మాస్కోపై దాడి: ఈ నలుగురే రష్యాలో 137 మందిని చంపారా?

మాస్కోలో దాడి

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, అరెస్టైన వారిలో దలెద్జోన్ మిర్జోయెవ్, సైదాక్రమి మురోదలీ రఖ్‌బలిజోడా, షంసిదిన్ ఫరీదౌనీ, ముహమ్మద్ ఫైజోవ్‌లు ఉన్నారు.

మాస్కోలోని కన్సర్ట్ హాల్‌పై దాడి చేసి 137 మందిని చంపిన ఘటనలో రష్యా నలుగురిపై అభియోగాలు మోపింది. వీరిలో ముగ్గురిని కదలలేని స్థితిలో కోర్టు లోపలికి తీసుకురాగా, నాలుగో వ్యక్తి వీల్ చైర్‌పై కనిపించారు.

క్రోకస్ సిటీ హాల్‌పై దాడికి బాధ్యత వహిస్తూ 'ఇస్లామిక్ స్టేట్ గ్రూప్' వీడియో సాక్ష్యాలను విడుదల చేసింది.

రష్యా అధికారులు మాత్రం ఈ దాడిలో యుక్రెయిన్ ప్రమేయం ఉందని, ఎలాంటి సాక్ష్యాలను సమర్పించకుండా ఆరోపిస్తున్నారు. దీనిని యుక్రెయిన్ ఖండిస్తోంది.

మాస్కోలో దాడి

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, ఫరీదూని ముఖం బాగా వాచిపోయి ఉంది.

మాస్కోలో దాడి చేసిన వారెవరు?

రష్యాలోని బెస్మెని జిల్లా కోర్టుకు ముసుగులు వేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను నడిపిస్తూ తీసుకొస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.

వీడియో చూసిన తర్వాత నిందితులందరినీ దారుణంగా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ నిందితులను క్రూరంగా విచారించిన వీడియోలు బహుశా రష్యా భద్రతా దళాలే లీక్ చేసి ఉండవచ్చు.

ఒక వ్యక్తికి కరెంట్ షాక్ ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి.

అరెస్టైన వారు దలెద్జోన్ మిర్జోయెవ్, సైదాక్రమి మురోదలీ రఖ్‌బలిజోడా, షంసిదిన్ ఫరీదౌనీ, ముహమ్మద్ ఫైజోవ్‌లు అని రష్యా అధికారులు తెలిపారు.

మిర్జోయెవ్, రఖ్‌బలిజోడాల కళ్ల చుట్టూ నల్లగా కనిపించింది. అదే సమయంలో రఖబలిజోడా చెవికి బ్యాండేజ్ వేశారు. మిర్జోయెవ్ మెడకు పాలిథిన్ కట్టారు. ఫరీదూని ముఖం బాగా వాచిపోయి ఉంది. ఫెజోవ్ అపస్మారక స్థితిలో కనిపించారు. పల్చటి హాస్పిటల్ డ్రెస్ వేసి వీల్ చైర్‌లో అతన్ని తీసుకొచ్చారు. ఆయనకు ఒక కన్ను కనిపించడం లేదని వార్తాసంస్థ రాయిటర్స్ తెలిపింది.

కోర్టు విచారణ సమయంలో నిందితులందరినీ గాజుతో కవర్ చేసిన బూత్‌లో ఉంచారు. వారు కోర్టులో ఉన్న సమయమంతా వారి చుట్టూ ముసుగులు ధరించిన పోలీసులు కనిపించారు.

టెలిగ్రామ్‌లో కనిపించిన కోర్టు ప్రకటన ప్రకారం మిర్జోయెవ్, రఖ్‌బాలిజోడాలు నేరాన్ని అంగీకరించారు. ఈ నలుగురిని మే 22 వరకు ముందస్తు నిర్బంధంలో ఉంచాలని కోర్టు ఆదేశించింది.

నిందితులను తజికిస్థాన్ పౌరులుగా గుర్తించారని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ తెలిపింది.

మాస్కోలో దాడి

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK

దాడి సమయంలో ఆరు వేల మంది

ఈనెల 22 వ తేదీన రాత్రి ఉత్తర మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్‌లో రాక్ మ్యూజిక్ కన్సర్ట్‌ జరిగింది. ఆ ప్రోగ్రాంకు సుమారు 6,000 మంది హాజరయ్యారు. వీరందరిపై నలుగురు ముష్కరులు కాల్పులు జరిపారు. అనంతరం కన్సర్ట్ హాల్‌కు నిప్పు పెట్టారు, దీంతో పైకప్పు పడిపోయింది.

