బ్రిటన్ యువరాజు విలియం భార్య కేథరీన్‌కు క్యాన్సర్.. చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడి

ఫొటో సోర్స్, BBC Studios
- రచయిత, సీన్ కొగ్లన్
- హోదా, రాయల్ కరస్పాండెంట్
తనకు క్యాన్సర్ సోకిందని, చికిత్స తీసుకుంటున్నానని బ్రిటన్ యువరాజు విలియం భార్య, వేల్స్ యువరాణి కేథరీన్ తెలిపారు.
గత రెండు నెలల కాలం చాలా కష్టంగా గడిచిందని, షాక్‌కు గురిచేసిందని ఆమె ఒక వీడియోలో చెప్పారు.
''నేను బాగున్నాను, రోజురోజుకూ ఇంకా దృఢంగా మారుతున్నా'' అని ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ చెప్పారు.
కేథరీన్‌కు సోకిన క్యాన్సర్ రకం, ఇతర వివరాలు వెల్లడి కాలేదు. అయితే ఆమె పూర్తిగా కోలుకుంటారని కెన్సింగ్‌టన్ ప్యాలెస్ విశ్వసిస్తోంది.
జనవరిలో పొత్తికడుపులో శస్త్రచికిత్స చేసినప్పుడు, క్యాన్సర్ ఉన్నట్లు తెలియదని కేథరీన్ తెలిపారు.
"ఆపరేషన్ తర్వాత పరీక్షల్లో క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. కీమోథెరపీ చేయించుకోవాలని నా వైద్య బృందం సలహా ఇచ్చింది. నేను ఇప్పుడు ఆ చికిత్స ప్రారంభ దశలో ఉన్నాను" అని ఆమె చెప్పారు.
కేథరీన్‌కు ఫిబ్రవరి చివరిలో కీమోథెరపీ చికిత్స ప్రారంభమైంది.

ఫొటో సోర్స్, Getty Images
'మాకు ప్రైవసీ అవసరం'
కేథరీన్‌కు వచ్చిన క్యాన్సర్ ఏంటనే విషయాన్ని బయటికి చెప్పలేమని ప్యాలెస్ తెలిపింది.
ఆమె వయసు 42 ఏళ్లు.
క్యాన్సర్ బారిన పడిన వారందరి గురించి తాను ఆలోచిస్తున్నానని ఆమె చెప్పారు.
"ఈ వ్యాధిని ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరూ విశ్వాసాన్ని, ఆశను కోల్పోకండి. ఈ పోరాటంలో మీరు ఒంటరి కాదు’’ అని ఆమె తెలిపారు.
జనవరిలో జరిగిన శస్త్రచికిత్స నుంచి కోలుకోవడానికి సమయం పట్టిందని కేథరీన్ చెప్పారు.
"కుటుంబంలో చిన్న వాళ్లుండటంతో నేను, విలియమ్ ఈ విషయాలు ఎక్కువగా బయటికి తెలియకుండా చేయగలిగినదంతా చేస్తున్నాం" అని ఆమె అన్నారు.
"జార్జ్, షార్లెట్, లూయిస్‌లకు ప్రతిదీ వివరించడానికి, నేను బాగానే ఉంటానని వారికి భరోసా ఇవ్వడానికి మాకు సమయం పట్టింది" అని కేథరీన్ తెలిపారు.
కుటుంబానికి ఇప్పుడు కొంత సమయం, ప్రైవసీ అవసరమని ఆమె కోరారు.
శుక్రవారం ప్రకటనకు ముందే యువరాణి ఆరోగ్యం గురించి రాజు, రాణికి సమాచారం అందించారు, కింగ్ చార్లెస్ కూడా క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నారు.
కింగ్ చార్లెస్, కేథరీన్ ఇద్దరూ లండన్ క్లినిక్ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందారు. కేథరీన్‌కి అక్కడ ఉదర శస్త్రచికిత్స జరిగింది.
చార్లెస్ ప్రొస్టేట్ క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నారు.
"కేథరీన్ ధైర్యంగా మాట్లాడినందుకు రాజు చాలా గర్వపడుతున్నారు" అని బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రతినిధి తెలిపారు.
"మేం కేట్, ఆమె కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం’’ అని ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఒక సందేశాన్ని పంపారు.

ఫొటో సోర్స్, PA Media
కేథరీన్‌కు క్యాన్సర్ నిర్ధరణ కావడంతోనే ఫిబ్రవరి 27న జరిగిన కెన్సింగ్టన్ ప్యాలెస్ స్మారక సేవకు ప్రిన్స్ విలియమ్ గైర్హాజరయ్యారు.
కేథరీన్‌కు జనవరిలో ఆపరేషన్ జరిగినప్పటి నుంచి ఆమె ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో ఊహాగానాలు ఎక్కువయ్యాయి. క్రిస్మస్ తర్వాత ఆమె అధికారిక కార్యక్రమాలకు హాజరుకాలేదు.
"నా పక్కన విలియం ఉండటం ఓదార్పు, భరోసా ఇస్తోంది. మీరంతా మా మీద చూపిన ప్రేమ, మద్దతు, దయ, మా ఇద్దరికీ చాలా విలువైనవి" అని కేథరీన్ అన్నారు.
యువరాణి వీడియోను 'బీబీసీ స్టూడియోస్' బుధవారం చిత్రీకరించిందని కెన్సింగ్టన్ ప్యాలెస్ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- ఎండల్లో పని చేసే మహిళలకు గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందా?
- మనిషి మెదడులోకి పురుగులు ఎలా వస్తాయి?
- ఫ్రామౌరో: మతం కాదు, సైన్స్ ఆధారంగా తొలి ప్రపంచ పటాన్ని చిత్రించిన సన్యాసి... గడప దాటకుండానే ఆయన ఈ అధ్భుతాన్ని ఎలా సాధించారు?
- 'కలుపు దెయ్యాల'ను 141 ఏళ్ల కిందట భూమిలో పాతిపెట్టినా చావలేదు... అవి ఇలాఎంతకాలం జీవిస్తాయి?
- జింకల్లో కొత్త జాతి గుర్తింపు.. ఇది ఎక్కడ ఉంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














