ఎలక్ట్రిక్ కార్: టెస్లాకు పోటీగా రంగంలోకి దిగిన షియోమీ, కారు ధర ఎంత, సవాళ్లేంటి?

ఫొటో సోర్స్, MICHAEL ZHANG/AFP
- రచయిత, మారికో ఓయ్, పీటర్ హోస్కిన్స్
- హోదా, బిజినెస్ రిపోర్టర్లు
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీల కంపెనీ షియోమి తన తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసి దీని ఆర్డర్లను చేపడుతోంది.
కంపెనీ ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ కారు స్టాండర్డ్ ఎస్‌యూ7 మోడల్ ధర 2,15,900 యువాన్ల ( సుమారు రూ. 25 లక్షలు)ని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) లి జున్ తెలిపారు. మ్యాక్స్ వెర్షన్ ధర 2,99,900 యువాన్లు(సుమారు రూ. 35 లక్షలు) గా ప్రకటించారు.
తన తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసిన 27 నిమిషాల్లో 50 వేల ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా కార్ల అమ్మకాలు తగ్గుతున్న సమయంలో షియోమి ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీంతో, ధరల్లో సరికొత్త పోటీకి తెరలేపింది.
ఇప్పటికే ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో దిగ్గజాలుగా ఉన్న టెస్లా, బీవైడీ కంపెనీలతో పోటీకి సిద్ధమైంది షియోమి.
చైనాలో టెస్లా మోడల్ 3 కారు ప్రారంభ ధర 2,45,900 యువాన్లు( సుమారు రూ.28 లక్షలు)

ఫొటో సోర్స్, MICHAEL ZHANG/AFP
షియోమి ఎస్‌యూ7 ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
ఒక్కసారి చార్జ్‌తో 700 కిలోమీటర్ల వరకు ఎస్‌యూ7 ప్రయాణించగలదని కంపెనీ సీఈఓ లి జున్ చెప్పారు.
వేగంలో టెస్లా మోడల్ 3 కంటే మెరుగైందన్నారు. టెస్లా మోడల్ 3 కారు సింగిల్ చార్జ్‌లో 567 కి.మీల వరకునే ప్రయాణించగలదు.
షియోమి తన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర డివైజ్‌లలో వాడిన ఆపరేటింగ్ సిస్టమ్‌నే ఎస్‌యూ7లో వాడాలని భావిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 12 శాతం మార్కెట్ షేరుతో మూడవ అతిపెద్ద అమ్మకందారుగా షియోమి ఉందని రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ తెలిపింది.
ఎస్‌యూ7ను గత ఏడాదే షియోమి రివీల్ చేసింది.
ఎస్‌యూ7 ముందున్న సవాళ్లేంటి? పోటీ పెరుగుతుందా?
బీజింగ్‌లోని ప్రభుత్వ యజమాన్యంలోని కార్ల తయారీ సంస్థ బీఏఐసీ గ్రూప్ ప్లాంట్‌లో దీన్ని రూపొందిస్తుంది. ఏడాదికి 2 లక్షల వరకు వెహికిల్స్‌ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
‘‘ఇప్పటి వరకు కంపెనీ సాధించినది పెద్ద విజయమే. కానీ, ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోని వినియోగదారుల వద్ద తన స్థానాన్ని దక్కించుకోగలిగినప్పుడు షియోమి నిజంగా అతిపెద్ద విజయం సాధించినట్లు లెక్క’’ అని ఆటోమొబిలిటీకి చెందిన బిల్ రుస్సో బీబీసీతో అన్నారు.
ఐఫోన్ తయారీదారు యాపిల్ గత నెలలోనే ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్రణాళికలను రద్దు చేసుకుంది. టెక్నాలజీ కంపెనీలు ఈ రంగంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయన్న సంకేతాలను ఇది ఇచ్చింది.
చైనాలో తన బ్రాండ్‌పై ఉన్న పూర్తి నమ్మకంతో షియోమి కంపెనీ కార్ల మార్కెట్లోకి ప్రవేశించిందని బిల్ రుస్సో చెప్పారు.
చైనా వెలుపల ఈ మార్కెట్‌కు పెద్దగా ఎలాంటి సామర్థ్యాన్ని యాపిల్ చూడలేదు. అందుకే తన ప్రణాళికలను విరమించుకుంది.

