ఆ దేశంలో కొందరు డబ్బులు సంపాదించడానికి కిడ్నాప్‌లు చేస్తుంటారు, మరి పోలీసులు ఏం చేస్తున్నారు?

నైజీరియా

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, యూసుఫ్ అకిన్‌పేలు
    • హోదా, బీబీసీ న్యూస్

మాస్ కిడ్నాప్‌లతో నైజీరియా మరోసారి దద్దరిల్లుతోంది. ఇటీవల దేశంలోని ఉత్తర ప్రాంతంలోని రెండు వేర్వేరు ప్రదేశాల్లోని అడవుల నుండి మోటారు సైకిళ్ల మీద దూసుకొచ్చిన కొన్ని సాయుధ ముఠాలు వందలాది మందిని కిడ్నాప్ చేశాయి. గత వారం రోజుల్లో ఇలాంటి రెండుసార్లు జరిగాయి.

గత బుధవారం నాడు ఈశాన్య ప్రాంతంలోని బోర్నో రాష్ట్రంలోని ఒక మారుమూల పట్టణంలో ఇస్లామిక్ మిలిటెంట్లుగా అనుమానిస్తున్న కొందరు వ్యక్తులు...అడవుల్లో కట్టెల కోసం వెళ్లిన అనేకమంది మహిళలను, చిన్నారులను ఎత్తుకెళ్లిపోయారు.

కిడ్నాప్‌కు గురైన వీరంతా ఆ అటవీ ప్రాంతంలో ఉన్న ఒక శరణార్ధి శిబిరంలో ఉంటున్నారు. స్థానికంగా ఉన్న మొబైల్ ఫోన్ టవర్లను కూడా ధ్వంసం చేయడంతో వారు కిడ్నాపైన విషయం బయటి ప్రపంచానికి తెలియడానికి చాలా రోజులు పట్టింది.

ఇది జరిగిన మరుసటి రోజు వాయవ్య రాష్ట్రం కదునాలో రాజధానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ మారుమూల ప్రాంతంలోని ఓ స్కూల్లో 8-14 సంవత్సరాల వయసున్న 280 మంది చిన్నారులను, కొంతమంది టీచర్లను కిడ్నాపర్లు ఎత్తుకుపోయారు.

అల్‌ఖైదాతో అనుబంధం ఉన్న అన్సారు గ్రూ‌ప్‌కు చెందిన మిలిటెంట్లు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని స్థానికంగా వార్తలు వచ్చాయి.

ఇటీవలి నెలల్లో నైజీరియాలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి. 2014 ఏప్రిల్‌లో ఒక స్కూల్ నుంచి దాదాపు 300 మంది బాలికలను ఎత్తుకుపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఆ తర్వాత కొన్నాళ్ల వరకు ఈ కలకలం తగ్గినప్పటికీ, మళ్లీ ఇటీవలి కాలంలో ఈ రకమైన కిడ్నాప్‌లు పెరిగిపోతున్నాయి.

ఇటీవల జరిగిన కిడ్నాప్‌ వ్యవహారాలు సరిగ్గా పదేళ్ల కిందటి ఘటనలను గుర్తు చేసేలా కనిపించాయి.

కదునాలో జరిగిన సామూహిక అపహరణ 2021 తర్వాత ఒక పాఠశాలలో జరిగిన అతిపెద్ద కిడ్నాప్ అని చెబుతున్నారు.

నైజీరియా

ఫొటో సోర్స్, AFP

నైజీరియన్లు ఎందుకిలా కిడ్నాపర్ల చెరలో చిక్కుకుంటున్నారు?

తాజాగా జరిగిన ఈ రెండు వేర్వేరు ఘటనలకు మూలం ఒక్కటే అని చెప్పడం కష్టం. కానీ, కిడ్నాప్‌ల ముప్పు ఇంతటితో ఆగిపోదని మాత్రం వీటి ద్వారా అర్ధం చేసుకోవచ్చు.

ముస్లింలు ఉపవాసం ఉండే రంజాన్‌ మాసం ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఇవి జరగడం గమనార్హం.

తమను అడవులలోకి తీసుకెళ్లి వారి క్యాంపుల్లో వంటతోపాటు చిన్నా చితకా పనులు చేయించేవారని గతంలో కిడ్నాప్‌కు గురైన బాధితులు వెల్లడించారు.

అయితే, నైజీరియాలో కిడ్నాపింగ్ అనేది తక్కువ రిస్క్, ఎక్కువ ఆదాయం ఉన్న ఒక వృత్తి రూపాన్ని సంతరించుకుంటోంది.

అపహరణకు గురైనవారు కిడ్నాపర్లకు డబ్బు చేరగానే విడుదలవుతారు. కానీ, కిడ్నాపర్లను పట్టుకోవడం, అరెస్టు చేయడం, శిక్షించడంలాంటివి నైజీరియాలో చాలా అరుదైన విషయాలు.

