క్లిక్ హియర్ అంటే ఏంటి? ‘ఎక్స్’లో ఈ మాట ఎందుకు ట్రెండ్ అవుతోంది?

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
సోషల్ మీడియా నెట్వర్క్ ఎక్స్(ట్విటర్)లో శనివారం సాయంత్రం నుంచి వేల మంది యూజర్లు ‘క్లిక్ హియర్(Click here)’ అనే ట్రెండ్‌లో భాగమవుతున్నారు.
మీరు ‘ఎక్స్’ ట్రెండ్స్ చూసుంటే మీకు కూడా క్లిక్ హియర్ అనే పదాలు రాసి ఉన్న ఒక ఫోటో కనిపించి ఉంటుంది.
ఈ ఫోటోలో నలుపు రంగులో పెద్ద అక్షరాలతో ఇంగ్లిష్‌లో ‘క్లిక్ హియర్’ అని రాసి ఉంటుంది. ‘సి’ అక్షరం నుంచి ఎడమ వైపు ఒక బాణం గుర్తు ఉండి, దాని చివరన కింద చిన్న అక్షరాలతో ఇంగ్లిష్‌లో ‘ఆల్ట్’ (ALT) అని రాసి ఉంటుంది.
ఈ ఆల్ట్ బటన్‌పై క్లిక్ చేయగానే ఒక మెసేజ్ కనిపిస్తుంది.
ఆల్ట్‌ను క్లిక్ చేస్తే మాత్రమే మీరు ఈ మెసేజ్‌ను చూడగలరు. ఒకవేళ ఆల్ట్‌ను క్లిక్ చేయకపోతే కేవలం క్లిక్ హియర్ అనే వ్యాఖ్యను మాత్రమే చూడగలుగుతారు. అందులో దాగి ఉన్న సందేశాన్ని చూడలేరు.
‘క్లిక్ హియర్’ ట్రెండ్ మొదలైనప్పటి నుంచి సాధారణ పౌరులే కాకుండా రాజకీయ పార్టీలు, స్పోర్ట్స్ క్లబ్‌లు, ఫుట్‌బాల్ జట్లు, సినీ తారలు ఇందులో పాల్గొంటున్నారు.

ఫొటో సోర్స్, X
ఆల్ట్ టెక్ట్స్ అంటే ఏంటి?
ఆల్ట్ టెక్ట్స్ అనేది ఒక టెక్ట్స్ ఫీచర్. ట్విటర్ చాలా కాలం క్రితమే ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
ఈ ఫీచర్ సహాయంతో ఎవరైనా ఫోటోను షేర్ చేసేటప్పుడు దాని గురించి ఏదైనా రాయవచ్చు. ఆల్ట్ టెక్ట్స్ ఫీచర్ రూపంలో ఏదైనా ఒక ఫోటో గురించి వెయ్యి అక్షరాల వరకు మెసేజ్‌ను రాయొచ్చు.
ఈ ఫీచర్ సహాయంతో ఎక్స్‌లో కంటెంట్ ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది.
ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ఈ ఆల్ట్ టెక్ట్స్ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆల్ట్ టెక్ట్స్‌ను ఎలా వాడాలి?
ఎక్స్‌లో ఈ ఫీచర్‌ను ఫోటోలకు ఉపయోగించవచ్చు. కానీ, వీడియోలతో ఈ ఫీచర్‌ను వాడలేం.
ఎక్స్‌లో మీరు ఏదైనా ఫోటోను అప్‌లోడ్ చేసినప్పుడు, ఫోటోతో పాటు +ALT మీకు కనిపిస్తుంది.
అప్పుడు ఆల్ట్‌ను క్లిక్ చేసి ఏదైనా మెసేజ్ టైప్ చేసి దాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు రాసిన మెసేజ్ ఫోటోకు యాడ్ అవుతుంది.
ఈ ఫోటోను పోస్ట్ చేసిన తర్వాత మీరు ఆల్ట్ మీద క్లిక్ చేస్తేనే అందులో ఉన్న సందేశం కనిపిస్తుంది.
మొబైల్‌లో, ల్యాప్‌ట్యాప్‌లో, డెస్క్ టాప్‌లో ఎక్కడైనా ఎవరైనా ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు.

