారిలో జాస్మిన్ విజేతగా నిలిచిన మొదటి మహిళ.
99 సెకన్లకు ముందే గమ్యాన్ని చేరుకున్న ఆమె ఫినిషింగ్ లైన్ దగ్గరే కూలబడిపోయారు. అక్కడున్నవారంతా ఆమెను అభినందిస్తుంటే, ఫొటోగ్రాఫర్లు ఆ క్షణాలను కెమెరాల్లో బంధించారు.
‘బీబీసీ బ్రేక్‌ఫాస్ట్’ ఆ సమయంలో జాస్మిన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించింది.
ఆమె మాట్లాడలేక మొబైల్ ద్వారా తన సందేశాన్ని పంపారు.
“నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. సంతోషంతో మాటలు రావడం లేదు.
ఈ ఏడాది ఎలాగైనా పూర్తి చేయాలని అనుకున్నాను. శిక్షణలో పూర్తి నమ్మకం కలిగింది. ఈ క్షణాలు నా సామర్థ్యాన్ని నిరూపించే తార్కాణాలుగా నిలిచాయి” అని స్పందించారు.

ఫొటో సోర్స్, David Miller
ఏంటీ మారథాన్?
మారథాన్‌ల నిర్వహణ వెనుక వ్యాయామం, ఆరోగ్యం పట్ల అవగాహన వంటి అంశాలు ఉంటాయి. కానీ, బార్క్‌లీ మారథాన్ వెనుక ఒక కథ ఉంది.
గ్యారీ లాజరస్ లేక్ కాంట్రెల్, కార్ల్ హెన్‌ల ఆలోచన నుంచి పుట్టింది.
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌ను హత్యచేసిన జేమ్స్ ఎర్ల్ రే 1977లో బ్రషీ మౌంటెన్ పెనిటెన్షియరీ (జైలు) నుంచి తప్పించుకుని, 50 గంటల్లో 12 మైళ్ల దూరం పరిగెత్తాడు.
ఉదయం పూట పోలీసులు, అన్వేషణ సాగించే హెలికాఫ్టర్ల నుంచి తప్పించుకునేందుకు అడవిలో చెట్ల మధ్యన దాగి, మిగిలిన సమయంలో పరిగెత్తాడు.
దీనిపై కాంట్రెల్ “అతడు 12 మైళ్లే పరిగెత్తాడు. నేనైతే 100 మైళ్లయినా పరిగెత్తి ఉండేవాణ్ని” అని ఎగతాళిగా అన్నాడు.
అలా మొదలైన ఆలోచనకు రూపమే బార్క్‌లీ మారథాన్.
ఈ మారథాన్ నియమాలు కూడా భిన్నంగా ఉంటాయి.
ఏటా జరిగే ఈ పోటీలో కేవలం 35 మందికి మాత్రమే పాల్గొనేందుకు అనుమతి ఉంటుంది.
100 మైళ్ల రేస్‌ను ఐదు లూప్‌లలో పూర్తి చేయాలి. అందుకు 60 గంటలు మాత్రమే సమయం ఉంటుంది.
పోటీల్లో పాల్గొనాలనుకునే వారు తమ అప్లికేషన్‌తోపాటు బార్క్‌లీలో పాల్గొనాలని నేనెందుకు అనుకుంటున్నాను? అనే అంశంపై వ్యాసం రాసి పంపాలి. దానితోపాటు
ఒక్కో లూప్ 12 మైళ్లు (19 కిలోమీటర్లు) ఉంటుంది. 1.66 డాలర్లు దరఖాస్తు రుసుము చెల్లించాలి.
మారథాన్ మొదలయ్యాక, ప్రతి లూప్‌ను పూర్తి చేశారన్న దానికి సాక్ష్యంగా ముందే నిర్వాహకులు చెక్ పాయింట్ల వద్ద దాచిన పుస్తకాల నుంచి వారికి కేటాయించిన నెంబరు గల పేజీని చించి, తమతో ఉంచుకోవాలి.
లూప్ పూర్తయ్యే సమయాన నిర్వాహకుడికి అందజేయాలి. మొత్తంగా మారథాన్‌లో 9 నుంచి 14 పుస్తకాల నుంచి వీటిని సేకరించాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, David Miller
ఎలా మొదలవుతుంది?
రేస్ జరిగే రోజున ఉదయం నుంచి రాత్రి మధ్య ఎప్పుడైనా మారథాన్ మొదలుకావొచ్చు. ఒక గంట ముందు శంఖం ఊది పోటీదారులకు సిగ్నల్ ఇస్తారు. డైరెక్టర్ సిగరెట్ వెలిగించిన సమయాన రేస్ మొదలవుతుంది.
ఐదులూప్‌లలో మొదటి, మూడో లూప్‌లు సవ్యదిశలో, రెండు, నాలుగు లూప్‌లు అపసవ్య దిశలో పూర్తి చేయాలి.
చివరి లూప్ దగ్గరికి వచ్చేసరికి డైరెక్టర్ ఫైనలిస్ట్‌లను బట్టి వారు ఏ దిశలో వెళ్లాలో నిర్ణయిస్తారు.
జాస్మిన్ ఎలా పూర్తిచేశారు?
డెర్బీషైర్‌లోని హాడ్‌ఫీల్డ్‌కు చెందిన జాస్మిన్‌కు ఈ మారథాన్‌తో పరిచయం ఉంది.
2022లో ఫన్‌రైడ్‌గా పిలిచే మారథాన్‌లో తొలిసారిగా పాల్గొని, విజేతగా నిలిచారు. ఆ పోటీలో మూడు లూప్‌లను పూర్తి చేశారు జాస్మిన్.
ఈ రికార్డు గతంలో స్యూ జాన్‌స్టన్ అనే మహిళ పేరుమీద ఉండేది. ఆమె 2001లో 66 మైళ్లను పూర్తి చేశారు.
జాస్మిన్ విజేతగా నిలిచిన క్షణాలను తన కెమెరాలో బంధించిన ఫొటోగ్రాఫర్ డేవిడ్ మిల్లర్ మాట్లాడుతూ, “పోటీ మూడు నిముషాల్లో ముగుస్తోందనగా అందరూ ఏవేవో అనుకున్నారు. అప్పుడే జాస్మిన్ అన్న పేరు ప్రేక్షకుల నుంచి వినిపించింది.
నేను అటువైపు దృష్టి సారించాను. ఎంతో పట్టుదలతో గమ్యం వైపు వస్తోన్న జాస్మిన్ నాకు కనిపించింది” అన్నారు.
“ఆమె లూప్‌ను పూర్తి చేసే పసుపురంగు గేట్‌ను ముట్టుకుని, అక్కడే కూలబడిపోయారు. ఆ దృశ్యాన్ని నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే, అది అద్భుతం. నాకళ్లు చెమ్మగిల్లాయి. ఫొటోగ్రాఫర్‌గా నా పనిని కూడా నేను నిర్వర్తించాను. ఆమె విజయ క్షణాలను నా కెమెరాలో బంధించాను” అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కర్ణాటక ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు డబ్బులిచ్చిన బీజేపీ ఎంపీ.. ఆయన ఎవరు? ఎంత ఇచ్చారు?
- ఈడీ ఎవరినైనా అరెస్టు చేయొచ్చా? అన్ని అధికారాలు ఎలా వచ్చాయి?
- ఆమె 58 ఏళ్ల వయసులో మళ్లీ తల్లయింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వివరణ కోరింది...చట్టం ఏం చెబుతోంది?
- మనిషి మెదడులోకి పురుగులు ఎలా వస్తాయి?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














