‘ఘోరమైన కిడ్నాపింగ్ ముఠాల నుంచి నేనెలా తప్పించుకున్నానంటే...’

- రచయిత, క్రిస్ ఎవోకర్
- హోదా, బీబీసీ న్యూస్, కురిగ
ఉత్తర నైజీరియాలో కిడ్నాపర్లు దాడులు చేసినపుడు, వారి నుంచి మూసా గర్బా అనే 17 ఏళ్ల యువకుడు పొదల్లో పాకుతూ తప్పించుకున్నారు.
పొదల్లో కనిపించకుండా ఉండటానికి ఆ రంగులో కలిసిపోయే స్కూల్ యూనిఫారం ధరించాడు. ఓ గడ్డి కుప్పలో దాక్కున్నారు. ఆ సమయంలో తన సహచర విద్యార్థులను కిడ్నాపర్లు తీసుకెళుతున్నారు.
గత వారం అక్కడి వాయవ్య రాష్ట్రం కదునాలో రాజధానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కురిగా ప్రాంతంలోని ఒక పాఠశాలలో 8-14 సంవత్సరాల వయసున్న 280 మంది చిన్నారులు, కొంతమంది టీచర్లను కిడ్నాపర్లు ఎత్తుకుపోయారు.
"మేం రహదారిపై మోటర్‌బైక్‌లను చూశాం. వారు పాఠశాల ఆవరణను ఆక్రమించుకొని, కాల్పులు ప్రారంభించడానికి ముందు వరకు వారిని సైనికులనే అనుకున్నాం" అని ఆ భయానక సంఘటనలను గుర్తుచేసుకుంటూ మూసా బీబీసీతో చెప్పారు.
కిడ్నాప్‌కు గురైన ఇద్దరు బాలుర పేర్లను వారి భద్రత కోసం ఈ కథనంలో మార్చాం.
"మేం పారిపోవాలని ప్రయత్నించాం, కాని వారు అందరినీ వెంబడించి పట్టుకున్నారు, పొదల్లోకి దూరిన ఆవులను బయటికి తొలుకొచ్చినట్లు తోలుకొచ్చారు" అని మూసా అన్నారు.

ఫొటో సోర్స్, AFP
'మమ్మల్ని అడవిలో నడిపించారు'
మోటర్‌బైక్‌లపై వచ్చే ఈ సాయుధ వ్యక్తులను స్థానికంగా బందిపోట్లు అని పిలుస్తారు. కొంత కాలంగా వారు అక్కడి జనాల్ని బెదిరిస్తున్నారు, భద్రతా దళాలు వారి ఆగడాలను నిలువరించలేకపోతున్నాయి.
కురిగా జనాలను కిడ్నాప్ చేసి, డబ్బులు డిమాండ్ చేయడానికి ముఠాలు దాడి చేస్తున్నాయి. ఈ తాజా కిడ్నాప్ బాధితుల్లో ఏడేళ్ల వయస్సు పిల్లలు కూడా ఉన్నారు.
"వాళ్లు ఇక్కడి నుంచి మా పిల్లలను తీసుకువెళ్లడం చూశాం, మేం ఏమీ చేయలేం. మాకు మిలటరీ లేదు, పోలీసులూ లేరు" అని స్థానిక హాజియా హౌవా ఏడుస్తూ చెప్పారు. మూసా కూడా కిడ్నాపైన వారిలో ఉన్నారు.
"మేం అడవిలో నడుస్తున్నపుడు కొన్నిసార్లు మాకు దాహం వేసింది, నీళ్లు కూడా లేవు. కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు అలసిపోయి, పడిపోయారు" అని చెప్పారు మూసా.
దీంతో "పడిపోయిన వారిని బందిపోట్లు బైక్‌పై తీసుకెళ్లారు" అని తెలిపారు.