అపహరణకు గురైన వారిని విడిపించడానికి డబ్బు చెల్లించడం నేరమని అక్కడి చట్టాలు చెబుతున్నప్పటికీ దానిని ఎవరూ పట్టించుకున్నట్లు కనిపించదు.

ప్రస్తుత అధ్యక్షుడు బోలా టినుబు గతయేడాది మే నెలలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 4,700 మందికి పైగా కిడ్నాప్‌కు గురయ్యారని రిస్క్ కన్సల్టెంట్స్ సంస్థ ఎస్‌బీఎం ఇంటెలిజెన్స్ తెలిపింది.

ఆర్ధికంగా కష్టాలలో ఉన్నవారికి కిడ్నాపింగ్ అనేది ఒక లాభదాయకమైన వృత్తిగా మారింది.

డబ్బుతోపాటు, బందీలను విడుదల చేయడానికి ఆహార పదార్ధాలు, మోటార్ సైకిళ్లు, పెట్రోలును కూడా ముఠాలు డిమాండ్‌ చేసిన సందర్భాలున్నాయి.

"నైజీరియాలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కిడ్నాప్‌లకు అవకాశమిచ్చేలా ఉంటాయి. గత సంవత్సరంలో, ప్రభుత్వం దాని విదేశీ మారకద్రవ్య సమస్యను పరిష్కరించలేకపోయింది" అని సీఐఏ రిటైర్డ్ అధికారి, ఆఫ్రికాకు చెందిన రిస్క్ అడ్వైజరీ సంస్థ 14 నార్త్‌కు నాయకత్వం వహిస్తున్న విలియం లిండర్ బీబీసీతో అన్నారు.

‘‘నైజీరియాలో గత ఆరు నెలలుగా ఆహారపు ధరలు విపరీతంగా పెరిగాయి. అవినీతి కొనసాగుతోంది.’’ అని విలియం లిండర్ అన్నారు.

నైజీరియా

కారణాలేంటి?

చాతం హౌస్ థింక్-ట్యాంక్‌‌కు చెందిన ఆఫ్రికా ప్రోగ్రామ్ డైరెక్టర్ అలెక్స్ వైన్స్‌ కూడా దీనిని అంగీకరిస్తున్నారు.

ఇటీవలి దాడులు నైజీరియా ఆర్థిక వ్యవస్థ బలహీనతకు, కిడ్నాప్ ముఠాల అడ్డుకోవడంలో ప్రభుత్వ అసమర్థతకు నిదర్శమని ఆయన అన్నారు.

దాడులు, కిడ్నాప్‌ల భయంతో రైతులు పొలాల్లోకి వెళ్లడం లేదు. దీంతో ఆహారపు ధరలు విపరీతంగా పెరిగాయి.

"ఈ ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ఉన్న సాయుధ ముఠాలు ప్రభుత్వం యంత్రాంగాన్ని పక్కకు తోసి, అధికారం చెలాయించే స్థాయికి ఎదిగాయి.’’ అని డాక్టర్ వైన్స్ అన్నారు.

‘‘ఆర్ధిక పరిస్థితులు చాలామందికి ఇబ్బందులను పెంచాయి. దీంతో కొందరు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను వెతుక్కున్నారు. అందులో కిడ్నాప్‌లు చేయడం కూడా ఒకటి.’’ అని లిండర్ అన్నారు.

నైజీరియా సరిహద్దుల్లో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్ల ముఠాలు మరింతగా చెలరేగిపోతున్నాయని చెబుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని విస్తారమైన అడవులు నేరగాళ్లకు స్థావరాలుగా మారాయి.

‘‘నైజీరియా దాని పొరుగు దేశాలతో కలిసి పనిచేయాలి’’ అని టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్‌లో సీనియర్ విశ్లేషకుడు బులామా బుకార్టి అన్నారు.

‘‘నైజీరియా సరిహద్దులోని వాయువ్య భాగంతో సహా ముఖ్యంగా నైజర్, కామెరూన్, చాడ్‌లతో అంతర్జాతీయ సహకారం లేకపోతే ఈ సంఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి.’’ అని ఆయన అన్నారు.

అయితే, ఇదొక్కటే సరిపోదని, నిందితులను శిక్షించడంలో అధికారులు నిబద్ధతతో వ్యవహరించాల్సి ఉందని బుకార్టి అన్నారు.

‘‘ఇక్కడి గ్యాంగ్ లీడర్లను పట్టుకుని శిక్షించిన ఘటనలు ఒక్కటి కూడా చూడలేదు. కిడ్నాప్‌లు చేయడం మంచి లాభదాయకమైన పనిగా మారింది. అందుకే ఎక్కువమంది ఈ ముఠాల్లో చేరుతున్నారు. సమస్య పెరుగుతోంది.’’ బుకార్టి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)