మాస్కో దాడి: రష్యాను ఇస్లామిక్ స్టేట్ శత్రువుగా ఎందుకు చూస్తోంది?

పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాస్కో శివార్లలోని ఆడిటోరియంలో జరిగిన దాడిలో బాధితుల గౌరవార్థం నిర్వహించిన కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్

మాస్కోలో గత శుక్రవారం మ్యూజిక్ కన్సర్ట్ హాల్‌లో దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత, ఆ దాడి చేసింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) సంస్థ తన టెలిగ్రామ్ చానల్ ద్వారా ప్రకటించింది.

దాడికి సంబంధించిన రుజువుగా ఒక వీడియోను కూడా ఐఎస్ విడుదల చేసింది.

దాడికి కొన్ని రోజుల ముందు, ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్న కారణంగా బహిరంగ ప్రదేశాలకు వెళ్లొద్దంటూ రష్యాలోని తమ పౌరులను అమెరికా హెచ్చరించింది.

రష్యా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని అమెరికా పేర్కొంది. అయితే, దీనిపై ప్రస్తుతానికి రష్యా మౌనంగా ఉంది. అమెరికా చేసిన హెచ్చరికల వివరాలు ఇంకా తెలియవు. యుక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

మాస్కోలో దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్న నలుగురు నిందితులను రష్యా ఆదివారం కోర్టుకు తీసుకొచ్చింది. వారిని ఉగ్రవాదులంటూ ఆరోపించింది. వారు చేసిన దాడిలో 137 మంది ప్రాణాలు కోల్పోగా, వంద మందికి పైగా గాయపడ్డారని తెలిపింది.

శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో గోధుమ రంగు దుస్తులు ధరించిన వ్యక్తులు క్రోకస్ సిటీ హాల్‌లోకి చొరబడి, కచేరీకి హాజరైన వారిపై తుపాకులతో కాల్పులు జరిపి, మోలోటోవ్ కాక్‌టెయిల్స్ విసిరేశారని బీబీసీకి సాక్షులు వివరించారు.

దాడి కారణంగా ఆడిటోరియం దగ్ధమైంది. పైకప్పు కొంత భాగం కూలిపోయింది. మంటలు క్రోకస్ ముందు భాగానికి వ్యాపించడంతో పైనున్న రెండు అంతస్తులు ధ్వంసం అయ్యాయి.

దాడి వెనుక ఎవరి హస్తం ఉందనే అంశంపై రష్యా ప్రభుత్వం ఇంకా ప్రకటన చేయలేదు. కానీ, రష్యా అనుకూల చానళ్లు మాత్రం ఈ దాడికి సంబంధించి ఇస్లామిక్ స్టేట్ చేసిన ప్రకటన తప్పు అని పేర్కొన్నాయి.

కోర్టులో ప్రవేశపెట్టిన నలుగురు నిందితులు ఐఎస్‌కు చెందినవారా, కాదా అనే అంశంతోపాటు దాడికి కారణాలను రష్యా అధికారులు ఇంకా వెల్లడించలేదు.

ఈ అనిశ్చితి నేపథ్యంలో రష్యాను ఐసిస్ ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? రష్యా ఆడిటోరియంపై ఈ సంస్థ దాడికి పాల్పడటం ఎంతవరకు సాధ్యమనే అంశాల గురించి పలువురు విశ్లేషకులు వివరించారు.

తాలిబాన్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, మాస్కో దాడిలో నలుగురు నిందితులను ఆదివారం కోర్టులో హాజరుపరిచారు

తాలిబాన్ అంశం

రష్యాపై హింసాత్మక దాడులు చేసిన చరిత్ర ఇస్లామిక్ స్టేట్‌ సంస్థకు ఉంది.

2015లో 224 మందితో ఈజిప్టు నుంచి బయలుదేరిన రష్యా విమానాన్ని పేల్చేసినట్లు ఐఎస్ అప్పట్లో ప్రకటించింది.

2022లో కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయంపై ఐఎస్ చేసిన దాడిలో ఇద్దరు దౌత్యవేత్తలు, నలుగురు అఫ్గాన్లు చనిపోయారు.

రష్యాపై ఐఎస్ సంస్థ చేసే ఫిర్యాదుల్లో అఫ్గానిస్తాన్, చెచెన్యా యుద్ధాలు ఉన్నాయి. ప్రస్తుతం సిరియా, పశ్చిమ ఆఫ్రికాలో తమ దళాలపై రష్యా చేస్తున్న దాడులను ఈ సంస్థ ఖండిస్తోంది.