''మండే ఎండలో అలా చాలాదూరం నడిపించారు. ఉదయం నుంచి కనీసం అల్పాహారం కూడా తీసుకోని పిల్లలకు దగ్గరలో కనిపించిన నది ఉపశమనం ఇచ్చింది. పిల్లలంతా నీళ్లు తాగి దాహం తీర్చుకున్నారు'' అని చెప్పారు.
ఆ సమయంలో మూసా తప్పించుకోవడానికి మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. మిగతా వారిని కూడా తనతో రావాలని అడిగారు, కానీ, వాళ్లు రావడానికి భయపడ్డారు.
ఎలా తప్పించకున్నారు?
సూర్యుడు అస్తమిస్తుండటంతో ఇక తప్పించుకోవాలనుకున్నారు మూసా. తనను ఎవరూ చూడటం లేదని నిర్ధరించుకుని, అక్కడే గడ్డి కుప్పలో దాక్కున్నారు.
"అంతా నిశ్శబ్దంగా ఉన్న తర్వాత, నేను నేలపై పాములా పాకడం ప్రారంభించాను" అని అన్నారు మూసా. అలా చీకటి పడే వరకు చూసి, తర్వాత లేచి తన గ్రామానికి పయనమయ్యారు.
అయితే, యువకుడు పెద్ద రిస్క్ తీసుకున్నాడని, ఒకవేళ అతన్ని చూసి ఉంటే, వారు చంపేసేవారని, దేవుడే అతన్ని రక్షించాడని అక్కడి స్థానికులు అంటున్నారు.
మరుసటి రోజు యువకుడు కురిగా గ్రామానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు అతన్ని చూసి ఆనందించారు. పిల్లల కిడ్నాప్ విషయం అందరికీ చెప్పారు.

'నాకు నిద్ర పట్టట్లేదు'
పదేళ్ల సాదిక్ ఉస్మాన్ అబ్దుల్లాహీ తల్లిదండ్రులు బాలుడి క్షేమ సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు.
కిడ్నాప్‌కు ముందు సాదిక్ పెన్సిల్ మర్చిపోయానని చెప్పి, స్కూల్ నుంచి ఇంటికి తిరిగొచ్చాడు. తర్వాత తిరిగి వెళ్లాడు. కిడ్నాపయ్యాడు.
సాదిక్ కిడ్నాపైన రోజు నుంచి నిద్ర పట్టలేదని అతని తల్లి రహ్మతు ఉస్మాన్ అబ్దుల్లాహి అంటున్నారు.
"నేను ఎప్పుడూ వాడి గురించే ఆలోచిస్తాను, నాకు నిద్ర ఎలా పడుతుంది? దేవుడు సహాయం చేస్తాడు" ఆమె అన్నారు.
కిడ్నాప్‌లు ఎందుకు చేస్తున్నారు?
గత ఎనిమిది నెలల్లో నైజీరియాలో 4 వేలమందికి పైగా కిడ్నాప్ అయ్యారని అంచనా. దశాబ్ధన్నరకాలంలో ఉత్తర నైజీరియాలోని ప్రజలపై సాయుధ మిలిటెంట్ గ్రూపులు దాడులు చేస్తూనే ఉన్నాయి.
ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలైన బోర్నో, అడమావా, యోబేలో ఇవి జరిగాయి. ఇక్కడ బోకో హరామ్ (పాశ్చాత్య విద్యపై నిషేధం) అని పిలిచే ఇస్లామిస్ట్ గ్రూపు చురుకుగా దాడులు చేస్తోంది.
ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో సంబంధమున్న మరో దళం కూడా అక్కడి పుట్టుకొచ్చింది.
ఈ రెండు జిహాదీ గ్రూపులు కిడ్నాప్‌లు చేయడం, రైతులను, ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని గ్రామాలను ధ్వంసం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
పాశ్చాత్య విద్యకు నిలయంగా భావించే పాఠశాలలు వీరికి లక్ష్యంగా మారాయి. ఇలాగే 10 సంవత్సరాల క్రితం చిబోక్‌లోని బాలికల పాఠశాలపై జరిగిన దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
"ఉత్తర నైజీరియాలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు దాడికి గురయ్యాయి" అని కదునా రాష్ట్ర మాజీ సెనేటర్ షెహు సాని చెప్పారు.
