ఎండల్లో పని చేసే మహిళలకు గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందా?

సంధ్య
ఫొటో క్యాప్షన్, దేశంలోని అసంఘటిత శ్రామిక వర్గాల్లో తక్కువ వేతనానికి, అధిక వేడి ఉండే ప్రదేశాల్లో పనిచేసే రేఖలాంటి మహిళలు ఎంతో మంది ఉన్నారు.
    • రచయిత, తులిప్ మజుందార్
    • హోదా, బీబీసీ హెల్త్ కరస్పాండెంట్

విపరీతమైన వేడిలో పని చేసే గర్భిణులు, ప్రసవ సమయంలో బిడ్డ చనిపోవడం లేదా అబార్షన్ల బారిన ప్రమాదం రెట్టింపయిందని భారత్‌లో నిర్వహించిన కొత్త పరిశోధనలో తేలింది.

తల్లి కావాలని ఆరాటపడే మహిళల్లో ఈ ప్రమాదం గతంలో ఊహించినదానికన్నా ఎక్కువగానే ఉన్నట్లు అధ్యయనంలో తెలిసింది.

ఈ ప్రభావం కేవలం ఉష్ణమండల ప్రాంతాల్లోని మహిళలపై మాత్రమే కాక, బ్రిటన్ వంటి దేశాల్లోనూ, ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లోనూ ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

ప్రపంచదేశాల్లో పనికి వెళ్తున్న గర్భిణులకు నిర్దిష్టమైన ఆరోగ్య సలహా అవసరమని వారు అంటున్నారు.

తమిళనాడులో నిర్వహించిన ఈ అధ్యయనంలో 800 మంది గర్భిణులు పాల్గొన్నారు. చెన్నైలోని శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఎస్ఆర్ఐహెచ్‌ఈఆర్)‌ 2017లో ఈ అధ్యయనాన్ని ప్రారంభించింది.

ఆ మహిళల్లో సగం మంది ఎండలో పనులు చేయాల్సివచ్చే వ్యవసాయం, ఇటుక బట్టీలు, ఉప్పు తయారీ వంటి పనులకు వెళ్లేవారు కాగా, మిగిలిన వారు స్కూల్స్, ఆసుపత్రులు వంటి వాతావరణ పరిస్థితుల్లో పనిచేసే మహిళలు. అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే పనిప్రదేశాల్లో పనిచేసే మహిళలు కూడా ఈ అధ్యయనంలో భాగమయ్యారు.

"ఏ స్థాయి ఉష్ణోగ్రతకు లోనైతే మానవ శరీరం వేడికి లోనయినట్లు భావించాలని చెప్పడం గురించి కాకుండా, శరీరంపై వేడి ప్రభావమనేదీ, మీరు అలవాటు పడిన వేడి వాతావారణం, మీ శరీరం తట్టుకునే ఉష్ణోగ్రతలను బట్టి చూడాలి" అని ఈ అధ్యయనంలో భాగస్వాములైన ప్రొఫెసర్ జేన్ హర్ట్స్ అన్నారు.

రేఖ షణ్ముగం
ఫొటో క్యాప్షన్, తిరువన్నామలైలోని చెరకు తోటలో ఉష్ణోగ్రతను పరిశీలిస్తున్న రేఖ షణ్ముగం

తిరువణ్ణామలైలో పొలంలో పని చేస్తున్న సుమతిని నేను కలుసుకున్నాను. సుమతి అధ్యయనంలో పాల్గొన్న గర్భిణుల్లో మొదటివారు.

అప్పటికే రెండు గంటల నుంచి దోసకాయలు కోస్తున్న సుమతి, తన చేతికి తొడుక్కున గ్లౌజులను తీసి, “ఈ వేడికి నా చేతులు కాలిపోయాయి” అంటూ తన చేతి వేళ్లను చూపించారు.

ఇంకా వేసవి మొదలుకానేలేదు, కానీ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు చేరాయి. ఈరోజు మరీ ఉక్కపోతగా కూడా ఉంది.