ఫొటో సోర్స్, X
ట్రెండ్‌ను వాడుకుంటున్న పార్టీలు
2024 లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఈ ‘క్లిక్ హియర్’ ట్రెండ్ ద్వారా తమదైన రీతిలో ప్రయోజనం పొందుతున్నాయి.
పార్టీల అధికారిక ఖాతాల నుంచి ‘క్లిక్ హియర్’ ఫోటోల్లో తమకు నచ్చిన సందేశాలు రాసి పోస్ట్ చేస్తున్నారు.
బీజేపీ, ‘ఆల్ట్ టెక్ట్స్’ ఫీచర్‌లో ‘‘మరోసారి మోదీ ప్రభుత్వమే’’ అంటూ రాసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ, ‘‘దేశాన్ని రక్షించడానికి మార్చి 31న రామ్‌లీలా మైదానానికి రండి’’ అంటూ పిలుపునిచ్చింది.
వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన ఏం రాశాయి?
ఆంధ్రప్రదేశ్‌లో మే 13న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో, వైఎస్సార్సీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా ఎక్స్‌లో ఈ ట్రెండ్‌లో భాగమయ్యాయి.
‘‘2024 - మరోసారి జగనన్న(2024 జగనన్న వన్స్‌మోర్)’’ అని వైఎస్సార్సీపీ రాయగా, ‘‘2024 - ఇక వైఎస్సాఆర్‌సీపీ వద్దు(2024 వైఎస్సాఆర్‌సీపీ నో మోర్)’’ అని తెలుగుదేశం పార్టీ రాసింది.

ఫొటో సోర్స్, X

ఫొటో సోర్స్, X
జనసేన పార్టీ తన ఎక్స్ ఖాతాలో క్లిక్ హియర్ ట్రెండ్‌ను ఫాలో అవుతూ, ‘‘వైసీపీ ప్రభుత్వానికి సౌండ్ ఎక్కువ- గాలి తక్కువ’’ అని రాసింది.

ఫొటో సోర్స్, X
ఎక్స్‌లో తన టైమ్‌లైన్ అంతా ‘క్లిక్ హియర్’ ఫోటోలతో నిండిపోయిందని, అసలు ఇదేంటని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నాయకురాలు ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు.
అలాగే ఇండియా విత్ కాంగ్రెస్ అనే పేరుతో ఉన్న ఖాతా ఈ ట్రెండ్‌లో పాల్గొంటూ ఆల్ట్ టెక్ట్స్ ఫీచర్‌లో సుదీర్ఘ సందేశాన్ని రాసింది.
ఇందులో కాంగ్రెస్ యువ న్యాయ్ గ్యారంటీ గురించి సమాచారం అందించారు.
ఇవి కూడా చదవండి:
- ఓపెన్‌హైమర్: అణు దాడులతో కకావికలమైన జపాన్ ప్రజలు.. ఆ బాంబుల తయారీపై వచ్చిన చిత్రం చూసి ఏమన్నారు?
- బాల్టిమోర్ బ్రిడ్జి ప్రమాదం: అర్ధరాత్రి, కరెంట్ పోయింది, నౌక కంట్రోల్ తప్పింది... రెండు నిమిషాల్లోనే విధ్వంసం
- గోమూత్రంతో పసుపు రంగు, విఖ్యాత భారతీయ వర్ణచిత్రాలను దీంతోనే వేశారా? 1908లో ఆంగ్లేయుల కాలంలో దీన్ని ఎందుకు నిషేధించారు
- ఎలిహు యేల్: భారతీయులను బానిసలుగా మార్చి సంపన్నుడిగా ఎదిగిన ఈయన అసలు చరిత్ర ఏమిటి?
- లద్దాఖ్: కేంద్రం ద్రోహం చేసిందంటూ గడ్డ కట్టే చలిలో వేల మంది రోడ్ల మీదకు ఎందుకు వచ్చారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