"ఐఎస్‌కు, దాని మిత్రదేశాలకు వ్యతిరేక ఆపరేషన్లలో రష్యా భాగస్వామ్యం, ముఖ్యంగా సిరియాలో రష్యా కార్యకలాపాలు, తాలిబాన్‌తో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నించడం వంటి వాటి వల్ల ఇస్లామిస్టులకు రష్యా కీలక ప్రత్యర్థిగా మారింది" అని అమెరికాలోనిక్లెమ్సన్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్, ‘ఐఎస్ ఇన్ అఫ్గానిస్తాన్ అండ్ పాకిస్తాన్’ పుస్తక సహ రచయిత అమీరా జాడూన్ వివరించారు.

అఫ్గానిస్తాన్‌లోని ఖొరాసన్ ప్రావిన్సులో ప్రాణం పోసుకున్న అఫ్గాన్ ఐఎస్ శాఖ, మాస్కోలోని ఆడిటోరియంపై దాడి చేసినట్లుగా చెబుతున్నారు.

ఒకప్పుడు ఒసామా బిన్ లాడెన్ తలదాచుకున్న ప్రాంతంలోనే 2015లో ఈ గ్రూపు పుట్టుకొచ్చింది.

తాలిబాన్ ఉద్యమం, స్థానిక షియా కమ్యూనిటీలే మొదట ఈ గ్రూపు ప్రధాన లక్ష్యాలుగా ఉండేవి.

"ఐఎస్‌కు బద్ధ శత్రువులు తాలిబాన్లు. తాలిబాన్లకు రష్యాను స్నేహితుడిగా ఐఎస్ పరిగణిస్తుంది" అని వాషింగ్టన్‌ విల్సన్ సెంటర్‌లోని దక్షిణాసియా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ మైఖేల్ కుగెల్‌మాన్ చెప్పారు.

ఇటీవల ఐఎస్‌కు చెందిన అఫ్గాన్ శాఖ దాని పరిధిని విస్తరించాలని నిర్ణయించుకుంది.

మాస్కో దాడి

ఫొటో సోర్స్, Getty Images

ముస్లింలపై హింసకు పుతినేే మూలమంటున్న ఐఎస్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ముస్లింలకు శత్రువుగా, రష్యాతో పాటు విదేశాల్లో ముస్లింలపై హింసకు ఆయనే మూలం అంటూ ఇటీవలి ఏళ్లలో ఐఎస్ ప్రచారం సాగింది.

"యుక్రెయిన్, గాజా యుద్ధాల నేపథ్యంలో నిరంకుశ శక్తులతో (రష్యా, ఇరాన్, చైనాలను ఉద్దేశించి) అమెరికా, ప్రజాస్వామ్య ప్రపంచం తమ పోరాటాన్ని తీవ్రం చేసింది. కానీ, ఇస్లామిక్ స్టేట్ కోణంలోంచి చూస్తే ఇవన్నీ ముస్లిం విశ్వాసాలకు శత్రువులు, వీటిని నాశనం చేయాలి’’ అని వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ఇస్లామిక్ స్టేట్ వ్యవహారాల నిపుణులు రాశారు.

‘‘దాడి చేయడానికి సరైన తరుణం కోసం ఐఎస్ ఓపికగా వేచి చూస్తోంది’’ అని ఇస్లామాబాద్‌లోని ఖోరాసన్ డైరీ థింక్ ట్యాంక్‌కు చెందిన రికార్డో వల్లే చెప్పారు.

“ప్రస్తుతం వారు మాస్కోలో ఉన్నారు. ఇటీవల ఇరాన్‌లో ఉనికి చాటారు. బహుశా ఇతర రాజధానుల్లో కూడా మరిన్ని దాడులు జరుగవచ్చు’’ అని అల్ జజీరాతో సైనిక విశ్లేషకుడు, టర్కీ ఆర్మీ మాజీ కల్నల్ మురాత్ అస్లాన్ అన్నారు.

రష్యాకు కూలీలుగా వెళుతున్న మధ్య ఆసియా వలసదారులను రష్యా అధికారులు తిరస్కరించడం కూడా ఈ దాడికి పురికొల్పిన మరో అంశం కావొచ్చు.