దోసకాయలు కోసే సమయంలో వాటికి ఉండే సన్నని ముల్లులవంటివి చేతికి గుచ్చుకోకుండా గ్లౌజ్‌ను ధరించారు. అందువల్ల చెమటలు పట్టి, అసౌకర్యంగా అనిపిస్తోంది ఆమెకు.

“ఈ ఎండకు నా మొఖం కూడా కాలిపోతోంది” అని చెప్పారామె.

ఆమె ఉదయం, సాయంత్రం ఈ పనికి వెళ్తూనే, స్కూల్‌లో వంటమనిషిగా రోజుకు రూ.200ల జీతానికి పనిచేస్తున్నారు.

అధ్యయనంలో, గర్భస్థ శిశువును కోల్పోయిన మహిళల్లో ఆమె మొదటివారు.

“గర్భంతో ఉండి, అందులోనూ అంత వేడిలో పనిచేయడం అలసటగా అనిపించేది” అన్నారామె.

ఒకరోజు తన భర్తకు భోజనం తీసుకువెళ్తున్న సమయంలో ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు సాయంత్రం, వైద్యుడి దగ్గరకు వెళ్లగా, ఆమెను పరీక్షించి, అబార్షన్ అయినట్లు తెలిపారు. అప్పటికి 12 వారాల గర్భవతి ఆమె.

“నా భర్త నన్ను ఒడిలో పడుకోబెట్టుకుని ధైర్యం చెప్పారు. ఆయనే లేకపోతే నేను ఏమైపోయేదానినో చెప్పలేను” అన్నారు.

తన భర్త ఎంతో ప్రేమగా చూసుకునేవారని, ఇప్పుడు ఆయన లేకుండా జీవితాన్ని కొనసాగించేందుకు అలవాటు పడ్డానని చెప్పారు సుమతి. ఈ మధ్యనే సుమతి తన భర్తను కోల్పోయారు. దాంతో ఆమె కుటుంబపోషణకు ఆధారంగా మారారు.

వేడి వాతావరణంలో తాను పనిచేసిన కారణంగానే తన బిడ్డను కోల్పోయానన్న విషయం సుమతికీ తెలీదు.

మొత్తంగా చూస్తే, శీతల ప్రదేశాల్లో పనిచేసే వారితో పోలిస్తే, వేడి వాతావరణంలో పనిచేసే గర్భిణులు ప్రసవంలో బిడ్డను కోల్పోయే లేదా అబార్షన్‌కు గురయ్యే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువని అధ్యయనంలో తేలింది.

వేడి వాతావరణంలో పనిచేసే గర్భిణులకు ముప్పు పొంచి ఉంది.
ఫొటో క్యాప్షన్, సుమతి 12 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు అబార్షన్‌కు గురయ్యారు.

ప్రపంచంలోని మహిళలకూ ముప్పే

అధ్యయనంలో పాల్గొన్న మహిళలంతా భారతదేశంలోని వారే.

“వాతావరణ మార్పులకు లోనవుతున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది” అన్నారు యూకేకు చెందిన ది జార్జ్ ఇన్‌స్టిట్యూట్‌లో గ్లోబల్ విమెన్స్ హెల్త్ విభాగ ప్రొఫెసర్, ఒబ్‌స్టెట్రీషియన్ అయిన ప్రొఫెసర్ జేన్.

పారిశ్రామికీకరణకు జరగక ముందు సమయంతో పోలిస్తే, ఈ శతాబ్దం చివరినాటికి భూమి సగటు ఉష్ణోగ్రత మూడు డిగ్రీల మేర పెరగనుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ చెప్తోంది.

అది “అందరికీ అస్థిత్వ ముప్పుగా మారనుంది” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా గర్భిణులు “కొన్ని తీవ్రమైన పరిణామాలు” ఎదుర్కోవలసి రావొచ్చని పేర్కొంది.

వేడిగాలుల తీవ్రత సమయంలో, నెలలు నిండకముందే ప్రసవాలు, మృత శిశువుల ప్రసవాలకు సంబంధించిన కేసులు 15% పెరిగే ప్రమాదముందని గత అధ్యయనాల్లో తేలింది.

