బర్మీస్ పైథాన్: పెంపుడు జంతువులుగా వచ్చి మిగతా జంతువులన్నిటినీ తినేస్తున్నాయి.. పట్టుకుంటే పాతిక లక్షల బహుమతి

ఫొటో సోర్స్, Amy Siewe
- రచయిత, లూసీ షెరీఫ్
- హోదా, ఫీచర్స్ కరస్పాండెంట్
ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లేడ్స్ అభయారణ్యంలో కొండ చిలువల సంఖ్య భారీగా పెరిగింది. వీటి ఆకలికి ఇతర జంతువులు బలైపోతున్నాయి. కుందేళ్లు, లేళ్లు, దుప్పిలు, ఎలుకలు, నక్కలు తదితర జంతువులు మచ్చుకు కూడా కనిపించకుండా పోతున్నాయి.
దీంతో కొండ చిలువలు ఇప్పుడు పక్షులను, మొసళ్లను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నాయి.
కొండ చిలువల సంఖ్యను తగ్గించకపోతే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని భావించిన ఫ్లోరిడా అధికారులు వీటి నిర్మూలనకు ప్రత్యేకంగా వేటగాళ్లను రంగంలోకి దించారు.
తొలుత మూడు నెలల ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌గా దీనిని ప్రారంభించారు. కానీ కొండ చిలువల సంఖ్య కారణంగా గత 8 ఏళ్లుగా ఇది కొనసాగుతోంది.
వేటగాళ్లు సగటున రోజుకు మూడు కొండ చిలువలను పట్టుకుంటున్నారంటే వీటి సంఖ్య ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు కొండచిలువల వేటను ఓ వృత్తిగా ఎంచుకున్న 50మంది ఫ్లోరిడాలో ఈ కొండ చిలువల నిర్మూలన ప్రాజెక్టులో పనిచేస్తున్నారు.
అమీ సీవే.. ఈమె కొండచిలువలను వేటాడుతారు.
ఇప్పడామె దక్షిణ ఫ్లోరిడాలోని గడ్డి మైదానాలు, రహదారులను జల్లెడ పడుతున్నారు.
ఇరవై అడుగుల పొడవున్న బర్మీస్ కొండచిలువ ఒకటి జంతువేదైనా కనిపిస్తే అమాంతం మింగేయడానికి సర్రున పాకుతూ పోతోంది.
‘అది రోడ్డుకు అడ్డంగా ఎప్పుడొస్తుందో తెలియదు. దాని కోసం మీరు అక్కడ ఓపికగా వేచి ఉండాలి’ అని అమీ చెప్పారు.
శీతాకాలంలో పగటివేళల్లోనూ, వేసవిలో రాత్రివేళ అమీ కొండచిలువల వేటకు బయల్దేరతారు.
ఏ క్షణమైనా రోడ్డుపైకి వచ్చే కొండచిలువను పట్టుకోవడానికి ఆమె తన ట్రక్కు వెనుక పొంచి ఉన్నారు. కళ్లలో పురుగులు పడకుండా కళ్లజోడు ధరించారామె.
కొండ చిలువలను వేటాడటం ప్రమాదకరమైన పనైనా పర్యావరణ హితమైన ఈ పనిని ఆమె ఇష్టంగా చేస్తున్నారు.
30 ఏళ్ల కిందట పెంపుడు పాములు
1990 ప్రాంతాలలో ఫ్లోరిడాకు ఈ కొండచిలువలకు పెంపుడు జంతువులుగా వచ్చాయని భావిస్తుంటారు.
1996 నుంచి 2006 మధ్య అమెరికాకు దాదాపు 99,000 వేల కొండచిలువలను విక్రయించడానికి తీసుకొచ్చారు. వాటిలో కొన్ని అడవిలోకి జారుకున్నప్పుడు వాటికి ఎలుకలు, ఉడతలు, పక్షులతో కూడిన స్వర్గం కనిపించింది.