ఈ దాడిలో 137 మంది మరణించారని, 100 మందికి పైగా గాయపడ్డారని రష్యా అధికారులు తెలిపారు.

కోర్టుకు తీసుకొచ్చిన నలుగురు వ్యక్తులను దాడి జరిగిన 14 గంటల తర్వాత ఆదివారం బ్రయాన్స్క్ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు రష్యా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 'ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్' (FSB) తెలిపింది.

బ్రయాన్స్క్ రష్యా రాజధాని మాస్కోకు నైరుతి దిశలో 400 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ దాడికి బాధ్యత వహిస్తూ, కాల్పులు జరుపుతున్న వీడియోను ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ విడుదల చేసింది. బీబీసీ తన పరిశోధనలో ఈ వీడియో నిజమైనదిగా గుర్తించింది.

అయితే, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ వాదనను రష్యా అధికారులు అంగీకరించడం లేదు.

దాడి చేసిన వారికి యుక్రెయిన్ నుంచి సహాయం అందుతున్నదని, నిందితులు సరిహద్దు దాటేందుకు ఏర్పాట్లు కూడా చేశారని ఆధారాలు అందించకుండానే రష్యా ఆరోపిస్తోంది.

యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలియన్‌స్కీ ఆదివారం రష్యా ఆరోపణలను ఖండించారు.

ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ కారణమని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ తెలిపారు. యుక్రెయిన్‌కు దాడితో సంబంధం లేదని తెలిపారు.

ఈ కేసులో ఈ నలుగురితో పాటు మరో ఏడుగురిని కూడా అరెస్టు చేశారు.

దాడికి ముందే హెచ్చరించిన అమెరికా

ఈ నెల ప్రారంభంలో ఎక్కువ మంది ప్రజలు గుమిగూడిన ప్రదేశంపై దాడి జరగవచ్చని రష్యాను అమెరికా హెచ్చరిస్తూ, వారి పౌరులకు పబ్లిక్ అడ్వైజరీ కూడా జారీ చేసింది.

అయితే, రష్యా ఈ హెచ్చరికను కొట్టి పడేసింది దాని అధ్యక్ష ఎన్నికలలో జోక్యం చేసుకునే ప్రయత్నంగా ఆరోపించింది.

అయితే, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ వాదనలను విశ్వసించకపోవడానికి ఎటువంటి కారణం లేదని అమెరికా అంటోంది.

ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ లేదా దాని శాఖలు రష్యాను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు.

2014లో ఈజిప్టులో రష్యా విమానంపై బాంబు దాడికి ఇదే గ్రూపు బాధ్యత వహించింది. ఆ విమానంలో 224 మంది ఉన్నారు, అందులో ఎక్కువ మంది రష్యా పౌరులే.

దీనితో పాటు 2017లో సెయింట్ పీటర్స్‌బర్గ్ మెట్రోలో జరిగిన బాంబు పేలుళ్లకు ఇస్లామిక్ స్టేట్ బాధ్యత వహించింది. ఆ ఘటనలో 15 మంది మరణించారు.

మాస్కోలో దాడి

ఫొటో సోర్స్, REUTERS

సెక్యురిటీ అనలిస్టుల అభిప్రాయం ప్రకారం ఇస్లామిక్ స్టేట్ అనేక కారణాలతో రష్యాను లక్ష్యంగా చేసుకుంటోంది.

సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ కోటను ధ్వంసం చేసి, అసద్ ప్రభుత్వాన్ని బలోపేతం చేయడంలో రష్యా పాత్ర దీనికి ఒక కారణం.

రెండు ముస్లిం ఆధిపత్య ప్రాంతాలలో మొదట సోవియట్ యూనియన్, తరువాత రష్యా యుద్ధం చేయడం మరో కారణం.

అఫ్గానిస్తాన్‌పై సోవియట్ యూనియన్‌ సుదీర్ఘ యుద్ధం చేసింది. చెచెన్యాపై రష్యా 1994-2009 వరకు యుద్ధం చేసింది.

ఐఎస్-కే ప్రధానంగా అఫ్గానిస్తాన్, మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో చురుకుగా ఉంది. ఇస్లామిక్ స్టేట్ శాఖలలో ఇది అత్యంత సామర్థ్యంతో పనిచేస్తోంది, క్రియాశీలంగానూ ఉంటోంది.

2021 సెప్టెంబర్‌లో కాబూల్ విమానాశ్రయంలో జరిగిన పేలుడుకు ఈ శాఖే బాధ్యత వహించింది. ఈ గ్రూపు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తరచుగా విమర్శిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, బాధిత కుటుంబాలకు దేశవ్యాప్తంగా సానుభూతి ప్రకటిస్తున్న ప్రజలు...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)