అయితే, ఈ అధ్యయనాలు అమెరికా, ఆస్ట్రేలియా వంటి అత్యధిక ఆదాయాలు ఉన్న దేశాల్లో జరుగుతుంటాయి.

భారత్‌లో నిర్వహించిన అధ్యయనంలో ఆందోళన కలిగించే అంశాలు, ప్రతికూల ప్రభావాలను కలిగించే విషయాలు తెలిశాయని ప్రొఫెసర్ జేన్ అంటున్నారు.

“అమెరికాలోనూ వేసవిలో ఎండ తీవ్రత ఉంటుంది కానీ, భారత్‌తో పోలిస్తే అది తక్కువే. అయినప్పటికీ తక్కువ ఎండ తీవ్రత ఉన్న ప్రాంతాల్లో ఈ బెడద తగ్గుతుంది” అన్నారు.

ప్రస్తుతానికి వేడి ప్రదేశాల్లో పనిచేసే గర్భిణులను ఉద్దేశించి ముఖ్య మార్గదర్శకాలంటూ లేవు. అయితే, 1960లు, 70లలో యూఎస్ మిలటరీకి చెందిన 70-75 కేజీల బరువు, శరీరంలో 20% కొవ్వు కలిగి ఉన్న వ్యక్తి పాల్గొన్న అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ఉన్నాయి.

ఈ అధ్యయన ఫలితాలు, తదనంతర పరిశోధనలు చాలా మార్పులు కలిగించాయని ప్రొఫెసర్ జేన్ అన్నారు.

ఆమె సూచనల ప్రకారం.. వేడి ప్రదేశాల్లో పనిచేసే గర్భిణులు వారి రక్షణ కోసం ఈ జాగ్రత్తలు పాటించాలి అవి..

  • దీర్ఘకాలంపాటు వేడి వాతావరణంలో ఉండకుండా చూసుకోవాలి
  • ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న రోజుల్లో పని చేసేటప్పుడు నిర్ణీత సమయాల్లో విరామాలు తీసుకోవాలి.
  • ముఖ్యంగా వేడి ఎక్కువగా ఉండే సమయంలో ఏకబిగిన పనిచేయకూడదు.
  • ఎక్కువ నీరు తాగాలి.
  • పరిశోధకులు భారత్‌లో నిర్వహించిన అధ్యయనం కోసం వెట్ బల్బ్ గ్లోబ్ టెంపరేచర్ (డబ్ల్యూబీజీటీ) అని పిలిచే సూచీని ఆధారంగా చేసుకున్నారు. ఉష్ణోగ్రత, తేమ శాతం, గాలి వేగం, మానవ శరీరాలపై వేడి ప్రభావాన్నితెలిపే సూచీ అది.

ఆ సూచీల ఆధారంగా నమోదయ్యే ఉష్ణోగ్రత, తరచుగా, టీవీల్లో ప్రసారమయ్యే వాతావరణ సమాచారం లేదా యాప్‌ల‌తో పోలిస్తే తక్కువగానే ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

భారీ పనులు చేసే వ్యక్తులకు 27.5 సెల్సియస్- డబ్ల్యూబీజీటీ సూచి సురక్షితమైన ఉష్ణోగ్రత అని తెలిపింది యూఎస్ ఆక్యుపేషణల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్.

ఎండలో పని తప్ప మరో దారి లేదు

కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఇటీవల జరిపిన అధ్యయనం ప్రకారం, నీడలో విశ్రాంతి తీసుకునే వ్యక్తి ఎదుర్కొనే ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయిని దాటుతోన్న ప్రపంచ దేశాల్లో భారత్ మొదటి దేశంగా మారనుంది.

2050 నాటికి భారత్‌లో వేడి ఎక్కువగా ఉండే పగళ్లు, రాత్రుల సంఖ్య రెట్టింపు లేదా నాలుగు రెట్లు కూడా పెరిగే అవకాశం ఉంది.