వీటితోపాటు జింకలు, మొసళ్లు కూడా కొండచిలువలకు సమృద్ధిగా లభించాయి.
వాసన ఆధారంగా ఇతర జంతువుల జాడను పసిగట్టే కొండ చిలువలు అదను చూసి దాడిచేసి మింగేస్తాయి.
కొండచిలువల వేటలో ఓపిక చాలా అవసరం.
‘85 శాతం సమయం కదలకుండా కూర్చోవాల్సి ఉంటుంది. ఒకవేళ చిన్న అలికిడి అయినా కొండ చిలువలు అప్రమత్తమై జారుకుంటాయి. తరువాత వాటిని కనిపెట్టడం అసాధ్యం. అందుకే అవి కనపడగానే పట్టుకోవడానికి ఏమాత్రం సంకోచించకూడదు’’ అని ఆమె చెప్పారు.
ఆమె ఒక కొండ చిలువను చూడగానే ట్రక్కు పై నుంచి దాని తలపైకి దూకి వెనకనుంచి కొండచిలువ తలను నొక్కిపెట్టారు.
కొండ చిలువల వేటకు వెళ్లినప్పుడు వారికి తోడుగా మరొకరు ఉంటారు. అమీ కొండ చిలువ తలను పట్టుకోగానే ఆమె సహాయకుడు అది నోరు తెరవకుండా టేపు వేసేశారు. కొండ చిలువకు విషం ఉండదు కానీ వాటి పొడవైన, పదునైన దంతాల కారణంగా లోతైన గాయాలయ్యే అవకాశం ఉంది. అయినా అమీ తన పనిపట్ల చాలా మక్కువతో ఉంటారు.
‘నేను పట్టుకునే ప్రతి కొండ చిలువ ఏదో ఒక మార్పుకు కారణమవుతుందని నాకు తెలుసు’ అంటారామె.

ఫొటో సోర్స్, South Florida Water Management District
గంటల లెక్కన చెల్లిస్తారు
అమీ నాలుగేళ్లుగా దక్షిణ ఫ్లోరిడా వాటర్ మేనేజ్ మెంట్ డిస్ట్రిక్ట్ కు కొండచిలువ వేటగత్తెగా పనిచేశారు.
ఆమెకు గంటల లెక్కన జీతం ఇస్తారు. ఆమె వేటాడే ప్రదేశాన్ని బట్టి గంటకు 13 అమెరికన్ డాలర్ల నుంచి 18 డాలర్ల వరకు చెల్లిస్తారు. పట్టుకున్న ప్రతి కొండ చిలువకు ఆమెకు బహుమతి కూడా లభిస్తుంది.
నాలుగు అడుగుల కొండచిలువను పట్టుకుంటే 50 డాలర్లు లభిస్తాయి. పాము పొడవు పెరిగే కొద్దీ అడుగుకు 25 అమెరికన్ డాలర్లు అదనంగా లభిస్తాయి. కొండ చిలువ ఆవాసాన్ని కనుగొంటే 200 అమెరికన్ డాలర్లను చెల్లిస్తారు.
దీంతోపాటు ఆమె కొండ చిలువల చర్మాన్నిఅమ్మి డబ్బు సంపాదిస్తారు. అయితే తనతోపాటు టూరిస్టులను వేటకు తీసుకువెళ్లి మరికొంత సంపాదింవచ్చనే విషయాన్ని ఆమె ఇటీవల గ్రహించారు.
ఫ్లోరిడాలో కొండచిలువలు నియంత్రిత జాతి కిందకు వస్తాయి. అందువల్ల వీటిని సజీవంగా రవాణా చేయడానికి వీల్లేదు. బోల్ట్ గన్‌ను ఉపయోగించి కొండచిలువలను చంపడానికి ఫ్లోరిడాలో శిక్షణ ఇస్తారు.