రష్యా దాడి నిందితులు

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, మాస్కో దాడికి పాల్పడినట్లు అనుమానాలున్న నలుగురిని రష్యా గుర్తించింది. వీరిలో ఇద్దరు- దలెర్డ్‌జోన్ మిర్జోయెవ్ (ఎడమ), సైదాక్రమి మురోదలీ రచబలిజోడా (కుడి)
రష్యా దాడి

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, అనుమానితుల్లో మరో ఇద్దరు- షంసిదిన్ ఫరీదుని (ఎడమ), ముహమ్మద్సోబిర్ ఫైజోవ్‌ (కుడి)

ప్రాంతీయ శాఖ ప్రస్తావన లేదు

మాస్కో కన్సర్ట్ హాల్‌లో దాడి జరిగిన తర్వాతి రోజు, ఆ దాడికి బాధ్యత వహిస్తూ ఐఎస్ ఒక కొత్త ప్రకటన విడుదల చేసింది.

దాడిలో నలుగురు పాల్గొన్నట్లు కనిపించే ఒక ఫోటోను ‘ద అమాక్ న్యూస్ ఏజెన్సీ’ ప్రచురించింది. అందులో వారి ముఖాలు సగం మాస్క్‌ వేసి ఉన్నాయి. ఫోటోగ్రాఫిక్ ఫిల్టర్ ద్వారా వారి ముఖాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి.

అయితే, కేవలం దీని ఆధారంగా ఏ శాఖ ఈ దాడులను నిర్వహించిందో చెప్పలేమని తీవ్రవాద గ్రూపులపై విశ్లేషించే బీబీసీ నిపుణుడు మినా అల్ లామి అన్నారు.

క్రోకస్ సిటీ హాల్ గురించి ఇచ్చిన ప్రకటనలోనూ వారు కేవలం ‘‘రష్యా’’ అని మాత్రమే పేర్కొన్నారు.

ప్రాంతీయ శాఖ ప్రస్తావన లేకుండా ప్రకటన చేయడం ఐఎస్ అనుసరించే సాధారణ పద్ధతి అని అల్ లామి చెప్పారు. దీన్నిబట్టి, భద్రతా దళాల దృష్టిలో పడకుండా రష్యాలోని తమ శాఖను ఐఎస్ రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఆయన అంచనా వేశారు.

ఇంకా, ఈ దాడిలో స్థానిక ఐఎస్ శాఖ పాల్గొనలేదని కూడా భావించవచ్చని ఆయన సూచించారు.

రష్యా ప్రభుత్వ అనుకూల చానళ్లు కూడా ఐఎస్ ప్రాంతీయ శాఖ ప్రస్తావన లేకపోవడం మీద దృష్టి సారించాయి.

2024 జనవరిలో ఇరాన్‌లోని కెర్మాన్‌ నగరంపై తామే దాడి చేసినట్లు ప్రకటించినప్పుడు కూడా ఐఎస్, ఆ దాడులకు పాల్పడిన ప్రాంతీయ శాఖ గురించి ప్రస్తావించలేదు.

మాస్కో దాడికి, కెర్మాన్‌ దాడికి మధ్య చాలా సారూప్యం ఉందని అల్-లామి అన్నారు.

కాన్సర్ట్ హాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మంటలు చెలరేగడంతో కన్సర్ట్ హాల్ పై అంతస్తులు ధ్వంసం అయ్యాయి

ఐఎస్ మళ్లీ పుంజుకుందా?

మాస్కో దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు అనుమానితులను రష్యా అధికారులు గుర్తించారు. వారి పేర్లు దలెర్డ్‌జోన్ మిర్జోయెవ్, సైదాక్రమి మురోదలీ రచబలిజోడా, షంసిదిన్ ఫరీదుని, ముహమ్మద్సోబిర్ ఫైజోవ్‌.

ఈ ఆదివారం వారిని కోర్టులో హాజరుపరిచినప్పుడు మిర్జోయెవ్, సైదాక్రమి కళ్లపై గాయాలు ఉన్నాయి. సైదాక్రమి చెవికి బ్యాండేజ్ ఉంది. అరెస్టు సమయంలో చెవిని కాస్త కత్తిరించినట్లుగా అధికారులు తెలిపారు.

ఫైజోవ్‌ను వీల్ చైర్‌లో కోర్టుకు తీసుకువచ్చారని, అతనికి ఒక కన్ను లేనట్లుగా కనిపిస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ఫరీదుని ముఖం బాగా వాచిపోయిందని రిపోర్ట్ చేసింది.

రష్యా, ఇరాన్ దాడులతో ఐఎస్ తిరిగి పుంజుకుందని దాని అనుచరులు భావిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

"ఈ దాడులు చేసినప్పటికీ, ఇది ఐఎస్‌కి కష్టమైన సంవత్సరమే. ఈ ఏడాదంతా ఐఎస్‌కు వైఫల్యాలు ఎదురయ్యాయి’’ అని మినా అల్-లామి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)