తిరువణ్ణామలైలోని చెరకుతోటల్లో ఉదయం పూట ఉష్ణోగ్రతల్ని రికార్డు చేస్తున్నారు ఎస్ఆర్ఐహెచ్ఈఆర్ అధ్యయన బృందంలోని ప్రధాన పరిశోధకురాలు, విశ్రాంత నర్స్ రేఖ షణ్ముగం.

“నా చుట్టూ దాదాపు 12 మంది కార్మికులు పని చేస్తున్నారు. వారిలో సగం మంది మహిళలే. చెరకు గడలను కోస్తున్నారు. ఉపాధి కోసం ఎండలో పని చేయడం తప్ప మరో మార్గం లేదు వీరికి” అన్నారు రేఖ షణ్ముగం.

పరికరంలో నీటిని నింపి, వేర్వేరు బటన్లను నొక్కారు.

డబ్ల్యూబీజీటీ ఉష్ణోగ్రత 29.5 సెల్సియస్‌గా ఆ పరికరం చూపిస్తోంది. ఆ ఉష్ణోగ్రత ఎండలో పనిచేసే వారు సురక్షితంగా పనిచేయగలిగిన ఉష్ణోగ్రత పరిమితికి మించి ఉంది.

“ఈ స్థాయి వేడిలో వారు ఎక్కువసేపు పనిచేస్తే, అధిక ఉష్ణోగ్రతల కారణంగా అనారోగ్యం పాలయ్యే ప్రమాదముంది. ముఖ్యంగా గర్భిణుల విషయంలో ఇది ఆందోళన కలిగించే విషయం” అన్నారు.

వెన్ను విరిగేలా ఈ పని చేయడం తప్ప మరో మార్గం లేదని, ఈ పనికి రోజుకు రూ.600 అందుతాయని 28 ఏళ్ల సంధ్య నాతో చెప్పారు.

ఇద్దరు పిల్లలతోపాటు కుటుంబం అవసరాలు తీర్చేందుకు ఆమె ఈ పని చేస్తున్నారు.

సంధ్య కూడా అధ్యయనంలో పాల్గొన్నారు. మొదటిసారి గర్భవతి అయిన సమయంలో ఆరునెల గర్భం ఉన్నప్పుడు తన బిడ్డను కోల్పోయారు.

అనారోగ్యం నుంచి కోలుకోవడానికి కొన్ని నెలలపాటు పనికి దూరంగా ఉన్నారు.

ఆ సమయంలో చేసిన అప్పులు ఇంకా తీరలేదని ఆమె చెప్పారు.

“నా ఆలోచనలన్ని నా పిల్లల చుట్టూనే ఉంటాయి” అని చెెప్పిన సంధ్య, “వారు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించాలి. నాలాగా ఇలా పొలం పనులకు వెళ్లే పరిస్థితి రాకూడదు” అన్నారు.

మూత్ర విసర్జన కూడా సమస్యే..

వేడి వాతావరణం గర్భిణులు, గర్భంలో పెరుగుతున్న పిండం ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, ఎందుకు సమస్యగా మారుతుందో వారికి తెలీదు.

గతంలో, గాంబియాలో నిర్వహించిన అధ్యయనంలో, అధిక ఉష్ణోగ్రతలు పిండం గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయని, బొడ్డు నుంచి జరిగే రక్తప్రసరణ వేగాన్ని తగ్గిస్తాయని తేలింది.

ఒక సిద్ధాంతం ప్రకారం, తల్లి శరీరం ఎక్కువ వేడిగా ఉంటే గనుక, దానిని తగ్గించేందుకు పిండానికి జరిగే రక్తప్రసరణలో మార్పులు జరుగుతాయి. ఆ రక్తప్రసరణ దారి మళ్లుతుంది.

మరుగుదొడ్లు లేకపోవడం కూడా ఈ సమస్య తీవ్రతకు కారణం అవుతోందని రేఖ షణ్ముగం అంటున్నారు.