2017లో ఈ కొండచిలువల నియంత్రణ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇప్పటిదాకా 8,565 కొండచిలువలను పట్టుకున్నారు. వీటిలో ఎక్కువ భాగం నాలుగు అడుగుల (1.2మీటర్లు) పొడవున్నవే ఉన్నాయి. 17 కొండ చిలువలు 16 అడుగులు (4.8మీటర్లు), 17 అడుగులు (5.2 మీటర్లు) ఉన్నాయి.
‘‘కొండ చిలువల ప్రవర్తనను అర్థం చేసుకోవాలి. ఇది చదరంగం ఆడటం లాంటిది’’ అంటారు డోనా కలీల్.

ఫొటో సోర్స్, Credit: Water Management District
నక్కలు, ఎలుకలు, కుందేళ్లు, లేళ్లు, దుప్పిలు అన్నీ మాయం
విదేశాల నుంచి వన్య ప్రాణుల వ్యాపారం కారణంగా కొండచిలువలు ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లేడ్స్ అభయారణ్యానికి చేరి ఉంటాయని భావిస్తున్నారు. ఇవి ఒకప్పుడు పెంపుడు జంతువులుగా ఉండేవి.
18 అడుగుల పొడవు వరకు పెరిగే అతిపెద్ద కొండచిలువలు ఈ అభయారణ్యంలో అభివృద్ధి చెందాయి. వీటికి విపరీతమైన ఆకలి. పైగా వీటికి ఇక్కడ సమృద్ధిగా మేత లభిస్తుంది.
‘‘అవి మన పర్యావరణ వ్యవస్థను ధ్వంసం చేశాయి’’ అని ఫ్లోరిడాలో కొండ చిలువల నియంత్రణ కార్యక్రమానికి సూత్రధారి అయిన సౌత్ ఫ్లోరిడా వాటర్ మేనేజ్‌మెంట్ డిస్ట్రిక్ట్ లో సీనియర్ జంతుశాస్త్రవేత్త మైక్ కిర్క్‌లాండ్ చెప్పారు.
ఎవర్‌గ్లేడ్స్ జాతీయ పార్కులో 1990 ప్రాంతాలలో కొండ చిలువలు కనిపించినప్పటినుంచి ఇప్పటి వరకు 90 నుంచి 95 శాతం ఇతర జీవులు అంతరించిపోయాయని కిర్క్‌లాండ్ చెప్పారు.
ఒక అధ్యయనం ప్రకారం రకూన్లు (నక్కను పోలి ఉంటాయి) 99శాతం, అపోసమ్స్ (ఎలుక జాతికి చెందినవి) 99 శాతం తగ్గిపోయాయి. ఇక కుందేళ్లయితే పూర్తిగా అదృశ్యమైపోయాయి.
‘’20 ఏళ్ళ కిందట ఈ ప్రాంతం వన్యప్రాణులతో కళకళలాడుతుండేది. మీరిప్పుడు ఇక్కడ ఒక్క జింక, ఎలుకనైనా కనుక్కోగలరా అని ఆయన సవాల్ చేశారు. కొండచిలువల వన్యప్రాణులను నాశనం చేసేశాయి’’ అని చెప్పారు కిర్క్‌లాండ్.
ఫ్లోరిడాలో కొండచిలువల నిర్మూలన ఎలా అని మథనం జరుగుతున్న వేళ కిర్క్‌లాండ్స్ కార్యక్రమం ఓ విప్లవాత్మక మార్గం చూపింది.
తొలుత ఈ కార్యక్రమాన్ని 3నెలలపాటు ప్రయోగాత్మకంగా నిర్వహించాలనుకున్నారు. కానీ దీనికి ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తుందని ఆయన అసలు ఊహించలేదు. ఇప్పడీ కార్యక్రమం 8వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఇందులోని ఉద్యోగులు కూడా రెండింతలయ్యారు.
