యూసీ-18: యుద్ధంలో మునిగిపోయిన జర్మనీ జలాంతర్గామి మిస్టరీని చేధించిన డైవర్లు

ఫొటో సోర్స్, The Hunt for Lady Olive and the German Submarine
వందేళ్ల క్రితం యుద్ధ సమయంలో కనిపించకుండా పోయిన ఒక జర్మన్ యూ-బోటు(జలాంతర్గామి) ఉన్న ప్రదేశాన్ని డైవర్లు కనిపెట్టారు. దీంతో, ఎట్టకేలకు సుదీర్ఘకాలం తర్వాత దీని మిస్టరీ వీడింది.
1917లో ఇంగ్లిష్ చానల్‌లో రాయల్ నేవీ షిప్ ‘లేడీ ఆలివ్’తో యుద్ధంలో జర్మనీకి చెందిన యూసీ-18 జలాంతర్గామి కనుమరుగైంది.
లేడీ ఆలివ్ నౌక కూడా మునిగిపోయింది.
బీబీసీ దీనిపై ఒక డాక్యుమెంటరీని చిత్రీకరించింది.
దీని చిత్రీకరణలో ఇంగ్లిష్ చానల్‌లో కనుగొన్న యూసీ-18 జలాంతర్గామిని ధ్రువీకరించేందుకు, గుర్తించేందుకు డైవర్ల బృందానికి నాలుగేళ్ల సమయం పట్టింది.
ఇప్పుడు తనకు చాలా సంతోషంగా ఉందని అండర్‌వాటర్ ఫిల్మ్‌మేకర్ కార్ల్ టేలర్ చెప్పారు.
‘ద హంట్ ఫర్ లేడీ ఆలివ్ అండ్ ద జర్మన్ సబ్‌మెరైన్’ పేరుతో బీబీసీ చిత్రీకరించిన డాక్యుమెంటరీ ఫిల్మ్ జూన్‌లో ప్రసారం కానుంది.

ఫొటో సోర్స్, Tomas Termote
230 అడుగుల లోతులో యూసీ-18 జలాంతర్గామి
యూసీ-18, లేడీ ఆలివ్ మధ్య యుద్ధంలో రెండూ నీటిలో మునిగిపోయాయి. దీంతో, యూసీ-18 జలాంతర్గామిలో ఉన్న 28 మంది సిబ్బంది చనిపోయారు.
యూసీ-18 అవశేషాలున్న ప్రదేశాన్ని డైవర్ల బృందం గుర్తించింది. దీనితోపాటు లేడీ ఆలివ్ మునిగిపోయిన ప్రదేశాన్ని గుర్తించినట్లు చెబుతోంది.
సముద్ర గర్భంలో అతి తక్కువ వెలుతురులో జరిపిన ఈ అన్వేషణ సవాళ్లతో కూడుకొన్నదని కార్ల్ టేలర్ చెప్పారు.
70 మీటర్ల (230 అడుగుల) లోతులో యూసీ-18 జలాంతర్గామిని గుర్తించారు. దీని అవశేషాలను గుర్తించేందుకు సముద్ర పురావస్తు శాస్త్రవేత్త, యూ-బోటు నిపుణులు టోమస్ టెర్నోట్‌తో కలిసి ఈ బృందం పనిచేసింది.

ఫొటో సోర్స్, The Hunt for Lady Olive and the German Submarine
చారిత్రక ఆధారాలను బట్టి ఈ యుద్ధం ఇంగ్లిష్ చానల్‌లో జెర్సీ తీర ప్రాంతానికి 13 కి.మీ. దూరంలో జరిగింది.
కానీ, మునిగిపోయిన యూసీ-18, లేడీ ఆలివ్‌లను పశ్చిమాన 64 కి.మీ. దూరంలో గుర్తించినట్లు కార్ల్ టేలర్ తెలిపారు.
డైవర్ల బృందం తమ అన్వేషణలో మరో రెండు మునిగిపోయిన నౌకల అవశేషాలను కూడా కనుగొంది.
ఈ బృందం పరిశోధనల్లో వెల్లడైన విషయాలను ఫ్రాన్స్ అథారిటీలు, జర్మనీ నౌకాదళం దృష్టికి తీసుకెళ్లారు.
‘‘ఈ నౌకల మునక వెనక చాలా కాలంగా ఉన్న రహస్యాన్ని చేధించినట్లయింది. యూరప్ చరిత్రలో అత్యంత కల్లోల పరిస్థితుల వెనుక దాగి ఉన్న త్యాగాలన్నింటినీ ప్రజలు తెలుసుకునేందుకు ఈ డాక్యుమెంటరీ సాయం చేస్తుందని ఆశిస్తున్నాం’’ అని కార్ల్ టేలర్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మనిషి మెదడులోకి పురుగులు ఎలా వస్తాయి?
- ఫ్రామౌరో: మతం కాదు, సైన్స్ ఆధారంగా తొలి ప్రపంచ పటాన్ని చిత్రించిన సన్యాసి... గడప దాటకుండానే ఆయన ఈ అధ్భుతాన్ని ఎలా సాధించారు?
- 'కలుపు దెయ్యాల'ను 141 ఏళ్ల కిందట భూమిలో పాతిపెట్టినా చావలేదు... అవి ఇలాఎంతకాలం జీవిస్తాయి?
- జింకల్లో కొత్త జాతి గుర్తింపు.. ఇది ఎక్కడ ఉంది?
- సీఏఏ: పౌరసత్వ సవరణ చట్టం అమలుకు నిబంధనలను విడుదల చేసిన కేంద్రం, దీనివల్ల ఏం జరుగుతుంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














