ఇతర పక్షుల ఆహారాన్ని కొట్టేసే స్కువాల సంఖ్య ఎందుకు తగ్గిపోయింది?

గ్రేట్ స్కువా పక్షులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఇతర పక్షుల ఆహారాన్ని దొంగిలించే, చిన్న చిన్న జీవులను వేటాడే పక్షులు గ్రేట్ స్కువాలు
    • రచయిత, జార్జినా రానార్డ్
    • హోదా, సైన్స్ ప్రతినిధి, బీబీసీ న్యూస్

బర్డ్ ఫ్లూ వల్ల ‘పైరేట్ ఆఫ్ ది సీస్(సముద్రపు దొంగ పక్షి)’గా పిలిచే స్కువా పక్షుల సంఖ్య విపరీతంగా తగ్గిపోయినట్లు రాయల్ సొసైటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్స్(ఆర్ఎస్‌పీబీ) తెలిపింది.

ఇతర పక్షుల ఆహారాన్ని దొంగిలిస్తూ, చిన్న జీవులను వేటాడే ఈ గ్రేట్ స్కువా పక్షులు బ్రిటన్ తీర ప్రాంతాల్లో ఎగురుతూ ఉంటాయి. కానీ, 2023లో వీటి సంఖ్య 76 శాతం తగ్గినట్లు ఆర్ఎస్‌పీబీ తన నివేదికలో తెలిపింది.

ఏవియన్ ఫ్లూ తర్వాత 2021-22లో వేల సంఖ్యలో పక్షులు మరణించడంతో గానెట్, రోసేట్ టెర్న్ పక్షుల సంఖ్య ప్రమాదకర రీతిలో తగ్గిపోయినట్లు ఈ నివేదిక వెల్లడించింది.

బర్డ్ ఫ్లూ వ్యాప్తికి ముందు ఈ మూడు రకాల పక్షుల సంఖ్య బాగా పెరిగింది.

ఏవియన్ ఫ్లూ వైరస్‌నే బర్డ్ ఫ్లూ అని కూడా పిలుస్తుంటారు.

2021 వేసవి కాలంలో ఈ పక్షుల్లో ఏవియన్ ఫ్లూకు చెందిన హెచ్‌5ఎన్‌1 అనే సూక్ష్మజీవి వ్యాప్తి చెందింది. దీని వల్ల వేల సంఖ్యలో పక్షులు మరణించాయి.

పలు సముద్ర పక్షులు ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకర ముప్పుల్లో ఏవియన్ ఫ్లూ ఒకటిగా ఉందని ఈ గణాంకాలను బట్టి స్పష్టమవుతుందని ఆర్ఎస్‌పీబీ తెలిపింది.

‘‘ఏవియన్ ఫ్లూ ఎంత తీవ్రమైందో తెలిపే హెచ్చరికలు ఇవి. ఈ మూడు రకాల సముద్ర పక్షులు ఎదుర్కొంటున్న పలు రకాల ప్రమాదాల్లో ఇది ప్రధాన స్థానంలోకి వస్తుంది’’ అని ఆర్ఎస్‌పీబీ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా పాలసీ అసిస్టెంట్ జీన్ దుగ్గన్ తెలిపారు.

ఆర్ఎస్‌పీబీ 2023లో మే నుంచి జులై మధ్య కాలంలో 13 రకాల పక్షులపై అధ్యయనం చేసింది.

గ్రేట్ స్కువా, గానెట్, రోసేట్ టెర్న్ పక్షుల సంఖ్య బాగా తగ్గిపోయేందుకు ఏవియన్ ఫ్లూ ప్రధాన కారణమని ఆర్ఎస్‌పీబీ తన నివేదికలో తేల్చింది.

శాండ్‌విచ్, కామన్ టెర్న్ పక్షులు తగ్గిపోయేందుకు కూడా ఇదే కారణమై ఉండొచ్చని చెప్పింది.

గానెట్ పక్షులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఏవియన్ ఫ్లూ వల్ల వేల గానెట్ పక్షులు చనిపోయినట్లు అంచనా

2015-21 మధ్య కాలంలో ఇతర పక్షుల సంఖ్యతో పోలిస్తే గానెట్ పక్షుల సంఖ్య 25 శాతం, రోసేట్ టెర్న్ పక్షుల సంఖ్య 21 శాతం, శాండ్‌విచ్ టెర్న్స్ 35 శాతం, కామన్ టెర్న్ పక్షుల సంఖ్య 42 శాతం తగ్గిపోయాయి.

బ్రిటన్‌లోని గ్రేట్ స్కువా పక్షులలో చాలా వరకు స్కాంట్లాండ్‌లోనే ఉంటాయి. 2022లోనే 2,591 గ్రేట్ స్కువా పక్షులు మరణించాయి.

యూకేలో ఈ పక్షుల సంఖ్య 9,088 నుంచి 2,160కి తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పక్షిని కాపాడాలంటే బ్రిటన్ చాలా కీలకమని, ఎందుకంటే, చాలా వరకు పక్షులు బ్రిటన్‌లోనే ఉంటాయని దుగ్గన్ చెప్పారు.

బ్రిటన్‌లో సరైన చర్యలు చేపడితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ పక్షుల సంఖ్యను గణనీయంగా పెంచవచ్చని వివరించారు.

గానెట్ పక్షులు కూడా 2022లో బాగా ప్రభావితమయ్యాయి. స్కాట్లాండ్‌లో 11,175 పక్షులు చనిపోయాయి. వేల్స్‌లోని గ్రాస్‌హామ్ దీవిలోనే సుమారు 5 వేల వరకు చనిపోయినట్లు అంచనాలు ఉన్నాయి.

బ్రిటన్‌లో ఈ పక్షుల సంఖ్య 2023లో 25 శాతం తగ్గిపోయింది. 2,27,129 నుంచి 1,71,048కు పడిపోయింది.

ఇటీవల కాలంలో బ్రిటన్‌లో ఏవియన్ ఫ్లూ తీవ్రత కాస్త తగ్గింది. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పక్షుల మరణాలకు ఇది కారణమైంది.

ఈ జనవరిలో తొలిసారి అంటార్కిటికాలోని ఏనుగులు, ఫర్ సీల్స్‌లో ఈ ఫ్లూను గుర్తించారు.

‘‘ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఈ వైరస్ ఉనికిలో ఉంది. బ్రిటన్‌లో పక్షులు ఇంకా ప్రమాదంలోనే ఉన్నాయి. వైరస్ మ్యుటేట్ అవుతూ ఉంది. మనం దీన్ని దీర్ఘకాలిక ప్రమాదంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది’’ అని దుగ్గన్ అన్నారు.

పర్యావరణ మార్పు, చేపలవేట వల్ల చనిపోతున్న జీవులు, సముద్ర ఉపరితలంపై గాలుల్లో వచ్చే మార్పులు, తగ్గిపోతున్న ఆహారం, ఇతర ముప్పులను బ్రిటన్ సముద్రపు జీవులు ఎదుర్కొంటున్నట్ల ఆర్ఎస్‌బీపీ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)