ఈ ఏజెన్సీ కోసం 50 మంది కాంట్రాక్ట్ వర్కర్లు పనిచేస్తున్నారు. 9 రాష్ట్రాలలోని ఫెడరల్, కౌంటీ భూములలో వీరు తమ సేవలు అందిస్తారు.
2017లో వాటర్ మేనేజ్‌మెంట్ డిస్ట్రిక్ట్ నియమించిన పాతికమంది ఒరిజినల్ కాంట్రాక్టర్లలో డోనా కలీల్ ఒకరు. ఇప్పటిదాకా కలీల్ 850కు పైగా కొండచిలువలను పట్టుకున్నారు.
‘‘మీరు వాటి కదలికలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. అవి ఉండే ప్రదేశాలు భిన్నమైనవే. ఇదో చదరంగం ఆట లాంటిది’’ అని చెప్పారు కలీల్.
ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటినుంచి ఫ్లోరిడా రాష్ట్ర వ్యాప్తంగా 8,565 కొండచిలువలను నిర్మూలించగలిగారు. అంటే ఏటా 1000కి పైగా కొండచిలువలను పట్టుకుంటున్నారన్న మాట. ఈ లెక్కన రోజుకు సగటున 3 కొండ చిలువలను తక్కువ కాకుండా నిర్మూలిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. అయితే కేవలం కొండ చిలువలను వేటాడితే సరిపోదంటారు కిర్క్‌లాండ్.
పర్యావరణాన్ని ధ్వంసం చేసే వీటి నిర్మూలనకు విన్నూత్నమైన శాస్త్రీయ విధానాలు, చైతన్యం, విధానపరమైన నిర్ణయాలు అవసరమంటారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు విధానపరమైన మార్పులు మొదలయ్యాయి.
2021లో కొండ చిలువలను ఫ్లోరిడా నిషేధిత జంతువుల జాబితాలో చేర్చారు.
వాటిని కొనడం, అమ్మడం, లేదా రవాణా చేయడాన్ని నిషేధించారు.
ఎవరైనా వాటిని అప్పటికే పెంచుకుంటూ ఉంటే వారు కచ్చితంగా ఆ విషయాన్ని నమోదు చేయడమే కాక, వాటికి మైక్రోచిప్స్‌కూడా అమర్చాలని ఆదేశాలు జారీచేశారు.
కిర్క్‌లాండ్ బృందం కొండ చిలువలను కనిపెట్టడానికి, వాటిని వేటాడటానికి ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను ఆచరిస్తుంటారు. వీటిల్లో పైథాన్స్‌కు ట్రాన్స్‌మీటర్లను అమర్చే రేడియే టెలిమీటరీ ప్రాజెక్ట్ ఒకటి.
ఈ ట్రాన్స్‌మీటర్ల ద్వారా వచ్చే సమాచారాన్ని రెండు విభిన్న కార్యక్రమాలలో ఉపయోగిస్తుంటారు. వీటిల్లో ఒకటి పైథాన్స్ ప్రవర్తన, జత కూడడటంలోని వాటి అలవాట్లను తెలుసుకోవడం కాగా, మరొకటి, ‘స్కౌట్’ కార్యక్రమం. ట్యాగ్ చేసిన పైథాన్స్‌ను స్కౌట్ కొండచిలువలు అంటారు. ఇవి ఒక సీజన్‌లో ఒకేసారి 100 గుడ్లను పెట్టగల సామర్థ్యం ఉన్న ఆడ కొండచిలువలను కనిపెట్టేందుకు మార్గం చూపుతాయి.
‘అవి ఇక్కడకు వాటి తప్పు లేకుండా వచ్చాయి. వీటి పట్ల మానవతా దృక్పథంతో ఉండటమనేది చాలా ముఖ్యం’ అని మైక్ కిర్క్‌లాండ్ చెప్పారు.