గతంలో చేసిన అధ్యయనం గురించి ఆమె చెప్తూ, బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జనకు ఇష్టపడని మహిళలు, ఆ అవసరం రాకుండా ఉండేందుకు తక్కువ నీరు తాగుతారని, ఫలితంగా వారిలో మూత్రసంబంధిత సమస్యలు తలెత్తుతున్నట్లు తేలిందన్నారు.

“ కీటకాలు, పొదల్లో దాగి ఉండే పాముల బెడద లేదా పురుషులెవరైనా చూస్తారనే భయంతో వారు బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జనకు ఇష్టపడరు. ఇంటికి వెళ్లేవరకు, రోజంతా అలాగే బిగపట్టుకుని ఉంటారు” అన్నారు.

భాస్కర్
ఫొటో క్యాప్షన్, తిల్లై భాస్కర్ తన బట్టీల్లో పనిచేసే కార్మికులకు ఇబ్బంది కల్గకుండా ఉండేందుకు షెడ్ నిర్మించారు.

పరిష్కారాలు..

తమిళనాడులో నిర్వహించిన ఈ అధ్యయనాల్లో గుర్తించిన అంశాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని స్టేట్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.టీఎస్ సెల్వ వినాయగం అన్నారు.

“ఇప్పటికే మేం గర్భిణులకు ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమం కొనసాగిస్తున్నాం, కానీ, దానితోపాటుగా వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను కల్పించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది” అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 12 వారాలు నిండిన నిరుపేద గర్భిణులకు రూ.18 వేల ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఆ మొత్తం వారి అవసరాలను తీర్చడంలో ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెప్తోంది.

చెన్నై పరిసరాల్లో ఇటుక బట్టీ వ్యాపారం నిర్వహించే తిళ్లై భాస్కర్, తన దగ్గర పనిచేసే కార్మికులకు ఎండ నుంచి ఉపశమనం కల్పించడం కోసం భారీ షెడ్డులను నిర్మించారు. వేడి నుంచి రక్షణ కల్పించే ప్రత్యేకమైన కోటింగ్ వేయించారు.

“ఉద్యోగులు ఎక్కువకాలం తమవద్దే పనిచేయాలంటే, ఏం చేయాలో యజమానులకు తెలిసి ఉండాలి. అదే తెలివైన వారు చేసే పని. మీరు వారిని చూసుకుంటే, వారు మిమ్మల్ని చూసుకుంటారు” అన్నారు.

తన దగ్గర పనిచేసే మహిళా కార్మికుల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మిస్తానని ఆయన చెప్పారు.

మహిళలు వేడి వాతావరణంలో పనిచేయడం వల్ల కలిగే దుష్ఫ్రవాల నుంచి తమని తాము రక్షించుకోవడంలో భాగంగా, సులభంగా అనుసరించే విధానాల గురించి తెలిపేందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి కొన్ని సంస్థలు. ఇన్‌స్యులేటెడ్ బాటిళ్లను వాడటం ద్వారా చల్లటి నీటిని తాగొచ్చని వారికి చెబుతున్నాయి.

అబార్షన్ అయిన రెండేళ్ల తర్వాత గర్భం దాల్చారు సుమతి. కానీ, ఆ వేడి వాతావరణంలో పనిచేయక తప్పదు ఆమెకు. కానీ, వైద్యులు, ఎస్‌ఆర్ఐహెచ్‌ఈఆర్ పరిశోధకుల సలహాలు, సూచనలతో ఆమె జాగ్రత్తపడ్డారు. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలు.

రోజంతా పనిచేసి ఇంటికి వెళ్లే సుమతిని ఆప్యాయంగా పలకరించే పిల్లలు ఉన్నారిప్పుడు. ఆమె ఒంటరికాదు.

వీడియో క్యాప్షన్, విపరీతమైన వేడిలో పని చేసే గర్భిణులు, ప్రసవ సమయంలో బిడ్డ చనిపోవడం లేదా అబార్షన్ల బారిన ప్రమాదం రెట్టింపయిందని భారత్‌లో నిర్వహించిన కొత్త పరిశోధనలో తేలింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)