తమ పిల్లలను బడికి పంపకుండా తల్లిదండ్రులను నిరుత్సాహపరచడమే వీరి లక్ష్యం అని షెహు సాని ఆరోపించారు.
''నేర కార్యకలాపాల కోసం నిధులు సేకరించడం, ఆయుధాలు కొనుగోలు చేయడం కోసం కూడా వీళ్లు కిడ్నాప్‌లు చేస్తుంటారు'' అని తెలిపారు.
బందిపోట్లుగా పేరుగాంచిన క్రిమినల్ ముఠాలు అదే విధానాన్ని అవలంబించడంతో వారి దాడులు ఉత్తరానికి వ్యాపించాయి. ఇక్కడ పాఠశాల పిల్లలను కిడ్నాప్ చేసి, డబ్బులు తీసుకుంటున్నారు.
"వారు డబ్బు కోసం ప్రజలను కిడ్నాప్ చేస్తారు, డబ్బులు చెల్లించిన తర్వాతే బందీలను విడిచిపెడతారు. వారికి ఏ రకమైన రాజకీయ ఎజెండా లేదు" షెహు సాని చెప్పారు.

కిడ్నాపైన పిల్లల పరిస్థితేంటి?
ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చాలా సమయం, డబ్బును ఖర్చు పెట్టింది, అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు దాడులకు బలవుతూనే ఉన్నాయి.
అందులో కురిగ ఒకటి. ఈ ప్రాంతంలో భద్రతా బలగాలు లేకపోవడంతో వారు బందిపోట్ల బారిన పడుతున్నారని స్థానిక తెగ నాయకుడు జిబ్రిల్ గ్వాడాబే చెప్పారు.
"నేనూ బాధితుడిని" అని 64 ఏళ్ల జిబ్రిల్ గ్వాడాబే చెప్పారు.
"రెండేళ్ల క్రితం ఒకరోజు నా పొలానికి వెళుతుండగా వాళ్లు నన్ను అడ్డుకున్నారు. నేను వాళ్లను ఎదిరించాను. వారు నా కడుపులో కాల్చారు, నా వెనుక నుంచి బుల్లెట్ బయటికి వచ్చింది. నేను నెల రోజులు ఆసుపత్రిలోనే ఉన్నాను." అని అన్నారు.
కాగా, కిడ్నాపైన పిల్లలను త్వరలోనే సజీవంగా ఇంటికి చేర్చుతామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే కురిగ ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు.
"మా పిల్లల పరిస్థితి ఇప్పటి వరకూ తెలియదు. వారెలా ఉన్నారో, ఎక్కడున్నారో తెలియదు" అని చీఫ్ గ్వాడాబే చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- భారత్-దివ్యాస్త్ర: చైనా నగరాలను టార్గెట్ చేయగల ఈ క్షిపణిలోని టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి?
- విమానంలో 153 మంది ప్రయాణికులు, నడుపుతూ నిద్రపోయిన పైలెట్లు, తర్వాత ఏం జరిగిందంటే...
- రష్యా ఆర్మీలో హెల్పర్ పని అని తీసుకెళ్లి సైన్యంలో చేర్చారు.. హైదరాబాద్ యువకుడి మరణంపై కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?
- రవిచంద్రన్ అశ్విన్: బ్యాటర్ కావాలనుకుని బౌలర్‌గా మారి రికార్డులు నెలకొల్పిన ఆటగాడు
- బూతు కామెంట్లు, బాడీ షేమింగ్, ఫోటోల మార్ఫింగ్, మహిళలే లక్ష్యంగా ట్రోలింగ్.. దీని వెనక ఏం జరుగుతోంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