ఎవర్‌గ్లేడ్స్‌లోని దట్టమైన అరణ్యంలోకి చొచ్చుకుపోవడానికి ఈ టెలిమీటరీ ప్రాజెక్ట్ వల్ల సులభమవుతోంది. అక్కడి అడవి చిత్తడి నేలలు, మడ అడవులు, గడ్డి మైదానాలతో దాదాపు 15 లక్షల ఎకరాల మేర విస్తరించి ఉంటుంది.
బోటులో వెళ్లి చేపలను పట్టినట్టుగానే ఏఐ టెక్నాజీ ఆధారిత కెమెరాలను అభివృద్ధి చేసి కొండ చిలువల కదలికలను పసిగట్టేందుకు వాటర్ మేనేజ్‌మెంట్ డిస్ట్రిక్ట్ , ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కమిషన్‌తో కలిసి పనిచేస్తోంది.

ఫొటో సోర్స్, Amy Siewe
ఫ్లోరిడా పైథాన్ ఛాలెంజ్
కొండ చిలువలు పర్యావరణానికి ఎంత ప్రమాదకరంగా మారాయనే విషయంపై ప్రజలలో చైతన్యం తీసుకువచ్చారు. ఇప్పటికీ వాటర్ మేనేజ్‌మెంట్ డిస్ట్రిక్ట్ ఫ్లోరిడా, ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సిస్టమ్ తో కలిసి పైథాన్ ఛాలెంజ్‌ను నిర్వహిస్తోంది.
ఈ పోటీలు ఏటా ఆగస్టులో జరుగుతాయి. పదిరోజులపాటు సాగే ఈ పోటీలలో ప్రపంచం నలుమూలల నుంచి వేటగాళ్ళు పాల్గొంటారు.
అతి పొడవైన బర్మీస్ కొండచిలువలను పట్టుకుంటారో వారికి 30వేల అమెరికన్ డాలర్లను(సుమారు రూ. 25 లక్షలు) బహుమతిగా ఇస్తారు.
ఈ పదిరోజుల సమయంలో ఫ్లోరిడా వాసులు, పర్యాటకుల సహా బయటి వ్యక్తులు కూడా కొండ చిలువల వేటలో పాల్గొనేందుకు అవకాశం దక్కుతుంది.
‘‘ఆఫ్రికా సహా ప్రపంచవ్యాప్తంగా కొండచిలువలను వేటాడేవారు ఫ్లోరిడాకు వచ్చి కొండచిలువలను వేటాడే పోటీలలో పాల్గొనాలనుకుంటారు’’ అని సీవే చెప్పారు. ఆమె ఇప్పుడు గతంలో కంటే బిజీగా ఉన్నారు. కొండ చిలువలను ఎలా పట్టుకోవాలనే ఆసక్తి ఉన్న ఫ్లోరిడా స్థానికులు ఇప్పడామె వద్ద శిక్షణ తీసుకుంటున్నారు.
వేటగాళ్ళు కొండచిలువను పట్టుకున్నాక కిర్క్‌లాండ్ బృందం దానిని కచ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది. వాటర్ మేనేజ్‌మెంట్ స్టాఫ్ వీడియో కాల్‌లో ఉన్నప్పుడు ఈ కొండ చిలువ పొడవును కొలవాల్సి ఉంటుంది. వేటగాళ్లు కొండచిలువల కళేబరాన్ని ఎక్కడైనా పారేయవచ్చు. లేదంటే వాటి చర్మాన్ని తీసి ఇతర అవసరాలకూ వినియోగించుకోవచ్చు.
‘‘ఇదో ప్రత్యేక కార్యక్రమం, అలాగే ప్రత్యేక విషయం కూడా ’’ అంటారు కిర్క్ లాండ్.
చిత్తడినేలల్లో 18 అడుగుల కొండచిలువలతో కుస్తీపట్టాలనే ఆలోచన మీకుంటే కిర్క్‌లాండ్ మీకు స్వాగతం పలుకుతారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