ఫొటో సోర్స్, ANI
రాబోయే పదేళ్లలో షియోమి కంపెనీ ఎలక్ట్రిక్ కారు వ్యాపారాల్లో 10 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపింది.
‘చైనాలో ఎలక్ట్రిక్ మార్కెట్ వృద్ధి చెందుతోంది. ఎలక్ట్రిక్ కార్ల తయారీదారుల కోసం స్థిరమైన ఎకోసిస్టమ్ ఉంది’’ అని రీసెర్చ్ సంస్థ రిస్తాద్ ఎనర్జీకి చెందిన అభిషేక్ మురళి తెలిపారు.
ఉదాహరణకు, బ్యాటరీ సప్లై చైన్ అక్కడ చాలా బలంగా ఉంది. పెరుగుతున్న ఈవీ డిమాండ్‌ను అందుకునేందుకు ఆ దేశంలో చార్జింగ్ నెట్‌వర్క్ విస్తరిస్తుందని చెప్పారు.
షియోమి తొలి ఎలక్ట్రిక్ కారు లాంచ్‌తో ఆ దేశంలో ఈవీ మార్కెట్‌లో ధరల యుద్ధం తీవ్రతరం కానుంది.
ఇటీవలే ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా కార్ల కంపెనీ చైనాలో తన కార్లపై ధరలను తగ్గించింది. ప్రపంచంలోనే టాప్ సెల్లింగ్ ఈవీ తయారీదారి, చైనాకు చెందిన కంపెనీ బీవైడీ కూడా ధరలను తగ్గించేసింది.
ఈ వారం ప్రారంభంలో బీవైడీ విడుదల చేసిన ఫలితాల్లో రికార్డు స్థాయిలో వార్షిక లాభాలు పొందినట్లు వెల్లడించింది. కానీ, గత ఏడాది చివరికి వచ్చేసరికి గ్రోత్ కాస్త నెమ్మదించినట్లు తెలిపింది.
ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటు తగ్గుతుండటంతో, వినియోగదారులు కూడా తమ ఖర్చులను తగ్గించేశారని షాంఘైకు చెందిన కారు కంపెనీ నియో తెలిపింది. ఇది తొలి క్వార్టర్‌లో అమ్మకాలపై ప్రభావం చూపనుందని పేర్కొంది.
అమెరికాకు చెందిన ఈవీ దిగ్గజం టెస్లా 2024లోని తొలి మూడు నెలల డెలివరీ గణాంకాలను వచ్చే వారం విడుదల చేయనుంది.
అయితే, ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు విదేశాల్లో తయారయ్యే ఎలక్ట్రిక్ కార్ల దిగుమతులను తగ్గించాలనుకుంటున్నాయి. ఈ సమయంలో షియోమి ఈ మార్కెట్లోకి అడుగు పెట్టింది.
ఎలక్ట్రిక్ కార్లపై చైనీస్ ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, యూరోపియన్ కంపెనీలు తయారు చేసిన కార్ల అమ్మకాలు తగ్గేందుకు కారణమవుతున్నాయా? అన్న విషయంపై యూరోపియన్ యూనియన్ విచారణ ప్రారంభించింది.
ఇవి కూడా చదవండి:
- ఓపెన్‌హైమర్: అణు దాడులతో కకావికలమైన జపాన్ ప్రజలు.. ఆ బాంబుల తయారీపై వచ్చిన చిత్రం చూసి ఏమన్నారు?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- కోటిన్నర రూపాయల జీతం, ఇల్లు, ఇంకా ఇతర సౌకర్యాలు ఇస్తారట... స్కాట్లండ్ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- రాధికా మర్చంట్: ముకేశ్ అంబానీ కోడలవుతున్న ఈ అమ్మాయి ఎవరు?
- విశాఖపట్నం: ఖరీదైన కెమెరా కోసమే సాయి కుమార్‌ను చంపేశారా, నిందితులను సోషల్ మీడియా ఎలా పట్టించింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














